koodali

Friday, December 16, 2011

కొన్ని ఆలోచించవలసిన విషయాలు....



కొందరు ఏమంటారంటే ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు, దెయ్యం వంటి చాదస్తాలు ఏమిటి ? అంటారు . వాళ్ళలా ఎందుకంటారో అర్ధం కాదు .

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవం శాశ్వతం.

ఇక ప్రాచీన కాలమయినా ....ఆధునిక కాలమయినా మార్పు ఏముంది ? ప్రాచీనులు భోజనం చేసినట్లే మనమూ చేస్తున్నాము.. వారు నిద్ర పోయినట్లే మనమూను. వారిలాగే అహంకార, మమకారాలు మనకూ ఉన్నాయి.


ప్రాచీనకాలం నాటి విజ్ఞానాన్ని తక్కువగా చూస్తూ .... ఇప్పటికాలపు విజ్ఞానం వల్ల అన్నీ లాభాలే అంటున్నారు కొందరు., ఈ నాటి విజ్ఞానంలో కొన్ని లాభాలతో పాటు పొరపాట్లు కూడా జరుగుతున్నాయి.


రాకెట్లను అంతరిక్షంలోకి పంపటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉండవచ్చు అంటున్నారు కొందరు. . రాకెట్లు తిరిగి భూమికి వచ్చేటప్పుడు అంతరిక్షం నుంచి కొత్తరకం సూక్ష్మజీవులు కూడా భూమికి వచ్చే అవకాశముందట. వాటి వల్ల భూమిపై కొత్తరకం జబ్బులు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందట.


యాంటిబయాటిక్స్ కనుగొనటం వల్ల వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇప్పుడు మళ్ళీ తేలుతున్నదేమిటంటే, యాంటిబయాటిక్స్ ను విపరీతంగా వాడటం వల్ల వ్యాధికారక బాక్టీరియా దానికి అలవాటుపడి యాంటిబయాటిక్స్ కు కూడా లొంగని విధంగా శక్తిని సాధిస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలిందట.


ఇలా ఏ మందులకూ లొంగని రోగాల వల్ల ప్రజలకు మరిన్ని కష్టాలు వచ్చిపడే అవకాశం ఉందనీ, అందువల్ల యాంటిబయాటిక్స్ ప్రతి చిన్న రోగానికీ విపరీతంగా వాడకూడదనీ వైద్యులు చెబుతున్నారు.


ఎన్నో ఉపయోగాలున్నాయని అందరూ భావించిన ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా తయారయ్యింది. ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, గ్యాస్ తయారుచెయ్యవచ్చు అంటున్నారు. ఇది కొంతలో కొంత శుభ పరిణామమే.


అయితే ఈ పెట్రోల్ వాడకం ద్వారా వాతావరణం కలుషితం కాదని ప్రస్తుతానికి చెబుతున్నారు ..కానీ కలుషితం అవుతుందా ? కాదా ? ఓజోన్ పొర దెబ్బ తింటుందా ? లేదా ? అన్నది కాలమే తేల్చాలి.


ఈ మధ్య టీవీ చానల్ లో ఒక వార్త వచ్చింది. ఏమంటే కొందరు శాస్త్రవేత్తలు ఒక పదార్ధం కనిపెట్టారట. దానితో చేసిన వస్త్రం కప్పుకుంటే మనిషి ఎదుటి వారికి కనపడరట.

ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ విన్నాక ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ వస్త్రం పోలీసు వారికి ఒక వరం . అని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారట. అయితే ఈ వార్త విన్న ప్రజలు మాత్రం బెంబేలు పడిపోతున్నారట.

పోలీసుల సంగతి అటుంచితే ....... నేరస్తులకు ఇది ఒక వరంలా ఉపయోగపడుతుందనీ, ఇటువంటివి ఆవిష్కరించవద్దు మహాప్రభో ! అని ప్రజలు శాస్త్రవేత్తలను వేడుకుంటూన్నారని వార్తా సారాంశం.


ఇలాంటివి ఏమీ లేకపోయినా నేరస్తులు అందినమటుకు అందినట్లు దోచుకుపోతున్న ఈ రోజుల్లో .... ఇలాంటివి అందుబాటులోకి వస్తే ఇక అంతే సంగతులు. అని ప్రజల ఘోష. ( పట్టించుకునేదెవరు ? )

పోలీసులు, దొంగలు ఇద్దరూ కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది.


