koodali

Friday, November 9, 2012

పల్లెటూరు...పైరగాలి.


మా  చిన్నతనంలో  వేసవి  సెలవల్లో   కొన్ని  రోజులు   మా  తాతగారి  ఇంటికి  వెళ్ళేవాళ్ళం.  అక్కడ  ఎంత  బాగుంటుందో. పల్లెటూరు,  పచ్చటి ప్రకృతి  ,  పైరగాలి ,  చెరువు,  చెరువులో  తామరపూలు,    చెరువు  ఒడ్డున  రాములవారి  గుడి,  అమ్మవారి  గుడి,  పక్షుల  కిలకిలారావాలు,  ఆవుల  అంబా రావాలు,  మేతకు  వెళ్లి  వచ్చే  పశువులు ,ఆకాశంలో పక్షుల  బారులు.. .......  ఇవన్నీ  ఎంతో  బాగుంటాయి.  


  పల్లెటూరిలో  ఇళ్ళు  కూడా   పెద్దగా  ఉండి ,  ఆరుబయట  చాలా  స్థలం   ఉంటుంది  కదా  !  అక్కడ  వంట  గది  విడిగా  ఉండేది.  మా  బామ్మగారు  ఉదయాన్నే  మల్లెపూవుల్లాంటి  ఇడ్లీలు  ,  కొబ్బరిచట్నీ,  లేక  వేరుశనగపప్పు  చట్నీతో  వడ్డించేవారు.,  ఆ  ఇడ్లీలను  రోట్లోనే  రుబ్బేవారు.  ఇడ్లీల  ప్రక్కన  చిన్న  గిన్నెతో  నెయ్యి  ఉంచి   ఇడ్లీలను  ఆ  నేతిలో  ముంచుకుని  తినేవాళ్ళం. 



  పెరట్లో  కాసే  కణుపు  చిక్కుడు  కాయలకు  గింజలు  పెద్దగా  ఉండి  చాలా  రుచిగా  ఉంటాయి. ఒకసారి  మా  బామ్మగారు  కూర  వండటం  కోసమని  ఉప్పు  వేసి  ఉడికించిన  చిక్కుడు కాయలను   పిల్లలం  అందరమూ అలాగే  తినేసాము . 


ఈ  రోజుల్లో  వచ్చే   హైబ్రీడ్   చిక్కుడు  కాయల్లో గింజల  కన్నా  తొక్కే  ఎక్కువగా  ఉంటుంది.  అది  కూడా   సహజమైన  కమ్మటి  చిక్కుడు కాయల   వాసన కాకుండా   చప్పగా  ఉండి  కొంచెం   మందు  వాసన  వస్తుంది.  రసాయన  మందులతో  పెరిగిన  పంటలు  కదా  మరి. 

పెరట్లోని  లేత  సొరకాయలు ,   బెండకాయలు  ఇవన్నీ  చాలా  రుచిగా  ఉంటాయి.

పెద్ద  సపోటా  చెట్టు  నిండా  ఎప్పుడూ  కాయలు  ఉండేవి.  పెరట్లో  ఎన్నో  పళ్ళచెట్లు  ఉండేవి.  మల్లె  పాదులు  వంటి  పూల  మొక్కలు  ఉండేవి.


   పెరట్లో  ఇంటికి  ఆనుకుని  అరుగులు  ఉండేవి.   ఆ  అరుగులమీద  పడుకుని  చందమామ  పుస్తకాలలోని  కధలు  చదవటం  ఎంతో  బాగుంటుంది.  

    పిల్లలం  అందరం   ఎన్నో  ఆటలు  ఆడుకునేవాళ్ళం.  కధలు  చెప్పుకునేవాళ్ళం.  


 రాత్రికి    ఆరుబయట  వెన్నెల్లో  కూర్చుని  వేడివేడి  పప్పుచారు,  వడియాలు  వేసుకుని  భోజనం  చేసేవారం.  ఆరుబయటే   మంచాలు  వేసుకుని, మంచాలపై  మెత్తటి  పక్కలు  వేసుకుని   వెన్నెల్లో  పడుకునేవాళ్ళం.

 ఇవన్నీ  తలుచుకుంటే,  ఇప్పటి  పిల్లలు  ప్రకృతికి  ఎంత  దూరంగా  బ్రతుకుతున్నారో  కదా  !  అనిపిస్తుంది.  


ఈ  రోజుల్లో   పిల్లలకు  వేసవి  సెలవల్లో  కూడా  స్పెషల్  క్లాసులు  ఉంటున్నాయి.  

ఒకవేళ  కొద్దిరోజులు  సెలవలు  ఉన్నా  కూడా, ఎక్కువమంది   పిల్లలు    తాతగార్ల  ఊళ్ళు  వెళ్ళటం  కన్నా  ఇంట్లోనే  ఉండి  వీడియో  గేంస్  వంటివి  ఆడుకోవటానికే    ఇష్టపడుతున్నారు.

 ఈ  రోజుల్లో  ఎక్కువమంది  తాతగార్లు బామ్మలు   కూడా  నగరాల్లోనే  ఉంటున్నారు.  


సెలవలకు   వాళ్ళ  ఇళ్ళకు  వెళ్ళినా  పిల్లలకు   యధాప్రకారం  ఏసీ  గదులు,   టీవీలు,  వీడియో  గేంస్,  కంప్యూటర్స్,   ఫేస్ బుక్ ఛాటింగ్ లు,   షాపింగ్ మాల్స్.....ఉండనే  ఉంటాయి.  ఇంకా పెద్దగా    తేడా  ఏమీ  అనిపించదు. 

  సమాజంలో  చాలా  మార్పులు  వచ్చాయి  కదా  మరి.

10 comments:

  1. మనం జ్ఞాపకాలతోనయినా ఉన్నాం, ఇప్పటి పిల్లలు పాపం....బాల్యమే కోల్పోతున్నారు..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి. ఇప్పటి పిల్లలు పాపం....బాల్యమే కోల్పోతున్నారు..

      ఈ రోజుల్లో చాలామంది తలుపులను, కిటికీలను బిడాయించుకుని ఏసీలు లేక రూం హీటర్లు వేసుకుని యంత్రాల మధ్య జీవిస్తూ ( పనిచేస్తూ ) అదే అభివృద్ధి అని భ్రమపడుతున్నారు.

      ప్రకృతికి దూరమవుతున్న ఇలాంటి సమాజాన్ని చూసి బాధపడటం తప్ప ఏం చేయగలం ?


      Delete
  2. avunu mi tapa baavundi jnapakaalu baavuntaayi eppati ki ....eppati pillalu chaalaa miss avutunnaru

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి. ఇప్పటి పిల్లలు చాలా మిస్సవుతున్నారు.

      ఇప్పటి చాలామంది జీవితాలు , ప్రాణంలేని యంత్రాల మధ్య ... ప్రాణమున్న యంత్రాలలా తయారయ్యాయి.

      పిల్లలు చదువుల వత్తిడితోనూ, పెద్దవాళ్ళు పని లో టార్గెట్ల వత్తిడితోనూ, వృద్ద్యాప్యం వచ్చాక అనారోగ్యపు వత్తిడితోనూ జీవితాలు సా....గుతున్నాయి.

      Delete
  3. మీ జ్ఞాపకాలు బావున్నాయి.
    ఇప్పటి పిల్లలకి అన్నీ కరువే!
    పెద్దవారికి అన్నీ బరువే..అయిపోయాయి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి.
      ఇప్పటి పిల్లలకి అన్నీ కరువే!
      పెద్దవారికి అన్నీ బరువే..అయిపోయాయి.
      మనం కొన్ని జ్ఞాపకాలనయినా చెప్పగలుగుతున్నాము.
      యాంత్రికంగా పెరిగి పెద్దయిన ఇప్పటి పిల్లలే రేపటి పెద్దలు కదా !
      వీళ్ళు తమ తరువాత తరాలకు చెప్పటానికి చదువు, కెరీర్, పోటీ ప్రపంచంలో దూసుకు వెళ్ళటం వంటి....యాంత్రికమైన కబుర్లు, జ్ఞాపకాలు తప్ప , ప్రకృతికి సంబంధించిన ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు అంతగా ఉండవేమోనండి?

      Delete
  4. edi chaala manchidi.deenine mannam telusu kovalli

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి మీ వాఖ్యలు నిను కొని రోజులు నుంచి చదువుతున్ను మీరు 2010 నుంచి రాసున్న మీ వాఖ్యలు చాల బాగున్నాయి ఇవి రాస్తుంది అమ్మాయి నాకు తెలుసు ఉంది 28-32 లో ఉంటారు మీ పోస్ట్ లు నిను నా ఫేస్బుక్ లో షేర్ చెస్తునాను మీరు శామిచాలి

    ReplyDelete
  6. బాగుంది
    వ్యాసాలు కూడారాయండి

    ReplyDelete
  7. బాగుంది
    వ్యాసాలు కూడారాయండి

    ReplyDelete