koodali

Monday, December 29, 2014

హరిశ్చంద్రుని కధ చదివి..


హరిశ్చంద్రుని కధ చదివి.. సత్యం కోసం అన్ని కష్టాలు పడటం ఎందుకు ?  అనుకుంటున్న వాళ్ళూ ఈ సమాజంలో  ఉన్నారు.

చిన్న  అబద్ధమే కదా అనుకుంటే అదే అలవాటై ఒకరిని చూసి ఒకరు  అంతా అబద్ధాలే  చెబితే  సమాజంలో ఎన్నో గొడవలు మొదలవుతాయి. అసత్యం  విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..మొదలే  దానిని అరికట్టాలి.       

( అయితే కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు అన్యాయంగా ప్రాణాలకు హాని కలిగే సమయాలలో అసత్యం చెప్పినా ఫరవాలేదని మినహాయింపును ఇచ్చారు పెద్దలు.. ఇలాంటి  సందర్భాలలో  విచక్షణ ప్రకారం నడుచుకోవాలని పెద్దలు సూచించారు.)

 సత్యం విలువ ఎంతో  గొప్పది.  రాజే  అసత్యవంతుడైతే, యధారాజా తధాప్రజా  అన్నట్లు ...సమాజం  అంతా అబధ్ధాలు, మోసాలతో  అస్తవ్యస్తమైపోతుంది.

 లోకహితం కోసం, లోకానికి సత్యం యొక్క విలువను తెలియజెప్పటం కోసం  హరిశ్చంద్రుడంతటి వారు ఎన్నో కష్టాలను సహించారు. నేను రాజును కదా, సత్యం కోసం ఎందుకు కష్టాలు పడాలి ? అని వారు అనుకోలేదు.

ఈ విషయం గురించి మరిన్ని  వివరాలను  చదవాలనుకుంటే  దయచేసి  ఈ  లింకుల  వద్ద  చదవగలరు..  

పురాణములలో ఉన్నది అధర్మం కాదు ....అంతా ధర్మమే..... పురాణములు ఎంతో గొప్పవి .... ఐదవ భాగము.........


*******************
    క్రింద వ్రాసిన విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేసాను. అంటే    2025 లో వ్రాసాను.

.......
  గ్రంధాలలో ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయి. ఏవి ప్రక్షిప్తాలో? ఏవి కావో?
........
హరిశ్చంద్రుని కధ ఇంకో కోణంలో...

 హరిశ్చంద్రుడు తనకు సంతానం కలిగితే చాలని, సంతానం కలిగితే ఆ పుట్టిన సంతానాన్ని బలిగా సమర్పిస్తానని అంటారట. బాలుడు పుట్టిన తరువాత పుత్రప్రేమతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఉండగా, కొంత పెద్దయిన బాలుడు తనను బలి ఇస్తారని తెలిసి భయపడి పారిపోతాడట. మరి, బలి ఇస్తారంటే ఎవరికైనా భయమే కదా..

తమ సంతానం అయినా కూడా, వారిని బలి ఇచ్చే హక్కు తల్లితండ్రికి ఉండదు. ఎవరి ప్రాణభయం వారిది, ఎవరి నెప్పి వారిది కదా..

 హరిశ్చంద్రుడు తమకు పుట్టబోయే పుత్రుని బలి ఇస్తానని అనుకోవటం ఏమిటో?  హరిశ్చంద్రుడు  వేరేవారి కొడుకును బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడటం జరిగింది. ఇవన్నీ ఏమిటో? అర్ధం కాదు.

 వీటన్నింటి ఫలితంగా ఎన్నో కష్టాలు వచ్చి, హరిశ్చంద్రునికి వైరాగ్యం కలిగి తాను చితి మంటల్లోకి దూకటానికి సిద్ధపడతారు.

పుట్టబోయే పిల్లవాణ్ణి బలి ఇస్తానని ఒప్పుకోవటం వల్ల కూడా హరిశ్చంద్రునికి కష్టాలు వచ్చి ఉండవచ్చనిపిస్తుంది.
...............

  ఒక గ్రంధములో నేను చదివినదాన్నిబట్టి, హరిశ్చంద్రుని కధలో..బంధవిముక్తుడైన శునశ్శేపుడు సదస్యుల్ని చూసి తనకు ఇప్పుడు తండ్రి ఎవరని ప్రశ్నించగా..ఇతను అజీగర్తుని కొడుకు. ఇతరులకు కొడుకు ఎలా అవుతాడని కొందరు అంటారు.

