koodali

Friday, November 12, 2010

త్యాగం వాటిది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


ఈ సృష్టిలో మానవులమైన మనము మాత్రమే గొప్పవాళ్ళము అనుకుంటుంటాము. కానీ అల్పజీవులు అనబడే మొక్కలు, ఫలవృక్షములు, జంతుజాలము , ఇతరజీవులు మానవ మనుగడకోసం ఎన్నో త్యాగములు చేస్తున్నాయి.


మనము కోరికలతో ఎన్నో పూజలు చేసి వాటి ఫలితములను మాత్రము మనకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆలోచిస్తే పూజలో మనము వాడే ఎన్నో పదార్దములు ఇతర జీవుల నుంచి మనము పొందేవే.


ఉదా..పుష్పములు మొక్కల నుంచి పొందుతాము. మొక్కలు పెరిగేటప్పుడు వాటి కొమ్మలను తుంపటం, కత్తిరించటం ఇలా ఎన్నో బాధలకు గురవుతాయి.


మరి ప్రసాదముగా .... పాయసం, ఇతరపిండివంటలు తయారుచెయ్యటానికి వాడే పాలు .. ఆవుల ద్వారా వస్తాయి కదా.... ఈ రోజుల్లో ఆ పాలను వాటి దూడలను కూడా సరిగ్గా త్రాగనివ్వకుండా పిండేస్తున్నారు .


పండ్లు, బియ్యపుపిండి, గోధుమలు, బెల్లము , ఇవన్నీ మొక్కలు, చెట్లనుంచి మనము పొందేవే. ఇలా దేవునికి ప్రసాదముగా మనము సమర్పించే పదార్దములు ఇతరజీవుల నుంచి మనము పొందుతూ పూజా ఫలము మాత్రము ... మనకు మాత్రమే దక్కాలని కోరుకోవటం ఏమి న్యాయం ? మనము మనదిగా భగవంతునికి ఏమి ఇస్తున్నాము ?


మనము కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపిభగవంతునిఆనందపరచవచ్చుఇంకా ప్రేమతోకూడిన భక్తిని వారికిసమర్పించవచ్చు.


మనము స్వచ్చమైన భక్తిని కూడా భగవంతుని యెడల ప్రదర్శించలేకపోతున్నాము. త్యాగం ఇతర జీవులది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా..ఇదెక్కడి అన్యాయం ?

అందుకే పెద్దలు పూజాఫలమును పరమాత్మకే సమర్పించమని చెబుతుంటారు.

ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు ఏది ఎలా చెయ్యాలో ! ఎవరికి ఏది , ఎంత ఇవ్వాలో !


ఈ విశ్వ మనుగడకు ఇతర జీవులు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. మరి జీవులలో ఉత్తములు అనబడే మనం భగవంతునికి ప్రేమ భక్తితో పూజ కూడా చెయ్యలేకపోతున్నాము.

ఇంకా, మనం బ్రతకటం అంతా.. మన గొప్పే, మన తెలివివల్లనే అని విర్రవీగుతుంటాము.  ఆలోచిస్తే ప్రాణవాయువు అందకపోతే.... గట్టిగా కొంతసేపు కూడా ఉండలేని అల్పజీవులమైన మనం పుట్టినప్పటినుంచి మనకు ప్రాణవాయువును, నీటిని ,ఆహారాన్ని ఇంకా అనేకమైన వాటిని ఏర్పరిచిన పరమాత్మ పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి.


అలా లేకపోగా ... మన బ్రతుకుకు తోడ్పడుతున్న ఇతరజీవులను మన భౌతికమైన సుఖములకోసం నిర్దాక్షిణ్యముగా వాడుకుంటూ, మానవులు ఎంతో గొప్పవాళ్ళు .. ఇతరజీవులు అల్పమైనవి అంటుంటారు.


ఇంకా, ఎన్నో అవసరముల కోసం ఇతర జీవుల దయపై ఆధారపడి బ్రతుకుతూన్న మనం , భౌతిక సుఖములకు అతిగా అలవాటుపడి ..... కన్నూమిన్నూగానక ఇతర జీవులను సర్వనాశనం చేస్తున్నాము.

