koodali

Wednesday, June 22, 2011

అన్నయ్య గారూ, ఆక్కయ్య అని పిలుచుకొనే ఆ నాటి పిలుపులు ఏమైపోయాయో ?

 

 బంధువులు కాకుండా పరిచయస్తులు.. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకరినొకరు అన్నయ్య గారూ, ఆక్కయ్య అని పిలుచుకొనే
ఆ నాటి పిలుపులు ఏమైపోయాయో ?

మా చిన్నతనంలో జీవితం ఇంత హర్రీబర్రీగా ఉండేది కాదు.

కాసేపు నింపాదిగా కూర్చుంటే కొంపలు మునిగిపోతాయేమో అన్నట్లు కంగాళీగా ఉండేది కాదు. కొంచెం ప్రశాంతంగానే ఉండేది ప్రపంచం.

మధ్యాహ్నమో, సాయంత్రమో చుట్టుప్రక్కల ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం లాంటి దృశ్యాలు కనిపించేవి.

పిల్లలకు సాయంత్రం పూట ఆడుకోవటానికి కూడా సమయముండేది.

( అప్పట్లో ఇప్పటిలా బండెడు హోంవర్క్ ఉండేది కాదు. )

మా ఎదురింట్లో ఒక పిన్నిగారు ఉండేవారు. వారి పిల్లలు నాకు ఫ్రెండ్స్.

ఆ పిన్నిగారు మా ఇంటికి వస్తూ మా అమ్మగారిని
" అమ్మాయ్ ! ఏం చేస్తున్నావు" అంటూ వస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది.

ఆ పిన్నిగారు, ప్రక్కింటి వదినగారు, మా అమ్మగారు కబుర్లు చెప్పుకుంటుంటే
నేను మా అమ్మ పర్మిషన్ తీసుకొని పిన్నిగారి ఇంటికి వెళ్ళటం జరిగేది.,

ఇక చుట్టుపక్కల పిల్లలం ఎన్నో కధలు చెప్పుకొనేవాళ్ళం.

రాజు..భేతాళ కధలు ,చందమామ లోని కధలు ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్ళం.
ఆ కధలు సీరియల్స్ లా కూడా కొనసాగేవి.


ఎందుకంటే కధ పూర్తి అవకముందే పెద్దవాళ్ళు ఇంటికి పిలిచేశారనుకోనండి.
కధ ఆగిపోయి తరువాయి భాగం తరువాత కొనసాగేది అన్నమాట.

మగవాళ్ళు వచ్చే సమయమయ్యేసరికి ఆడవాళ్ళు కబుర్లు ముగించి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేవారు.

ఆ రోజుల్లో ఆఫీసుల్లో కూడా ఇప్పటిలా గొడ్డుచాకిరీ ఉండేది కాదు.

చాలా మంది మగవాళ్ళు వీలయినంత త్వరగానే ఇళ్ళకు వచ్చేసే వారు.

వ్యవసాయం, వ్యాపారం చేసేవారికి, ఇంకా కుటుంబ వారసత్వంగా వచ్చిన వృత్తులు చేసేవారికి కూడా
ఇప్పటి అంత టెన్షన్ గా పని వత్తిడి ఉండేది కాదు.


కొందరు ఇంట్లో పిల్లలతో హోంవర్క్ చేయించే తండ్రులు కూడా ఉండేవారు అంటే.. ఇప్పటి వాళ్ళు ఆశ్చర్యపోతారు.

మగవాళ్ళకు కూడా కుటుంబంతో గడపటానికి, ఇంకా , స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పుకోవటానికి తగిన సమయం ఉండేది.

ఇలా కబుర్లు చెప్పుకోవటం వల్ల పని దండగ,పోచుకోలు కబుర్లు అని ఈ మధ్య అంటున్నారు గానీ,

కబుర్ల వల్ల చాలా లాభాలున్నాయట.

మనకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవటం, ఇంకా, మానసికవత్తిడి తగ్గటం ఇలా ఎన్నో లాభాలున్నాయట.

( అలా అని మన ఇంట్లో విషయాలన్నీ పక్కింటివారికి అన్నీ చెప్పెయ్యకూడదు. ఎంతవరకూ చెప్పొచ్చో అంతవరకే చెప్పినప్పుడే లాభాలు.

పరిధి దాటి చెప్పేస్తే జరగబోయే పరిణామాలకు ఏం చేయాలో తెలియక మనం దిక్కులు చూడవలసిందే .)

ఇక,...