 వశిష్టుల వారు లేచి..కొడుకును అమ్ముకున్న నాటి నుంచి జన్మదాతకు సంబంధం తెగిపోతుంది. కొన్న రాజు నిజంగా తండ్రి అవాలి. కానీ, యూపస్థంభానికి కట్టి వధించటానికి పూనుకున్న రాజు తండ్రి కాడు. పొగడ్తలకు పొంగి( మంత్రాధీనుడై) బంధవిముక్తుణ్ని కావించిన వరుణుడు కూడా తండ్రి కాడు. భయాతురుడైన వాడికి మంత్రోపదేశం చేసి రక్షించిన కారణంగా విశ్వామిత్రుడే ఇతనికి తండ్రి..అని తన అభిప్రాయం చెప్పారు.

 
     వశిష్టుల వారు తెలియజేసిన విషయాలను గమనిస్తే, శునశ్శేపుని తండ్రి అయిన అజీగర్తుని విషయంలో.. కొడుకును అమ్ముకున్న నాటి నుంచి జన్మదాతకు సంబంధం తెగిపోతుంది అంటారు. మరి, హరిశ్చంద్రుడు కూడా తన కుమారుడైన రోహితుని బలి ఇస్తానని అంటారు కదా..

బలి కొరకు కొడుకును అమ్ముకున్న తండ్రికి.. కొడుకుతో సంబంధం తెగిపోయినప్పుడు, కొడుకును బలి ఇవ్వటానికి ఒప్పుకున్న తండ్రికి.. కొడుకుతో సంబంధం ఉంటుందా? అని నాకు సందేహాలు కలిగాయి.

 రోహితుడు, శునశ్శేపుడు..బలి అవ్వకుండా కాపాడబడ్డారు కానీ, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదో?
...........

 సత్యము ఎంతో గొప్పదే. సత్యాన్ని పాటించటానికి శాయశక్తులా ప్రయత్నించటం మంచిదే. అయితే.. ప్రాణ, మానభంగ ప్రమాదాలలో అసత్యం ఆడినా తప్పులేదని గ్రంధాలలో ఉందికదా..మన సత్యం వల్ల ఎవరి ప్రాణాలైనా పోయే పరిస్థితి ఉన్నప్పుడు, అసత్యం చెప్పి ప్రాణాన్ని నిలబెడితే, ఆ అసత్యం కూడా సత్యమే..అని చెప్పారు.
.................

సమాజంలో చాలామంది తమ కష్టాలు పోవటానికి, కోరికలు తీరటానికి ఏదోఒకటి మొక్కేస్తూ ఉంటారు. తరువాత ఆ మొక్కులు తీర్చటం కొన్నిసార్లు కుదరదు. అందువల్ల, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గభాల్న మొక్కేయటం కాకుండా, కష్టాలు తీరాలని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిది. జీవితంలో మనం మొక్కులు మొక్కకూడదని  ముందే గట్టిగా అనుకోవాలి. కుదిరితేనే చేస్తానని కూడా అనుకోవచ్చు.
...........

ఎవరైనా తమ పాపపరిహారాల కొరకు, కోరికలు తీరటానికి.. జంతువులను బలి ఇవ్వటం కాకుండా, మనుషులు తమలోని దుర్గుణాలను బలి ఇస్తే ..దైవము యొక్క దయను పొందగలరు.  కనీసం తమ దుర్గుణాలను వదలటానికి శాయశక్తులా ప్రయత్నించినా కూడా దైవకృపను పొందగలరు.

 
      వేదాలలో జంతుబలులు అనేవి లేవని కొందరు చెబుతున్నారు. అలాంటప్పుడు, బలులు  అనేవి ఉండకూడదు. తమ మనస్సులను అదుపులో పెట్టకుండా, తమలోని చెడును వదలకుండా.. పుణ్యంకోసం అంటూ తమకంటే బలహీనమైన జీవులను చంపటానికి, వాటి మాంసాన్ని తినటానికి అలవాటు పడి, జంతు బలులు అంటూ..దైవం పేరుతో అలా చేస్తున్నారనిపిస్తుంది.
..........

మనుషులు చాలామంది పశుపక్ష్యాదులను చంపుతూ చాలా హింస చేస్తున్నారు. ఆహారం కొరకు మాంసాహారాన్ని విపరీతంగా తింటున్నారు. ఇలాంటప్పుడు ఇక ఎవరికి ఏం చెప్పగలం? ప్రాణభయం, నొప్పి అనేవి ఏ జీవికైనా ఉంటుంది కదా.. మనుషులు హింసకు దూరంగా దయతో ప్రవర్తించాలి.
.........
ఇవన్నీ ఎప్పుడు చక్కబడుతాయో దైవానికే తెలియాలి.
...................
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment