koodali

Friday, September 8, 2023

ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 
కొందరు ..మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో ఉంది...ఇలాంటి వారి మాటలు విని ప్రజలు గొడవలు పడుతుంటారు.

ఇంకా ఎన్నాళ్లు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటారు? నిజంగా ప్రజలపై జాలి ఉంటే వాళ్లకున్న సంపదలో కొద్దిగా తమకు ఉంచుకుని, మిగతాది పేద ప్రజలకు ఇచ్చేస్తే బాగుంటుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు ఎగదోసి తాముమాత్రం కోట్ల సంపదలు కూడబెట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. మరి కొందరు ముందు జాగ్రత్తతో ప్రజలకు కూడా గోరంత ఇచ్చి, తాము కొండంత సంపాదించుకుంటారు.

కొందరి ప్రవర్తన పైకి కనిపించేదొకటి..వెనుక ఉండేదొకటి.

పూర్వం జరిగిన సంగతులు అలా ఉంచితే, ఈ రోజుల్లో ఎవరు ఎంత వరకూ సాటిమనుషులను గౌరవిస్తున్నారో? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ను విసుక్కోకుండా ఎంతమంది ఆప్యాయంగా చూసుకుంటున్నారు? చాలామంది తమ ఆఫీసులో పై అధికారికి నమస్కరిస్తారు, గౌరవిస్తారు, మరి ఆఫీసు గుమ్మం బయట కాపలా ఉండే వ్యక్తి మనకు నమస్కరించినప్పుడు, ప్రతినమస్కారం చేసి గౌరవంగా మాట్లాడేవారు ఎంతమంది? రోడ్డుప్రక్కన ఉండే బిచ్చం ఎత్తుకునే వారిని సాటిమనిషిగా అయినా గౌరవించే వారెందరు? ఇంట్లో పిల్లల అభిప్రాయాలకు కొంతయినా విలువ ఇచ్చే పేరెంట్స్ ఎందరు? నీకు ఏం తెలుసు? మేము చెప్పిన చదువు మాత్రమే నువ్వు చదవాలి..అని మాట్లాడే పేరెంట్స్ ఎందరో ఉన్నారు.కుటుంబాలలో కూడా మెతకగా ఉండేవారిని గడుసుగా ఉండేవారు ఏడిపిస్తారు. ఇలా ఎన్నో అసమానతలు, అణచివేతలు ఇం
టాయటా ఉన్నాయి.

ఈ ప్రపంచంలో బలహీనులను బలవంతులు అణచివేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే ఎందరో మనుషులు..మూగజీవులైన పశుపక్ష్యాదులను చంపి తింటున్నారు. అప్పుడు ఈ మాటలు వర్తించవా? మూగజీవులపైన మన పెత్తనమేమిటి? వాటికీ ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉంది.

ఈ రోజుల్లో కూడా తేడాలుంటున్నాయి. ఉదా.. వైద్యులకు ఇచ్చినంత గౌరవం, జీతం నర్సులకు ఉంటుందా? నర్సులు రోగులకు ఎంతో చేస్తారు.వారి రక్తం, మలమూత్రాలను కూడా శుభ్రం చేస్తారు. నర్సుల సాయం లేనిదే రోగులకు, వైద్యులకు కూడా  కుదరదు.అలాగని, వైద్యులకు, నర్సులకు ఒకే జీతం ఇవ్వాలంటే ఎంతమంది  ఒప్పుకుంటారు? డాక్టర్లు ఏమంటారంటే, మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివాము..మాకు..నర్సులకు ఒకేలా జీతాలు ఎలా ఇస్తారంటారు. తేలికగా అర్ధం అవ్వటం కోసం వైద్యుల ఉదాహరణ చెప్పాను.. ఏ రంగంలో వారికైనా ఇది వర్తిస్తుంది.
 
