koodali

Monday, December 9, 2013

యయాతి..దేవయాని...శర్మిష్ఠ....కొన్ని విషయాలు..


యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి ...బహుశా   యయాతి  శర్మిష్ఠను  గాంధర్వ  వివాహం  చేసుకుని  ఉండవచ్చుననిపిస్తోందండి.
శుక్రుని   శాపం యయాతికి  మాత్రమే  కాదు  శర్మిష్ఠకూ  శాపమే. శర్మిష్ఠ  కుమారుడు  పురు  తండ్రి  యొక్క  వృద్దాప్యాన్ని  స్వీకరించాడు.
 కుమారుడు  వృద్దాప్యంతో  బాధపడుతుంటే  అతని  యవ్వనాన్ని  స్వీకరించినా  సరే  ....తల్లితండ్రి  ఏ  విధంగా  సుఖంగా  ఉండగలరు ? 


ఆ  విధంగా  శుక్రుని  శాపం  వల్ల    శర్మిష్ఠ  యయాతి  ఇద్దరూ   మనశ్శాంతిని  కోల్పోవటమే  జరిగింది.

.........................................

  పూర్వం  ఎక్కువమంది  సంతానం  ఉన్న  తల్లితండ్రులను  అదృష్టవంతులుగా  భావించేవారు. అందువల్ల  ఎక్కువమంది  సంతానాన్ని  పొంది  వంశాభివృద్ధి  జరగాలనే  ఉద్దేశంతో ....... ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న  విశ్వాసాన్ని  ప్రచారం  చేసి  ఉండవచ్చు.


 అలాగని  స్త్రీ  పరపురుషునితో  సంతానాన్ని  పొందవచ్చు  అనేది  పెద్దలు  అభిప్రాయం  కానేకాదు.

ఈ   విషయంలో  ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు ..అనే  విషయం  స్పష్టంగా  ఉంది.


వివాహసమయంలో  ధర్మార్ధకామములో .... నాతిచరామి  అని  వరునితో  ప్రమాణం  చేయిస్తారు. వివాహం  అయిన  స్త్రీ  భర్తనే  దైవంగా  భావించాలి.  పరపురుషుని  సోదరునిలా  భావించాలి  వంటి    ధర్మాలను  బోధించారు.

పై  విషయాలను  గమనించితే,   స్త్రీలు  పురుషులు   కట్టుబాట్లు  లేకుండా   తమకు   ఇష్టం  వచ్చినట్లు  పరాయి  వారితో  సంతానాన్ని  పొందవచ్చని  పెద్దల అభిప్రాయం  కాదని  చక్కగా  తెలుసుకోవచ్చు.

అయితే  భర్త  వల్ల  సంతానాన్ని  పొందలేని    కొన్ని  ప్రత్యేక  పరిస్థితిలో   కొందరు  స్త్రీలు  ఇతరుల   వల్ల  సంతానాన్ని  పొందినట్లు  పురాణాలలో  ఉంది.    ఉదా...కుంతీదేవి,  మాద్రి  దేవి  భర్త  అనుమతితోనే  పాండవులను  పొందారు. 


 ఈ  రోజుల్లో  కూడా  కొందరు  తల్లితండ్రులు  స్పెర్మ్ బ్యాంకుల  సాయంతో  సంతానాన్ని  పొందుతున్నారు  కదా  ! 
...............................................


.ఋతుకాలంలో ధర్మం తప్పకుండా  అన్నదానికి  ఋతుకాలధర్మం తప్పకుండా   అన్నదానికి  చాలా  తేడా  ఉందండి.   గ్రంధాలలో  ఋతుకాలంలో ధర్మం తప్పకుండా  అని  ఉండిఉంటుంది.  



ఉదా...వ్యాస  జననం  సందర్భములో సత్యవతి  దేవి  మరియు  కర్ణుని  జననం  అప్పుడు  కుంతీదేవి  తమ   కన్యాత్వాన్ని  కోల్పోలేదని  చెప్పబడింది. 


 అంటే  ఇప్పటి  టెస్ట్  ట్యూబ్  పద్ధతిని  మించిన  విజ్ఞానం   ఆ  రోజుల్లోనే  ఉండిఉండవచ్చు.  


 ఆ  రోజుల్లో   మంత్రశక్తితో  స్త్రీలకు  సంతానాన్ని  ప్రసాదించే  శక్తి  గల  మహర్షులు    కూడా   ఉండేవారన్న  విషయం   కూడా  గ్రంధాల  ద్వారా   తెలుస్తోంది.
............................................


సంతానం  పొందాలంటే    భార్యాభర్త    శారీరిక  సంబంధముతో  సంబంధం  లేని  పద్ధతులు  ఆ  రోజుల్లో  ఉండేవన్న  విషయానికి  ఒక  ఉదాహరణ..


ఉపరిచరవసువు  అనే  రాజు  కధలో ......అత్యవసరమైన  పని  మీద  బయటకు  వెళ్ళిన  రాజు    తన  వీర్యాన్ని  దొన్నెలో  భధ్రపరిచి    పెంపుడు   డేగకు  ఇచ్చి   తన  భార్య  అయిన  గిరికకు  అందజేయమని   పంపిస్తాడు. 

 ఆ  డేగ  ఆకాశం లో  వెళ్తుండగా  వేరొక  డేగ    ఆ  దొన్నెను  మాంసపు  ముక్కగా  భ్రమిస్తుంది.  రెండు  పక్షులకు  జరిగిన  గొడవలో  దొన్నె  నదిలో  పడిపోగా  ,   దొన్నెలోని  పదార్ధాన్ని  మ్రింగిన   ఒక  చేప  గర్భాన్ని  ధరిస్తుంది. ( ఒక  అప్సరస   శాపవశాత్తు  చేపగా  మారింది.)


 కొంతకాలానికి   వలలో  పడిన  చేపను   చేపలవాళ్ళు  కోయగా  ఇద్దరు  బిడ్డలు  బయటపడతారు. ఆ   అమ్మాయే  వ్యాసుని  తల్లి  అయిన  సత్యవతీదేవి .

  పై సంఘటనలను  గమనిస్తే,    సంతానాన్ని    పొందాలంటే    భార్యాభర్త    శారీరిక  సంబంధముతో  సంబంధం  లేని  పద్ధతులు  కూడా   ఆ  రోజుల్లో  ఉండేవన్న   విషయం  తెలుస్తుంది. 

......................................

  సమాజంలో  పెద్దలు  చెప్పిన  ఎన్నో  విషయాలను  ప్రజలు  సరిగ్గా  అర్ధం  చేసుకోకపోవటం  లేక  తమ  ఆశలకు,  అవసరాలకు  అనుగుణంగా  పూర్వీకులు  చెప్పిన  విషయాలను  మార్చేయటం  పూర్వమూ  జరిగి  ఉంటుంది  ఇప్పుడూ  జరుగుతోంది  అని  స్పష్టంగా   చెప్పుకోవచ్చు.

ఋతుకాలోచితం విషయంలో  కూడా  పెద్దలు  చెప్పిన  విషయాన్ని  సరిగ్గా  అర్ధం  చేసుకోని  పూర్వీకులు  తమ  భార్యను  అతిధికి  సమర్పించే  ఆచారాన్ని  కొంతకాలం  పాటించి  ఉండవచ్చు.  


   ఉదా....శ్వేతకేతుని  కాలంలో  ఇలాంటి  మూఢాచారాలు  కొంతకాలం  ఉండి  ఉంటాయి.  అది  అధర్మమని  గ్రహించిన  ప్రజలు  క్రమంగా  ఆ  ఆనవాయితీలను  విడిచిపెట్టి  ఉంటారు.

మన  పెద్దలు   వివాహాన్ని   పవిత్రంగా  భావించారు.  ఒక  స్త్రీ  ఒక  పురుషుడు  లెక్కనే   జంట  అని  అంటారు . అర్ధనారీశ్వర  తత్వాన్ని  భార్యాభర్తగా  భావిస్తారు.  ఈ   విషయాలను  గమనించితే    భార్య  లేక  భర్త  బోలెడు  వివాహాలు  చేసుకోవాలన్నది  పెద్దల  అభిప్రాయం  కాదని  స్పష్టంగా  తెలుస్తోంది.