అవి అల్పజీవులు కాదు. మనిషే... అల్పబుద్దిగలవానిగా తయారవటం నేటి దౌర్భాగ్యం.


Wednesday, November 10, 2010

నాకు పూర్తిగా తెలియని విషయాలు .....................

 

 

ఇది ఆ మధ్యన నేను ఒక పుస్తకములో చదివిన సంగతి అండి. ......

అదేమిటంటేనండి, ఆ పుస్తకములో ఏమని ఉందంటే .... ఒక ఆయన ఒక స్వామివారి భాగవత ఉపన్యాసమునకు వెళ్ళారట.

అప్పుడు ఆ ఉపన్యాసములో నారదుడు- ప్రహ్లాదుడికి "ఓం నమో భగవతే వాసుదేవాయ "అనే మంత్రాన్ని ఉపదేశించే విషయాన్ని చెబుతున్నారట. దీనిని విన్న ఆయనకు ఆ ఉపన్యాసం చాలా ఆనందాన్ని ఇచ్చిందట.

ఆయన అప్పటినుంచి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టారట.

అయితే ఆ తరువాత కష్టాలు రావటం , ఈ కష్టాలకు కారణం, ఈ మంత్రమేనని భావించి వారు ఆ స్మరణను ఆపివేయటం జరిగిందట. కష్టాలు నెమ్మదిగా తొలగిపోయాయట.

ఆయన ఆ మంత్రాన్ని జపించటంవలన కష్టాలు రావటానికి కారణం ఏమిటని ఒక యోగిని అడిగినప్పుడు, " ఏముందీ నీవు భక్తి- జ్ఞాన - వైరాగ్య - తపస్సులను అడిగావు. వాసుదేవుడు ఇచ్చారు. అందుకే ఈ కష్టాలు. ఈ మంత్రం ముక్తి మంత్రమని, చాల శక్తివంతమైనదని వారు తెలిపారట. 


ఇవన్నీ చదివాక నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అంటే తెలియని వాళ్ళు అన్నీ మంత్రములు జపించకూడదు కాబోలు అని.

ఇంకా , ఈ మధ్యన టి.విలో పెద్దలు ఏమి చెప్పారంటేనండీ , భక్తులకు మొదలు కష్టములు వచ్చినా ఆ తరువాత సుఖములు వస్తాయట.

ఇంకా నాకు ఎన్నెన్నో ఆలోచనలు కలిగాయి. అవి ఏమంటే, మనము మంత్రజపం చేసినప్పుడే అనుకోకుండా కష్టములు రావటం వల్ల మనము ఆ కష్టములు జపంవల్ల అని పొరబడే అవకాశం కూడా ఉంది. అనీ,...........


కొన్ని మంత్రములను గురువు దగ్గర నుంచి ఉపదేశమును పొంది మాత్రమే జపించాలేమో ? అనీ ఇలా....

పైన యోగి చెప్పిన దానిప్రకారం అంటే, "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రము ముక్తి మంత్రము అని చెప్పినదానిప్రకారం చూస్తే ............. ఈ మంత్రం పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళకు బాగా అవసరం. ఉదా.. పెద్దలు నాలుగు ఆశ్రమధర్మములను గురించి చెప్పారు కదండి.


అలా నాలుగు ఆశ్రమధర్మములను నిర్వర్తించి క్రమముగా మోక్షమునకు అర్హతను సంపాదించుకోవచ్చని పెద్దలే తెలపటం జరిగింది. (ఈ రోజుల్లో వానప్రస్థాశ్రమం అంటే వనములకు వెళ్ళటం అందరికీ అయ్యే పని కాదు కదా ! కాబట్టి, ఉన్నచోటే మనస్సును అలా నిష్కామముగా ఉంచుకోవచ్చట. )


కానీ కొంతమందికి ( పెద్దవయస్సు గల వాళ్ళు ) వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళకు మనస్సులో ఇహలోక సుఖముల పట్ల కొద్దిగా అయినా అనురక్తి తగ్గటం జరగక బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి మహా మంత్రములు ఎంతో సహాయపడతాయి అని నాకు అనిపించిందండి.