ఈ రోజుల్లో కూడా మరి గార్డులుగా పనిచేసేవారు కొందరు వారి కష్టాల గురించి చెప్పి బాధపడుతున్నారు.ఈ గార్డుల్లో అన్ని కులాల వాళ్లున్నారు.

ప్రజల  మధ్యన  ఆర్ధిక అసమానతలు తగ్గితే అన్ని అసమానతలు తగ్గుతాయి. అందుకే, ఒకే ఆఫీసులో పనిచేసేవారి జీతాల విషయంలో పెద్ద తేడాలు లేకుండా చేస్తే బాగుంటుందేమో? అనిపిస్తుంది. ఈ విషయాల గురించి ఇంతకుముందు కొన్ని పోస్టులు వ్రాసాను. అనేక చర్చలు కూడా జరిగాయి.

ప్రాచీన గ్రంధాలలో అంటరానితనం లేదని నేను వివరించాను. క్రమంగా కొందరు తెలిసీతెలియని వారి వల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో అంటరానితనం..వంటి దురాచారాలు ప్రవేశించాయి.

అంటరానితనం పేరుతో సాటి మనుషులను వేరుగా పెట్టడం ఖచ్చితంగా తప్పే.అలా వేరుచేయబడ్దవారు ఎంతో బాధపడతారు.
పాతకాలంలో కొందరి శ్రమశక్తిని కొందరు  దోచుకున్నారని అంటారు.మేము ఎవరినీ దోచుకోలేదు.. మేమూ కష్టాలు అనుభవించాము అంటారు కొందరు. ఎవరి వాదన వారిది.
 
 మనము మాత్రమే  బాధలు పడ్డాము అనుకోనక్కరలేదు. ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి. బ్రాహ్మణులు ఉపవాసాలని సరిగ్గా  ఆహారం కూ
డా తినకపోవటం,  తలస్నానాలు, కఠినమైన ఆచారాలను పాటించటం..వంటివి చేస్తారు. అలా పాటించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది.వేరే వృత్తులు  చేయకూడదని వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకుంటారు..
రాజులు, సైనికులు వంటివారు ..యుద్ధానికి వెళితే తిరిగి వస్తారో రారో తెలియదు. ఇలా ఎవరి బాధలు వారికి ఉన్నాయి. అన్ని కులాల్లోనూ మంచివారుంటారు, చెడ్దవారుంటారు.

సమాజంలో ఎన్నో వృత్తులుంటాయి. ఆవన్నీ లేనిదే సమాజం సరిగ్గా నడవదు.శూద్రులు రకరకాల పూజలు చేయకపోయినా ఫరవాలేదు, కొంత పూజ చేసినా చాలు.. చక్కటి ఫలితం వస్తుందని గ్రంధాలలో తెలియజేసారు. .. కొందరికి ఇది నచ్చదు. 

 హమ్మయ్య....పూజ కొంత చేసుకున్నా చక్కటిఫలితం వస్తుందంటే మంచిదే కదా..  అనుకునే శూద్రులూ ఉన్నారు.  శూద్రులకు ఎన్నో వెసులుబాట్లున్నాయి. వీరికి  ఆహారం విషయంలో   ఉల్లి, వెల్లుల్లి..వంటివి తినకూడదనే  నియమాలు లేవు. మడి వంటివి ఉండవు.

 ప్రత్యేకపూజలు చేయాలనుకుంటే కొన్ని నియమాలను పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. నియమాలను పాటించనివారు, మాంసాహారం తినేవారు ఈ పూజల విషయంలో పండితులను సంప్రదించి ఆచరించటం మంచిది.

పాతకాలంలో మడి అని అందరినీ దూరంగా ఉంచారని అంటారు కొందరు. బ్రాహ్మణులలో కూడా మడికట్టుకున్నప్పుడు వారి ఇంట్లో వారిని కూడా అందరినీ ముట్టుకోరు.