  పాతకాలంలో  కానీ  ఇప్పటి  కాలంలో  కానీ     స్త్రీలు పురుషులు  ఒకటి  కంటే  ఎక్కువ    వివాహాలను  చేసుకున్నారంటే  వారి  అవసరాల  కోసం  మాత్రమే.  పెద్దలు  దీనికి  బాధ్యులు  కాదు.

..................................................


 భర్త  వల్ల  సంతానాన్ని  పొందలేని  పరిస్థితిలో  ఉన్న  స్త్రీలకు  మాత్రమే  భర్త అనుమతితో     ఇతరులతో  సంతానాన్ని  పొందే  అవకాశం   ఉండి  ఉంటుంది. ఇంకా  భర్త  లేని  స్త్రీలకు  కూడా  ఇతరులతో  సంతానాన్ని  పొందే  అవకాశం   ఉండి  ఉంటుంది.

  ఇక్కడ  శర్మిష్ఠకు  వివాహం  కాలేదని,  భర్త  లేడని    దేవయాని  అభిప్రాయం  కాబట్టి  శర్మిష్ఠ  ఎవరైనా  ముని  వల్ల  సంతానాన్ని  పొందినదా  ?  లేక  యయాతి  వల్లనా  ? అనే  సందేహంతో  దేవయాని  శర్మిష్ఠను    ప్రశ్నించించి  ఉండవచ్చు.

  యయాతి  శర్మిష్టను  గాంధర్వ  వివాహం  చేసుకుని  ఉంటాడు.  ఇక  విషయమంతా  దేవయానికి  తెలిసిపోయాక  దాయడానికేముంది.  అందువల్లనే  యయాతి  తాను  శర్మిష్టను  వివాహం  చేసుకున్న  విషయాన్ని  తెలియజేస్తూ  భార్య  అనే  పదాన్ని  ఉపయోగించి  ఉంటాడు.

.................................................

ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్...అనటం  సరైనది  కాదు. 

  ధర్మాన్ని    సరిగ్గా  పాటించని   కొందరు   యజమానులు  దాసీలను  వాడుకునే  అవకాశం  ఉందేమో  కానీ  యజమానులకు  దాసీల  పట్ల   భర్తగా    వ్యవహరించే  హక్కు  లేదన్నది  నిజం. 

మన  వివాహమంత్రాలు  ఒక  స్త్రీకి  ఒకే  పురుషుడు  ఒక  పురుషునికి  ఒకే  స్త్రీ    అన్నది.....ఉత్తమమైన  వివాహ  ధర్మము....  అని  గట్టిగా  చెబుతున్నప్పుడు యజమానులకు  దాసీలపై  అన్ని  హక్కులూ  ఉంటాయని  భావించటం  సరైనది  కాదు.

అలా  ఎవరైనా  భావిస్తున్నారంటే  పెద్దలు  తెలియజేసిన  వివాహమంత్రాలను  పాటించనట్లే.

...............................


శ్వేతకేతుని  కాలంలో   మూఢాచారాలు  కొంతకాలం  ఉండి  ఉంటాయి.  అది  అధర్మమని  గ్రహించిన  ప్రజలు  క్రమంగా  ఆ  ఆనవాయితీలను  విడిచిపెట్టి  ఉంటారు.

వివాహిత  స్త్రీలను  పరపురుషులకు  అప్పగిస్తే   ఆ  స్త్రీ  యొక్క  భర్త  గతి  ఏమిటి  ?   భార్యకు  కలిగే  సంతానం  తనకు  సంభవించిన  సంతానమో  ?   లేక  పరపురుషుని  వల్ల  కలిగిన  సంతానమో ?  భర్తకు   ఎలా  తెలుస్తుంది?  పూర్వీకులు  ఇవన్నీ  తెలియని  అమాయకులు  కాదు  కదా  !

భర్త  వల్ల  సంతానం  కలగని  పరిస్థితిలో  మాత్రమే ( భర్త  అనుమతితో  ) పరపురుషుని  వల్ల  సంతానాన్ని  పొందే  హక్కు  స్త్రీకి  ఉండేది  అనుకోవచ్చు.

.............................................
 గ్రంధాలలో    ఉన్న  కొన్ని  విషయాలను  ప్రక్షిప్తాలుగా   అనుకోవచ్చనిపిస్తుంది.
   
 చాలామంది  ఏమంటారంటే  మహా  భారతం  నాటికి  ఇంకా మాతృస్వామ్యం  మిగిలే  ఉంది అంటారు.  అయితే,   మహాభారతం  కాలం  కన్నా  ముందే     రామాయణం   కాలం  నాటికే  పితృ స్వామ్యం బలంగా  ఉంది  కదా  ! 

........................................

          "నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ భర్తవే"
అనే  శర్మిష్ఠ  మాటలను    గమనిస్తే  శర్మిష్ఠ  యయాతిని  వివాహం  చేసుకోగోరి  చాకచక్యంగా  మాట్లాడుతోందని  తెలుస్తుంది.

ఈ    రోజుల్లో  కొందరు   స్త్రీలు,  కొందరు    పురుషులు  పెద్దలు  చెప్పిన  ధర్మాలను  తమ  అవసరాలకు   అనుగుణంగా  మలచుకుని  అర్ధాలను  చెప్పుకుంటున్నారు.

   ఆ నాటి  శర్మిష్ఠ  కూడా   యయాతిని  వివాహం  చేసుకోవాలని  భావించి    ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’  అన్నదేమో  అనిపిస్తుంది. 


యయాతి  మొదట  సందేహించగా..............


‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని   కూడా  శర్మిష్ట అంది.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారంటే  మునుల  అభిప్రాయాలు  వేరు.

ఈ రోజుల్లో  కూడా  స్త్రీపురుషులు  వివాహం  సమయంలో  అనేక  అబద్ధాలతో  ఇతరులను  మోసం  చేసి  వివాహాలు  చేసుకుని  వివాహ సందర్భంలో    అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారని  తమను  తాము  సమర్ధించుకుంటున్నారు.
......................................

ఇక  శుక్రునికి  కూతురుపట్ల  గల  మమకారం  వల్ల  ఆమెను  గట్టిగా  మందలించలేకపోయి  ఉండవచ్చు.  అయితే  శర్మిష్ఠ  పట్ల  కూడా  శుక్రునికి   వాత్సల్యం  ఉండిఉండవచ్చు.  శర్మిష్ఠ  రాజు  కూతురు .   సుకుమారంగా  పెరిగిన  అమ్మాయి  కాబట్టి  ఆమెకు    చక్కటి  సౌకర్యాలను  ఏర్పరచాలని  యయాతిని  కోరి  ఉంటాడు.  అయితే  ఆమెతో   సానిహిత్యం  వద్దని  స్పష్ఠంగా  చెప్పినదానిలో  శుక్రుని   అభిప్రాయం  సూటిగానే  తెలుస్తోంది.

 తన  కూతురికి  సవతి  పోరు  ఉండాలని  ఏ  తండ్రీ  కోరుకోడు.  కూతురంటే  ఎంతో  ప్రేమ  ఉన్న  శుక్రుని  వంటి  తండ్రి  అసలే  కోరుకోడు.   శర్మిష్ఠ  యయాతికి  భార్య   కావాలని  శుక్రుని  ఉద్దేశం  కాకపోవచ్చు. 
 
దేవయాని  గడుసుదే  కావచ్చు.  అంతమాత్రం  చేత  తోటి  ఆడుపిల్లను  వివస్త్రగా  చేసి    ఊరికి  దూరంగా  ఉన్న   నూతిలో  తోసి  వెళ్ళిపోయిన    శర్మిష్ఠ    మైనపుబొమ్మ   కాదనే  అనిపిస్తుంది.

 ఈ  కధలో  దేవయాని,  శర్మిష్ఠ,  యయాతి  అందరికందరే.  ఎవరూ  తక్కువగా  లేరు.  ఆఖరికి  అందరూ  తాము  చేసిన దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించారు.  వీరి  సంతానం  కూడా  కష్టాన్ని  అనుభవించవలసి  వచ్చింది.

  దేవయాని    తనకు  నచ్చని  
శర్మిష్ఠ ను    సవతిగా  పొంది   బాధపడింది.

