అవునండి నిజమే.. భోగభాగ్యాలు అంటే డబ్బు మాత్రమే అనుకుంటారు చాలామంది . అది తప్పు.
ఒక ఇంట్లో తల్లిదండ్రులు,పిల్లలు, భార్యాభర్తలు ఇలా ఒకరికొకరు అందరూ జీవించి ఉండటమే పెద్ద భాగ్యము.
మనకు పెద్దగా జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండటం ఇంకో పెద్ద భాగ్యం.......... బి.పి, సుగర్ లేకుండా మనకు ఇష్టమయిన పదార్ధాలు తినగలగటం కూడా భాగ్యమే.
దేవుడు మనకు కళ్ళు అలా అన్ని అవయవాలు సవ్యంగా ఇవ్వటం ఎంతో భాగ్యం.
ఇన్ని భోగభాగ్యాలు ఉండగా డబ్బు లేనంత మాత్రాన ఎవరైనా పేదలు ఎలా అవుతారు ?......... చాలా మంది డబ్బు ఉన్నవాళ్ళకు ఇవన్నీ ఉండకపోవచ్చు.
.ఇప్పటిలా టివీలు, సినిమాలు లేని రోజుల్లో ........ ధనవంతుల ఇండ్లు, అందులో వస్తువులు ఎలా ఉండేవో సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం అంతగా ఉండేది కాదు.
ఈ మధ్యన ఎవరో ఇలా అన్నారు ..... టి.వీల్లో ,సినిమాల్లో......... డబ్బు ఉన్నవారి యొక్క పెద్దపెద్ద భవంతులు ,అందులో విలాసవంతమైన సామాను చూపిస్తున్నారు కదా !
అంతే కాదు .... బయట కూడా డబ్బు ఉన్నవారి ఇండ్లలో జరిగే భారీ ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తున్నారుకదా అందరూ.
ఇవన్నీ చూడటం వల్ల కూడా ............ తాము కూడా అలాంటి వస్తువులను పొందాలన్న కోరికలు కలుగుతాయట ప్రజలకు.
( ఈ భారీ భవంతుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కొట్టుకుచస్తూ , ఏడుస్తున్నట్లే కధలలో ,సీరియల్స్ లో చూపించినా కూడా వారి జీవితాలే నచ్చుతాయి ప్రజలకు. )
అందుకే ఈ రోజుల్లో జనానికి సంపాదన పట్ల విపరీతమైన క్రేజ్ పెరగటానికి ఇవన్నీ కూడా కారణాలట.
సంపాదించటం తప్పేమీకాదు కానీ ..........దేనికైనా కొన్ని పధ్ధతులు, పరిమితులూ ఉంటాయి కదా !
అది అలా ఉంచితే , అసలు ,డబ్బు ఉన్న వాళ్ళందరూ నిజంగా సంతోషంగా ఉన్నారంటారా ?
ఇక్కడ కొన్ని నిజాలు గ్రహించాలి. ఒక వ్యక్తికి కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ బి.పి, సుగర్ వంటి వ్యాధులు ఉండటం వల్ల తనకు ఇష్టమయిన పదార్ధాలు తినలేడు...... మరి ఆ సంపద వల్ల అతనికి ఏం సంతోషం కలుగుతుంది ? .
అతనికన్నా ( డబ్బు ఎక్కువ లేకపోయినా )......... ఇష్టమయినవి తినగలిగే ఆరోగ్యం ఉన్న పేద వ్యక్తి అదృష్టవంతుడు కదా !
కొందరికి బోలెడు సంపద ఉంటుంది. వారికి సంతానం కలగలేదు. అప్పుడు వారి మనసు ఎలా ఉంటుందంటే...........పిల్లలతో తిరిగే కోడిపెట్టను చూసినా ఆ కోడిది ఎంత అదృష్టం. తమ కన్నా అనిపిస్తుందట.
