koodali

Tuesday, October 28, 2025

ఏవి నిజమో? ఏవి ప్రక్షిప్తాలో? మరికొన్ని విషయములు..

 

గ్రంధాలలో 
ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి. 

ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
................

ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు,  దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 

వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
..................
 

మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యం వంటి మత్తు పదార్ధాల వల్ల మనస్సు అదుపు తప్పి ఎన్నో నేరాలు జరిగే అవకాశముంది. అందువల్ల, వాటిని ప్రోత్సహించేలా మాట్లాడటం సరైనదేనా?
...................
మాంసాహారం తినకూడదని వేదములలో ఉందని కొందరు చెబుతున్నారు.

మద్యాన్ని తీసుకోవటం పంచమహాపాతకాల్లో ఒకటని గ్రంధాలలో ఉందంటున్నారు. వాటిని సమర్ధించటం కూడా పాపమేనట.

 ............

 చక్కగా గాయత్రిని ఆచరించే కుటుంబాలవారు ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా చేయలేనివారు తక్కువ నియమాలను పాటిస్తారు....(నాకు తెలిసినంతలో.. పాత కాలంలో అలా ఉండేదనుకుంటున్నాను.)

అయితే ఈ మధ్య కొందరు, ఎవరైనా కూడా అనేక నియమాలను పాటించాలన్నట్లు చెబుతున్నారు. ఉదా.. ఉల్లి,వెల్లుల్లి వంటివి తినకుండా నియమాలు పాటించాలన్నట్లు చెబుతున్నారు.

మరికొందరు ఏమంటున్నారంటే, గాయత్రిని ఆచరించే కొన్ని అగ్రవర్ణాల వారు (ఉదా..క్షత్రియులు..)మాంసాహారం తినొచ్చు అంటున్నారు.

ఒకరు ఏమంటున్నారంటే, బ్రాహ్మణ,క్షత్రియులు..యజ్ఞంలో వ్రేల్చబడిన బలిని  (మాంసాహారాన్ని) తీసుకోవాలని గ్రంధాలలో ఉందని చదివినట్లు గుర్తు ..అని చెబుతున్నారు.

 గాయత్రి మంత్రాన్ని చేసేవారు మాంసాహారాన్ని తీసుకోవచ్చా?

 ఎలా తిన్నా కూడా మాంసాహారం మాంసాహారమే కదా...అప్పుడు ఎవరైనా దైవం పేరు చెప్పి జీవహింస చేసి మాంసాహారం తిని, మేం చేసింది తప్పుకాదు అంటే సరిపోతుందా?

నియమాలను పాటించేటప్పుడు ఉల్లివెల్లుల్లి వంటివే తినకూడదంటే, మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు? ఏమిటో ?

................

భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించో, ప్రలోభపెట్టో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు( ప్రక్షిప్తాలు)చేయించారేమో?

హిందువుల్లోనే కొందరు తమలోతాము గొడవలు పడి తమకుతోచినట్లు ప్రక్షిప్తాలు చేసారేమో? ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
..............

కొంతమంది ఏమనుకుంటారంటే, సాటి జీవులను ఎక్కువగా చంపితే వీరత్వం అనుకుంటారు. ఎవరైనా తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.
................

క్రూరమృగాలు ఊళ్ళమీద పడి మనుషులను చంపే సందర్భాల్లో క్షత్రియులు ఆ క్రూరమృగాలను చంపవచ్చు . అందువల్ల, క్షత్రియులకు వేట నిషిద్ధం కాదు. అలాగని వేట వ్యసనం కాకూడదు.
............

వేటకు వెళ్లినప్పుడు దశరధ మహారాజు, పాండుమహారాజు.. అంతటివారే శాపాలకు గురయ్యారు.
................

నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, యుద్ధరంగంలో పోరాడేవారు పౌరుషం రావటానికి బహుశా మాంసాహారం అలవాటుచేసుకున్నారేమో?..అనుకున్నాను.

ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను చూస్తే.. వారిని ఎదుర్కునే ధైర్యం దానికదే రావాలి. అంతేకాని, ధైర్యం రావటం కొరకు మూగజీవులను చంపనవసరం లేదు.

తామసాహారాన్ని తింటే కోపం, ఆవేశం..వంటి తామస గుణాలు కలుగుతాయంటారు.

 ఆ విధంగా ఆహారం ద్వారా ఆవేశం రావాలంటే, మాంసాహారమే తిననవసరం లేదు. ఉప్పు,కారం బాగా ఉండే నిల్వ పచ్చళ్ళు, చద్ది ఆహారం.. కూడా తామసాహారమే. అలాంటివి తిన్నా సరిపోతుంది.

...........................

ఇంతకుముందు ఒక పోస్టులో..
 
 యుద్ధసమయంలో జంతువులను వాహనాలుగా చేసుకునేవారు. యుద్ధసమయంలో కొన్నిసార్లు శాకాహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..అలా చనిపోయిన జంతువులను తినేవారేమో? అని రాసాను.

ఇలా వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి....

మనుషులు తమ అవసరాల కొరకు జంతువులను పెంచటం అలవాటుచేసుకున్నారు. 


మన అవసరాల కొరకు జంతువులను కష్టపెట్టటం కూడా పాపమే. యుద్ధాలు వస్తే మనుషులే తమలో తాము పోట్లాడుకోవాలి. మధ్యలో జంతువులను వాడటం, వాటిని చంపటం ..ఇంకా పాపం.
 
పాపాలు చేసినప్పుడు ఫలితాలను అనుభవించాలి.
................
మనుషులు కోరికలు తగ్గించుకుంటే కష్టాలు తగ్గుతాయి. 
 
మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాకూడా వేరేవాళ్లు వచ్చి, రెచ్చగొట్టి యుద్ధాలు చేస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి యుద్ధం చేయకతప్పదు. అప్పుడు ఆ పాపం రెచ్చగొట్టిన వారికే ఎక్కువగా తగులుతుందనిపిస్తుంది.
...............................
 
 

No comments:

Post a Comment