koodali

Wednesday, August 9, 2017

కొన్ని విషయాలు..తక్కువ ధరకు భోజనాన్ని...


ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది. 
***************

మరి కొన్ని విషయాలు..


 కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న తక్కువ ధరకు భోజనాన్ని అందించడానికి ఏర్పాటయిన క్యాంటీన్ల గురించి చాలా మందికి తెలుసు.


ఎన్నో కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితిలో అందరికీ పని లభించటం కష్టంగా ఉంది.


 ప్రభుత్వాలు కూడా అందరికీ ఉపాధి కల్పించలేవు. 


ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు పేదలకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించగలిగితే ఎంతో మంచిది. 


ఆకలితో ఉన్న మనిషికి పనిచేయటానికి సరైన శక్తి  ఉండదు. 


ఆకలితో  ఉన్నప్పుడు చాలామందిలో కోపం , ఆవేశం వంటి లక్షణాలు కూడా వస్తాయి. 


ఇందువల్ల సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది.


అందువల్ల అందరికీ ఆహారాన్ని అందించటం ఎంతో ముఖ్యం. 


ఆకలితో ఉన్నవారికి  ఆహారాన్ని అందించటం ఎంతో మంచి విషయమని పెద్దలు తెలియజేసారు. 


***************

 ఈ రోజుల్లో పని చేయాలన్నా పని దొరకటమే కష్టంగా ఉంది. 

 ఇలాంటప్పుడు పని చేసినవారికే  ఆహారం అనటం సరైనది కాదు. 

పనికోసం విపరీతంగా పరిశ్రమలు పెట్టి సహజవనరులు త్వరగా తరిగిపోవటమూ సరైనది కాదు.


 సహజవనరులు వేగంగా తరిగిపోని విధంగా  ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు అభివృద్ధి చేసుకోవాలి..


 ఉదా.. పర్యాటకం..వంటి రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. 


**************** 

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. 

అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  


వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  


మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  


అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.


***************

 ఇక్కడ  ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.  


  ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 


  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన  అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది.


  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


************

పేదవారికి రాత్రి సమయంలో తల దాచుకోవటానికి  షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడే వైద్య సహాయం ఉండాలి.

 ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాల వద్ద డబ్బు ఉండాలి. 


డబ్బు ఉండాలంటే, సంపద అంతా కొందరి వద్దే ప్రోగుపడకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


 జనాభా విపరీతంగా పెరిగినా ఇబ్బందే. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అనే పరిస్థితి వస్తుంది. 


స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా దేశంలో పేదరికం వంటి సమస్యలు ఉండటం బాధాకరం. 


 దేశంలో పేదరికం తగ్గాలంటే ప్రజలూ, ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే చక్కటి ఫలితాలు వస్తాయి.



No comments:

Post a Comment