పిల్లలు ఉండి కూడా ఆ పిల్లలు పెట్టే బాధలు భరించలేక కొందరు డబ్బున్న తల్లిదండ్రులు పడే బాధలూ ...........అబ్బో చాలా ఉంటాయి.
డబ్బు ఉన్నవారిలో కొందరికి ............ తల్లి గానీ,తండ్రి గానీ దూరమయితే వారి సంపద వారికి ఆ తల్లినో,తండ్రినో తిరిగి తెచ్చివ్వ లేదు కదా !
( ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రులు కొట్టుకుని విడిపోతున్నారు కూడా ! )
అలాంటి వారి పిల్లలకు ........... తల్లిదండ్రులతో జీవిస్తున్న పేదింటి పిల్లలను చూసినా వారెంత అదృష్టవంతులో కదా ! తనకన్నా........ అనిపిస్తుందట.
కెరీర్, సంపాదన ........ వీటితో ఎప్పుడో తప్ప ఇంటికి రాని భర్త ఉన్న ఒక భార్యకు అష్టైశ్వర్యాలూ ఉన్నా కూడా .......... అది ఏం అదృష్టం .
.తమ కన్నా పొలంలో కలసి పనిచేసే పేద రైతు దంపతులే అదృష్టవంతులని ........... ఆమెకు అనిపిస్తుంది.
డబ్బే గొప్ప అయితే , ఎంతో డబ్బు ఉండీ కూడా.......... కొందరు భార్యాభర్తలు మనస్పర్ధలతో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.
వీళ్ళందరూ డబ్బు ఉన్నా పేదవాళ్ళ కిందే లెక్క. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
అయితే డబ్బు అందరికీ అవసరమే.......... డబ్బు లేని వాళ్ళకు దాని విలువ బాగా తెలుస్తుంది. కొందరు పేదవాళ్ళకు జబ్బులు వస్తే బాగు చేయించుకోవటానికి కూడా డబ్బు ఉండదు.
కొందరికి తినడానికి కూడా డబ్బు చాలదు. .......... అందుకని డబ్బు అవసరమే.
మేము ఒకసారి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ....అక్కడ ఒక కుటుంబాన్ని చూసాము.
అందులో భార్యాభర్త చక్కగా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి మాత్రం మెంటల్ డిసబిలిటి ........ప్రాబ్లం ఉన్న అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అతన్ని తీసుకువచ్చారు.
వారికి డబ్బు బాగానే ఉండటం వల్ల అతనికి మంచి వైద్యం, మంచి సదుపాయాలు కల్పించగలరు.
కానీ ఆ అబ్బాయిని అలా చూస్తూ జీవితాంతం వారు ఏమంత సంతోషాన్ని అనుభవించగలరు ? తమ తరువాత ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి ? ఎవరు చూస్తారు ? అనే ప్రశ్నలు వారిని వేధిస్తూనే ఉంటాయి.
అందుకని నాకు ఏమనిపిస్తుందంటే డబ్బు అవసరమే కానీ............. డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే అదృష్టవంతులు ............. డబ్బు అంతగా లేని వాళ్ళు దురదృష్టవంతులు అనుకోకూడదు.
డబ్బు ఎక్కువ లేకపోతే ఇక జీవితం అంతా శూన్యం అనే భావన తప్పు.
భోగభాగ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటాయి. అందరూ అదృష్టవంతులే........... ఇలా ఆలోచించి .,ధైర్యంతో ముందడుగు వేస్తే ............ డబ్బు లేనివాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చి డబ్బు సంపాదించగలరు.
డబ్బు ఎక్కువగా ఉంటేనే జీవితంలో సంతోషం ఉంటుంది అనుకోవటం వల్ల.............. ఈ రోజుల్లో అధర్మంగా అయినా సరే డబ్బు సంపాదించాలనే ధోరణి సమాజంలో పెరిగిపోయింది.
No comments:
Post a Comment