 పాతకాలంలో అంటరానితనం లేదు. ఎవరిపనిని వారు చక్కగా చేసుకునేవారు. ఎవరి గౌరవం వారికి ఉండేది. పాతకాలంలో భారతదేశం ఎంతో సుసంపన్నంగా ఉండేది.ఈ విషయాలను ఎందరో విదేశీ యాత్రీకులు కూడా  తమ గ్రంధాలలో వ్రాసారు.అయితే, మధ్యకాలంలో విదేశీదండయాత్రల వల్ల వ్యవస్థ మారిపోయింది.

 ఇక్కడి సంపదపై కన్నేసిన కొందరు విదేశీయులు ఇక్కడకొచ్చి, ఇక్కడవారిని భయపెట్టి, బెదిరించి కొంత లోబరుచుకున్నారు. ప్రతిసమాజంలోనూ కొందరు చెడ్దవారుంటారు. వారు శత్రువులకు సహకరించారు. క్రమంగా అనేక చెడ్దవిషయాలు సమాజంలో ప్రవేశించాయి. విభజనలు జరిగాయి. మనుషుల మధ్య విభేదాలు ఏర్పడ్దాయి.

 విదేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సంపన్నులు..పేదల మధ్య దూరం, తెల్లవారు..నల్లవారి మధ్య దూరం..ఒక్క మతం వారి మధ్యే గొడవలు.. ఇలాంటివి ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడే భారతదేశంలోనే ఉన్నాయనుకోవటం మూర్ఘత్వం.హిందువుల్లో కులాలున్నాయంటారు. ఇతర మతాల వారిలో కూడా తెగలున్నాయి. వారి గొడవలు వారికున్నాయి.

  పాతకాలంలో శూద్రులు అంటరానితనం వల్ల ఇబ్బందులు పడ్దారని, వారు పైకి రావాలని ఈ మధ్య కాలంలో అనేక చట్టాలు వచ్చాయి. అంటరానితనాన్ని నిర్మూలించటానికి చట్టాలు తప్పకుందా రావాలి. ఇందువల్ల పరిస్థితి మెరుగుపడింది..  రిజర్వేషన్లు కూడా వచ్చాయి. కొద్దిగా ప్రారంభమయిన రిజర్వేషన్లు ఇప్పుడు బాగా పెరిగాయి.  

  రిజర్వేషన్లు లేని కులాల్లో కూడా ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన వారు ఎందరో ఉన్నారు. వీరికి చదువులు, ఉద్యోగాలు లభించటం కొంత కష్టంగా ఉంది.

ఇంకో కొందరున్నారు. వారు శూద్రులలోనే కొన్ని కులాలు. వీరు ఆర్ధికంగా ముందున్నారని వీరికి  రిజర్వేషన్లు  ఇవ్వలేదు...దీనినిబట్టి  ఏ కులంలో వారైనా ఆర్ధికంగా బాగుపడితే ఇక వారికి రిజర్వేషన్లు అక్కరలేదు అని, అనుకోవచ్చేమో..

 రిజర్వేషన్లు  లేని శూద్రులలో కూడా  ఎందరో పేదవారున్నారు.  వీళ్ళు ఏమంటారంటే.. మేము పాతకాలంలో అంటరానితనంతో బాధపడ్దాము. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా లేవు..ఇలా రెండు విధాలుగా అన్యాయం జరుగుతోందంటారు.  

 ఆర్ధికంగా వెనుకబడినవారికి చదువుకోవటానికి, వ్యాపారానికి నిలదొక్కుకోవటానికి ప్రభుత్వాలు ఆర్ధికంగా సహాయం చెయ్యవచ్చు. అంతేకానీ, ఎంతో కష్టపడి చదివిన మాకు  సీట్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవటం అన్యాయం. పాతకాలంలో కొందరికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు మరి కొందరికి అన్యాయం చేయటం ఏం న్యాయం? మమ్మల్ని ఇలా అణచివేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలంటున్నారు.