శాస్త్రవేత్తలు ఏమంటారంటే ,మేము కనిపెట్టిన విజ్ఞానాన్ని ప్రపంచ క్షేమం కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. అంటారు.

అందరూ వారిలా మంచిగానే ఆలోచిస్తే ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతాయి ? అన్నది అసలు విషయం.


ఇలాంటివాటిని నెగటివ్ గా ఎలా ఉపయోగించాలి ? అని ఆలోచించేవారు కూడా కొందరు ఉంటారనేది అందరూ ఆలోచించవలసిన విషయం.

ఇవన్నీ ఎవరినీ నొప్పించటానికి వ్రాయలేదండి. దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నాను..


* ప్రాచీన కాలంలో కూడా కొందరికి ఇలా మాయమయ్యే శక్తులు ఉండేవని చెబుతారు. అయితే గొప్ప తపస్సులు వంటివి చేసిన వారికి మాత్రమే ఇలాంటి శక్తులు అందుబాటులో ఉండేవనీ, అందరికీ అందుబాటులో ఉండేవి కాదని చెబుతారు.


* శాస్త్రవేత్తలు లోకానికి ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలను కూడా అందించారు. అందుకు మనము వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.


Wednesday, December 14, 2011

శాస్త్రీయ నిరూపణ.... టెక్నాలజీ.



నేను ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి వ్యతిరేకిని కాదు. అయితే విజ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం.

కొందరు ఏమంటారంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే ఏ విషయాన్నయినా నమ్ముతాము అంటారు.

ఆధునిక శాస్త్ర విషయాలు కొన్ని , ఒకసారి నిరూపణ అయిందని భావించాక కొంతకాలానికి ఆ విషయం పొరపాటు అని తేలుతోంది.

ఇలా పదేపదే మార్పులుచేర్పులు జరుగుతున్నప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించటం అనేది ఎప్పటికి జరుగుతుంది ?

అంతిమంగా ఏ విషయమైనా ఇదీ సత్యమని తేలినప్పుడే కదా ! అది నిజమని నిరూపణ అయ్యేది.

ఒకసారి సత్యం అని నిరూపణ అయ్యాక కొంతకాలానికి మళ్ళీ అది పొరపాటని మళ్ళీ కొత్త సత్యం కనుక్కుంటే ఇక ఏది శాస్త్రీయమని నమ్మాలి ?

అందరూ తెలియని వాళ్ళే అయినప్పుడు ఏది తప్పో ? ఏది ఒప్పో ? ఎవరు నిర్ణయిస్తారు ?

హేతువాదులు చెప్పే శాస్త్రీయత అంటే ఏమిటి ? ఏదైనా అంతిమంగా నిర్ధారణ అయినప్పుడే గదా నమ్ముతారు.

ఎప్పటికప్పుడు మారుతూ ఉండే విషయం .శాస్త్రీయంగా నిరూపణ అయింది అని ఎలా చెప్పగలరు ?

అలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటూ, నిరూపణ నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నమ్మాలి ?

........................

కొందరు నాస్తికులు ఏమంటారంటే , ...........ఆస్తికులు కూడా ఈ నాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా ! అంటారు. ..

మరి దైవం లేరనే నాస్తికులు కూడా ఆ దైవం ప్రసాదించే గాలిని పీల్చే బ్రతుకుతున్నారు.

వాళ్ళు తయారుచేసే అనేక వస్తువులు కూడా దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేయబడినవే.

విమానాలు తయారుచేయటానికి ముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. నౌకలు తయారుచేయబడటానికి ముందే చేపలు నీటిలో ఈదుతున్నాయి.

సృష్టిలోని టెక్నాలజీని చూసి ఎంతో నేర్చుకుంటూ కూడా కొందరు ..... దైవం లేరు అంటారు. ఇది అన్యాయం.

ఈ నాటి టెక్నాలజీ లేకపోయినా ప్రాచీన కాలం నుంచీ ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంధాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఇక ముందూ కొనసాగుతాయి..

..............

కొందరు ఏమంటారంటే , మన దేశంలోని ప్రజల ఆలోచనాధోరణి వల్ల దేశం ఎంతో వెనకబడిపోయింది. ఇతరదేశాలు టెక్నికల్ గా ఎంతో అభివృద్ధిని సాధించాయి అంటారు.

ఆ దేశాలు మొదట అలా అభివృద్ధిని సాధించినట్లు కనిపించినా ఇప్పుడు చూడండి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు అనుకున్న దేశాలు ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి.

