ఓం
గురువులకు వందనములు.
************
సృష్టి అంతటా దైవం ఉంటారు కాబట్టి, దైవాన్ని నిరాకారంగానో లేక ఏ రాయినో రప్పనో దైవంగా భావించి దృఢంగా నమ్మి ఆరాధించినా కూడా దైవశక్తి అనుభవంలోకి వస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు. కొందరు చెట్లను కూడా దైవంగా ఆరాధిస్తారు.
దైవశక్తి అద్భుతమైన శక్తి. దైవము ఏ విధంగానైనా ఉండగలరు. రూపం లేకుండాను, ఏ రూపంతోనైనా.. ఎలాగైనా ఉండగలరు.
వేదములలో విగ్రహారాధన లేదని కొందరు అంటున్నారు. దైవము స్వయంభువుగా విగ్రహరూపంలో వెలిశారని చెబుతారు. చాలామందికి దైవాన్ని విగ్రహరూపంలో ఆరాధించుకుంటే దైవాన్ని చూసినట్లుగా భావించి ఆరాధించుకుంటారు. ఆ విధంగా విగ్రహారాధన చేస్తారు.
అయితే, విగ్రహారాధన పేరుతో మూఢనమ్మకాలను, విపరీత ధోరణిని పెంచుకోకూడదు.
ఇవన్నీ గమనిస్తే, నాకు ఏమనిపిస్తుందంటే, హిందువులకు దైవాన్ని ఎలా ఆరాధించుకోవాలనే విషయం గురించి స్వేచ్చ ఉంది. దైవాన్ని నిరాకారంగా ఆరాధించుకోవచ్చు, ఇంకా విగ్రహరూపంలో కూడా ఆరాధించుకోవచ్చు.
హిందువులు చాలామంది అనేక దేవతారూపాలను ఆరాధిస్తారు. అమ్మవారు, శివుడు, విష్ణువు..ఇలా.. చక్కగా ఆరాధించుకుంటారు. అయితే, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు..అని కూడా విభాగాలు ఉన్నాయి. వీరిలో కొందరు మా దేవతారూపమే గొప్ప అని అనేవారూ ఉన్నారు..
పరమశివుడు విష్ణుమూర్తికి వరాలనిచ్చినా, విష్ణుమూర్తి పరమశివునికి వరాలనిచ్చినా, అమ్మవారు వరాలనిచ్చినా..వారి పట్ల ఎక్కువతక్కువ అనుకోకూడదు. అందరూ ఒకే పరమాత్మ శక్తిగా ఆరాధించుకోవాలి.
అనేక దేవతారూపాలను ఆరాధించేటప్పుడు పండుగలు, పూజలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. అన్నిరూపాలు కాకుండా, ఏకాగ్రతగా ఒకే రూపాన్ని ఆరాధించుకోవాలంటే ఒకే దేవతారూపాన్ని కూడా ఆరాధించుకోవచ్చు.
*************
వ్యాసపూర్ణిమ సందర్భముగా వ్యాసమహర్షిని పూజిస్తారు. వ్యాసులవారు ఎన్నో పురాణాలను, శ్రీదేవీభాగవతాన్ని కూడా రచించారు. గ్రంధాలద్వారా ఎన్నో విషయాలను తెలియజేసారు.
వ్యాసమహర్షిని పూజించటంతోపాటు, వారు తెలియజేసిన విషయాలను కూడా గౌరవించాలి.
ప్రాచీనగ్రంధాలలో..దేవతల మధ్య భేదభావంతో.. మేము పూజించే దేవతారూపమే గొప్ప అంటూ ఒకరితోఒకరు గొడవలు పడమని చెప్పలేదు.
ప్రాచీనులు తెలియజేసిన విషయాలను పట్టించుకోకుండా శైవులు, వైష్ణవులు..అంటూ కొందరిమధ్యన కొన్ని గొడవలు జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
హిందుత్వం చక్కగా ఉండాలంటే హిందువులు అనేక వర్గాలుగా విడిపోకుండా ఐకమత్యంగా ఉండాలి.
హిందువులు అందరూ తాము పూజించే దేవతారూపాలు అందరూ ఒకే పరమాత్మశక్తి అనే భావనతో దైవాన్ని ఆరాధించుకుంటూ ఐకమత్యంగా ఉంటే బాగుంటుంది. ఐకమత్యంగా ఉండటం తప్పనిసరి పరిస్థితి.
**************
ఒకే మతంలోని వారు కూడా గొడవలు పడటాన్ని గమనిస్తే, వారు వారి ఉనికికొరకు అలా చేస్తారనిపిస్తుంది. ఎవరి ఉనికికొరకు వారు తాపత్రయపడటంలో తప్పులేదు కానీ, తమయొక్క ఉమ్మడి మతం యొక్క ఉనికిని దెబ్బతీయకూడదు.
సనాతనధర్మం వర్ధిల్లాలంటారు... అలా అనేవారు కూడా వివిధ వర్గాలుగా చీలి, మేము పూజించే దైవమే గొప్ప, ఎదుటివర్గం వారు తాముపూజించే దేవతలను తక్కువచేసి మాట్లాడారు..అంటూ వాదవివాదాలు చేస్తుంటారు. ఇలాంటి గొడవల వల్ల అందరికీ నష్టమే తప్ప, లాభం ఉండదు.
**********
హిందువులు పాటిస్తున్న కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని మూఢాచారాలు ప్రవేశించాయి. వాటి వల్ల కూడా నష్టం జరుగుతోంది. హిందువులలో ఉన్న మూఢత్వం పోవాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
కొందరు దైవానికి కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు..మొదలైనవాటిని సమర్పిస్తారు. కొందరు బంగారునగలను కూడా సమర్పిస్తారు. అయితే ఎన్ని సమర్పించినా కూడా, దైవకృప లభించాలంటే నీతినియమాలను పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించటం అవసరం.
పాపాలు చేస్తూ బంగారునగలు సమర్పించటం ఎందుకు.. బంగారు గనులనే సృష్టించిన దైవానికి బంగారు నగలకు లోటేమిటి?
అయితే, చంటిపిల్లలు తమ తల్లితండ్రికి ప్రేమతో ఒక పండు ఇస్తే తల్లితండ్రి ఎంతో ఆనందిస్తారు.. అలాగే భక్తులు ధర్మబద్ధంగా జీవిస్తూ..దైవానికి స్వచ్చమైన ప్రేమతో పువ్వులు, పండ్లు, నీరు.. వంటివి సమర్పిస్తే అది కొద్దిగా అయినా సరే, దైవం కూడా ప్రీతి చెందుతారు.
**************
ఇతరమతములవారు కొందరు హిందువులను తమమతాలలోకి మార్చటానికి నయానా, భయానా ప్రయత్నించటం సరైనది కాదు.
ఎవరిమతాన్ని వారు పాటించవచ్చు. అంతేకానీ, మతాలు మారనివారిని ఎంతకష్టపెట్టి అయినా మార్చాలని కొందరు భావిస్తుంటారు. అలాంటి అభిప్రాయాలు మారాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. కొందరు క్రూరత్వంతో ఉంటారు. ఆ క్రూరత్వం నశించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
అంతా మంచిగా ఉండాలని, అన్ని జీవులు మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.