ఈ రోజుల్లో అయితే పిల్లలకు సూర్యోదయం నుంచీ మళ్ళీ సూర్యోదయం వరకూ చదువేచదువు.(

మధ్యలో కొంచెం సేపయినా నిద్ర పోకపోతే బాగుండదు కాబట్టి
పడుకోవటానికి పర్మిషన్ దొరుకుతుంది అంతే.


నిద్రలో కూడా మెదడుకు చదువు చెప్పే సాధనాలు ముందుముందు కనుక్కుంటారేమో చెప్పలేము.

ఇక తండ్రులు, కెరీర్ టార్గెట్టుల మాయాజాలంలో ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తారు.

చాలా మంది తల్లులు కూడా ఉద్యోగాల వల్ల రాత్రి 7 లేక 8 గంటలకు ఇంటికి వస్తారు.

పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఇంట్లో ఎవరూ ఉండరు కాబట్టి ,
వాళ్ళను కరాటే, కధాకళి వగైరా క్లాసుల్లో వేస్తారు .

( అవి నేర్చుకోవటం వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా, నేర్చుకోవటానికి ఓపిక ఉన్నా లేకపోయినా ).

అందరూ ఇంటికి వచ్చి ఇంత వండుకుని తిని ,దానికీ ఓపిక లేకపోతే కర్రీ పాయింట్ల నుంచీ

తెచ్చుకుని భోజనాలు కానిచ్చి పడుకుంటారు.

కొన్ని ఇండ్లలో తండ్రిని వారం రోజుల పాటు చూడని పిల్లలు కూడా ఉన్నారట.

అంటే రాత్రి తండ్రి ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్ర పోతారు. ప్రొద్దున పిల్లలు లేచేసరికి తండ్రి పనిలోకి వెళ్ళిపోతారు.

ఇక ఈ రోజుల్లో భార్యా భర్తా మాట్లాడుకోవాలన్నా అన్నీ అడ్డంకులే.

ఉదా... భార్య " ఏమండి."... అనగానే "ఏమిటోయ్ "! అని భర్త అనగానే ..

ట్రింగ్!ట్రింగ్ ! అని సెల్ ఫోన్ మోగుతుంది. ఇంకా సంభాషణ కట్.

ఒక అరగంట అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉండే భర్తను చూసీచూసీ భార్య తాను భర్తతో ఏం

చెప్పాలనుకుందో మర్చిపోతుంది.

అరగంట ఫోన్ సంభాషణ అనంతరం భర్త కాసేపు అయోమయంగా తాను ఆఫీసులో ఉన్నానో లేక ఇంట్లో ఉన్నానో అర్ధం కాక , గుర్తు తెచ్చుకుని స్పృహ లోకి వచ్చి ,

ఎదురుగా నీరసం మొహం వేసుకొని చూస్తున్న భార్యను చూసి ........

"ఆ !ఏంటోయ్ ! ఇందాక ఏదో చెబుతున్నావు.విషయమేంటి " ? అని అడుగుతారు.

" మరీ ! మరీ ! విషయమేమిటంటే ... అని గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే ..మళ్ళీ ట్రింగ్ !ట్రింగ్! ........

ఒక గంట ఫోన్ తరువాత తెప్పరిల్లి చూసిన భర్త గారికి భార్య నిద్రపోతూ కనిపిస్తుంది.

తెల్లవారితే ఆఫీసులో చేయవలసిన పనుల గురించి , ఫోన్ లో సూచనలు ఇచ్చిన పై అధికారి మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతుండగా ,

రేపు అడుగుదాములే ఏం చెప్పాలనుకుందో ! అని ఆయనా పడుకుంటారు.

ఆ రేపు ఎప్పటికి వస్తుందో ? ఆ భార్య ఏం చెప్పాలనుకుందో ? ఏమిటో ?


* ఈ రోజుల్లో పెరిగిన రవాణా, ఫోన్ ఇత్యాది సౌకర్యాల వల్ల
ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిందని దేశాల మధ్య దూరం తగ్గిపోయిందని చెబుతున్నారు.

నిజమే,కానీ, ఒక దగ్గర ఉండే మనుషుల మనసుల్లో మాత్రం దూరం పెరిగిపోయిందని చెప్పక తప్పదు.



* పూర్వం బ్రతకటం కోసం పని చేసి సంపాదించేవారు. ఇప్పుడు పనిచేయటం కోసమే బ్రతుకుతున్నాము అనిపిస్తోంది. 

 

2 comments:

  1. ఎంత చక్కగా చెప్పారు వాస్తవాలు మీరు. ఇంతవరకు ఒక్క వ్యాఖ్య కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete