Wednesday, January 23, 2013
అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...
* కొంత కాలం క్రిందట ఒక టీవీ చానల్ లో ఒక ప్రోగ్రాం చూసాను. పెద్ద స్టార్ హోటల్ వాళ్ళు తమ హోటల్లో టాయిలెట్స్ ను ఎంత శుభ్రంగా ఉంచుతామో చూపించారు. .
అక్కడ కమోడ్స్ కూడా చేతిలో ఒక బట్ట ముక్కను పట్టుకుని దానితో శుభ్రంగా తుడుస్తున్నారు. ఆ శుభ్రం చేసే వాళ్ళు మంచి దుస్తులు వేసుకుని , చక్కటి భాష మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఎక్కువ జీతం ఇస్తారట.
* ఇదంతా చూసిన తరువాత నాకు ఎన్నో ఆలోచనలు వచ్చాయి.
..........................
* పూర్వకాలంలో కొందరు ప్రజలు, ఇతరుల మలినాలను శుభ్రపరిచేవారు . ఇది ఎంతో బాధాకరమైన విషయం .
* అయితే, ఈ రోజుల్లో అలాంటివి జరగటం లేదా ? అనే విషయాన్ని గమనిస్తే, ఇలాంటి చర్యలు అప్పటి కన్నా, ఇప్పుడే ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుంది.
* ఈ రోజుల్లో కూడా ఇతరుల మలినాలను సాటి మనుషులే శుభ్రం చేయటం చూస్తూనే ఉన్నాము.
* ఉదా...చాలామంది ఇళ్ళలో , గదికో టాయిలెట్, గదికో వాష్ బేసిన్ కట్టించుకుంటున్నారు. అయితే, వాటిని ఇంటి యజమానులు శుభ్రం చేయరు. పనివాళ్ళతో శుభ్రం చేయిస్తారు.
ఈ రోజుల్లో చాలామందికి ఇంటిపని చేయటానికి పనివాళ్ళను ఏర్పాటుచేసుకుంటున్నారు కదా ! వాళ్ళు యజమానులు తిన్న ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తారు. టాయిలెట్స్ శుభ్రం చేస్తారు.
అంతేకాదు, వాటిని గాఢమైన రసాయనాలతో శుభ్రం చేయవలసి వస్తుంది. ఆ ఘాటు వల్ల వాళ్ళ చేతులకు, కళ్ళకు అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఉంది.
* ఇళ్ళల్లోనే టాయిలెట్స్, వంటగదిలో సింకులు వల్ల డ్రైనేజ్ సమస్యలు వచ్చినప్పుడు కూడా పారిశుద్య కార్మికులు వచ్చి మలినాలను శుభ్రం చేసి వెళ్తారు.
* పూర్వం ఇలా గదికో టాయిలెట్ ను శుభ్రం చేసే అవసరం ఉండేది కాదు. రసాయనాల బాధ కూడా ఉండేది కాదు.
.......................................
* ఇప్పుడు చాలా మంది సరదాగా కుటుంబసమేతంగా హోటల్స్ కు వెళ్ళి భోజనం చేస్తున్నారు. . వాళ్ళు తిన్న పళ్ళేలను అక్కడ వదిలి వచ్చేస్తారు గానీ, కడగరు కదా ! వాటిని అక్కడి పనివాళ్ళే కడుగుతారు.
* పూర్వ కాలం కుటుంబసభ్యులు హోటల్స్ కు వెళ్ళి తినటం అనేది తక్కువగా జరిగేది. ఒకవేళ బయట తిన్నా , ఆ రోజుల్లో భోజనం చేయటానికి అరటాకులు వంటి ఆకులను ఉపయోగించేవారు.
భోజనం తరువాత అరటాకులను ఇతరులు శుభ్రం చేయనవసరం లేదు, వాటిని బయట పారేస్తే పర్యావరణానికి హాని లేకుండా చక్కగా మట్టిలో కలిసిపోయేవి.
...................................
* అప్పటి వాళ్ళు సరుకులు తెచ్చుకోవటానికి కిరాణా కొట్టుకు వెళ్తే ఇంటినుంచి సంచిని తీసుకు వెళ్ళేవారు.
పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నన్ని రకాల వస్తువులు లేవు కాబట్టి , ఇంత చెత్త ఉండేది కాదు. ఆ చెత్త కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టిలో కలిసిపోయేది.
* పూర్వకాలం వాళ్ళు ఇంత చెత్తను బయట పారబోసేవారు కాదు. అంటే,
ఉదా... ఇంట్లో మిగిలిన వ్యర్ధ పదార్ధాలైన కూరగాయల తొక్కలను , వేరుశనగ తొక్కలు, మొక్కజొన్న పై తొక్కలు , అరటి వంటి పండ్ల తొక్కలు,.... వంటివాటిని చెత్తలో వేయకుండా పశువులకు మేతగా వేసేవారు. మరికొన్ని పదార్ధాలను బయట పారవేస్తే కాకులు వంటి పక్షులు తిని పర్యావరణాన్ని శుభ్రం చేసేవి.
