koodali

Wednesday, September 28, 2011

భక్తి యోగం లోని కొంత భాగం .....1

ఓం.

దివ్యమైన దసరా నవరాత్రులు ఆరంభమయ్యాయి. ఇంతకు ముందు దసరా నవరాత్రుల సందర్భంగా పెద్దలు తెలిపిన అమ్మవారి దివ్యమైన కధలు బ్లాగులో వ్రాయటం జరిగిందండి.

ఈ సారి శ్రీకృష్ణపరమాత్మ బోధించిన
భగవద్గీత యందలి భక్తి యోగం లోని కొంత భాగం .....

పెద్దలు తెలిపిన తాత్పర్యము ........

భక్తి యోగము.

అర్జున ఉవాచ.........

ఈ ప్రకారముగ ఎల్లప్పుడు నీ యందే మనస్సును నెలకొల్పినవారై ఏ భక్తులు నిన్నుపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరము కాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆ యిరుతెగలవారిలో యోగమును బాగుగా నెరిగిన వారెవరు ?


శ్రీ భగవానువాచ.........

నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై ( తదేకనిష్ఠులై ) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా యభిప్రాయము.


ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి ( స్వాధీనపరచుకొని ) ఎల్లెడల సమభావము గలవారై, సమస్త ప్రాణులకును హితమొనర్చుట యందాసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింప నలవికానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియునగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.


అవ్యక్త ( నిర్గుణ ) పరబ్రహ్మమునందాసక్తి గల మనస్సు గలవారికి బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగుణోపాసకుల కంటె ) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన, నిర్గుణోపాసనామార్గము దేహాభిమానము గలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది.


వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నా
నండి..

 

No comments:

Post a Comment