పూర్వం ఆడవాళ్ళు ఇప్పటిలా ఉద్యోగాలు చేసి సంపాదించటం తక్కువగా ఉండేది.
భర్త ఎంత ధనికుడయినా ఆడవారికి తమకంటూ సొంతానికి కొంత ధనం ఉంటే వాళ్ళకు స్వతంత్రంగా ఉంటుంది.
ఒక ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే.. పండుగలకు కొత్త బట్టలు, ఆడుకొనే బొమ్మలు, తినే వస్తువులు ఇవన్నీ .... తల్లిదండ్రులు పిల్లలు అందరికి ఇస్తుంటారు.
అలాగే తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు వారి వివాహం సందర్భంగా ... ముచ్చటపడి ఆ పిల్లలకు కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపేవారు.
డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా , తక్కువగా ఉన్నవాళ్ళు తమకున్నంతలో కానుకలు ఇచ్చుకొనేవారు.
ఆ కానుకలు ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.
అలా ఆడవాళ్ళు .... పుట్టింటినుంచి తెచ్చుకున్న ధనాన్ని భర్త మొదలైన వారు కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.
స్రీ ధనంగా భావించి దానిని ఆమెకే ఉంచేసేవారు. ఆ కానుకలు ఆమె తమ పిల్లలకు ఇచ్చుకోవటం జరిగేది.
అలా ముచ్చటగా మొదలైన వ్యవహారం .... ఇప్పుడు వికృతరూపం దాల్చి ఆ కానుకల కోసం ఎంతకైనా తెగించేస్థాయికి పరిస్థితులు వచ్చాయి.
తప్పు ఎక్కడ వచ్చింది అంటే మనుషుల మనస్తత్వాలు మారటం వల్ల వచ్చింది.
డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోవటం,తేరగా ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశ పడటం, డబ్బు కోసం హుందాతనం లేకుండా లేకిగా ప్రవర్తించటం, మానవసంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోవటం వల్ల...ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి.
వియ్యానికయినా, కయ్యానికయినా సమాన స్థాయి ఉండాలంటారు.
ఇప్పుడు అందరికీ కోరికలు పెరిగిపోయి కొందరు ఆడపిల్లలు అమెరికా పెళ్ళికొడుకులే కావాలి అంటే... కొందరు మగపిల్లలు ఐశ్వర్యా రాయ్ లాంటి అమ్మాయి మాత్రమే కావాలి . ఇలా పెరిగిపోతున్న కోరికలు.
ఇక తల తాకట్టు పెట్టి అయినా పెళ్ళి చేస్తారు పెద్దవాళ్ళు.
చాలామంది మగవారినే ఆడిపోసుకుంటారు గానీ ... ఈ డబ్బు గొడవల్లో భర్త ఒక్కడే కాదు. చాలా సార్లు అత్తా, ఆడపడుచుల ప్రమేయం కూడా ఉంటుంది.
ఒక భర్త తన భార్యను కొడుతున్నప్పుడు తోటి ఆడవాళ్ళుగా అత్తగారు , ఆడపడుచులు, అలా చేయటం తప్పు అని చెపితే ... భార్యను కొట్టే భర్త ప్రవర్తన మారే అవకాశం ఎంతయినా ఉంది.
అలా చేయకపోగా కొందరు అత్తగార్లు, ఆడపడుచులు విషయాన్ని మరింత పెద్దది చేస్తారు.
కుటుంబాల్లో గొడవలు జరగటానికి సమస్య డబ్బు మాత్రమే కాదు.
కొందరి విషయాల్లో డబ్బు వల్ల గొడవలు వస్తున్నాయి .
మరి కొందరు కోట్ల రూపాయల కట్నం తీసుకెళ్ళినా కూడా ... వారి కుటుంబాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి,.
మొత్తం మీద ఇలా కుటుంబాల్లో గొడవలు పెరిగిపోవటానికి... మనుషుల మధ్య ఆప్యాయతలు , నమ్మకాలు తగ్గిపోవటం, ఇగో సమస్యలు పెరిగిపోవటం .. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.
అయితే, భార్యాభర్తలు, అత్తకోడలు,ఆడపడుచులు వీరి మధ్య ఆప్యాయతలు, మంచి అవగాహన ఉన్నప్పుడు డబ్బు పెద్ద సమస్య కాబోదు........
ఆడపిల్లలకు వివాహ సమయంలో వారి తల్లిదండ్రులు కానుకలు ఇవ్వటానికి నేను వ్యతిరేకం కాదు.
అయితే ఆ కానుకలను అత్తింటివారు పీడించి తీసుకోవటానికి నేను పూర్తిగా వ్యతిరేకం.
ఆ కానుకలను అత్తింటి వారు తీసుకోకుండా ఆ అమ్మాయికే అట్టిపెట్టడం పద్దతిగా ఉంటుంది.
No comments:
Post a Comment