   శుక్రుని  శాపం  వల్ల    తన    కళ్ళముందే   కుమారుడు     ముసలితనంతో  బాధపడటాన్ని  చూసి  శర్మిష్ఠ    బాధపడింది. 

యయాతి   శుక్రుని  శాపానికి  గురయ్యి    తన    కళ్ళముందే   కుమారుడు     ముసలితనంతో  బాధపడటాన్ని  చూసి  బాధపడిఉంటారు.

........................................

పురాణేతిహాసాలలోని  పాత్రల  ద్వారా  ఎన్నెన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు.

శర్మిష్ఠ  రాక్షసరాజు  కూతురు  కాబట్టి  దేవయాని  ఆమెను  దానవి  అని  సంబోధించి  ఉండవచ్చు.  లేక     తన  భర్తను  రహస్యంగా  వివాహం  చేసుకుని  సంతానాన్ని  పొందినదన్న  కోపంతో  కూడా  దేవయాని  ఆమెను  దానవి  అని  సంబోధించి  ఉండవచ్చు.

 అయితే   శర్మిష్ఠ    దేవయానిని  వివస్త్రగా  చేసి  నూతిలోకి  తోసి  ఒంటరిగా  వదిలి  వెళ్ళిపోవటం   మాత్రం  తప్పే. 

  మీరన్నట్లు,   శర్మిష్ఠ  దేవయానికి  దాసిగా  ఒప్పుకునే  విషయంలో  తన  తండ్రి   మరియు  తమ  రాజ్య  ప్రజలు  ఇబ్బందులు  పడటం  ఇష్టం  లేకపోవటం  ఒక  కారణం  కావచ్చు. లేక  తండ్రి  యొక్క  ఆజ్ఞను  జవదాటలేక  పోవటం  కూడా  కారణం  కావచ్చు. లేక  దేవయానిని  నూతిలోకి  తోయటం  ద్వారా   చేసిన  తప్పును  సరిద్దుకోవాలని   భావించి  ఉండవచ్చు.

 తరువాత  .....దేవయాని  భర్తను   తాను  వివాహం  చేసుకోవటం  ద్వారా    తనను  దాసిగా  చేసినందుకు  ప్రతిగా  శర్మిష్ట  దేవయానిపై  ప్రతీకారాన్ని  తీర్చుకుందని  కూడా  అనుకోవచ్చు.

  మీరన్నట్లు,  శర్మిష్టకు తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరుఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా,  ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  ఆమెకు అర్థమయ్యుంటుంది.  వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!

అయితే,   శర్మిష్ఠ  పాత్ర   కూడా  మరీ  సౌమ్యురాలుగా  అనిపించదు.  శర్మిష్ఠ  మరీ  సౌమ్యురాలైతే  దేవయానిని  నూతిలోకి  తోసేదే  కాదు.  దేవయాని  భర్తను  తాను  వివాహం  చేసుకుని  దేవయాని  మనస్సును  బాధపెట్టేదీ  కాదు.  

ఇక,  దేవయాని  పాత్ర  కూడా   మరీ  సౌమ్యురాలుగా  కాకుండా  గడుసుదనం  ఉన్న  పాత్రలానే  కనిపిస్తుంది.  దేవయాని  మరీ  సౌమ్యురాలైతే  పొరపాటున  దుస్తులు  మారటం  బాధను  కలిగించినా  పైకి  ప్రదర్శించకుండా  సర్దుకుపోయేది.

 శర్మిష్టపై   ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు.

ఇక  యయాతి   విషయానికొస్తే   ,   నూతిలో  పడిన   దేవయానిని   రక్షించే  ఉద్దేశంతో   కుడిచేయి  అందించి   ఆమెను  రక్షించాడు  తప్పితే ,   దేవయానిని  వివాహం  చేసుకోవాలనే  ఉద్దేశం  ఉన్నట్లు  కనిపించదు.  యయాతికి  శర్మిష్ఠ  అంటే  నచ్చినట్లు  అనిపిస్తుంది.   అయితే  , శుక్రునికి  భయపడో  లేక  ఆ  వివాహం    ద్వారా   శర్మిష్ఠను  పొందవచ్చు  అనో  దేవయానితో  వివాహానికి  ఒప్పుకుని  ఉండవచ్చు. 

