koodali

Friday, September 30, 2016

అమెరికాలో..శ్రీ యంత్రం...

కొన్ని సంవత్సరాల క్రిందట అమెరికాలోని Oregon అనే ప్రాంతంలో శ్రీ యంత్రం( శ్రీ చక్రం) యొక్క ఆకారం పెద్ద సైజులో కనిపించిందట.


ఈ విషయం గురించి పూర్తి వివరాలు నాకు సరిగ్గా తెలియవు.


ఆసక్తి ఉన్నవారు యు ట్యూబ్  లో చూడవచ్చు. 


Oregon Sri Yantra YouTube...


****************


 చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. 

పక్కలో బల్లెం..పరిస్థితి చక్కబడాలని ..




పదేపదే కవ్విస్తుంటే చేయగలిగింది ఏముంది.

తప్పని పరిస్థితిలో చర్య తీసుకున్నారు.
 
దేశరక్షణ కొరకు ధైర్యంగా పోరాడి విజయాన్ని సాధించిన అందరికీ కృతజ్ఞతలు. 


పరిస్థితి చక్కబడాలని దైవాన్ని కోరుకుందాము. 


Wednesday, September 28, 2016

స్థానికుల ఉపాధి ...

 
పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చాలామంది అంటుంటారు.

అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు..ఇక్కడి రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే  రాష్ట్రప్రజలకు  ఉపాధి లభిస్తుంది.

అంతేకానీ ఉద్యోగాలలో ఇతరులను తీసుకుంటే అప్పుడు పరిశ్రమలు వచ్చినా స్థానికులకు కలిగే లాభం ఏమీ ఉండదు.
...............
 
 భూములేమో రాష్ట్ర ప్రజల వద్ద నుండి  తీసుకోవటం..పరిశ్రమల ద్వారా వచ్చే లాభాలేమో పరిశ్రమల అధిపతులకు..ఉద్యోగాలేమో ఇతర రాష్ట్రాల వాళ్లకు అనే పరిస్థితి ఉండకూడదు.

 ఎక్కడెక్కడెక్కడివాళ్ళో వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ చక్కగా ఉపాధి పొందుతుంటే.. స్థానికులు వలస వెళ్లే పరిస్థితి ఉంటే... అలాంటి అభివృద్ధి ఎవరికోసం ?
.....................

ఎక్కడైనా కొంచెం అభివృద్ధి కనిపిస్తే చాలు .. ఇక ఎక్కడెక్కడి వాళ్లో వచ్ఛేస్తారు. 

   ఇలాంటప్పుడు స్థానికులకు ఉపాధి విషయంలో  పోటీ ఏర్పడి సమస్యలు వస్తాయి.

ఇవన్నీ చదివి, నాకు విశాలహృదయం లేదు..స్వార్ధం ఎక్కువ అనుకుంటే నేనేమీ చేయలేను.
 
 దేశంలో అందరూ ఒకే జాతిగా కలిసికట్టుగా జీవించాలి అనుకోవటం బాగుంటుంది.

 అయితే అలాంటి సమైక్యత  ఉండి, మన నీళ్లు, మన ఉద్యోగాలు..అనుకుంటూ  కలిసికట్టుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు ... మా నీళ్ళు, మా ఉద్యోగాలు అనే మాట వినిపించదు.


అయితే .. అనేక కారణాల వల్ల, మా నీళ్లు, మా ఉద్యోగాలు అనే ధోరణి  ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితిలో ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వారికి కూడా మా నీళ్ళు, మా ఉద్యోగాలు .. అనే అభిప్రాయం కలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

..............

ఇప్పుడు అమెరికా వంటి దేశాల వాళ్ళు కూడా ఇతరదేశాలనుండి తమ దేశానికి వచ్చే వాళ్ల వల్ల ... తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని భావించే పరిస్థితి ఉంది.
........................
 
