koodali

Friday, July 17, 2015

ఎంతో సుందరమైనది..రామాయణము..

 
. మహాబలి అయిన హనుమంతుడు శివాంశ గలవాడు. 

ఒక అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. 

శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలను భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు.

కేసరి, మునుల కోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. 

సజ్జన స్వభావం గల కేసరికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. 

అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. 

కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.

 పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు.

 సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. 

వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. 

అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు.
........

 సీతాదేవి జాడ తెలుసుకోవటం కోసం బయలుదేరినప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని సీతాదేవికి  ఇవ్వమని హనుమంతునికే ఇచ్చారు.

ఎదురైన అడ్దంకులను అధిగమించి  మహాబలి ఆంజనేయుడు  లంకను చేరుకున్నాడు.

కొన్ని సంఘటనల  తరువాత....

సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు.

 అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

తరువాత,

 రావణుడు..  సీతమ్మను భయపెట్టటం కూడా చూసాడు .  

తరువాత, హనుమంతుడు  సీతమ్మతో సంభాషించి ,రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. 

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. 

వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. 

చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. 

సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. 

రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. 

కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

చూడబడెను  సీతమ్మ ..అంటూ ఆనందంతో  ఉప్పొంగుతూ రాములవారికి  మరియు అక్కడ ఎదురుచూస్తున్న వారికీ శుభసందేశాన్ని వినిపించాడు.

సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాములవారికి అందించాడు.
...............
( చాలా విషయాలను అంతర్జాలం నుంచి సేకరించి వ్రాయటం జరిగిందండి.)


1 comment:

  1. ఒకప్పుడు, రావణుడు కైలాసం వెళ్లినప్పుడు, నందీశ్వరుని చులకన చేయగా నందీశ్వరుడు రావణుని శపించాడంటారు.

    రావణుడు ఆరాధించే శివుని అంశ గలిగినవాడు హనుమంతుడు.

    అలాంటి హనుమంతుడు చెప్పిన హితవును వినిపించుకోలేదు రావణుడు.

    ReplyDelete