మరి వారికి పారిశ్రామికాభివృద్ధి జరిగీ కూడా ఆర్ధికమాంద్యం ఎందుకువచ్చింది ?
.........

అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గొప్పగా కట్టిన కట్టడాలను చూసినప్పుడు గొప్పగానే అనిపిస్తుంది.

అబ్బో ! మనుషులు ఎంత ఎదిగిపోయారు కొండల్ని కూడా పిండి చేయగలుగుతున్నారు అనిపిస్తుంది.

కానీ, అలా కట్టడానికి వెనుక ఎంత ఇనుము, ఎంత ఇసుక, ఎంత కంకర ఇలా ఎన్ని సహజవనరులు వాడారో కూడా తెలుసుకుంటే.......

కట్టడాలనే కాదు ఈ రోజుల్లో మనం వాడుతున్న వస్తువుల్లో చాలా మనకు అనవసరమైనవే.

ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందువల్ల పేదరికం అలాగే ఉండిపోతూంది.

. మన పూర్వులు ఇలాగే విచ్చలవిడిగా సహజవనరులను వాడి ఉంటే , ఇప్పుడు మనకు ఇవేమీ ఉండేవి కాదు.

ఇలా అన్ని సహజవనరులను విపరీతంగా వాడేస్తే మనం మళ్ళీ ఇనుప గనులను, సృష్టించగలమా ? పిండి చేసిన కొండలను తిరిగి సృష్టించగలమా ?

కోరికలకు అంతెక్కడ ? మనిషి కోరికలను పెంచుకుంటూ పోతే భూమి లాంటి పది గ్రహాలలోని సహజవనరులైనా సరే సరిపోవు.

రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అయినా మనం మన అలవాట్లను మార్చుకోవాలి.

ఎంతో ఖర్చు పెట్టి, గొప్ప టెక్నాలజీతో కట్టడాలు కట్టినా భూకంపాలు వంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టడాలు పడిపోకపోయినా కొద్దిగా బలహీనమైనా అంత పెట్టుబడీ వృధానే కదా !

ప్రకృతి ముందు మనిషి ఎంత ?

* దైవం అంటూ ఎవరూ లేరు..... మనిషే గొప్ప . అని ఎవరైనా భావించటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యటంలా హాస్యాస్పదం...


Monday, December 12, 2011

గత శుక్రవారం మేము కొందరం ........

* గత శుక్రవారం మేము కొందరం కలిసి ఒక ఊరిలోని అనఘాదేవీ సమేత దత్తాత్రేయస్వామి వారి దేవాలయానికి వెళ్ళామండి.


* దేవాలయంలో ఇతర దేవుళ్ళ ఉపాలయాలు కూడా ఉన్నాయి.

దైవ దర్శనం చేసుకున్నాము . దేవాలయంలో అన్నదానం జరుగుతుంటే మేమూ అక్కడే భోజనాలు చేశాము.

తరువాత మా ఫ్రెండ్ ఒకామె మమ్మల్ని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ అత్తగారింటికి తీసుకువెళ్ళింది.


* ఆ ఇల్లు పాతకాలం మోడల్ ఇల్లు. కానీ చాలా గదులున్నాయి. ఒక గదిలో కిటికీలు కూడా లేవు. అయినా గదంతా తెల్లగా వెలుతురుగా ఉంది.

మేము వెళ్ళినప్పుడు కరెంట్ లేకపోయినా , ఈ వెలుతురు ఎక్కడినుంచీ వస్తోందబ్బా ! అని చూస్తే పైన వెంటిలేటర్ లాంటిది కనిపించింది.


* ఆ అద్దంలోనుంచి సూర్యరశ్మి గదంతా పరుచుకుంది. మరి అద్దం తీరో ఏమో వెలుతురు వెన్నెలలా తెల్లగా ఉంది.


* ఒక గ్రిల్ పెట్టి ( రక్షణకు ) పైన అద్దం పెట్టారు. ఆ అద్దానికి అవతలి వైపు నుంచీ ఎవరైనా చూసినా కూడా గదిలోని వారు కనపడరట. అద్దం అంత మందంగా ఉంటుందట.

* ఇదంతా చూశాక పూర్వకాలం వాళ్ళు ఎంత తెలివి గల వాళ్ళో అనిపించింది.