 అన్ని రాష్ట్రాల ప్రజలు తమతమ రాష్ట్రంలో ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రం ప్రజలయినా తమ ప్రభుత్వాలు తమకు సమస్యలు లేకుండా చూడాలని భావిస్తారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాలు తమకు చక్కటి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు.
 
 
 అయితే, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పడినా కూడా, ఆ పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి లభించకుండా, ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉపాధి పొందుతుంటే .. ఓట్లేసిన స్థానికులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? తమకు ఉపాధి కల్పించమని స్థానికులు ఎవరిని అడగాలి? అందువల్ల ప్రభుత్వాలు స్థానికులకు ఉపాధి లభించేలా పనిచేయాలి.
 
***************

సంస్థలను ఏర్పాటు చేసినప్పుడు, ఆ సంస్థలలో ఎక్కువగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ, ఇతరరాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తే స్థానికులకు ఉపాధి ఎలా? ఇంకో విషయం ఏమిటంటే, ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ ఓటుహక్కు ఉండదు. వారు వారి రాష్ట్రాలలోనే ఓట్లు వేస్తారు.


 ఇతరులకు ఉపాధి కల్పించటానికి మనము సంస్థలను తేవటం ఎందుకు? నాకు ఇతరరాష్ట్రాలవారంటే కూడా గౌరవమే. అయితే, ఎవరి రాష్ట్రాలను వారు అభివృద్ధి చేసుకుని ఉపాధిని పొందాలి. ఎవరి రాష్ట్రాన్ని, దేశాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి కానీ, అదేపనిగా వలసలు పోవటం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. 
 
 
 ప్రజలు ఎడారిదేశాలకు వెళ్ళి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్నారు. ప్రభుత్వాలు చిన్న ఉద్యోగాలనైనా కల్పించి,  ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. 
 
పర్యావరణరక్షణ, పార్కులు అభివృద్ధి,  హదారుల శుచిశుభ్రత,  చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు..ఇలా ఎన్నో రంగాలలో ఉపాధి కల్పించవచ్చు. 
 
 
 విదేశాలకు వెళ్తే కొన్ని కష్టాలుంటాయని తెలిసినా కూడా, కొందరు ప్రజలు విదేశాలకు వెళ్ళి .. ఆదుకోవాలంటూ ప్రభుత్వాలను అడుగుతుంటారు. వెళ్ళినవాళ్ళందరూ అలా అడగటం మొదలెడితే ఎంతమందిని తిరిగి రప్పిస్తారు..
 
 ప్రజలు కూడా ఇతరదేశాలకు వెళ్ళి కష్టాలు పడటం కన్నా , స్వదేశంలోనే   వ్యవసాయం వంటివి కూడా చేయటానికి ప్రయత్నించవచ్చు.

****************

 ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను.

 ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇతర రాష్ట్రం నుండి మరింత మంది ఇక్కడ రావాలి.. అంటూ ఇక్కడ స్థిరపడిన కొందరు  ఇతర  రాష్ట్రం వాళ్ళు... తమ వాళ్ళను ఆహ్వానిస్తున్న వార్త చదివాను.

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే బోలెడుమంది ఉపాధి లేక బాధపడుతున్నారు.

 ఇక ఎక్కడెక్కడి నుండో వస్తే స్థానికుల ఉపాధి సంగతేమిటి ?

 ఇలాంటప్పుడు ..  మాకు విశ్వనగరాలు అక్కరలేదు... బాబోయ్! మమ్మల్నిలా బ్రతకవ్వండి చాలు.. అనాలనిపిస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇతరరాష్ట్రాలకు, ఇతరదేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడివాళ్ళు కూడా మనవాళ్లను తిట్టుకుంటూ ఉంటారు.
................. 
 
ఇతర భాషల వాళ్ళు కొందరు కొన్ని సంవత్సరాల క్రిందట తెలుగురాష్ట్రాల కొచ్చి సెటిల్ అయ్యి, ఇక్కడ తెలుగు వాళ్ల మధ్య గొడవలు పెట్టి విడతీయటానికి ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో వేరే భాషల వాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు చాలా చోట్ల వారి పెత్తనం ఎక్కువయ్యింది. ఇతరులు ఇక్కడకు వచ్చి హాయిగా ఉంటున్నారు. స్థానికులు ఉపాధి కొరకు విదేశాలకు పోయి అక్కడ నానాబాధలు పడుతున్నారు.
..............
 
