koodali

Monday, June 6, 2011

అందరూ విపరీతంగా ధర్మపన్నాలు చెబుతున్నారు. ( నాతో సహా )

మేము ఊరు వెళ్ళి ఈ రేజే వచ్చామండి. అందుకే బ్లాగ్ చదవటానికి కుదరలేదండి. ఏదో నాకు తెలిసినంతలో రాస్తుంటాను.

ఎన్నో విషయాలు తెలిసిన వారు ఇక్కడ ఎందరో ఉన్నారు. వారికి తెలిసిన విషయపరిజ్ఞానంలో నాకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే ఎక్కడన్నా తప్పుగా వ్రాస్తే దయచేసి క్షమించండి.


ఈ బ్లాగ్ ను సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లు అందరికి నా కృతజ్ఞతలండి. ఇంకా ఇంతకుముందు నుంచి బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న వారికి మరియు ఇప్పుడు కొత్తగా చదువుతున్న వారికి అందరికీ నా కృతజ్ఞతలండి.. ................................................................


మనం బస్సులో గానీ, రైల్ లో గానీ ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఊర్లు చూస్తుంటాము గదండి ! కొన్ని ప్రదేశాలు కొంచెం బాగానే ఉంటాయి గానీ ... చాలా ప్రదేశాలు చెప్పలేనంత మురికిగా ఉంటున్నాయి.

ఒక పక్క 22 వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నాము అంటున్నారు. ఒక ప్రక్క దూసుకుపొతున్నఅవినీతి తో పాట.. ఆకలి కేకలూ వినిపిస్తున్నాయి.


దేశంలో విపరీతంగా పంటలు పండాయి .. పండిన ధాన్యం నిలువ చేయటానికి సదుపాయాలే లేవు అంటున్నారు.

అంత పంట పండినా కూడా పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. ప్రజలకు ఆకలి తీరదు. ఏమిటో !


మనం రోడ్ మీద వెళ్తుంటే ఆకలిగా ఉంది. ధర్మం చెయ్యండి అనే వాళ్ళు అనేకమంది కనిపిస్తుంటారు.

ఒకరికి ఏదైనా ఇస్తే మరింత మంది చుట్టూ పోగవుతారు. ఇదంతా చాలా బాధగా ఉంటుంది.

మొన్న నేను ఊరెళ్ళినప్పుడు రోడ్డుపై నడిచి వెళ్తోంటే ఒక ముసలి ఆమె ...ఆకలిగా ఉంది. ఏమైనా ధర్మం చెయ్యమన్నప్పుడు.. ఈ వ్యవస్థతో సహా అందర్నీ తిట్టుకుని నన్ను నేను కూడా బాగా తిట్టుకున్నా .. ఇక చేసేదేమీ లేక.

( మనం ఒక సారి ఏమైనా ఇవ్వగలం .కానీ తరువాత వాళ్ళ పరిస్థితి ఏమిటి ? అనాధ పిల్లలు కూడా ఇలా కనిపిస్తుంటారు. ).


అసలు వ్యవస్థలోనే లోపముంది అనిపిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం అందరూ పని చేస్తే ఈ వ్యవస్థ మారటం పెద్ద కష్టమేమీ కాదు. .. కానీ చాలా మంది తమ స్వార్ధం తప్ప ఏమీ పట్టించుకోవటం లేదు.


ఎక్కడ పడితే అక్కడ ఉమ్మిన కిళ్ళీలు, రోడ్ల ప్రక్కన కంపు, ఇదంతా చూస్తే ..ఒకప్పుడు శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే భారతీయులు ఇలా తయారయారేమిటి ? అన్న బాధ మనసును పిండేస్తుంది.


చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అని చదివించేవారు. కొంత కాలం క్రిందట పొలాల్లో గట్ల పైన కొబ్బరి, తాటి చెట్లు వేసేవారు.


ఇప్పుడు రోడ్ల పక్కన కూడా చెట్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి... చెట్ళు ఎక్కువగా పెంచితే చల్లగా ఉంటుంది కదా ! ఏదో కారణంతో ఉన్న చెట్లనే కొట్టేస్తుంటారు. ఇలా అయితే ఎలా ?


*అసలు ఎవరి పని వారు సక్రమంగా చేస్తే దేశం ఎందుకు బాగుపడదు ?

ఒక ఉద్యోగి అవినీతి, లంచం లేకుండా తన పని తాను సక్రమంగా చేసినప్పుడు,

ఒక ప్రజా ప్రతినిధి తనను ఎన్నుకున్న ప్రజల కష్టాలను తీర్చి .. వారికి ప్రాధమిక అవసరాలకు లోటు లేని మంచి పాలనను అందించినప్పుడు.


ప్రజలందరూ ధర్మబద్దంగా మాత్రమే  జీవితాలను సాగించినప్పుడు ,

భక్తులు పూజ చేయటం మాత్రమే కాకుండా .. దైవానికి ఇష్టమయిన విధంగా ధర్మబద్దంగా జీవించినప్పుడు,

శాస్త్రవేత్తలు ప్రపంచానికి పనికివచ్చే ప్రయోగాలను మాత్రమే చేసి వాటిని ప్రపంచానికి అందించినప్పుడు,

ఇలా అందరూ తమతమ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించినప్పుడు..
ఇక కష్టాలెందుకుంటాయి ?

ఇప్పుడు సమస్య అదే ! ఎవరి ధర్మం వారు సరిగ్గా పాటించటం లేదు. .. పాటించకపోగా అందరూ విపరీతంగా ధర్మపన్నాలు చెబుతున్నారు. ( నాతో సహా ) ఇదే కలికాలపు వింత..


*ఈ రోజుల్లో.. ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు తమ ప్రభుత్వం పడిపోకుండా 5 ఏళ్ళు ఎలా నిలబెట్టాలి ? అన్న చింతతోనే కాలం గడిచిపోతుంది.. ఓడిపోయిన పార్టీలకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి ? అన్న చింతతోనే కాలం గడిచిపోతుంది.. ఇక..ఏది దారి ..?

*చిన్నతనం నుంచీ పిల్లలకు నైతికవిలువలతో కూడిన విద్యను అందించటం వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. .

అయితే నైతికవిలువలు అంటే తమకు ఇష్టం వచ్చినట్లు అర్ధం చెప్పుకునే వాళ్ళూ ఎక్కువయిపోయారు .అదే విషాదం మరి..

 

2 comments:

  1. అపరిచితుడులో రాము కారెక్టర్ మీకు ఇన్స్ పిరేషన్ లాగుంది.. ఎప్పుడో ఒకప్పుడు "నీయబ్బ ! ఒరే.." అని మాత్రం అపరిచితుడులా మారిపోకండేం..(జస్ట్ సరదాగా)

    ReplyDelete
  2. .మీ కామెంట్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. ఆ కారెక్టర్ ఏమీ నాకు ఇన్స్పి రేషన్ కాదండి. నాలో అంత కాఠిన్యం లేదండి.

    ఎవరైనా తప్పు చేసారంటే దాని వెనుక ఎన్నో కారణాలుంటాయి. తప్పు చేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుని మంచిగా మారి అందరికి ఆదర్శంగా జీవించాలని దైవాన్ని కోరుకుందాము.....

    ReplyDelete