koodali

Friday, October 31, 2025

చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

 

 దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.

    కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

        నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

   చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

  పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

  అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
    ........................................................
       
    సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

   జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

   కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.

కొన్ని పరిహారాలను చేయటం కూడా కష్టమే. కొన్ని పరిహారాలను ఆచరించటం కంటే, కష్టాలను అనుభవించటం ద్వారా పాపక్షయం చేసుకోవటమే తేలికగా అనిపించవచ్చు.

పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
  .....................................................

        ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

    అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

    చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

    ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
 ..............................

కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

    ****************************
    రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

    పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

***************************

ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

    చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

     ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

     కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

    ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
 .................................

భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.    

 ................................................ 

దైవనామ స్మరణాన్ని, పూజలు చేయటాన్ని  మొదలుపెట్టి, అలా పూజలు  చేస్తూచేస్తూ..ఉండటం వల్ల  క్రమంగా   పాపాత్ములలో  మార్పు వచ్చి మంచిగా  పరివర్తన చెందుతారు.

* మందులు మనకు ఇష్టం ఉండి వేసుకున్నా, ఇష్టం లేక  మ్రింగినా అనారోగ్యాన్ని  పోగొడతాయి కదా! అలాగే ఏ కారణంతో దైవనామస్మరణాన్ని మొదలుపెట్టినా ఫలితం లభిస్తుంది. 

అయితే, దైవనామ స్మరణం చేసే వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు , నీతినిజాయితీలను బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి. కొందరికి  ఒక జన్మలో  మంచి మార్పు  కనిపిస్తే, మరి  కొందరిలో  కొన్ని జన్మలు పట్టవచ్చు. 

*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   
 
కొందరికి రోగం  త్వరగా  తగ్గుతుంది. కొందరికి ఆలస్యంగా  తగ్గుతుంది. మందులు  సరిగ్గా  వేసుకోకుండా, పధ్యం సరిగ్గా  పాటించని  వారికి  రోగం త్వరగా తగ్గకపోవచ్చు కూడా.
............................. 

 దైవాన్ని దృఢంగా నమ్మి శరణు పొందిన వారి విషయంలో దైవము, వారిని సరైన పద్ధతిలో జీవించేలా చేస్తారు.

అయితే, భక్తులం అని చెప్పుకునేవారికి కొందరికి అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది..తాను ఎన్నో పూజలు చేయటం వల్ల, తాను ఎలా ప్రవర్తించినా కూడా..దైవం కూడా తనకి లొంగక తప్పదు..అనే విధంగా అహంకారం ఉన్న వారి విషయంలో, వారు ఎన్ని పూజలు చేసినా కూడా గొప్పఫలితాలను పొందలేకపోవచ్చు. 

................................. 

    కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

    తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

    దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
    ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
    శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

(రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )

  శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

 అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

 దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
 దైవం  కాపాడుతారు.
    ......................

    గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి,  ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.

కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.

పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
...................................

మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు. 

అలాగే కొందరు,  
పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా,  తాము చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుతూ కూడా.....పాపాలు చేయకుండా మాత్రం మనస్సును నిగ్రహించుకోలేరు. 

అలాంటప్పుడు తమకు సరైనదారిలో జీవించేలా శక్తిని ఇవ్వమని దైవాన్ని దృఢంగా ప్రార్ధిస్తే దైవము కరుణించే అవకాశం ఉంటుంది.

...........................
 పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా...ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు. 

పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల....చేసేవారికి, సమాజానికి మంచిదే. 

అయితే, సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందలేకపోవచ్చు.

  ...................................
  ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

ఉదా..కొందరిని గమనిస్తే, వాళ్లకు చాలా డబ్బుంటుంది. కాని, ఇష్టమైనవి తినలేనివిధంగా డయాబెటిస్ లేక అలాంటి వ్యాధులుంటాయి....

చేసిన పుణ్యాలకు చాలా డబ్బును ఇచ్చి, చేసిన పాపాలకు ఫలితంగా ఇష్టమైన ఆహారాన్ని తినలేని విధంగా సుగర్ వంటి వ్యాధులను వచ్చేలా చేస్తారు.

 కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 
...................

ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు. 

ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు.. ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.
...........................

దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.
......................................

 అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..

link.... ఓం ..కొన్ని విషయములు..

 link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

    

No comments:

Post a Comment