 వలసలు వెళ్లటం కొంతవరకూ ఎక్కడైనా జరిగేదే..

అయితే , వలసలు ఒక స్థాయిని మించితే మాత్రం స్థానికులకు, వలసదారులకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ...ఎవరి దేశాన్ని వాళ్లు అభివృద్ధి చేసుకుని సొంత ప్రాంతంలో ఉపాధి పొందటం మంచిది.
.................

అయితే, ప్రపంచమంతటా ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు , తత్వవేత్తలు.... వంటివారు ప్రపంచానికి అంతా చెందినవారు.

 ఇలాంటివారికి ప్రాంతీయత ఉండదు.ప్రపంచమంతా వారిదే. వారు అందరివారు.

 ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే.. సైనికులలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉంటారు. వారికి ప్రాంతీయభేదాలు ఉండవు. కలసికట్టుగా దేశ రక్షణకు కృషి చేస్తుంటారు.

 సైనికులను  చూసి దేశప్రజలు ఎంతో నేర్చుకోవాలి.
 
**************
marikonni vishayaalu..
 

కొంతకాలం క్రిందట  తిరుమలను కేంద్రప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు కావచ్చు కానీ, కొన్ని వార్తలు వచ్చాయి. కొందరు తమిళులు అప్పుడప్పుడు తిరుమల.. తిరుపతి మావే అన్నట్లు మాట్లాడుతారు. సరిగ్గా పూజాదికాలు జరగని పురాతనకాలం నాటి దేవాలయాలెన్నో ఉన్నాయి. వాటిగురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ? ఆదాయం ఎక్కువ వచ్చే తిరుమల గురించి పర్యవేక్షిస్తామంటూ మాత్రం వార్తలు వస్తుంటాయి.
 
 
  రాష్ట్ర విభజన సమయంలో మద్రాస్  తమిళనాడుకు, తిరుమల ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి.  నాకు తమిళులంటే ఏమీ వివక్షలేదు.వారంటే నాకు ఎంతో గౌరవం. అయితే, తిరుమల మాదే.. అనే కొందరి గురించి.. అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. 
 
 
హిందువులు అందరూ ఒకటేనంటూ.. తిరుమలను ఇస్కాన్, ఇతర రాష్ట్రాలు, లేక కేంద్రం ఆధీనంలోకి ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా నా అభిప్రాయం.


Monday, September 26, 2016

రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...


సునామీలు, తుఫాన్లు గురించి ముందుగానే సమాచారం తెలిసే విధంగా రాకెట్ ప్రయోగం విజయవంతగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు అభినందనలు.
..........
 
రాబోయే కాలంలో రొబోట్ల సంఖ్య పెరగటం.. తద్వారా మనుషులకు ఉద్యోగావకాశాలు తగ్గటం జరుగుతుందంటున్నారు.

 అయితే రోబోట్లను కొన్ని పనులకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఉదా..భూకంపాలు వచ్చినప్పుడు శిధిలాలలో ఉండిపోయిన వారి ఆచూకీ తెలుసుకోవటం కోసం రోబోట్లను ఉపయోగించవచ్చు అంటున్నారు..

చెత్త తరలించే కార్యక్రమాలలో మనుషుల బదులు రోబోట్లను వాడుకోవచ్చు.

 బోరుబావులలో పడిపోయిన వారిని వెలికితీయటంలో రోబోట్లను వాడవచ్చు. 

 మనుషులకు కష్టమైన పనులకు రోబోట్లను వాడేలా ఉపయోగించితే బాగుంటుంది.
 
***************
 
 మనుషులు చేసే ఉద్యోగాల స్థానంలో మనుషులను తీసేసి రోబోట్లను పెడితే నిరుద్యోగ సమస్య ఎదురవుతుందనేది నిజమే..