ఈ కొత్త అసంతృప్తులను గమనించి కాబోలు..ఈ మధ్య అన్ని కులాల్లోనూ ఆర్ధికంగా వెనుక బడినవారికి  కొద్దిశాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అయితే, అవకాశాలు లేనివారు మరెందరో ఉన్నారు. వీటన్నింటివల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయి. కనిపించకుండా ప్రజల మనస్సుల్లో విభేదాలు ఉంటున్నాయి.

 ఇవన్నీ లేకుండా ఉండాలంటే అందరికీ అన్ని అవకాశాలు చక్కగా ఉండాలి.
 
కొందరేమో రిజర్వేషన్లు తీసివేయాలంటారు. కొందరేమో కులాలు, మతాలు తీసివేయాలంటారు. రిజర్వేషనులు, కులాలు, మతాలు..పోయే పరిస్థితి ప్రస్తుతం కనిపించటం లేదు. అందువల్ల అన్నీ ఉండకతప్పని పరిస్థితి ఉంది కాబట్టి, అవన్నీ ఉండక తప్పదు.

 కులవ్యవస్థ పోవాలంటారు, అయితే వెనుకబడ్ద కులాలు అని అంటున్నవారిలో కూడా ఎవరి కులంలో వారినే వారు వివాహం చేసుకుంటారు. హిందువులలో కొందరు, ఒకే కులంలో కూడా శాఖా భేదాల వల్ల వివాహాలు చేసుకోరు.

 మతాలు, కులాలలో మూఢనమ్మకాలు, అంటరానితనం వంటివి పోవాలి. రిజర్వేషన్లు ఉన్న కులాలలో కూడా ధనవంతులు, బాగా చదివి పెద్ద స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. వారిలో కొందరు తమ రిజర్వేషన్లు వదులుకున్న గొప్పవారున్నారు. కొన్ని కులాలవారు  తమ రిజర్వేషన్ కోటాలో కొంత తగ్గించుకుని ఇతర శూద్రులకు వాటా ఇవ్వవచ్చు.

అప్పుడైనా ఇప్పుడైనా సమాజంలో కొందరికి అవకాశాలు బాగుండటం..కొందరికి అవకాశాలు తగ్గటం.. అనే విధమైన వ్యవస్థ సరైనది కాదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అసమానతలు ఉండకూడదు. సంపద కొందరు ధనవంతుల వద్ద మాత్రమే కాకుండా, అందరి వద్దా ఉండేలా వ్యవస్థ మారినప్పుడు అందరికీ చదువు,ఉపాధి అవకాశాలు చక్కగా ఉంటాయి.అసమానతలు తగ్గుతాయి.

సమాజంలోనూ, కుటుంబాల్లోనూ.. అందరూ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి, . అందరూ కష్టపడి పనిచేసుకోవాలి. అందరూ చేసే పని ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకం పని ఉంటుంది.

 
  సమాజం, కుటుంబం  అన్నాక కొంతయినా ఒకరితో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే కుటుంబమయినా, సమాజమయినా బాగుంటుంది.  స్వేచ్చ అని ఎవరిష్టానికి వారు ప్రవర్తించటం వల్ల సమాజానికి హాని కలుగుతుంది. మేము చెప్పినట్లే అందరూ వినాలని అహంకరించినా సమాజానికి హాని కలుగుతుంది.

సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఏర్పరుచుకుని ముందుకుపోవాలి. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి.
.....
ప్రపంచంలో  అధికారం, డబ్బు కొరకు ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. వారి మాటలు నమ్ముతున్నారు కొందరు ప్రజలు.