ఈ రోజుల్లో కూడా కొత్తగా మళ్ళీ ఇలా సూర్యరశ్మి వచ్చేటట్లు ఇళ్ళు, ఆఫీసులు కట్టడం మొదలుపెడుతున్నారట.

* ఆ విధంగా విద్యుత్ ఆదా అవుతుందని. ఇంకా ఈ మధ్య ఒక వార్త వచ్చింది.

రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ వెలుగుల్లో ఉంటున్నవారికి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని కనిపెట్టారట శాస్త్రవేత్తలు.


* అలా విద్యుత్ వెలుగులోనే బతుకుతున్న వారి బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుందట.

* ఇంకా నేను ఒక దగ్గర చదివిందేమిటంటే , పూర్వం కట్టడాలను ఇప్పటిలా సిమెంట్ తో కాకుండా అందుకు బదులుగా సున్నం, బెండకాయ జిగురు, బెల్లము, ఇంకా అనేక పదార్ధాలు కలిపి ఉపయోగించేవారట.


పురాతనమైన కట్టడాలు కొన్ని ... ఇప్పటి వాటికన్నా పటిష్టంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. పురాతన దేవాలయాలు ఎన్నో ఏళ్ళయినా పటిష్టంగా ఉంటున్నాయి.


* ఆ విధంగా ప్రాచీనులు పర్యావరణానికి హాని లేకుండా పద్ధతిగా జీవించారు. మరి మనమో ! బొగ్గు నిలువల్ని విపరీతంగా తవ్వేసి విద్యుత్ గా మార్చి ........ఎంత అభివృద్ధి చెందామో ? అని మురిసిపోతున్నాము.


ప్రకృతిలో ఇలా బొగ్గు తయారవ్వాలంటే వేల సంవత్సరాల కాలం పడుతుందట. ఇక అణువిద్యుత్ గురించి అందరికీ తెలిసిందే.

* ఇంకా , అహా ! ఇప్పటివాళ్ళకెంత విజ్ఞానం తెలుసో పాతకాలం వాళ్ళకు ఏమీ తెలియదు ... పల్లెటూరి గబ్బిలాయిలు. అనుకుంటున్నారు.


డిల్లీలో కుతుబ్ మీనార్ వద్ద ఒక ఉక్కు స్తంభం ఉందట. అది ఎన్నో ఏళ్ళనుంచీ ఉందట. వానకు తడిచినా కూడా తుప్పు పట్టదట.

* అది ఏ విధమైన మెటల్ తో చేశారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియటం లేదంట.

ఇలా ఎన్నో మనకు తెలియని విషయాలున్నాయి. ఇవన్నీ చూస్తే ఇప్పటి వాళ్ళకే అన్నీ తెలుసు. పాతకాలం వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవటం భ్రమ మాత్రమే.

నేను వార్తాపత్రికలు ఎక్కువగా చదువుతాను. కానీ ఇప్పుడు సరిగ్గా చదవటానికి సమయం సరిపోవటం లేదండి.

* నిన్న ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ బాగుంది. శీర్షిక పేరు........" కొత్త బూచాళ్ళు...భద్రతకు సవాళ్ళు " ........4 వ పేజీలో ఉంది. ....వీలుకుదిరితే తప్పక చదవండి....



Saturday, December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.





రేపు
తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.


తెలుగు బ్లాగులోకంలో నా బ్లాగును కూడా ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలండి. నేను బ్లాగ్ వ్రాస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దైవానికి అనేక కృతజ్ఞతలు..




Friday, December 9, 2011

కొన్ని విషయాలు, ఇంకా ......ఆధునిక సైన్స్ ను మాత్రం పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి ?

 

*నిన్న తిరువణ్ణామలైలో కార్తీకమహాదీపోత్సవం టీవీలో చూస్తుంటే మేము అక్కడకు వెళ్ళినప్పటి సంగతులు గుర్తు వచ్చాయి.

ఆ ఉత్సవం, ఇంకా పున్నమి వెన్నెలలో చేసే గిరిప్రదక్షిణ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి .

............................

ఇక, కొందరు ఏమంటారంటే ..
విద్యుత్ ఉంటే చాలు ఇక బ్రహ్మాండం బద్దలైపోయేంత అభివృద్ధి జరిగిపోతుందంటూ ఊదరగొట్టేస్తుంటారు
.

ఇప్పుడు అందరు విద్యుత్
విద్యుత్ అంటూ వెంపర్లాడి పోతున్నారు.