అయితే,  ప్రభుత్వం  వద్ద డబ్బు బాగా ఉండి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఉద్యోగాల కల్పన కష్టమేమీ కాదు.

 జీతాలు ఇవ్వటానికి డబ్బు ఉండాలే కానీ ఉద్యోగాలకు ఏం కొదవ .. . ఎన్ని చిత్రవిచిత్రమైన ఉద్యోగాలైనా సృష్టించవచ్చు..

ఉదా..రోడ్డు  ప్రక్కన చెట్లు నాటి వాటి రక్షణకు ఒక్కో రోడ్డుకు ఒక్కో ఉద్యోగిని నియమించవచ్చు.

  ...............
 
ఈ రోజుల్లో  చాలా ఆఫీసులలో ఇద్దరు చేసే పనిని ఒక్కరే చేస్తున్నారు. 

 ఇంతకుముందు అన్ని బస్సులలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉండేవారు.
ఇప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు ఎక్కువ లేక కొన్ని బస్సులలో కండక్టర్ను తీసివేసారు. డ్రైవరే టికెట్ ఇస్తున్నారు.

సమాజంలో పేదరికం, నిరుద్యోగం పోవాలంటే సంపద కొందరి వద్దే కాకుండా .. అందరి వద్ద ఉండాలి.

 పేదరికం, నిరుద్యోగం తగ్గాలంటే ప్రభుత్వాలు నల్లడబ్బును, అవినీతిని సమర్ధవంతంగా అరికట్టటానికి కఠినచర్యలు తీసుకోవాలి.
పెరుగుతున్న ధరలను తగ్గించాలి.

 ప్రజలు కూడా అత్యాశ తగ్గించుకోవాలి. అప్పుడు అందరి వద్దా సంపద  ఉంటుంది.

 భారతీయుల వద్ద ఉన్న వేలు లేక లక్షల కోట్ల సంపద బయటకు వస్తే .. పేదరికం తగ్గి నిరుద్యోగ సమస్యా తగ్గుతుంది.

అందువల్ల  నల్లడబ్బును, అవినీతిని నిర్మూలించటం ఎంతో ముఖ్యం. 

సమాజంలో నైతికవిలువలు పెంపొందటం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం.
 
*******

 ఎవరికైనా ప్రాధమిక అవసరాలు తీరటం ముఖ్యం.. అంటే, ఆహారం, రక్షణ, ఆవాసం(ఇల్లు), విద్య, వైద్యం..ఇలా ప్రాధమిక అవసరాలు తీరటం పెద్ద కష్టమేమీకాదు. ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి.
 

 బోలెడు మొక్కలనుంచి అందరికీ ఆహారం లభిస్తుంది. ప్రకృతి నుంచి లభించే వాటితో పర్యావరణహితమైన ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇక, చక్కటి పద్ధతితో జీవిస్తే అనారోగ్యాలు  తక్కువగా ఉంటాయి. ప్రకృతి నుంచి లభించే వాటితో మందులు తయారీ , సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజవిధానాలతో వైద్యం చేయవచ్చు. ఎన్నో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఇలా ప్రాధమిక అవసరాలు తీరటం అందరికీ తీరటం సులభమే. మనుషులే వ్యవస్థను పాడుచేసుకుంటున్నారు.
 
 పాతకాలంలో డబ్బు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. ఆ విధానాన్ని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడవచ్చు.


 ఇప్పటి ప్రజలు చాలామంది ప్రాధమిక అవసరాలను కూడా విలాసంగా మార్చుకుంటున్నారు. అంటే, ఆహారం విషయంలో.. సరిపడినంత మంచి ఆహారం కాకుండా, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు.  ఇల్లు విషయంలో..సరిపడినంత చక్కటి ఇల్లు కాకుండా,  విలాసవంతమైన ఇళ్ళకు బోలెడు డబ్బును ఖర్చుపెడుతున్నారు. ఇక   వైద్యం, విద్య విషయంలో గమనిస్తే.. వీటిని చాలాచోట్ల వ్యాపారధోరణితో మార్చుకున్నారు. ఇక రక్షణ విషయంలో..ప్రపంచంలో  మనుషులు అనేకకారణాలతో గొడవలు పడుతున్నారు కాబట్టి, రక్షణకొరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.


