koodali

Monday, September 5, 2011

నింగిని తాకిన నిశ్శబ్ద విప్లవం ...... అన్నా హజారే తో కలిసి ప్రజల ఉద్యమం..



ఈ బ్లాగ్ ను ఇంతకుముందునుంచీ చదువుతున్నవారికి , మరియు క్రొత్తగా చదువుతున్నవారికి, మరియు సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లకు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.


ఈ మధ్యన పనివత్తిడి వల్ల అన్నాహజారే గారి దీక్ష విరమణ గురించి వెంటనే టపా వ్రాయలేకపోయాను.

అవినీతిపై ఈ ఉద్యమం వెనుక అందరి పాత్ర ఉంది. మీడియా, యువత, బాలల నుంచీ వృద్ధుల వరకూ ఇలా ఎందరిదో పాత్ర ఉంది.

ఈ ఉద్యమానికి
మాత్రం విజయం లభించటం వెనుక ఎందరిదో పాత్ర ఉంది. అందుకే ఇది అందరి విజయం.


భారతదేశంలో అభివృద్ధి లేదు . అంటూ యువత విదేశాలకు విపరీతంగా తరలివెళ్ళటం చూశాక చాలా నిరాశగా అనిపించేది.

ఇంకా ఈ దేశాన్ని బాగుచేయటం సాధ్యమా ? అని కూడా చాలామంది బాధ పడ్డారు. కానీ , ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత ఉత్సాహంగా పాల్గొనటం చూశాక ఎందరిలోనో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.


కొందరు జనలోక్ పాల్ బిల్లు గురించి నిరాశగా మాట్లాడుతున్నా కూడా నిరాశను దరిచేయనీయకూడదు. కొంత అవినీతి తగ్గినా మంచిదే కదా !

అవినీతి చిన్న సమస్య కాదు. దాని వల్ల ప్రజలలో ఆర్ధికతారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి.

ధరలు తగ్గించటానికి గట్టి చర్యలు తీసుకోవటం వల్ల కూడా ప్రజల మధ్యన ఆర్ధిక తారతమ్యాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అయితే అన్నింటికన్నా కావలసింది , పాలకుల్లోనూ, ప్రజలలోనూ కూడా ఉండవలసింది చిత్తశుద్ధి.

అదేదో సామెత చెప్పినట్లు ..అదే ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి?


సరే, కొందరు మేధావులు ఈ జనలోక్ పాల్ బిల్లు వల్ల ముందుముందు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజల నిర్ణయాలు అధర్మంగా ఉంటే వాటిని తిరస్కరించాలి.

కానీ ఇక్కడ అవినీతిని పటిష్టంగా నిర్మూలించే బిల్లు కావాలని ప్రజలు కోరుకోవటంలో అధర్మం ఏమీ లేదు.

దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, తరలిపోతున్న ప్రజల సొమ్ము, వీటి గురించి గట్టిగా మాట్లాడని వారు పోతున్నారు.

మేధావులు ఈ విధంగా భావించటం , అవినీతి పెరగటానికి పరోక్షంగా తోడ్పడుతుందేమో దయచేసి వారు ఆలోచించాలి.

ఉదా..ఎవరైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చావుబ్రతుకుల మధ్య హాస్పిటల్ కు తీసుకు వెళ్తే  విజ్ఞులైన వైద్యులు రూల్స్ పాటించటం గురించి కంట, రోగికి వైద్యం చెయ్యటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు.


అంతేకానీ,ప్రాణం కన్నా రూల్స్ ముఖ్యం అని విజ్ఞులు ఆలోచించరు కదా !

అలాగే ఇప్పుడు పటిష్టమైన అవినీతి నిరోధకబిల్లు అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు.

చాలాకాలం తరువాత ప్రజలలో కదలిక వచ్చింది. దయచేసి దానిని బలహీనపరచవద్దు.

అన్నా హజారే గారి పట్టుదల మెచ్చుకోదగింది. వారి వెంట ఉండి సహాయసహకారాలు అందిస్తున్న కిరణ్ బేడి.. వంటివారు
రూల్స్ గురించి బాగా తెలిసినవారే .

అందుకని కంగారు పడవలసినపనిలేదు. 


ఇక, అవినీతిపనులు చేసే వారిని చూస్తే పాపం అనిపిస్తుంది.

ఎందుకంటే , వీళ్ళు తమకోసం, కుటుంబం కోసమూ అష్టకష్టాలు పడి పాపపు పనులు చేసి డబ్బు సంపాదిస్తారు.

కానీ ఆ పాప ఫలితాన్నీ ఈ జన్మలోకానీ, వచ్చే జన్మలో కానీ అనుభవించవలసి వస్తే ఎంతో కష్టం కదా ! .

ఆ పాపఫలితంగా వారి సొంతవాళ్ళే ఆ డబ్బు కోసం వారిని ఎన్నో కష్టాలపాలు చేస్తారు.

అందుకని ఎందుకొచ్చిన బాధలు..పాపపుపనులు చేయటం మానివేయండి.

కోట్లాది ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపండి. ఆ పుణ్యం వల్ల మీ జీవితాల్లోనూ ఆనందాన్ని అనుభవించండి. భగవంతుని దయను పొందండి.... 

 

No comments:

Post a Comment