విదేశీయులు చాలా కాలం భారతదేశాన్ని పాలించారు. అప్పుడు వారివల్ల భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. భారతదేశాన్ని పాలించిన విదేశీయులు ఇక్కడి ప్రజలను ఎన్నోబాధలు పెట్టారు. స్త్రీలపట్ల అవమానాలు చేసారు. అన్యాయాలకు ఎదురుతిరిగి పోరాడిన యువకులను చంపివేసారు. అప్పుడు కూడా  కొందరు స్వదేశీయులే తమ స్వార్ధం కొరకు వారికి సహకరించారు. ఈ రోజుల్లో కూడా కొందరు స్వదేశీయులు దేశానికి ద్రోహం చేస్తున్నారు. 


 ప్రపంచయుద్ధసమయంలో మనకు యుద్ధంతో ఏమీ సంబంధం లేకపోయినా, మన సైనికులను యుద్ధానికి తీసుకెళ్లటం వల్ల ఆ కొత్త వాతావరణంలో యుద్ధం చేయలేక వేలమంది సైనికులు చనిపోయారు.

****
 ఈ మధ్యన..మనుషులు మతాల పేరుతో,కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, దేశాల పేరుతో.. ఒకరికొకరు నిందించుకోవటం ఎక్కువయ్యింది. ఎవరికైనా దైవం ఒక్కరే.. ఆ మహాశక్తి ఒక్కటే. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. అయితే ఇతరులు మనల్ని అణచివేస్తారేమో? అనే భయాల వల్లా, ఇతరులపై మనమే ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి వల్లా.. ఇలాంటి కొందరి వల్ల సమాజం అంతా సమస్యలు వస్తుంటాయి.

  గొడవకొరకే కొందరు వాదనలకు దిగుతారు. అలాంటివారు ఎవరేం చెప్పినా వినిపించుకోరు.

ఓట్ల కొరకు పార్టీలు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజలు కూడా అలాంటి వారికే ఓట్లు వేస్తున్నారు. మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న వారి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు విచక్షణతో ఉండకపోతే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.

 ప్రపంచంలోని అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.చెడు పోవాలి.

 నా అభిప్రాయాలు కొందరికి  నచ్చకపోవచ్చు. నాకు తోచినవి వ్రాసాను.  వీటిలో చాలా విషయాలను ఇంతకుముందే బ్లాగులో వ్రాయటం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఎంతని చెప్పగలం? చేయగలిగినంత చేస్తాము. దైవం ఎవరికి ఏది చేయాలో అది చేస్తారు. అంతా దైవం దయ.


5 comments:


  1. ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు దైవాన్ని ప్రార్ధించటం మంచిది. మనుషులు కొంతవరకే సాయపడగలరు. దైవం తలచుకుంటే ఏమైనా చేయగలరు. దైవం మెచ్చే విధంగా ప్రయత్నించాలి.

    ReplyDelete
  2. రాజస్థాన్ లోని ఒక కాళీమాత ఆలయం వద్ద పులులు స్వేచ్చగా తిరుగుతాయట. అవి భక్తులకు ఏమీ హాని చేయవట. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరగటం దైవలీల.
    దైవం తలచుకుంటే ఏమైనా చేయగలరని
    తెలుస్తుంది.

    ReplyDelete
  3. దైవం జీవులకు ఎన్నో ఇచ్చారు. గాలి, నీరు, అందమైన పువ్వుల మొక్కలు, అందమైన దృశ్యాలతో కూడిన ప్రకృతి, ఆహారంగా రుచికరమైన పండ్లచెట్లు, కాయకూరలు....ఇలా ఎన్నింటినో సృష్టించి ఇచ్చారు. మనుషులు చక్కగా హాయిగా సంతోషంగా జీవించవచ్చు.

    మనుషులు అత్యాశలతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. మనుషులు ఎన్ని తప్పులు చేసినా మంచిగా మారడానికి దైవం ఎన్నో అవకాశాలను ఇస్తున్నారు. అయినా కూడా, మనుషులు బుద్ధి తెచ్చుకోవటం లేదు

    చాలామంది అనేక కారణాలతో ఇతరులను కష్టపెడుతుంటారు. కొందరు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. క్రూరత్వం వంటివి దైవానికి ఇష్టం ఉండవు.