 విమానప్రయాణాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు, అనేక ఆభరణాలు, కాస్మెటిక్స్ఖర్చులు..ఇలాంటి విలాసాలు ఎన్నో ఉన్నాయి.

ఆధునికకాలంలో కుటుంబవ్యవస్థ, విద్య, వైద్యం, అన్నీ మారిపోయాయి.  కొత్తవస్తువులకొరకు  ప్రజల కోరికలు పెరిగిపోయాయి.  వాటిని పొందటానికి స్త్రీలు, పురుషులు అదేపనిగా పనిచేసినా కూడా ఎక్కడి డబ్బూ సరిపోవట్లేదు.

*****************

marikonni vishayaalu..

link..మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ...

 

link.. యంత్రాల వాడకం, నిరుద్యోగం, పనివత్తిడి, పెరిగిన ధ...

Friday, September 23, 2016

అందరికీ మంచి బుద్ది......


ఈ మధ్య జరిగిన సంఘటనలో కొందరు సైనికులు మరణించటం అత్యంత బాధాకరం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి వందనములు.

ఈ సంఘటనల వల్ల భారతదేశంలోని ప్రజలు కొందరు పొరుగుదేశంతో యుద్ధం చేయాలంటున్నారు.

యుద్ధం వస్తే ముందు కష్టపడేది సైనికులే. 

ఇంతకుముందు జరిగిన యుద్ధాలలో భారతదేశం గెలిచినా కూడా.. ఎందరో సైనికులను కోల్పోవటం జరిగింది.

అత్యంత ప్రమాదకరమైన ఆధునిక మారణాయుధాలు ఉన్న ఈ రోజులలో యుద్ధం వస్తే ఇరుదేశాలూ తీవ్రంగా  నష్టపోయే అవకాశం ఉంది.

పోనీ,  యుద్ధం వల్ల సమస్య పరిష్కారమై పోతుందని చెప్పలేం.అందువల్ల యుద్ధం అనేది ఇప్పుడు సరైనది కాదు.

ఇంతకుముందు కూడా భారతదేశం తనకుతానుగా పొరుగుదేశంపై ముందుగా యుద్ధం ప్రకటించలేదు.

 ఇక పొరుగుదేశమే యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు ఎటూ యుద్ధం తప్పదు.

కొంతకాలం క్రిందట మేము అమరనాధ్, వైష్ణవీదేవి..యాత్ర కొరకు జమ్మూ..కశ్మీర్ వెళ్లి వచ్చాము.అద్భుతమైన ప్రదేశమది.


  స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.
....................


ఆ మధ్య కశ్మీర్లో వచ్చిన వరదలు వచ్చిన సమయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న సహాయచర్యల వల్ల అక్కడి వారు బీజేపీకి కూడా ఓట్లు వేసారు..   అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

తద్వారా అక్కడ  సంకీర్ణప్రభుత్వం ఏర్పడింది.

ఇంకో విషయం ఏమిటంటే, కొన్ని సమస్యలకు పరిష్కారం అంత సులువుగా ఉండదు.


కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం జరగటం అనేది అంత సులభం కాదు.

నష్టతీవ్రత వీలయినంత తక్కువగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతానికి చేయగలం.

 కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలి.  

ఈ మధ్య ప్రధానమంత్రి గారు బలూచిస్థాన్ గురించి ప్రస్తావించటం.. తద్వారా అక్కడి వాళ్ళ సమస్యను ప్రపంచదేశాల దృష్టికి తేవటమనేది చక్కటి ఆలోచనే.