అప్పుడు సోలార్ ఎనర్జీ వల్ల విద్యుత్తును పొంద వచ్చు కదా ! సోలార్ ఎనర్జీనే తక్కువ ఖర్చుతో ఎలా పొందాలో పరిశోధనలు చెయ్యాలి గానీ ..ప్రమాద కరమైన...?


అణుకేంద్రాలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏం చేస్తారో ? ఈ వ్యర్ధాలు కొన్నిసార్లు సముద్రాలలో కూడా కలిసే అవకాశం ఉందట.రేడియేషన్ వల్ల ప్రపంచానికంతా దీర్ఘకాలంలో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇలా ఎంతో రిస్క్ ఉన్న వీటిని మేధావులు కూడా ప్రోత్సహించటం దురదృష్టకరం.


* అయినా ,పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ! ఎన్నో సహజవనరులు వాడుకోవలసి ఉంటుంది. ఇలా అన్నీ వనరులనూ వాడేసి కొత్త వస్తువులు తయారుచేయటమేనా మనిషి జీవితధ్యేయం ?

పోనీ ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోకుండా కొత్తకొత్త వస్తువులు సృష్టిస్తే అప్పుడు మనుషులు ఆనందంగా ఉంటారని ఏమిటి గ్యారంటీ ?


ఇవన్నీ లేకపోయినా మన పూర్వులు హాయిగా వెన్నెల్లో విందుభోజనాలు చేసి కూడా ఎంతో సంతోషంగా జీవించారు.
ప్పటివాళ్ళు ప్రకృతికి దూరమై ఏసి గదులు తప్ప వెన్నెల అంటే కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు.

ప్రపంచం అసలు ఎటు పోతున్నదో అర్ధం కావటంలేదు
.
......................

ఇక ,ఆధునిక విజ్ఞానం విషయానికి వస్తే..........
.
నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమే. ఒక రకంగా చూస్తే ఈనాటి పరిశోధనల వల్ల కూడా ప్రాచీన విజ్ఞానం యొక్క గొప్పదనం అందరికీ తెలుస్తోంది.

* ఆధునిక సైన్స్ ను కూడా పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి?  ఆధునిక విజ్ఞానం విషయంలో కూడా ఒకసారి నిరూపణ అయిన విషయాలే కొంతకాలానికి పొరపాటుగా ఋజువయిన సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాము.

ఈ మధ్యే " కాంతి యొక్క వేగం " విషయంలో .... ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

* శాస్త్రవేత్తలు అంటే నాకు గౌరవమే. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

* అయితే శాస్త్రవేత్తల మధ్య కూడా సిద్ధాంత రాద్ధాంతాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరు అవునన్న దానిని ఇంకొకరు కాదంటూ ఉంటారు.

ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి....... కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.


రేడియేషన్ తో ట్రీట్ మెంట్ వల్ల వైద్యరంగంలో వ్యాధులు కొంతవరకూ తగ్గుతున్నాయి.. దానివల్ల కొంత మంచి జరుగుతోంది..అయితే, ఇంకా ఏమనిపిస్తుందంటే..ఈ రకమైన ట్రీట్ మెంట్స్ వల్ల 100 మందికి వ్యాధి తగ్గితే , ఈ రేడియేషన్ వ్యర్ధాలు గాలిలో, నీటిలో, భూమిలో కలవటం వల్ల 1000 మందికి కొత్తగా వచ్చే అవకాశమూ ఉంది అనిపిస్తుంది..

 
  అణుశక్తిని విద్యుత్ రంగంలోను, వైద్యరంగంలోను వాడుతున్నారు. అయితే, తద్వారా వచ్చే రేడియేషన్ సమస్యలు ఉన్నాయి..అణువ్యర్ధాల విషయంలోనూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. .విద్యుత్ మరియు  వైద్యానికి అణుశక్తి కాకుండా ఎన్నో విధానాలున్నాయి.అవి వాడుకోవచ్చు.

కొన్ని ప్రయోజనాల కొరకు.. పెద్దప్రమాదాలు ఉన్నదానిని పట్టుకోవటం ఎంతవరకు సరైనదో ? తెలియటం లేదు.

  
ఇంకా ప్లాస్టిక్ వంటి విషయాల్లో మొదట అద్భుతంగా చెప్పుకున్న విషయాలే కాలం గడిచాక ఇప్పుడు.... వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.

