koodali

Friday, May 12, 2017

యుద్ధాలు వంటివి లేకుండా..

 
వ్యక్తులకు.. అసూయాద్వేషాలు , పంతాలు, పట్టుదలలు, అధికారం కోసం యుద్ధాలు జరగటం..మొదలైనవి కధల ద్వారా వినటానికి,చదవటానికి..ప్రేక్షకులకు ఆసక్తిగా ఉంటాయి. వినోదాన్ని కలిగిస్తాయి.

అయితే, యుద్ధాలు నిజంగా జరిగితే మాత్రం తట్టుకోవటం చాలా కష్టం. 

 యుద్ధాలు సంభవిస్తే ఎందరో ప్రజలతో పాటూ ఎన్నోమూగజీవులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.

పురాణేతిహాసాలలో కూడా ఎన్నో యుద్ధాల గురించి వివరాలున్నాయి.

వ్యక్తుల అసూయాద్వేషాల వల్ల యుద్ధాలు మొదలై ఆ యుద్ధాలలో ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోవటం, తద్వారా ఎన్నో కుటుంబాలు కష్టాలు పాలవ్వటం .. సమాజం నష్టపోవటం గురించి తెలుస్తుంది.



కొందరు వ్యక్తుల స్వార్ధం, అత్యాశ, అధికార దాహం..వంటి కారణాల వల్ల దేశాల మధ్య యుద్ధాలు మొదలవుతాయి.

కొద్దిమంది వ్యక్తుల వల్ల ఎందరో కష్టాలు పడటం అత్యంత బాధాకరం.

అయితే, ఇంకో విషయం ఏమిటంటే, సమాజంలో అధర్మం పెరిగిపోయినప్పుడు పాపభారం తగ్గటానికి యుద్ధాలు మొదలై ఎంతో ప్రాణనష్టం జరుగుతుందనీ అంటారు.

యుద్ధాలు వంటివి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అందరూ ధర్మమార్గాన ప్రవర్తించటానికి ప్రయత్నించాలి.


Monday, May 8, 2017

తల్లితండ్రుల నిర్లక్ష్యము ..


 
కొందరు బంధువులు, కొందరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు, ఆఫీసుల్లో ..కొందరు ఎలా ఉంటారంటే, ప్రక్కవాళ్ళ  ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రక్కవాళ్ళ వస్తువులను వాడేసుకుంటూ ఉంటారు.

ప్రక్కవాళ్లు తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిల్ నోటికి కరచుకుని త్రాగేస్తుంటారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను ఖాళీ చేస్తుంటారు. అదేమిటంటే షేరింగ్ అంటారు.

అవసరమైనప్పుడు ఇతరులకు సహాయపడటం ఎంతో అవసరమే,  అలాగని అదేపనిగా ఇతరుల వస్తువులను వాడేసుకోవటం షేరింగ్ అనిపించుకోదు.


పెద్దవాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు ఇక చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది.

కొందరు పెద్దవాళ్లు పిల్లలకు స్కూలుకు వాటర్ బాటిల్స్ పంపరు.
పిల్లలు దాహం వేసినప్పుడు తోటి పిల్లల వద్ద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీరు త్రాగుతారు.

ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, తాను తెచ్చుకున్న బాటిల్ నీళ్ళు ప్రక్కవాళ్లు త్రాగేయటం వల్ల తనకు దాహం వేసినప్పుడు త్రాగటానికి పిల్లలకు నీళ్ళుండవు.


ఇది వినటానికి కొందరికి చిన్నసమస్యగా అనిపించవచ్చు. కానీ ఇది పెద్ద సమస్య.

ఒకే స్పూన్ తో పదార్ధాన్ని షేర్ చేసుకోవటం, ఒకరు త్రాగిన బాటిల్ నోటికి కరచుకుని ఇంకొకరు త్రాగటం వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

 ప్రక్క వాళ్లు దాహంగా ఉంది బాటిల్  ఇవ్వవా..అని అడిగినప్పుడు ఇవ్వనంటే స్నేహం చెడిపోయే అవకాశం ఉంది..అలాగని బాటిల్ ఇస్తే తనకు దాహం అయినప్పుడు నీళ్ళు లేకపోవచ్చు.


 అప్పుడప్పుడు ప్రక్కవాళ్ళు పొరపాటున మంచినీళ్లు ఇంటినుండి తెచ్చుకోవటం మరిచిపోయినప్పుడు ప్రక్కవాళ్ళకు కొంతనీరు ఇవ్వటం సరైనదే.

మనమూ  అప్పుడప్పుడు ఇంటినుండి నీళ్ళు తెచ్చుకోవటం మరిచిపోవటం జరుగుతుంది.

అయితే, ఎవరో ఒకరు ఇస్తారులే అనుకుని ఇంటినుండి నీళ్లు తెచ్చుకోవటం మాని,  రోజూ ప్రక్కవారి దగ్గర్నుంచి మంచినీళ్లు తీసుకోవటం అలవాటయితే మాత్రం అది  సరైనది కాదు.

