koodali

Monday, May 8, 2017

తల్లితండ్రుల నిర్లక్ష్యము ..


 
కొందరు బంధువులు, కొందరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు, ఆఫీసుల్లో ..కొందరు ఎలా ఉంటారంటే, ప్రక్కవాళ్ళ  ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రక్కవాళ్ళ వస్తువులను వాడేసుకుంటూ ఉంటారు.

ప్రక్కవాళ్లు తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిల్ నోటికి కరచుకుని త్రాగేస్తుంటారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను ఖాళీ చేస్తుంటారు. అదేమిటంటే షేరింగ్ అంటారు.

అవసరమైనప్పుడు ఇతరులకు సహాయపడటం ఎంతో అవసరమే,  అలాగని అదేపనిగా ఇతరుల వస్తువులను వాడేసుకోవటం షేరింగ్ అనిపించుకోదు.


పెద్దవాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు ఇక చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది.

కొందరు పెద్దవాళ్లు పిల్లలకు స్కూలుకు వాటర్ బాటిల్స్ పంపరు.
పిల్లలు దాహం వేసినప్పుడు తోటి పిల్లల వద్ద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీరు త్రాగుతారు.

ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, తాను తెచ్చుకున్న బాటిల్ నీళ్ళు ప్రక్కవాళ్లు త్రాగేయటం వల్ల తనకు దాహం వేసినప్పుడు త్రాగటానికి పిల్లలకు నీళ్ళుండవు.


ఇది వినటానికి కొందరికి చిన్నసమస్యగా అనిపించవచ్చు. కానీ ఇది పెద్ద సమస్య.

ఒకే స్పూన్ తో పదార్ధాన్ని షేర్ చేసుకోవటం, ఒకరు త్రాగిన బాటిల్ నోటికి కరచుకుని ఇంకొకరు త్రాగటం వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

 ప్రక్క వాళ్లు దాహంగా ఉంది బాటిల్  ఇవ్వవా..అని అడిగినప్పుడు ఇవ్వనంటే స్నేహం చెడిపోయే అవకాశం ఉంది..అలాగని బాటిల్ ఇస్తే తనకు దాహం అయినప్పుడు నీళ్ళు లేకపోవచ్చు.


 అప్పుడప్పుడు ప్రక్కవాళ్ళు పొరపాటున మంచినీళ్లు ఇంటినుండి తెచ్చుకోవటం మరిచిపోయినప్పుడు ప్రక్కవాళ్ళకు కొంతనీరు ఇవ్వటం సరైనదే.

మనమూ  అప్పుడప్పుడు ఇంటినుండి నీళ్ళు తెచ్చుకోవటం మరిచిపోవటం జరుగుతుంది.

అయితే, ఎవరో ఒకరు ఇస్తారులే అనుకుని ఇంటినుండి నీళ్లు తెచ్చుకోవటం మాని,  రోజూ ప్రక్కవారి దగ్గర్నుంచి మంచినీళ్లు తీసుకోవటం అలవాటయితే మాత్రం అది  సరైనది కాదు.

ఇలాంటివాటికి పెద్దవాళ్ళయిన తల్లితండ్రుల బాధ్యతారాహిత్యము, నిర్లక్ష్యమే కారణం. పిల్లలకు అవసరమైన వాటిని అమర్చవలసిన బాధ్యత తల్లితండ్రులది.

ఈ విషయం మంచినీళ్ల సీసా వరకూ మాత్రమే పరిమితం కాదు. అన్ని విషయాలకూ వర్తిస్తుంది.

ప్రక్కవాళ్ళ ఇబ్బందిని  పట్టించుకోకుండా తన అవసరాలను మాత్రం తీర్చుకునే విధంగా తయారవుతారు.



 అలాగని ఎప్పుడైనా మంచినీళ్ళ సీసా తెచ్చుకోవటం పొరపాటున మర్చిపోతే,  ప్రక్కవాళ్ళను అడిగితే బాగుండదనుకుని మొహమాటపడుతూ ....అలాగే దాహంతో అల్లాడటం కూడా సరైనది కాదు.

ఇలాంటప్పుడు ప్రక్కవారిని అడిగి దాహం తీర్చుకోవటం సరైనది.

అయితే, తరువాత తన మంచినీళ్ల బాటిల్ తాను ఇంటినుండి మర్చిపోకుండా తెచ్చుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి.

అప్పుడప్పుడు మర్చిపోవటం ఎవరికైనా జరిగేదే.ఒకరి కష్టంలో ఒకరు సహాయపడటం ఎంతో అవసరం.

 ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తాము బిజీగా ఉన్నామంటూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు.

 పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా, వారి ఖర్మకు వారిని వదిలి వేసే తల్లిదండ్రుల వల్ల సమాజానికి ఎంతో నష్టం కలుగుతుంది.


ఎవరి పిల్లల్ని వారు సరిగ్గా పెంచటం వల్ల కుటుంబాలు తద్వారా సమాజమూ బాగుంటాయి.

 
పిల్లలను మానసికంగా, శారీరికంగా చక్కటి ఆరోగ్యవంతులు, నైతికవిలువలతో పెంచి.. చక్కటి పౌరులుగా తీర్చిదిద్దితే సమాజంలో ఎన్నో సమస్యలు  తగ్గిపోతాయి.  ఇలాంటి తల్లిదండ్రులు ధన్యులు.


No comments:

Post a Comment