ఇలా చాలా ఉంటాయి. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

*అయితే , ప్రతిదానికీ దైవాన్ని ప్రాచీన గ్రంధాలనూ విమర్శించటం తప్పు అన్నదే నా అభిప్రాయమండి.


ప్రాచీనులకు కూడా ఇప్పటి కన్నా మెరుగైన విజ్ఞానం తెలుసేమో ? కొన్ని కారణాలవల్ల ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందేమో ? అనిపిస్తుంది..
................

అణురియాక్టర్లు ప్రమాదానికి గురయినప్పుడు సీల్ చేసి వాటిని మూసివేస్తారంటారు. కానీ మామూలుగా పనిచేసే రోజుల్లో కూడా వ్యర్ధపదార్ధాలు వస్తాయట. మరి రోజూ వ్యర్ధాలుగా వచ్చే వాటిని ఏం చేస్తారన్నది ? నాకు
తెలియదండి.

ఈ పేరా వ్యాఖ్యలు చూసాక వ్రాసానండి.


Wednesday, December 7, 2011

ఈ విధంగా భావించవచ్చేమో .........



శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం చాలా గొప్పది.

శ్రీమహావిష్ణువు శ్రీవామనావతారంలో మొదట చిన్నరూపంతో కనిపించినా క్రమంగా విశ్వరూపాన్ని పొంది భూమి నుంచి అంతరిక్షం వరకూ పెరిగిన విషయం తెలిసిందే.

గీతను బోధించే సందర్భంలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ రూపాన్ని దర్శించిన తరువాత అర్జునుని ప్రార్ధనమేరకు తిరిగి మునుపటి రూపాన్నే ధరిస్తారు.

అలాగే నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి వారు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించారేమో , ప్రహ్లాదులు ప్రార్ధించగా మరల పూర్వపు రూపాన్ని ధరించి వారిని అనుగ్రహించారేమో ? అనిపిస్తుంది.

( ఈ ఆలోచన సరైనదో కాదో నాకు తెలియదు. పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )

ప్రాచీనులకు మనకన్నా ఎక్కువగా విజ్ఞానం తెలుసు అనీ , ప్రాచీన గ్రంధాలను చదివి , పైపైన ఆలోచించి అపార్ధం చేసుకోకూడదు అనీ అనిపిస్తుంది.


అప్పటివారు కొందరు కుండలలో పిండాలను భద్రపరిచి పెంచినట్లు నేను ఒక దగ్గర చదివాను. ఆ విధానం ఇప్పటి టెస్ట్ ట్యూబు బేబీ పద్ధతి లాంటిది అనిపిస్తుంది కదా !

ఇలా ఇప్పటికే చాలా విషయాల్లో , ఈ నాటి శాస్త్రవిజ్ఞానం ద్వారా ప్రాచీన గ్రంధాలలోని విషయాలు ఆచరణ సాధ్యమేనని నిరూపించబడ్డాయి.

ఈ రోజుల్లో సంతానం లేని కొందరు తల్లిదండ్రులు స్పెర్మ్ బ్యాంకుల సహాయంతో సంతానాన్ని పొందుతున్నారు. అలా పుట్టిన బిడ్డలకు వీర్యదాత ఎవరో గ్రహీతకు కూడా తెలియనివ్వరట. ఈ విధంగా స్త్రీపురుషుల సాన్నిహిత్యం లేకుండానే సంతానాన్ని పొందటం సాధ్యమే.. అని కూడా ఇప్పుడు ఋజువయ్యింది కదా !


( సృష్టిలో కొన్ని మొక్కలలో కూడా పరపరాగసంపర్కం , ఫలదీకరణం అవసరం లేకుండానే వంశాభివృద్ధి జరిగే పద్ధతి ఉంది. ఉదా....ఒక మొక్క
యొక్క ,. కొమ్మను విరిచి నేలలో పాతితే కొత్త మొక్కగా పెరుగుతుంది. )


ప్రాచీనగ్రంధాలలో..... అనివార్యకారణాలవల్ల , తప్పనిసరి పరిస్థితులలో , ఇతరపద్ధతులలో సంతానాన్ని పొందిన కొందరు వ్యక్తుల కధలు ఉంటాయి. ఈనాటి వారు కొందరు ఆ కధలను అపార్ధం చేసుకుంటారు.


