ఇదొక చిత్రమైన కధ. ఒక యజ్ఞం చేయించే విషయంలో వశిష్టునికి నిమికి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. ఇక్ష్వాకు వంశసంభూతుడైన నిమిమహారాజును , శరీరం రాలిపోయి విదేహుడివి అవుదువు గాక - అని శపించాడు వశిష్టుడు . ( వశిష్టుడు నిమిని శపించటానికి అనేక కారణాలున్నాయి . ఆవి ఇప్పుడు వ్రాయటం లేదు. )
శాపఫలితంగా నిమి మహారాజు శరీరంలో నెమ్మదినెమ్మదిగా మార్పు రావటం మొదలవగా అది గమనించిన ఋత్విజులు , దానికి కావలసిన వేదమంత్రాలతో గంధమాల్యాదివిలేపనాలతో ఒకవైపు నిమి శరీరాన్ని రక్షిస్తూ , మరొకవైపు త్వరత్వరగా యజ్ఞాన్ని ముగించారు.
తరువాత నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది. ... నిమి ఆత్మ జగన్మాతను ప్రార్ధించి వరాలను పొందింది. (ఉదా.. ప్రాణికోటికి రెప్పపాటు కలగటం వంటి వరం. అయితే , దేవతలు మాత్రం అనిమిషులు...)
అటు తరువాత మహర్షులు సమాలోచనలు జరిపి, నిమికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని చేరువలో ఉంచి మంత్రపూర్వకంగా అరణిని మధించారు. మధిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించాడు. సర్వలక్షణ సంపన్నుడై ముమ్మూర్తులా తండ్రిలాగా ఉన్నాడు. అరణిని మధిస్తుండగా జన్మించాడు కనక కొందరు మిధి అన్నారు. జనకుడి ( తండ్రి ) శరీరం నుంచి పుట్టాడు కనక కొందరు జనకుడు అన్నారు.
విదేహుడైన ( దేహం లేని ) నిమియే ఇలా ఆవిర్భవించాడు కనక ఇంకొందరు విదేహుడన్నారు. ఇతని వంశంలో ఇటుపైని జన్మించే రాజులందరూ విదేహులని వ్యవహరింపబడతారన్నారు. వీరి రాజధాని మిధిలా నగరం. సీతాదేవి పుట్టింటివారు జనకవంశజులే.
( నిమి గురించిన వివరములు శ్రీ దేవీ భాగవతము గ్రంధము నుంచి తెలుసుకున్నవి.)
పై కధద్వారా .. మరణించిన వ్యక్తి శరీరం నుంచి సంతానం కలిగే అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రాచీనకాలంలో ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలు జరిగేవని తెలుస్తోంది. అప్పటివారు ఎంతో గొప్ప విజ్ఞానం తెలిసినవారని మనం తెలుసుకోవచ్చు.
అప్పటివారి విజ్ఞానం ఇప్పటి ఆధునిక విజ్ఞానంలా కేవలం భౌతికశక్తితో కూడిన విజ్ఞానం కాకపోవచ్చు. అది మానసిక శక్తితో కూడిన అద్భుతమైన శక్తి.
........................................
ఆధునిక శాస్త్రవేత్తలు , ఎన్నోవేల సంవత్సరాల క్రిందట మరణించిన మామత్ శరీరం నుంచి డిఎన్ఏ ను సేకరించి కొత్త మామత్ ను సృష్టించటానికి పరిశోధనలు చేస్తున్నారట. ఎప్పుడో మరణించిన డైనొసార్ అవశేషాల నుంచి సేకరించిన కణాలతో కొత్త డైనోసార్ ను సృష్టిస్తామంటున్నారు.
ఇవన్నీ గమనిస్తే ఏం తెలుస్తోందంటే, మరణించిన శరీరాల నుంచి తిరిగి సంతానాన్ని పొందటం అనేది అసంభవం కాదు అని తెలుస్తోంది కదా !
ఆ మధ్య ఒక విదేశీ స్త్రీ మరణించబోయే తన భర్త నుంచి స్పెర్మ్ ను సేకరించి శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి , భర్త మరణానంతరం టెస్ట్ ట్యూబ్ పద్ధతి సహాయంతో, భర్త వీర్యం ద్వారా చక్కటి బిడ్డను కన్నట్లు వార్తల ద్వారా తెలుసుకున్నాం.
కొంతకాలం క్రిందట ఆధునిక శాస్త్రవేత్తలు , క్లోనింగ్ ద్వారా అలైంగిక పద్ధతిలో సంతానాన్ని ఉత్పత్తి చేసారు.
.......................................
భారతంలో చెప్పబడిన వ్యుషితాశ్వుని యొక్క విషయం ద్వారా కూడా మరణించిన శరీరం నుంచి సంతానాన్ని పొందటం అనేది సాధ్యమే అని తెలుసుకోవచ్చు.
నిమి వారసులకు విదేహులనే పేరు రావటానికి కారణాలున్నాయి. అలాగే వ్యుషితాశ్వుని సంతానానికి సాల్వులు, మద్రులు అనే పేర్లు రావటానికి కూడా బలమైన కారణాలు ఉండే ఉంటాయి. సాల్వులు, మద్రులు అనే పదాలకు సంస్కృత అర్ధాలను తెలుసుకుంటే వారికి ఆ పేర్లు రావటంలో గల కారణాలను కొంతవరకూ ఊహించవచ్చనిపిస్తోంది. అంతేకానీ, వ్యుషితాశ్వుని సంతానాని కంటే ముందే సాల్వులు, మద్రులు ఉన్నారనేది నిజం కాదు...
( ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ..అని రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిదో రోజున జరిగిన ప్రక్రియ ద్వారా కొందరు , పద్నాలుగో రోజున .... కొందరు సంతానం కలిగారేమో ?)
ప్రాచీనులు ఇప్పటి వాళ్ళకన్నా ఎంతో విజ్ఞానవంతులు అనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. వారి విజ్ఞానం గురించి సరిగ్గా తెలియని ఇప్పటివాళ్ళం ప్రతి విషయంలోనూ ప్రాచీనులను అపార్ధం చేసుకోవటం సరి కాదు.
......................................
ప్రాచీన గ్రంధాలలో చెప్పబడిన ఎన్నో విషయాలు నిజమేనని ఆధునిక పరిశోధనల ద్వారా నిరూపించబడ్డాయి.
ఉదా.. ఎక్కడో దూరంగా జరుగుతున్న భారతయుద్ధాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిన విషయాన్ని చదివినప్పుడు .. ఇదెలా సాధ్యం ? అని అనుకున్నారు కొందరు.
మరి ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొనే ఎక్కడో జరుగుతున్న విషయాలను టీవీల ద్వారా చూస్తూన్నాము కదా !
అయితే ఇక్కడొక విషయం ఏమిటంటే, ప్రాచీనులది అద్భుతమైన మానసికశక్తితో ( ఉదా..భగవత్ ధ్యానం, తపస్సు మొదలగు వాటి ద్వారా...) తెలుసుకున్న విజ్ఞానమయితే, ఆధునికులది భౌతికమైన శక్తితో తెలుసుకున్న విజ్ఞానం. రెండింటికి చాలా తేడా ఉన్నది.
.............................................
ఆధునికులు చెప్పే మూలకణములు ( స్టెం సెల్స్ ) గురించి కూడా ప్రాచీనులకు తెలుసునని అనిపిస్తోంది.
విష్ణుమూర్తి బొడ్డు నుండి పద్మం ద్వారా బ్రహ్మ జన్మించి సృష్టిని చేస్తారు అంటే..
బొడ్డుత్రాడు నుండీ వచ్చే బ్రహ్మ సృష్టిని సృష్టిస్తారు. ... బొడ్డుత్రాడు నుండి లభించే మూలకణముల ద్వారా కొత్త సృష్టిని చేయవచ్చు.. అనే పోలిక కనిపిస్తోంది కదా !
ఇలా ఎంతో విజ్ఞానం ప్రాచీన గ్రంధాలలో ఉన్నదనిపిస్తోంది.
.............................
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
నేటి కాలం లో అన్నిటికి ఋజువులు కావాలి కదండి! లేవనుకోడమూ పొరపాటే అన్నీ ఉన్నాయనీ అనుకోలేం.
ReplyDelete
ReplyDeleteమీకు కృతజ్ఞతలండి, నిజమే మీరన్నట్లు నేటి కాలం లో కొందరు అన్నిటికి ఋజువులు కావాలంటున్నారు. అయితే, ఋజువులు అడిగేవారు కూడా విషయాన్ని గ్రహించే శక్తి కలిగిన వారై ఉండాలి మరి.
ఉదా..ఒక చిన్న పిల్లవాడు తనకు టీవీ ఎలా పనిచేస్తుందో వివరించమని పేచీ పెట్టాడనుకుందాము. పెద్దవాళ్ళు, టీవీ పనిచేసే విధానం గురించి ఎంత వివరించినా పిల్లవాడు అర్ధం చేసుకోలేడు. అర్ధం చేసుకోలేక పోగా పెద్దవాళ్లు చెబుతున్నది అంతా తప్పు .. అని మరింత మారాం చేసే అవకాశం కూడా ఉంది.
అదే పిల్లవాడు కొంత ఎదిగిన తరువాత టీవీ గురించి అర్ధం చేసుకునే అవకాశం ఉంది. దేనికైనా సమయం రావాలి.
............................
పాతకాలంలో టీవీలు, ఫోన్లు లేని రోజుల్లో దూరశ్రవణం, దూరదృష్టి గురించి గ్రంధాలలో చదివినా చాలామంది నమ్మేవారు కాదు. టీవీలు, ఫోన్లు వచ్చాక అవన్నీ సాధ్యమే అని తెలిసింది కదా ! అలాగే ప్రాచీన గ్రంధాలలో తెలియజేసిన మరెన్నో విషయాలకు భవిష్యత్తులో ఋజువులు లభిస్తాయేమో ..
................
అయితే భక్తితో తపశ్శక్తితో దూరశ్రవణం, దూరదృష్టి..మొదలగు సిద్ధులను సాధించిన మహనీయులకు టీవీలు, ఫోన్లు వంటి భౌతిక సాధనాలతో పని లేదు.
వారు తమ మనోశక్తితోనే దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలరు. ఇలాంటి శక్తులు కలిగిన మహనీయుల గురించి ఒక యోగి ఆత్మ కధ..గ్రంధములో కూడా వివరములున్నాయి.
.................
కొందరు మహనీయులు తాము తెలుసుకున్న సత్యాలను, సిద్ధులను లోకానికి తెలియజేసినా కూడా అవన్నీ జిమ్మిక్కులు అని కొట్టిపారేసినవారున్నారు.
కళ్ళెదుట సత్యం కనిపిస్తున్నా నమ్మని వారు దురదృష్టవంతులు. ఎవరికైనా, ఏ సత్యం తెలుసుకోవాలన్నా తగిన సమయం రావాలి మరి.