అలాగే నారదుల వారు ప్రహ్లాదునికి ఈ మంత్రమును ఉపదేశించారన్న విషయాన్ని చూస్తే, మరి ప్రహ్లాదులవారు వివాహం చేసుకోవటం, పుత్ర, పౌత్రులను పొందటం జరిగింది కదా ! అలా చూస్తే ఈ మంత్రం ఇహలోక,పరలోక శుభములను రెండింటినీ ఇచ్చే మంత్రమని తెలుసుకోవచ్చు..


ఏమిటో నాకు పెద్ద పాండిత్యం లేకపోయినా ( పెద్ద
పాండిత్యం కాదు , నాకు సంస్కృతం అస్సలు రాదండి. ) ఇందులో తప్పులున్నయెడల నా అజ్ఞానాన్ని మన్నించవలెనని భగవంతుని మరియు పెద్దలను ప్రార్ధిస్తున్నాను.

 

Saturday, November 6, 2010

అనగనగా ఒక కధ.....

 

ఇప్పుడు వ్రాయబోయే కధ నేను చాలా కాలం క్రిందట చదివినదండి. సంభాషణలు ఉన్నవున్నట్లు గుర్తులేవు గానీ, కధ సారాంశం చాలా వరకు గుర్తుందండి.

నారదుల వారు ఎప్పుడూ నారాయణ నామ స్మరణ చేస్తూంటారు గదా !

ఒకప్పుడు నారదుల వారి మనస్సులో తాను చాలా గొప్ప భక్తుడిని అనే భావం ప్రవేశించిందట.

అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇంకొక గొప్ప భక్తుని గురించి చెప్పదలిచారట. అప్పుడు నారదులవారు ఆ భక్తుడెవరో తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతను ప్రదర్శించారట.

అప్పుడు , శ్రీ మహావిష్ణువు ఒక సామాన్య రైతును చూపించారట. ఆ రైతు తన స్వధర్మమును చక్కగా ఆచరిస్తూ సామాన్యముగా జీవిస్తున్నాడు.

నారదునిలా చాలాసార్లు దైవనామాన్ని స్మరించటం లేదు. అతనెలా గొప్ప భక్తుడు అవుతాడని నారదునికి సందేహం కలిగింది.

అప్పుడు విష్ణుమూర్తి నారదునికి ఒక పోటీ పెట్టటం జరిగింది. అదేమిటంటే అంచుల నిండుగా ద్రవపదార్దమున్న ఒక పాత్రను తలపైన పెట్టుకుని ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధముగా నారదుడు పాత్రను తలపైన పెట్టుకుని ప్రదక్షిణలు ప్రారంభించారట. చాలా సమయం గడిచింది.

అప్పుడు విష్ణుమూర్తి నారదునితో, ఇప్పటికి ఎన్నిసార్లు నారాయణ నామస్మరణం జరిగిందని అడిగారట.

అప్పుడు నారదుడు ఆ పాత్రలోని పదార్ధం ఎక్కడ క్రింద చిందుతుందో అన్న ఆలోచనలో ఉన్న తాను నామస్మరణం అంతగా చేయలేదని చెప్పటం జరుగుతుంది.

అప్పుడు విష్ణుమూర్తి ఆ రైతు సంసారనిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉండి ఎక్కువగా నామస్మరణం చెయ్యలేకపోయినా కొద్దిసార్లు మాత్రమే చేస్తున్నా అతని ధర్మబధ్ధజీవనం, బలమైన భక్తిభావం ఇలాంటి కారణములవల్ల అతనూ గొప్ప భక్తుడే అని చెప్పటం జరిగిందట.

ఈ కధను నాకు గుర్తున్నంతవరకు వ్రాయటం జరిగిందండి.

నాకు ఈ కధ ఏ పుస్తకములో చెప్పబడిందో తెలియదండి.

ఇందులో తప్పులు ఉన్నయెడల దయచేసి క్షమించవలెనని భగవంతుని ప్రార్దిస్తున్నాను.

 

Friday, November 5, 2010

కొన్ని వ్రణములు మందులతో తగ్గుతాయి. కొన్ని తీవ్రమయిన వ్రణములు శస్త్రచికిత్స ద్వారా కోసిపారేస్తే గానీ

 

ఇంతకు ముందు పోస్ట్ వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి.

ఏమంటే, పాపములు చేసే వాళ్ళు దైవపూజకు అర్హులు కారు అనుకుంటే ఈ కలికాలములో పాపములు చెయ్యనివాళ్ళు ఎంతమంది ఉంటారు ?

అదీకాక వారిని దైవకార్యక్రమముల వంటి మంచి కార్యక్రమములకు దూరం చేస్తే వారు మంచికి మరింతగా దూరమయ్యే అవకాశం ఉంది.

సత్సంగం వల్ల చెడ్డ ఆలోచనలు దూరమయి చెడ్డవాళ్ళు మంచిగా మారే అవకాశం ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు కదండి. అందుకే మంచివాళ్ళయినా, చెడ్డవాళ్ళయినా దైవపూజకు అర్హులే.

అయితే, కొన్ని ప్రాచీన గ్రంధములలో ఏమని ఉంటుందంటే ..అందులోని విషయములను భక్తిలేని వారికి చెప్పవద్దని హెచ్చరిస్తారు పెద్దలు.

ఎందుకంటే, కొందరు దురాశాపరులు ప్రాచీనవిజ్ఞానాన్ని, గొప్పమంత్రములను దుర్వినియోగపరచటం వల్ల లోకమునకు హాని కలుగుతుందని పెద్దల అభిప్రాయం కావచ్చు.

ఇలాగే కొంతమంది తీవ్రస్థాయి చెడ్డ మనస్తత్వం గలవాళ్ళు ( పురాణములలో చెప్పబడ్డ రాక్షసులు ) తపస్సులు అవిచేసి, మరింత బలం సంపాదించి లోకములను అల్లకల్లోలం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆఖరికి వారు దైవం చేతిలో సంహరించబడటం అందరికీ తెలిసిన విషయమే.

ఈ రాక్షసులు తీవ్రమయిన తపస్సు చేసినప్పుడు ఆ తపశ్శక్తి వల్ల పుట్టిన వేడికి లోకాలు తల్లడిల్లగా, దేవతలు లోకములను రక్షించుట కొరకు రాక్షసులకు వరప్రదానం చేసినట్లు మనం చదువుకున్నాము.


ఇవన్నీ ఆలోచిస్తే ఇలా అనిపిస్తోందండి. ఈ విశ్వాన్నే సృష్టించిన పరమాత్మకు ........... రాక్షసులకు వరములను ఇవ్వకుండానే , ఆ రాక్షసుల తపశ్శక్తి వల్ల పుట్టిన వేడినుంచి లోకములను కాపాడటం పెద్ద పనేమీ కాదు.

అయితే, పరమాత్మ దయామయుడు. మంచివారు, చెడ్డవాళ్ళు అందరూ వారి బిడ్డలే .

అందుకే రాక్షసులయినా వారు కష్టపడి తపస్సు చేయటం వల్ల దైవం వారికి వరములను ప్రసాదించి, ఆ రాక్షసులు కూడా మంచిగా మారటానికి ఒక అవకాశమును కల్పించిందని మనం భావించవచ్చు.

కానీ వరములను పొందిన తరువాత వారు మంచిగా మారకుండా లోకులను పీడిస్తూ ఉండటం వల్ల దైవం వారిని సంహరించవలసి వస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ రాక్షసులు ఒక ప్రక్క దైవంవల్లనే వరములను పొందుతూ , ఆ వరముల సాయంతోనే లోకులను పీడించటానికి, దైవాన్ని ఎదిరించుటకు ప్రయత్నిస్తారు.

కానీ సదా లోకక్షేమం కోరే దైవం చూస్తూ ఊరుకోవటం జరగదు కదా !

అసలు ఈ రాక్షసులకు తపస్సు చేసేటప్పుడు త్వరగా వరములను ప్రసాదించటం ఒకరకముగా మంచిదే. లేకపోతే వారు అలాగే తపస్సు చేస్తూ మరింత శక్తిని పొందే అవకాశం ఉంది.

వారిని సంహరించటం వారికి కూడా మంచి చేయటమేనని పెద్దలు చెబుతున్నారు. ఎలాగంటే ఆ రాక్షసులు మరిన్ని చెడ్డపనులు చేసి మరిన్ని పాపములు మూటకట్టుకోకుండా అన్నమాట.

......ఇవన్నీ ఎలాగంటేనండీ, ... ఉదా.. శరీరంపై వచ్చిన వ్రణములు కొన్ని మందులతో తగ్గుతాయి. కొన్ని తీవ్రమయిన వ్రణములు శస్త్రచికిత్స ద్వారా కోసిపారేస్తే గానీ పోవు.

అలాగే కొద్ది స్థాయి చెడ్డవాళ్ళు దైవపూజల వల్ల మంచిగా మారే అవకాశం ఉంది. తీవ్రస్థాయి చెడ్డతనం కలిగిన వాళ్ళు మారరు .. వారికి వెయ్యవలసిన శిక్షను వారికి దైవం వేసేవరకూ....... అని తెలుస్తోంది.

ఇలా ప్రతి విషయానికి మనకు తెలియని ఇంకా ఎన్నో కోణములు ఉంటాయని అనిపిస్తోందండి..

 

Wednesday, November 3, 2010

తనవరకూ వస్తే గానీ తత్వం తెలియదు అని పెద్దలు అన్నట్లు.................

ఇంతకుముందు పోస్ట్ లో ... కొంతకాలం క్రితం మాకు కొన్ని సమస్యలు వచ్చాయని వ్రాయటం జరిగింది కదండి.

ఆ సమస్యలు రాకముందు నా ఆలోచనా విధానం ఎలా ఉండేదంటేనండి, ఎవరైనా నన్ను దేవుడిని ఏమి కోరుకున్నావు ? అని అడిగారనుకోండి ....... నేను ఏదో గొప్ప వేదాంతిలా ..... ఇలా చెప్పటం జరిగేదండి...మనము కోరుకునేదేమిటి, భగవంతునికి తెలియదా ఏమిటి, మనకి ఏమి కావాలో........ అని........

ఇంకా, నా మనసులో కూడా ....... చాలామంది జనం కోరికలకోసమే గుడికి వస్తారు కానీ భక్తితో కాదు, నేను అలా కాదు, నేను అంతలా కోరికలు కోరను ........ ఈ విధంగా ఆలోచిస్తూ నేను కొంచెం గొప్ప అన్న అహంకారం ( చాలా కొద్దిగా ) నాలో ఉండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుందండి.


పెద్ద గా సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరూ గొప్పవారే . సమస్యలు వచ్చినప్పుడే కదా ! ఎవరు ఏమిటో తెలిసేది.


తీరా సమస్య నాకే వచ్చేసరికి మాత్రం నేను ... దేవునికి తెలియదా ఏమిటి....... నాకుఏమి కావాలో అని అనుకోలేకపోయాను . ఆ సమస్య నుంచి రక్షించమని భగవంతుని కోరుతూ గుడుల చుట్టూ తిరిగిన తర్వాత నాకు తత్వం తెలిసివచ్చింది.

మనం ఇతరులను , వాళ్ళు కోరికలకోసం మాత్రమే గుడికి వెళ్తున్నారు .......... ఈ విధముగా అనుకుంటూ ఎవరి భక్తినీ తక్కువగా చూడకూడదని తెలిసివచ్చింది. ..


ఎవరి శక్తికొలదీ వారు భగవంతుని సేవిస్తారు. మనం ఎవరి భక్తినీ తక్కువగా భావించకూడదు. ఏమో ఇప్పుడు కోరికలతో దైవాన్ని ప్రార్దించేవారే కొంతకాలానికి అలా పూజిస్తూ క్రమముగా.... మహాభక్తులు, గొప్ప వేదాంతులు కావచ్చు కూడా..........


కానీ కొంతమంది ఉంటారు, చాలా పాపాలూ చేసేసి తీరా కష్టాలు వచ్చేటప్పటికి పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా .......... దేవుడా రక్షించు అని భగవంతుని సతాయించేవాళ్ళని....... సమర్ధించటం న్యాయం కాదు కదా...........
ఇలాంటి వాళ్ళవల్లే ఆస్తికులకు చెడ్డపేరు వస్తోంది అని.........ఇంతకుముందు అనుకోటం జరిగేది.


ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి ........... అసలు చెడ్డపనులు చేసే వారికి భగవంతుని అవసరం మరింతగా ఉంది. పూజలు లాంటి మంచి కార్యక్రమములు చేస్తూ ఉంటే, అలా క్రమంగా వాళ్ళూ మంచిగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని.


ఇంకా ఇలా అనిపిస్తుందండి, పూజలు చేస్తూ కూడా ఇన్ని పాపాలు చేస్తున్నారంటే, అసలు పాప భయం, దైవభక్తి కొంచెం కూడా లేకపోతే వాళ్ళు మరెన్ని పాపాలు చేస్తారో గదా అనిపిస్తుంది..

అందుకే ఎవరు పూజలు చేసినా మనం సంతోషించాలి...........

ఇంకా, నేను ఇప్పుడు కూడా కోరికలకోసం మాత్రమే భగవంతుని పూజించకూడదు ఇలాంటి మాటలు చెప్పినా, ఇంతకుముందు అన్నదానికి, ఇప్పుడు అన్నదానికి భావములో తేడా ఉన్నదిలెండి.

 

Monday, November 1, 2010

సమస్యల నుంచి కూడా లాభాలు...............

 

మేము ఆ మధ్యన అమర్ నాధ్ ,వైష్ణవీ దేవి యాత్రలు చేసి వచ్చామని ఇంతకుముందు చెప్పాను కదండి. ఆ యాత్రలను మేము కేవలం భక్తి వల్ల మాత్రమే చేయలేదు.


ఆ మధ్య మాకు కొన్ని సమస్యలు వచ్చాయి లెండి. ఆ సమస్యలను తట్టుకోలేక........... ఆ దైవం ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారని , అలా యాత్ర చేయటం జరిగింది.


తెలిసిన వాళ్ళు ఆ యాత్రలు ప్రమాదకరమని భయపెట్టారు. ఆ సమయంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలను భరించటం కన్నా ఆ యాత్రలు చేయటం మాకు కష్టమనిపించలేదు.


మేము ఈ యాత్ర విషయం చెప్పినప్పుడు మా పెద్దవాళ్ళు మొదట్లో భయపడ్డారు....... ( వెళ్ళవద్దని చెప్పినా మేము వినముకదా..... ) మాకూ భయం ఉన్నా, ఈ రోజుల్లో ప్రమాదం ఎక్కడ లేదు........ అని సర్దిచెప్పుకుని భయంవేసినప్పుడు దైవాన్ని తలచుకొని ధైర్యాన్ని తెచ్చుకోవటం జరిగింది.


మొత్తానికి ఆ భగవంతుని దయవల్ల క్షేమంగా యాత్ర చేసి తిరిగి వచ్చాము. మా పెద్దవాళ్ళు ఆ విషయం గురించి ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఆ యాత్రలు చెయ్యటం గొప్పగా భావిస్తున్నారు.


అవన్నీ తలచుకొంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి, అలా సమస్యలు రావటం వల్లనే గదా ................... అంత గొప్పయాత్రలు చేయటం జరిగిందని, ............. అది మా అదృష్టమని ఇప్పుడు అనిపిస్తోంది.


ఎందుకంటే నేను ఈ జన్మలో ఎప్పుడూ ఆ యాత్రలు చేస్తానని కనీసం ఊహించలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే. అంతా భగవంతుని దయ.


ఈ సంఘటనల అనంతరం నేను జీవితాన్ని సరికొత్త కోణం నుంచి చూడటం నేర్చుకుంటున్నాను.

ఆ సమయంలో నాకు కష్టంగా అనిపించినా, కొన్ని నియమాలను పాటించి దైవపూజ చెయ్యటం వల్ల ఇప్పుడు రోజువారీ పనులలో ఒక క్రమశిక్షణ పాటించటాన్ని నేర్చుకుంటున్నాను. (ఇంతకూ ముందు
క్రమశిక్షణ లేదని కాదు .... మరికొంచెము పాటించటాన్ని నేర్చుకుంటున్నాను )


ఇంకా, నాలో ఎంతో మార్పు వచ్చింది.

ఈ విధంగా కష్టముల వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

ఈ మధ్యన టి.వి లో పెద్దలు చెప్పినట్లు ఎప్పుడైనా కష్టములు వచ్చాయని భయపడకూడదు. భగవంతుని నమ్మి ధర్మకార్యములు చేస్తూ ఉంటే పరిష్కారమార్గం తప్పక లభిస్తుంది.

 

Sunday, October 31, 2010

భగవంతుడు చండశాసనుడు కాదు...............................పరమ కరుణా సముద్రుడు , మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..

సాయి సాయి

పూజా నియమములను ఉన్నదున్నట్లు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి కఠిననియమములను పాటించి ................. దైవాన్ని ఆరాధించి శీఘ్రముగా పరమాత్మను పొందాలనుకొనేవారు ఎందరో ఉంటారు.

సామాన్యులు కూడా సరియైన పధ్ధతులను తెలుసుకోవటం ద్వారా వారికి వీలయినంత నియమములను పాటించటానికి ప్రయత్నిస్తారు.

అసలు లౌకికపరమయిన కోరికలను (విద్య, ఉద్యోగం ) సాధించాలంటేనే, ఎన్నో కష్టాలు, త్యాగాలు అవసరమవుతాయి. అలాంటిది మరి, అత్యున్నతమమయిన పరమాత్మను పొందాలంటే కొంచెం కష్టపడటం తప్పదు మరి.

ఏదైనా కష్టపడి పొందిన దానిలో ఉన్న తృప్తి ఎక్కువ కూడా కదండి.

అలాగని అన్ని నియమములను పాటించగలమా ? అని అందరూ నిరాశ చెందనవసరం లేదు. భగవంతుడు సామాన్యులకు, అసామాన్యులకు కూడా సులభంగా అందే అందరివాడు.

ఉదా.. అందరూ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పూజలు చేయలేకపోవచ్చు.

అందరికి పెద్ద పెద్ద గ్రంధములు చదివి భగవంతుని గురించి విస్తారంగా తెలుసుకొనే పాండిత్యం లేకపోవచ్చు.

కొందరు ఆరోగ్యం సహకరించకపోవటం, ఇంకా, రకరకాల కారణముల వల్ల కఠిననియమములను పాటించలేకపోవచ్చు.

కానీ భగవానుడు భక్తసులభుడు. కేవలం ప్రేమభక్తి ఉన్నంత మాత్రమునే దైవం భక్తులను అనుగ్రహించిన కధలెన్నో మనకు ఉన్నాయి. అందుకని ఎవరూ నిరాశ పడనవసరంలేదు.

శ్రీ వైభవలక్ష్మీ పూజా వైభవము పుస్తకములో ఏ విధమైన కోరికలు లేకుండా ,కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు సామాన్యనియమములను పాటించటం తప్ప కఠిననియమములను పాటించనవసరంలేదని నేను చదివానండి.

మరి మన లౌకికపరమైన కోరికలు తీరాలంటే చేసే పూజలలొ నియమాలను పాటించటానికి మనము కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు ? ...........ఆ కోరికలు కూడా ప్రపంచానికి కీడు చేసేవిగా ఉండకూడదు. ఇంకా,.

శిరిడి సాయి ఇలా అన్నారట....." ఎవరు అదృష్ష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో, వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరంలేదు. భక్తి యున్నచోటనే నా నివాసము " అని...