ఇలాంటివాటికి పెద్దవాళ్ళయిన తల్లితండ్రుల బాధ్యతారాహిత్యము, నిర్లక్ష్యమే కారణం. పిల్లలకు అవసరమైన వాటిని అమర్చవలసిన బాధ్యత తల్లితండ్రులది.

ఈ విషయం మంచినీళ్ల సీసా వరకూ మాత్రమే పరిమితం కాదు. అన్ని విషయాలకూ వర్తిస్తుంది.

ప్రక్కవాళ్ళ ఇబ్బందిని  పట్టించుకోకుండా తన అవసరాలను మాత్రం తీర్చుకునే విధంగా తయారవుతారు.



 అలాగని ఎప్పుడైనా మంచినీళ్ళ సీసా తెచ్చుకోవటం పొరపాటున మర్చిపోతే,  ప్రక్కవాళ్ళను అడిగితే బాగుండదనుకుని మొహమాటపడుతూ ....అలాగే దాహంతో అల్లాడటం కూడా సరైనది కాదు.

ఇలాంటప్పుడు ప్రక్కవారిని అడిగి దాహం తీర్చుకోవటం సరైనది.

అయితే, తరువాత తన మంచినీళ్ల బాటిల్ తాను ఇంటినుండి మర్చిపోకుండా తెచ్చుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి.

అప్పుడప్పుడు మర్చిపోవటం ఎవరికైనా జరిగేదే.ఒకరి కష్టంలో ఒకరు సహాయపడటం ఎంతో అవసరం.

 ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తాము బిజీగా ఉన్నామంటూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు.

 పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా, వారి ఖర్మకు వారిని వదిలి వేసే తల్లిదండ్రుల వల్ల సమాజానికి ఎంతో నష్టం కలుగుతుంది.


ఎవరి పిల్లల్ని వారు సరిగ్గా పెంచటం వల్ల కుటుంబాలు తద్వారా సమాజమూ బాగుంటాయి.

 
పిల్లలను మానసికంగా, శారీరికంగా చక్కటి ఆరోగ్యవంతులు, నైతికవిలువలతో పెంచి.. చక్కటి పౌరులుగా తీర్చిదిద్దితే సమాజంలో ఎన్నో సమస్యలు  తగ్గిపోతాయి.  ఇలాంటి తల్లిదండ్రులు ధన్యులు.


Saturday, May 6, 2017

కొన్ని విషయాలు ..

  
ఈ రోజుల్లో చాలామంది ప్రజలలో బాధ్యతారాహిత్యం పెరిగింది. తమ స్వార్ధమే తప్ప సమాజం ఏమైనా ఫర్లేదు..అనే పరిస్థితి కనిపిస్తోంది. 

ఇలాంటి వాళ్ళను చూస్తే, ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం గురించి కూడా కొన్నిసార్లు నిరాశగా అనిపిస్తుంది. 

అవినీతి పనులు చేసైనా సరే , బాగా డబ్బు సంపాదించి, విలాసవంతంగా జీవించాలనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో పర్యావరణాన్నీ పాడుచేస్తున్నారు. 

సమాజంలో దోపిడీ బాగా పెరిగింది. సహజవనరులను కొల్లగొడుతున్నారు. 
సహజవనరుల డోపిడీకి వ్యతిరేకంగా చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు. 

అయితే, దోపిడీదారులు ఎవరికీ భయపడకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. 
ఉదాహరణకు.. ఎర్రచందనం ప్రజలకు చెందవలసిన సంపద. వీటిని కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 

సమాజంలో ఎన్నో రంగాలలో నైతికత తగ్గిపోయింది. కొందరు లంచాలు తీసుకుంటున్నారు. మరికొందరు డబ్బు సంపాదన కోసం కల్తీ వస్తువులు అమ్ముతున్నారు. 

కొందరు చదువు పేరుతో  ఎక్కువ ఫీజులు దండుకుంటున్నారు. అనారోగ్యమని తెలిసినా హానికారకపదార్ధాలతో పండ్లను మగ్గబెడుతున్నారు కొందరు. 


మద్యం, అశ్లీలత.. వంటివి కూడా సమాజానికి అనర్ధదాయకం. ఇలాంటివి సమాజానికి అందిస్తున్నవారు కూడా పాపాలు చేస్తున్నవారే.

అదీఇదీ అని కాదు, ఎన్నో విషయాలలో అనైతికత  ఎక్కువయింది.


చిన్నపెద్ద అనితేడా లేకుండా చాలామందిలో ..  డబ్బు సంపాదన తో పాటు అధికారవ్యామోహం, పంతాలు పట్టింపులు, అహంకార మమకారాల వంటి వాటి వల్ల.. చాలా విషయాలలో సమస్యలు వస్తున్నాయి. 

ప్రజలలో నైతికవిలువలు పెంపొందినప్పుడు..  అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. 

అన్ని రంగాలలోనూ మంచి వాళ్ళూ ఉంటారు, చెడ్ద వాళ్ళూ ఉంటారు. 