 ప్రపంచదేశాలకు పాక్ దుశ్చర్యలను తెలియజేస్తూ ..  భారత్ కు మద్దతు కూడగట్టడం, పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేయటం మంచిదే.

అయితే కొన్నిదేశాలు తమ అవసరాల దృష్ట్యా ఎప్పుడు ఎటు ప్లేట్ ఫిరాయిస్తాయో తెలియదు కాబట్టి భారత్ జాగ్రత్తగా ఉండాలి. 
..............

  స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.

ఎవరు ఎటు పోయినా సరే..మా అవసరాలే మాకు ముఖ్యం..  అంటూ స్వార్ధంగా ప్రవర్తిస్తూన్న వారు దేశంలో ఎందరో ఉన్నారు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలే నీటివిషయంలో సర్దుబాట్లు చేసుకోవటంలో పట్టువిడుపు లేకుండా ప్రవర్తిస్తూ గొడవలు పడటం జరిగింది.

*********
  గొడవలు పడకుండా  ఇరుప్రాంతాల వారు అభివృద్ధిపై దృష్టిపెడితే ఎంతో బాగుంటుంది.

భజరంగి భాయ్ జాన్  సినిమా చాలా బాగుంది.
 
అందరికీ మంచి బుద్ది ఉండాలని  దైవాన్ని కోరుకుందాము.



Wednesday, September 21, 2016

అడవిలో....

 
కొంతకాలం క్రిందట మేము నల్లమల అడవులలో ఉన్న..ఒక శివాలయ దర్శనానికి వెళ్ళి రావటం జరిగింది. (గుండ్ల బ్రహ్మేశ్వరం  )..

ఈ దేవాలయ దర్శనానికి సామాన్య భక్తులను మహాశివరాత్రి సందర్భంలో అంటే సంవత్సరంలో రెండు, మూడురోజులు మాత్రమే అనుమతిస్తారట.

ప్రయాణం అడవుల గుండా జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చారు..
మేము ఉదయం బయలుదేరి సాయంత్రానికి తిరిగి గిద్దలూరు చేరుకున్నాము. దైవదర్శనం బాగా జరిగింది.

జీపులో వెళ్ళటానికి సుమారు నాలుగు గంటలు, తిరిగి రావటానికి సుమారు నాలుగు గంటలు సమయం పట్టింది.

అంత అడవిలో కూడా వారు సరుకులు తెచ్చి  వంట చేసి దేవాలయం వద్ద  అన్నదానం జరపటం ఎంతో గొప్ప విషయం.
...........
ప్రయాణంలో అడవిలో జంతువులు కూడా కనిపించే అవకాశం ఉంది. మాకు జింకలు కనిపించాయి.

 మేము వెళ్ళినప్పుడు.. అక్కడి అటవీ సిబ్బంది దారిలో కనిపించి ..ఇంతకుముందు కొందరు చిరుతపులిని చూడటం జరిగిందని చెప్పి , జాగ్రత్త.. అని చెప్పారు.

.అంతా దైవం దయ....మాకు పులి కనిపించలేదు.
 దట్టమైన అడవిలో అక్కడక్కడ కొందరు అటవీ సిబ్బంది కాపలాకాస్తున్నారు. 


 కొందరి వద్ద ఆధునిక ఆయుధాలు ఉండి ఉండవచ్చు. 

అయితే కొందరు సిబ్బంది విల్లంబుల  సహాయంతో కాపలా కాయటం కూడా జరుగుతోంది.  

 ఒక దగ్గర ఒక్క అతనే నిలుచుని కాపలా కాస్తున్నాడు.

అతనివద్ద  రక్షణ కొరకు ఒక చెట్టుకొమ్మ వంటిది   మాత్రమే ఉన్నదని చూసినట్లు నాకు గుర్తుంది.

 నాకు ఏమనిపించిందంటే , పులి  వస్తే అతను ఒక్కడే  ఎలా ఎదుర్కోగలడు ? ఏం ఉద్యోగాలో ? ..అనిపించింది.

 అటవీ సిబ్బంది అందరికీ ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలు ఇస్తే బాగుంటుంది.