    క్రూరత్వం గురించి వింటేనే మామూలు మనుషులకే కండ్ల వెంట నీరు వస్తుంది. మరి మనుషులకే ఇలా జాలి, దయ వంటి లక్షణాలు ఉన్నప్పుడు, అపార దయామయుడైన దైవానికి ఎంతో జాలి, దయ ఉంటాయి. దైవాన్ని నమ్మేవారు క్రూరమైన పనులు చేయకూడదు.

    జీవితంలో కొన్ని గొడవలు వస్తుంటాయి. పట్టువిడుపుతో సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది. అయితే, కొందరికి పట్టువిడుపు ఉండదు.

    అనంత విశ్వంలో మనిషి బ్రతుకెంత? శక్తి ఎంత? గట్టిగా నూరేళ్ళు జీవించలేని మనుషులు ఎన్ని పట్టుదలలు చూపిస్తారో కదా..చనిపోతే శిధిలమయ్యే శరీరం, మరణం తరువాత ఎవరు ఏమవుతారో తెలియదు.

    బ్రతికినంత కాలం తాము సంతోషంగా ఉంటూ, ఇతరులను కష్టపెట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకరితో ఒకరు గొడవలు లేకుండా, అందరూ సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి మంచిరోజులు ఎప్పుడు వస్తాయో?
    .....
    ప్రపంచంలో హింసాత్మక పరిస్థితులు ఏర్పడటం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి సందర్భాలలో చిన్నపిల్లలకు రక్షణ ఉండాలి. హింసను వ్యతిరేకించే స్త్రీలకు, మగవారికి కూడా ముప్పు ఉండకూడదు. 

    హింసాత్మక పరిస్థితుల వల్ల కుటుంబాలు కకావికలు అయితే చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? చిన్నపిల్లలు ఏమీ తెలియని నిస్సహాయులు. ఇలాంటివి తలచుకుంటేనే తట్టుకోలేని బాధ కలుగుతుంది.

    కొందరు మనుషులు.. జంతువుల విషయంలో కూడా క్రూరంగా ఉంటున్నారు. కొందరు మనుషులు చేపలు వంటి వాటిని పట్టుకుని, అవి బ్రతికుండగానే కత్తితో కోస్తుంటారు.

    కరోనా వంటివి వచ్చి ఎందరో చనిపోయినా కూడా మనుషులు బుద్ధి తెచ్చుకోవటం లేదు. మనుషులు క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అర్ధం కావటం లేదు. మనుషులు మానవత్వంతో ప్రవర్తించాలి, ప్రపంచంలో శాంతి నెలకొనాలి.

    ReplyDelete
    Replies
    1. అధికారం కొరకు ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగాయి. ఎంతో మారణకాండ జరిగింది. ఎన్నో దారుణాలు జరిగాయి. ఎందరో సామాన్యులు నలిగిపోయారు. ఈ అన్యాయాలకు అంతమెప్పుడో?
      మతాల పేరుతో కూడా మారణకాండ జరిగింది. ఈ దారుణాలతో విసిగిపోయిన ప్రజలకు నాస్తికులుగా మారాలనిపించవచ్చు. లేకపోతే, ఏ మతం లేకుండా తమకు నచ్చినట్లు హాయిగా దైవాన్ని ఆరాధించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వస్తారేమో..అనిపిస్తుంది.

      Delete
  4. ఈ విషయాన్ని ఆలస్యంగా వ్రాస్తున్నాను. ఈ మధ్య కొందరు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. దైవందయవల్ల మానవప్రయత్నం ఫలించి, వాళ్లు అందరూ క్షేమంగా బయటకురావటం ఎంతో మంచి విషయం.

    ReplyDelete