నా అభిప్రాయం ఏమంటే , .........ఆ కధలలోని వ్యక్తులు , స్త్రీపురుషుల సాన్నిహిత్యం అనేది లేకుండా , పైన మనం చెప్పుకున్నటువంటి వైజ్ఞానిక పద్ధతుల ద్వారా గానీ .... లేక ....... తపశ్శక్తి, యోగశక్తితో గానీ సంతానాన్ని పొంది ఉండవచ్చు కదా అనిపిస్తుంది.

ఏమైనా ఆనాటి వాళ్ళకి మనకన్నా మెరుగైన ( సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని ) శాస్త్రవిజ్ఞానం తెలుసేమో అనిపిస్తుంది.


" శ్రీ దేవీ భాగవతము ", " శ్రీ పాద శ్రీవల్లభ  సంపూర్ణ చరితామృతము " వంటి గ్రంధములలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. నా బోటివాళ్ళకు ఆ గ్రంధములలోని కొన్ని విషయాలు అస్సలు అర్ధం కావు. కొన్ని విషయాలు అర్ధం అయినట్లుగా అనిపిస్తాయి.


కొన్ని ప్రాచీన గ్రంధములలోని కొన్ని విషయములు పైకి ఒక విధంగా అర్ధం స్ఫురిస్తూ , లోతుగా ఆలోచిస్తే వేరొక అర్ధం కూడా స్ఫురించేలా
ఉంటాయట.
 


 కొన్ని విషయాలు చదివినకొద్దీ ఎప్పటికప్పుడు కొత్త అర్ధాలు స్ఫురిస్తూ కూడా ఉంటాయట. అంచేత వాటిని చదివి మనకు తోచినట్లుగా అపార్ధం చేసుకోకూడదు.

వ్రాసిన విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.




Saturday, December 3, 2011

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు పోవటం , ఇంకా పర్యావరణానికి హాని.......

 
 
అసలు అభివృద్ధి అంటే పరిశ్రమలు విపరీతంగా పెడితే అభివృద్ధి ఉన్నట్లా ?
 పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం అంటే సహజవనరులను విపరీతంగా వినియోగించటం. సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట. సహజవనరులు అన్నీ మన అంతులేని కోరికల కోసం వాడేసుకుని రాబోయే తరాలకు ఖాళీ చిప్ప చేతికిస్తామా ? ( పొల్యూట్ అయిపోయిన ప్రపంచంతో సహా ).

* ప్రజల పేదరికం పోవాలంటే సంపద అందరికి సమానంగా అందటం ముఖ్యం. అంతేకానీ పరిశ్రమలు విపరీతంగా స్థాపించటం వల్ల అభివృద్ధి జరగదు.

ఉన్న సంపదంతా కొందరు బడావాళ్ళు అందినంతవరకూ దోచేస్తుంటే ఇక పేదరికం ఎలా పోతుంది ?

పారిశ్రామీకరణ వల్ల కొంతకాలం బాగానే ఉన్నట్లు కనిపించినా అది బలుపు కాదు వాపు అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్ధికమాంద్యం సమస్య చూస్తూనేఉన్నాము కదా !

పారిశ్రామీకరణ తప్పుకాదుకానీ , ఆధునికవిజ్ఞానాన్ని ఎంతలో వాడుకుంటే మంచిదో అంతలోనే వాడుకోవాలి. అతి పనికిరాదు.... యంత్రాలే అన్ని పనులు చేసేస్తే ఇక మనుషులకి మిగిలేది
నిరుద్యోగమే కదా!

.............


ఇది పాతటపానే. కానీ మళ్ళీ వేయాలనిపించింది.
........................
ఈ రోజుల్లో నిరుద్యోగం , ఉన్న ఉద్యోగాలు పోవటం.... ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కూడా నిరుద్యోగసమస్య వస్తోందని నా అభిప్రాయమండి.

పనులన్నీ
యంత్రములే చేసేయ్యటం వల్ల మనకి చెయ్యటానికి ఇక పనులు , ఉద్యోగాలు ఎలా వస్తాయి ?


1. పాతకాలంలో ఇప్పటిలా ఇన్ని యంత్రాలు ఉండేవి కావు. ఉదా..వాళ్ళు ఒక వస్తువును తయారుచేయాలంటే ఒక వారం రోజులు సమయం తీసుకునేవారనుకుందాము. దీనివల్ల ఆ వారమంతా రోజూ చేతి నిండా పని ఉండేది. ఇలా చెయ్యటానికి ఎప్పుడూ పని ఉంటుంది...


అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువ వస్తువులు తయారు చెయ్యలేము కాబట్టి భూమి పైన ఎక్కువ చెత్త వస్తువులు పేరుకుపోకుండా పర్యావరణం శుభ్రంగా ఉంటుంది.

2. ఈ రోజుల్లో అదే వస్తువును యంత్రాల సహాయంతో ఒక గంట సమయంలోనే ఒక వంద తయారుచేస్తున్నారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే .. పని త్వరగా అయిపోయి ఇక చేయటానికి పని ఉండదు . ( నిరుద్యోగం. )

ఇంకా , ఇలా గుట్టలుగా వస్తువులను ఉత్పత్తి చేయటం వల్ల ఖనిజనిల్వలు ఖాళీ అయిపోవటం , భూమి పైన గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వస్తువులతో ఎన్నో సమస్యలు.

.కంపెనీలు ఇలా గుట్టలుగా వస్తువులు తయారు చేస్తాయి . ఇలా గుట్టలుగా వస్తువులను తయారుచేసిన తర్వాత వాటిని ఎవరైనా కొంటేనే వారికి లాభాలు వచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరు. ఎవరూ కొనకపోతే నష్టాలు వచ్చి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేస్తారు.

అలాగని ఎవరు మాత్రం ఎంతకని వస్తువులు కొంటారు ? మనకు అప్పటికే ఇంటినిండా వస్తువులు ఉంటాయి, ఎన్నని కొంటాము ? కొత్తవి కొనేకొద్దీ ఇల్లంతా గజిబిజి .

మా ఇల్లు ఇలాగే చూసినవన్నీ కొని, అలా కొన్నవాటితో కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాటిని పారవెయ్యలేము.

పారవేసినా అవి ఎక్కడో ఒకచోట భూమిపైనే చెత్తలా ఉంటాయి గానీ మాయమయ్యేవి తక్కువ . అందుకని ఇప్పుడు ఎంతో అవసరమయితే తప్ప , కొత్తవి కొనటం మానేసామండి.

ఎవరికయినా కొంతకాలానికి ఇలాగే విరక్తి వస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే

1. వస్తువులను ఎవరూ కొనకపోతే , కంపెనీలకు నష్టం వచ్చి అందులోని వారికి ఉద్యోగాలు పోతాయి.

2. వస్తువులను కొంటే కంపెనీలకు లాభాలు వచ్చి ఉద్యోగాలు ఉంటాయి. కానీ భూమి ,పర్యావరణం మట్టికొట్టుకుపోతాయి.


3.అందుకే నాకు ఏమనిపిస్తుందంటేనండి ,పారిశ్రామీకరణ పూర్తిగా తప్పని అనటం లేదు. దానివల్ల కొన్ని లాభాల ఉన్నాయి. అయితే , మనకి కావలసినంత అంటే , మనిషి చేయలేని కష్టమయిన పనులకు యంత్రములను వాడుకోవాలి .

4. గుట్టలుగా వస్తువులను తయారుచేయటం మానాలి.

5. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

6. అంతగా వస్తువులు తయారుచేయటం అవసరం లేని ...... అర్ధ శాస్త్రం , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , పర్యాటకం , ఆటలు , సంగీతం, వినోదం ఇలాంటివాటితో ఆర్ధికాభివృద్ధిని సాధించటానికి ప్రయత్నించాలి.

ఈ వినోదం లాంటివి మితిమీరి ప్రజలు తప్పుదారిన వెళ్ళకుండా , వారిలో సోమరితనం పెరగకుండా చూడాలి .

దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా కొత్త వస్తువులు కొనాలన్న మోజు , ఇలా ... మన కోరికలను కొంచెము తగ్గించుకోవాలి..

దైవభక్తి , ఇలాంటి వాటి విషయంలో తప్ప ..ప్రతి పనికీ ఒక పరిధి ( లిమిట్ ) ఉంటుంది. ఉదా..ఆరోగ్యానికి మంచిది కదా అని విటమిన్ టాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటే అనారోగ్యం కలుగుతుంది.

అలాగే పెద్దలు చెప్పినట్లు , దేనినయినా ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.. యంత్రములను వీలయినంత తగ్గించటం వల్ల అందరికీ పని దొరికే అవకాశం ఉంది. పర్యావరణం బాగుంటుంది.

* ఇంకా , మనము ఒళ్ళు వంచి పనులు చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.