* ఇప్పుడు పెరిగిన వాతావరణ కాలుష్యం వల్ల కాకులు, పిచ్చుకలు వంటి పక్షులు ఎక్కువగా కనిపించటం లేదు కదా !
ఈ రోజుల్లో చెత్త బుట్టల వద్ద టన్నుల కొద్దీ చెత్త పోగవుతోంది. కుళ్ళిపోయిన ఆ చెత్తను సాటి మనుషులే శుభ్రం చేస్తుంటారు. ఈ పారిశుద్య కార్మికులు డ్రైనేజ్ కాలువలను కూడా శుభ్రం చేస్తుంటారు.
....................
* పూర్వకాలంలో ఎవరి ఇంటిముందు వీధిని వాళ్ళే ఊడ్చి, కళ్ళాపి జల్లి, ముగ్గులు పెట్టుకునే పద్ధతి ఉండేది. దీనివల్ల వీధులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులకు చాలా పని తప్పుతుంది.
* ఈ రోజుల్లో ఎవరి ఇంటి ముందు చెత్తను వారు శుభ్రం చేసే పద్ధతి తగ్గిపోయి , బాధ్యతంతా పారిశుధ్య కార్మికులపై పడుతోంది.
..............................
* ఇవన్నీ గమనిస్తే పూర్వకాలంలో కన్నా, ఈ కాలంలోనే ఇతరుల మలినాలను సాటి మనుషులు శుభ్రం చేసే పని ఎక్కువగా జరుగుతోంది ... అనిపించింది.
..................................
* పూర్వం ఈ దేశంలో టాయిలెట్స్ ఉండేవి కాదని, అప్పటి వాళ్ళు ఆరుబయటకు వెళ్ళేవారని ఇప్పటివారంటారు. ఆరుబయట కాలకృత్యాలకు వెళ్ళినా ఆ వ్యర్ధాలు మట్టిలో కలిసి ఎరువుగా మారేవి.
* ఈ రోజుల్లో అయితే, టాయిలెట్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలను పైపుల ద్వారా, మురుగు కాలువల ద్వారా...... డైరక్టుగా నదులలో, సముద్రాలలో కలిపేస్తున్నారు.
ఇలా కాకుండా గోబర్ గేస్ ప్లాంట్స్ ఏర్పరిచి , ఈ వ్యర్ధాలను విద్యుత్ గా మార్చి , వీధి దీపాలు వెలగటానికి , ఇంకా ఇతరత్రా విద్యుత్ అవసరాలకు వాడుకుంటే బాగుంటుంది. ( ఇలా వచ్చిన గేస్ ను వంటకు ఉపయోగించటానికి ఎక్కువమంది ఇష్టపడరు లెండి.. )
* చాలా కాలానికి పూర్వమే , భారతదేశంలో విలసిల్లిన సింధు నాగరికత యొక్క పురావస్తు త్రవ్వకాలలో చక్కటి మురుగునీటిపారుదల ఏర్పాట్లు ఉన్న వ్యవస్థ బయటపడింది. దీన్నిబట్టి చూస్తే అప్పటి వాళ్ళకు ఎంతో టెక్నాలజి తెలుసు . అని తెలుస్తుంది.
* ఒకప్పుడు భారత దేశం ఎంతో సిరిసంపదలతో విలసిల్లేది. ఇక్కడి వైభవాన్ని గురించి ఎందరో విదేశీ యాత్రికులు తమ గ్రంధాలలో వర్ణించారు. అయితే, తరువాత క్రమంగా భారతదేశం పేద దేశంగా, మురికితో నిండిన దేశంగా తయారయింది.
* తిరిగి ఈ దేశం సిరిసంపదలతో, పరిశుద్ధంగా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ .....
***********
ఈ మధ్య నేను కూడా
ప్లాస్టిక్ ను వేరు చేయాలంటే
బద్ధకిస్తున్నాను. తడీపొడి చెత్త మాత్రమే కాకుండా
ప్లాస్టిక్ చెత్త వేయటానికి విడిగా
డస్ట్ బిన్లు ఉండాలి.
మాల్స్ లో పప్పులు అమ్మడం
కొరకు నూలు దారాలతో అల్లిన
వలలాంటి సంచులు వాడాలి, పిండి అమ్మడం కొరకు
నూలు సంచులు వాడితే ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది.
వాడిపారేసిన ప్లాస్టిక్
తో పెట్రోల్ తయారుచేయవచ్చట.
No comments:
Post a Comment