koodali

Wednesday, September 23, 2015

మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి .....మూడవ భాగం..

 
కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 
......................

వాళ్ళ అభిప్రాయం..

ప్రాచీనులు కొందరు స్త్రీలను గురించి పరుషంగా వ్యాఖ్యానించారని అంటున్నారు.


 సమాజంలో అందరు స్త్రీలూ చెడ్దవాళ్ళని ప్రాచీనుల అభిప్రాయం కాదు.


అయితే , సమాజంలో చెడ్డగా ప్రవర్తించే స్త్రీలు కూడా  ఉన్నారు.


 ఈ రోజుల్లో  గమనించితే,  కొందరు స్త్రీల ప్రవర్తన  జుగుప్సాకరంగా ఉంటోంది. 


వివాహేతర సంబంధాలు ఉంటే తప్పేమిటని  ప్రశ్నిస్తున్న స్త్రీలు ఎందరో ఇప్పటి సమాజంలో ఉన్నారు. పరపురుషుని కోసం కన్నబిడ్దలనే కష్టాలు పెడుతున్న తల్లుల గురించి కూడా  వింటున్నాము.


 సమాజంలో ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నప్పుడు ...స్త్రీల గురించి ఏదో అనేసారని గోలపెట్టటం ఎందుకు. 

...................

వాళ్ళ అభిప్రాయాలు..చెడ్డగా ప్రవర్తించటంలో దుర్యోధనుడి  తప్పేముంది ? అని అంటున్నారు.


 నా అభిప్రాయాలు...దుర్యోధనుడు రాజ్యం మొత్తం తనకే కావాలనే అత్యాశతో పాండవులను ఎన్నో విధాలుగా కష్టపెట్టాడు. ఆఖరికి తనే నాశనం అయిపోయాడు.


 దుర్యోధనుడి పాత్ర నుంచి మనం  ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అత్యాశ, స్వార్ధం ఉండకూడదని నేర్చుకోవచ్చు.


నేర్చుకునే విషయాలను గురించి వదిలేసి,  అలా  దురుసుగా  ప్రవర్తించటంలో  దుర్యోధనుడి తప్పేముంది ? అని వాదించటాన్ని వితండవాదం అంటారు.


వాళ్ళ వాదన ప్రకారం చూసినా దుర్యోధనుడి పాత్ర  చెడ్డ పాత్రే. 


ఉదా.. సినిమాలో విలన్ పాత్ర  చేసిన చెడ్డపనులను చూసిన ప్రేక్షకులు  ఆ విలన్ ను తిట్టిపోయటం సహజమే కదా ! ఆ విధంగా చూసినా  దుర్యోధనుడిపాత్రను తిట్టడంలో తప్పేమీ లేదు.

.................

వాళ్ళ అభిప్రాయం..  మాయాజూదం ఆడి పాండవులను అడవులపాలు చేశారని  కౌరవుల మీద చాలామందికి వ్యతిరేకత ఉంటుంది.  ‘‘(జూదంలో) ధర్మరాజే  గెలిస్తే , అప్పుడు కౌరవుల రాజ్యం ధర్మరాజుకి రావలసిందే కదా? అప్పుడు కౌరవులైనా అడవికి పోవలసిందే కదా?’’


నా అభిప్రాయం..కౌరవులు ఆడింది మాయాజూదం. శకుని ఇష్టప్రకారం పడే పాచికలతో ఆడిన ఆట అది.


 ఇలాంటి మోసపూరితమైన జూదంలో కౌరవులు ఓడిపోవటం, అడవులకు వెళ్ళటం జరిగేపనికాదు.

.............
  
 వాళ్ళ అభిప్రాయాలు.. ధర్మరాజు మహాప్రస్థానంలో ఇంద్రుడు ఎదురొచ్చాడు. ముందు నిలిచాడు.. ధర్మరాజు ఆగిపోయి ఇంద్రుడికి నమస్కరించాడు. .. భార్యనీ, నలుగురు తమ్ముల్నీ ( నేలమీద పడిపోయినా వెనుదిరిగి) చూడకుండా నడిచిపోయినవాడు ఇంద్రుణ్ణి చూడకుండా వెళ్ళిపోతూవుండాలి. కానీ ఆగిపోయాడు!’’ 


నా అభిప్రాయం...ధర్మరాజు... భార్య, నలుగురు తమ్ముళ్ళు పడిపోయి మరణించిన తరువాత వాళ్ళను వదిలివెళ్ళాడు.


 దేవతల రాజైన ఇంద్రుడు ఎదురుపడితే ఆగటంలో తప్పేముంది ? 


ఇంద్రునితో స్వర్గానికి వెళ్ళిన తరువాత తన తమ్ముళ్ళు, భార్య కొరకు  ధర్మరాజు పడిన తాపత్రయం  గురించి కూడా  తెలుసుకుంటే  ధర్మరాజు వాళ్ళ గురించి ఎంత ఆలోచించాడో తెలుస్తుంది. 


తన వాళ్ళకు లభించని స్వర్గం తనకూ వద్దన్నన్నాడు  ధర్మరాజు. అలా తరువాత చాలా విషయాలు జరిగాయి.


 అదంతా వదిలేసి ధర్మరాజు తమ్ముళ్ళను, భార్యను వదిలి వెళ్ళిపోయాడని అభాండాలు వేయటం అన్యాయం.


................

 వాళ్ళ అభిప్రాయాలు.. కృష్ణుడు, ఏ కర్మ చేసినా ‘ఫలితాల మీద దృష్టి పెట్టవద్దు’ అన్నాడు కదా? అలాంటప్పుడు ఈ ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  ఎందుకు? ఈ కవి కృష్ణుడి బోధన పట్టించుకోలేదు. కృష్ణుణ్ణి సృష్టించి ఆ పాత్రతో అలా చెప్పించింది కవే.  ఆ కవే ఫల శ్రుతి చెప్పాడంటే... తను రాసినదాన్ని తనే పట్టించుకోలేదని అర్థం.


నా అభిప్రాయం..అందరూ  వెంటనే  స్థితప్రజ్ఞులు కాలేరు. అలాంటివారికి  ఈ విధమైన  ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  తెలియజేస్తే ఆ ఆశతో అయినా మహాభారతం  గురించి చదవటం లేదా వినటం చేస్తారు. తద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని క్రమంగా స్థితప్రజ్ఞులయ్యే అవకాశముంది..


( స్థితప్రజ్ఞులవటానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. )




1 comment:

  1. వేసిన టపాలే మళ్లీ వేసాను. ఎందుకంటే..

    ఈ మధ్య వేసిన కొన్ని టపాలలో అక్షరాలు చిన్నగా ఉన్నాయి.

    అవి స్పష్టంగా కనపడటం కోసం కొంచెం పెద్దగా మార్చి తిరిగి ప్రచురించవలసి వచ్చింది.

    ReplyDelete