మార్గమధ్యంలో ఒక దగ్గర అటవీ గెస్ట్ హౌస్ కూడా ఉంది.

రాత్రి సమయంలో గెస్ట్ హౌస్ చుట్టుప్రక్కల క్రూరజంతువులు తిరిగే సందర్భాలు కూడా ఉంటాయని అక్కడి సిబ్బంది చెప్పారు.

 వాళ్ళు డ్యూటీ పైన అక్కడికి వెళ్తే కొన్ని రోజులకు సరిపడా ఆహారదినుసులను తీసుకువెళ్ళవలసి ఉంటుందట. అక్కడే వాళ్ళు వంట చేసుకుంటారట.

 ఆ అడవుల్లో రాకపోకలకు సన్నని దారి ఉంది.

 అడవుల్లో స్మగ్లర్లు వంటి వారి బెడద కూడా ఉంటోంది.

మొత్తానికి అడవులు, అటవీ సిబ్బంది రక్షణ గురించి కొరకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడితే బాగుంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే ... కొన్నిసార్లు తిరుమల కొండల వద్ద అడవిలో నిప్పు వ్యాపించినప్పుడు సిబ్బంది చెట్ల కొమ్మలతో అగ్నిప్రమాదాన్ని  నివారించటానికి ప్రయత్నించటాన్ని టీవీలో చూసాము.

ప్రమాద నివారణ కొరకు  మరింత మెరుగైన పరికరాలను సిబ్బందికి సమకూర్చాలి.

Monday, September 19, 2016

దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు..మరియు...కొన్ని విషయాలు..



దేశరక్షణ విధులను నిర్వహిస్తూ కొందరు సైనికులు మరణించటం, కొందరు గాయాలపాలవటం ఎంతో బాధాకరమైన విషయాలు. ఇవన్నీ ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది.

దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు. .............

ఇంకో విషయం ఏమిటంటే ,ఆంధ్రప్రదేశ్లో కృష్ణా..గోదావరి బేసిన్లో చమురు లభిస్తుందని తెలిసిన తరువాత నుండి అక్కడ చమురు..సహజవాయువు వెలికితీత కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరగటం, కొందరు మరణించటం కూడా జరిగింది. 

ఇప్పడు కూడా అప్పుడప్పుడు గ్యాస్ వెలికిరావటం ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకటం జరుగుతోంది. 
 ఈ వార్తలు గమనిస్తే.. బాబోయ్!ఇక మీదట ఏ ప్రదేశంలోనూ ఖనిజాలు, గ్యాస్..వంటి నిక్షేపాలు  లభించవద్దు.అని కోరుకోవాలనిపిస్తోంది.

సూర్యరశ్మి అపారంగా లభించే మన దేశంలో సోలార్ విద్యుత్ మరింతగా పెంచుకోవాలి ..

సోలార్ విద్యుతో నడిచే వాహనాలను చవకగా తయారుచేసేలా ప్రయోగాలు జరిగేలా ప్రభుత్వాలు   ప్రోత్సహిస్తే బాగుంటుంది. 

  భూగర్భ వనరులను అదేపనిగా వెలికితీయటం వలన సముద్ర నీరు పైకి చొచ్చుకు వచ్చి మంచినీరు ఉప్పునీరుగా మారటం  వంటి  దుష్ఫలితాలు వస్తాయంటున్నారు.

 ఇప్పటికే కోస్తాలో అనేక చోట్ల మంచినీరు లభించే ప్రదేశంలో  ఉప్పునీరు ఆక్రమించటం జరుగుతోంది.

ఇలాంటి త్రవ్వకాల వల్ల పరిస
ర ప్రాంతాలలో  కాలుష్యం కూడా బాగా ఉంటుంది.

పచ్చటి కోనసీమ లో ఎప్పుడు ఏం  జరుగుతుందోనని ? ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే ఖర్మ ఏమిటి ?

ఈ పరిస్థితి మారేలా అందరూ చర్యలు తీసుకోవాలి.