koodali

Wednesday, September 23, 2015

మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి ....రెండవ భాగం..



కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 
..............

వాళ్ళ అభిప్రాయం..కురుక్షేత్ర యుద్ధం తర్వాత :  ధర్మరాజు , మొత్తం కౌరవ-పాండవ రాజ్యాలకు మహారాజు అయ్యాడు. వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?


నా అభిప్రాయం..ధృతరాష్ట్రుడు నేత్రహీనుడు కావటం వల్ల , పాండురాజు రాజ్యం బాగోగులు చూసుకుని రాజ్యాన్ని అభివృద్ధి చేసాడు.


 ( నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు... అని ధృతరాష్ట్రుడే చెప్పటం జరిగింది.)


తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం  చేసాడు.


 ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు....


ఆ విధంగా పాండవులు  రాజ్యాన్ని విస్తరించారు. పాండవుల శ్రమతో కూడా  పెరిగిన రాజ్యం మొత్తం తనకే కావాలని దుర్యోధనుడు  కోరుకోవటం అత్యాశే కదా !


.............................

ధృతరాష్ట్రుడు  కౌరవులకు తండ్రి. భారతయుద్ధంలో కౌరవులు ఓడిపోయిన తరువాత  కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా ఓడిపోయినట్లే కదా ! అతి మంచితనానికి పోయి పాండవులు రాజ్యం మొత్తాన్నీ ధృతరాష్ట్రునికి ఇవ్వాలనటం ఏం న్యాయం ?


అయినా, వృద్ధుడైన ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఎలా పాలించగలడు ? అతిమంచితనంతో రాజ్యాన్ని ధృతరాష్ట్రునికి ఇచ్చి మళ్ళీ కొత్త సమస్యలు  తెచ్చుకోవటం కన్నా, సమర్ధులైన పాండవులు రాజ్యాన్ని  చేపట్టటం  ప్రజలకు కూడా  శ్రేయస్కరం కదా ! 


 ప్రజలకు స్థిరమయిన పాలనను ఇవ్వటం కూడా అవసరమే. స్థిరమయిన పాలన అందివ్వటం కోసం పాండవులు మొత్తం రాజ్యాన్ని పాలించటమే సరైనది. 


............................

అధికారాన్ని చేపట్టేవిషయంలో ఎన్నో రకాలు ఉన్నాయి.


 జ్యేష్ఠునికి పట్టాభిషేకం చేసి తమ్ముళ్ళు సహకారాన్ని అందించటం, ఉన్న రాజ్యాన్ని అన్నదమ్ములు భాగాలు చేసుకుని ఎవరి రాజ్యాన్ని వారు పాలించుకోవటం,  ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవటం, యుద్ధంలో ఎవరు గెలిస్తే వారే పాలకులవటం..ఇలా ఎన్నో విధానాలున్నాయి.



పైన చెప్పిన విధానాల ప్రకారం చూస్తే.. ధర్మరాజే ముందు జన్మించాడు.  ధర్మరాజే  దుర్యోధనునికన్నా జ్యేష్టుడు. 


రాజ్యాన్ని పంచి ఎవరి భాగాన్ని వారు పాలించుకోవటానికి పాండవులు సిద్ధమయ్యారు కానీ,  దుర్యోధనుడు దానికీ ఒప్పుకోలేదు. 


 ధర్మరాజే రాజు అవటం  ప్రజలకు ఇష్టమని దుర్యోధనుని మాటలలోనే తెలుస్తోంది. 


యుద్ధంలో కూడా పాండవులే గెలిచారు. 


ఏ విధంగా చూసినా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టటం న్యాయమే.



1 comment:


  1. ( ధర్మరాజ యౌవ రాజ్య పట్టాభిషేకం దుర్యోదనాదులకుట్ర..గురించి అంతర్జాలంలో వివరాలున్నాయి.)

    దృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేసాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు....


    ధర్మ రాజు వైభవం దుర్యోధనుడు సహింప లేక పొయ్యాడు. ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి " తండ్రీ పాండవులు మహా వీరులు నీవు ధర్మరాజును రాజుని చేసావు. మంత్రులూ, సామంతులూ, ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు. నీవు గుడ్డి వాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంత కాలం ఇక్కడి నుండి పంపించి నట్లైతే ప్రజలు వారిని మరచి పోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది " అన్నాడు.

    దృతరాష్ట్రుడు బదులుగా " నాయనా దుర్యోధనా నాకు అన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేసాను ఇప్పుడు తొలగించ లేను " అన్నాడు.

    దుర్యోధనుడు " తండ్రీ రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యం చేసాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆ పై వారి వంశం రాజులౌతారు. మేము వశ పారంపర్యముగా బానిసలుగా ఉండవలసినదేనా? ఈ రాజ్యం నీది నీ తరువాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు " అన్నాడు. దృతరాష్ట్రుడు " నాయనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు " అన్నాడు.


    దుర్యోదనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు, అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు. బావ మీద ప్రేమతో మనల్నికృపుడు విడివడు. విదురుడు పాండవ పక్షపాతి అయినా ఒక్కడే ఏమి చేయడు. కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి " అని బలవంతం చేసాడు. గత్యంతరం లేక దృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు.
    ...............

    దుర్యోధనుడికి రాజ్యం మొత్తం తనకే కావాలనే అత్యాశ ఎక్కువ. పాండవులు రాజ్యం మొత్తం తమకే కావాలని ఎప్పుడూ కోరలేదు.

    లక్క ఇంటి సంఘటన తరువాత పాండవులు ఖాండవ ప్రస్థానికి తరలివెళ్ళి తమకు ఇచ్చిన కొద్దిరాజ్యాన్ని పాలించుకుంటూ తమ బ్రతుకులు తాము బ్రతుకుతున్నారు. అదికూడా సహించలేకపోయాడు దుర్యోధనుడు .

    పాండవులు సర్వ నాశనమవాలనే విపరీతకోరికతో... వారిని మాయాజూదానికి పిలిచి అడవులకు పంపించి, తరువాత జరిగిన యుద్ధంలో తాను నాశనం అవటమే కాకుండా కుటుంబసభ్యుల మరణానికి కారణమయ్యాడు.


    ReplyDelete