koodali

Monday, July 6, 2015

ఆహారనియమాలు పాటించే వారికి ఆహారాన్ని వండి అందించటం ....

 
ఈ మధ్య కాలంలో పిల్లలు ఉపాధికోసం వేరే ప్రాంతాలలో ఉంటుండగా,  పెద్దవాళ్లు మాత్రమే ఊరిలో ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది.

 ఒకే దగ్గర ఉన్నాకూడా, తమ ఆరోగ్యానికి సరిపడేవిధంగా వండిపెట్టాలని  పిల్లలను అడిగి ఆహారం వండించుకోవటానికి ఇబ్బందిపడే పెద్దవాళ్లూ ఉంటారు.

ఒకే దగ్గర ఉన్నాకూడా, చంటి పిల్లలకు జావ ఆహారం, చిన్న పిల్లలకేమో వేపుళ్లు, పెద్ద వాళ్ళకేమో నూనె లేకుండా కూరలు .. ఇలా  ఇంట్లో ఒక్కొక్కరికి  ఒక్కోరకం చేయాలన్నా..అన్నిసార్లూ కుదరక పోవచ్చు.

 ఎదిగే వయసులో ఉన్న చిన్న పిల్లలకి ఎంతో అవసరమైన సమాతులాహారాన్ని ఇవ్వకుండా..   న్యూడిల్స్, బ్రెడ్ వంటివి  ఎక్కువగా  ఇచ్చేస్తున్న పెద్దవాళ్లు ఈ రోజుల్లో  చాలామందే ఉన్నారు.
..............................

 ఈ రోజుల్లో చాలామందికి  45 సంవత్సరాల వయస్సు కంటే  ముందే  బీపీ, సుగర్..వంటి వ్యాధులు వస్తున్నాయి.

ఇక..  65, 75 ..వయస్సు వాళ్లయితే ఎక్కువ పనులు చేసుకోలేరు.

 పెద్దవయస్సు వచ్చిన తరువాత కొందరికి జీవిత భాగస్వామి కూడా ఉండకపోవచ్చు. భార్య లేని పురుషుడు బజారు కెళ్ళి సరుకులు తెచ్చుకున్నా వంట చేసుకోలేక పోవచ్చు. భర్త లేని స్త్రీ బయటకెళ్లి సరుకులు తెచ్చుకోలేకపోవచ్చు. 

ఇలాంటివారికోసం ఆహారాన్ని వండి ఇళ్ళకు పంపించే విధంగా ఏర్పాటు ఉంటే బాగుంటుంది.    
.................................

పెద్దవయస్సు వచ్చిన వారిలో కొందరికి గుండె జబ్బు...  వంటి  వ్యాధులు   ఉండే అవకాశాలున్నాయి.

 పెద్ద  వయస్సులో అనారోగ్యం వల్ల కొన్నిసార్లు వంట చేసుకోవటానికి చేతకాకపోవచ్చు. 

అలాగని హోటల్ నుంచి తెప్పించుకోవటమో  లేక కర్రీ పాయింట్ నుంచి తెప్పించుకోవటమో చేస్తే ఆ పదార్ధాలలో వేసే అధిక నూనె, కారం, ఉప్పు వల్ల అనారోగ్యం మరింత పెరిగే ప్రమాదముంది. 

వంట మనిషిని పెట్టుకోవాలంటే అందరివల్లా అయ్యే పనికాదు. 

ఈ రోజుల్లో సిటీలో వంటమనిషిని ఏర్పాటుచేసుకోవాలంటే నెలకు 10 వేలు అడుగుతున్నారని మాకు బాగా దగ్గరవాళ్ళు చెప్పారు. అదీ ఒక పూటే వస్తారట. వంట చేసిన ఆమె  కూడా అక్కడే భోజనం చేస్తుందట . 
..........................

ఇవన్నీ చూసిన తరువాత నాకు ఏమనిపించిందంటే,  పెద్దవాళ్లకు వంట చేసి  ఇళ్ళకు  పంపించే విధంగా ఎవరైనా చేస్తే బాగుంటుందనిపించింది.

 బీపీ ఉన్నవాళ్ళకు ఉప్పు లేకుండా, సుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు పంచదార లేకుండా, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లకు అందుకు తగిన విధంగా వండించి ఇంటికి పంపే విధంగా  ఉంటే బాగుంటుంది. 

పెద్ద హాస్పిటల్స్లో  పేషెంటుకు ఆహారాన్ని హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు. ఏ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఆహారాన్ని తయారుచేయాలో ఇలాంటి వాళ్లకు చక్కగా తెలుస్తుంది.
..........................

అయితే రోజూ బయట  నుంచి ఆహారం తెచ్చుకోవటం పెద్దవాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు.

 ఆరోగ్యం సరిగ్గా లేక నీరసంగా, నిస్సత్తువుగా ఉన్నప్పుడు మాత్రం  ఎవరైనా ఇంత వండి పెడితే బాగుండు.అనుకుంటారు పెద్దవాళ్లు.

ఆహారం వండలేని పరిస్థితి ఉన్న రోజున హోటల్  కు ఫోన్ చేసి ఈ రోజు వంట చేసి పంపండి...  అని చెపితే ఆ రోజుకు భోజనం పంపించే విధంగా ఉంటే హోటల్ వాళ్లకు కూడా ఆహారం వృధా కాకుండా ఎంతమందికి అవసరమో అంతవరకే వండుతారు.

 ఈ రోజు మేమే వండుకుంటాం అనుకుంటే.. హోటల్ వాళ్లకు ఆ మాట కొంచెం ముందే  చెపితే సరిపోతుంది.
.........................

అయితే, ఆహారపదార్ధాలకు బోలెడు రేట్లు పెడితే తీసుకునేవారు ఉండరు. ఎక్కువలాభం వేసుకోకుండా ధర్మబద్ధంగా లాభం వేసుకుని చేస్తే ఎక్కువమంది వస్తారు. 

ఇది వ్యాపారం అనీ అనుకోవచ్చు. సమాజసేవ అనికూడా అనుకోవచ్చు.

ఇలాంటి వ్యాపారాన్ని  వ్యాపారదృష్టి మాత్రమే కాకుండా....  సమాజసేవాదృష్టి కూడా ఉన్నవారే సరిగ్గా చేయగలరు.
............................

అయితే, ఎలాంటి వారికి ఎలాంటి పద్ధతిలో వండాలో తెలిసిన వాళ్ళ సహాయంతో వంట చేయటం జరగాలి. 

ఉదా..బీపీ  ఉన్నవారికి ఉప్పు లేకుండా, కిడ్నీ వ్యాధి ఉన్నవారికి వారికి తగ్గట్లుగా వంట చేసి పంపాలి. 

 ధర్మబద్ధమైన లాభంతో, శుచిగా ఆహారాన్ని అందిస్తే  పెద్దవాళ్ళకు సహాయం చేసిన వాళ్లవుతారు. పుణ్యమూ, పురుషార్ధమూ కూడా దక్కుతాయి.


2 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మా బంధువుల నుండి మరియు తెలిసిన వారి నుండి తెలుసుకున్న కొన్ని విషయాల వల్ల పై విధమైన టపా వ్రాయాలనిపించిందండి.

    ReplyDelete