అయితే, అనైతిక పనులతో సమాజానికి ద్రోహం చేస్తున్న వారు దైవం ఇచ్చే తీర్పు నుండి తప్పించుకొలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.


Monday, May 1, 2017

గొడవలు లేకుండా అందరూ బాగుండాలని ....


ఇలాంటి సున్నితమైన విషయాలు రాయాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ విషయాల గురించి రాయాలనిపించింది.  

  సైనికులు, పోలీసులు....నక్సలైట్లు..వీళ్ళ మధ్య కాల్పులు జరిగి.... కొందరు మరణించటం అనేది ఎంతో బాధాకరమైన పరిస్థితి.ఈ పరిస్థితి మారాలని ఎందరో కోరుకుంటున్నారు.

 సైనికులు, పోలీసులు ..వీళ్లలో కూడా చాలామంది పేద కుటుంబాల నుంచీ వచ్చిన వారు  ఉంటారు. 

 ప్రజలకు మేలు చేయాలనే విధినిర్వహణలో వీళ్ళు కుటుంబాలకు దూరంగా ఎన్నో కష్టాలను భరిస్తూ దినదినగండంగా పనిచేయాలంటే  ఎంతో  కష్టం. 

 సైనికులు మరణించినప్పుడు టీవీలో వారి కుటుంబాలను చూపిస్తుంటారు. వీళ్ళలో  కొందరివి పేదకుటుంబాలు. 

 మాకు కొద్దిగా పరిచయమున్న కుటుంబం గురించి చెబుతాను. ఇద్దరు  అన్నదమ్ముల  కుటుంబాలు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు.

అన్న సైన్యంలో పనిచేస్తుంటే , తమ్ముడు ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. 

అన్న కొడుకుకు (చిన్నపిల్లవాడికి)  కిడ్నీ సమస్య వచ్చింది. బాబాయి ఆ పిల్లవాడిని డాక్టరు వద్దకు  తీసుకువెళ్తుండేవాడు.

అన్న అప్పుడప్పుడు సెలవుపై వచ్చి పిల్లవాడిని డాక్టర్కు చూపించి, కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చి తిరిగి సైన్యంలో విధులకు వెళ్లేవాడు. 

 అయితే, కొంతకాలం క్రిందట తమ్ముడు ఏవో అప్పుల  సమస్యతో ఆత్మహత్య చేసుకున్నాడట. అన్న వచ్చి కొంతకాలం ఉండి డ్యూటీకి వెళ్ళిపోయాడు.

 తమ్ముడు చనిపోయినా, కొడుకు జబ్బుతో బాధపడుతున్నా..డ్యూటీకి వెళ్ళక తప్పదు కదా! 

సైన్యంలో ఉద్యోగం మానేద్దామనుకుంటే, ఊళ్ళో ఇప్పటికిప్పుడు ఉపాధి దొరకాలంటే..ఈ రోజుల్లో కష్టంగా ఉంది కదా! 

 నక్సలైట్లు ..వీళ్లలో కూడా చాలామంది పేద కుటుంబాల నుంచీ వచ్చిన వారు ఉంటారు. 

  ప్రజల మేలు కోసం పనిచేస్తామంటారు. కుటుంబాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో ఎన్నో కష్టాలను భరిస్తూ దినదినగండంగా బ్రతకాలంటే ఎంతో కష్టం. 

 పోలీసులు అయినా, సైనికులు అయినా,  నక్సలైట్లు అయినా..అందరికీ కుటుంబసభ్యులు ఉంటారు. ఎవరు మరణించినా వారి కుటుంబసభ్యులు ఎంతో బాధపడతారు.

 నక్సలైట్లు వారి కుటుంబాలు, గిరిజనులు వారి కుటుంబాలు, సైనికులు వారి కుటుంబాలు, పోలీసులు వారి కుటుంబాలు..సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!

 నక్సలైట్లు జనజీవనస్రవంతిలోకి వచ్చి , ఎన్నికలలో పాల్గొనవచ్చు. గెలిస్తే ప్రజల మేలు కోసం  మరిన్ని కొత్త సంస్కరణలు తేవచ్చు.  

ఎన్నికలలో  పాల్గొనటం  ఇష్టం  లేకుంటే   ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సహాయం చేయవచ్చు.

 ఉదా..కొందరు ఆదర్శవంతమైన వ్యక్తులు ఏ అధికారం లేకపోయినా ప్రజలను కూడగట్టి తమ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సంఘటనలు జరుగుతున్నాయి.

 ****************
 అన్ని రంగాలలోనూ మంచి వాళ్ళూ ఉంటారు, చెడ్ద వాళ్ళూ ఉంటారు.

ధనవంతులలో కూడా  మంచి పనులు చేసే వాళ్ళుంటారు. ధనవంతులైనా, పేదవారైనా మంచిగా ఉండటమే   మంచిది.
************************
 ప్రపంచంలో అందరూ గొడవలు లేకుండా సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!