  శర్మిష్ఠను  వివాహం  చేసుకోకూడదనే  షరతుతో  దేవయానిని  వివాహం  చేసుకున్నాడు.  కాబట్టి  మాట  తప్పకుండా  ఉండవలసింది. శుక్రునకు  ఇచ్చిన  మాటను  తప్పటం  వల్ల  శాపానికి  గురయ్యాడు.


యయాతికి   దేవయానిని  చేసుకోవటం  ఇష్టం  లేకపోతే  ధైర్యంగా  ఆ  మాటను  శుక్రునితో  చెప్పేసి  ఉంటే  బాగుండేది.

 యయాతి  తన  పట్ల  అనురక్తులవటాన్ని   గ్రహించిన   శర్మిష్ఠ   ఆ  అవకాశాన్ని  వదులుకోకుండా  యయాతితో  చాకచక్యంగా  సంభాషించి  వివాహానికి  ఒప్పుకునేలా  చేసింది. 

ఇక్కడ  యయాతి  శుక్రునికి  ఇచ్చిన  మాటను  ప్రక్కన  పెట్టేయటం  జరిగింది.   తద్వారా  శాపాన్ని  పొందటం  జరిగింది.

తన  కుమారులలో  ఒకరు  తన  వృద్ధాప్యాన్ని  స్వీకరించితే  కొంతకాలం  వారి  యవ్వనాన్ని  తాను  పొందవచ్చు...అని    యయాతి  శాపవిమోచనాన్ని  పొందారు.  


  తండ్రి  యొక్క  వృద్ధాప్యాన్ని  స్వీకరించిన  కుమారునికి    రాజ్యాధికారం  లభిస్తుందని    చెప్పటం  జరిగింది.   ఈ  విషయంలో  శుక్రుడు  శర్మిష్ఠకు  అనుకూలంగా  ప్రవర్తించారనుకోకూడదు.  

వృద్ధాప్యాన్ని  అనుభవించి  కష్టపడినవారికి  ప్రతిఫలంగా  రాజ్యాధికారాన్ని  ఇవ్వాలనటంలో  శుక్రుడు    శర్మిష్ఠకు  అనుకూలంగా  మాట్లాడటం  ఏమీ  లేదు.
............................................

పై  విషయాలను    గమనిస్తే   ఎన్నో  విషయాలు   అర్ధమవుతాయి.    శర్మిష్ఠ  దేవయాని  మధ్య    దుస్తుల  విషయంలో   జరిగిన   చిన్న పొరపాటు    వారి  జీవితాలనే  మార్చేసింది. ప్రతి  విషయానికి  అతిగా   పట్టుదలకు    పోకూడదు  అని  తెలిసివస్తుంది.  

ఈ  విషయాలను  గమనిస్తే   ఏకపత్నీ  లేక  ఏక పతి   యొక్క  ప్రాధాన్యత    కూడా  అర్ధమవుతుంది.  


ఒకరికంటే  ఎక్కువమంది  భార్యలుంటే  వారి  మధ్య  అసూయలు,  పోటీల  వల్ల    జీవితమంతా  గందరగోళంగా  తయారవుతుందని  అర్ధమవుతుంది.

యయాతి  పొరపాటునో  లేక  గ్రహపాటునో  దేవయానిని  వివాహం  చేసుకోవలసి  వచ్చింది.  అంతటితో  ఆగి  ఉంటే  బాగుండేది. 


శర్మిష్ట  కూడా  యయాతిని  వివాహం  చేసుకోకుండా  ఉండవలసింది.  

  దేవయాని  కూడా  శర్మిష్ఠను  దాసిగా  చేయకుండా  క్షమించి  ఉండవలసింది.  తద్వారా  దేవయానికి   సవతి  బాధ  ఉండేది  కాదు. 

మొత్తానికి  యయాతి,  దేవయాని,  శర్మిష్ఠలో  ముగ్గురితో  పాటు  వారి  సంతానం  కూడా  ఇబ్బందులను  అనుభవించారు. 


కుమారుడు  వృద్ధాప్యంతో  బాధపడుతుంటే  అతని  యవ్వనాన్ని  తీసుకుని   తల్లితండ్రులు   సుఖంగా  ఉండగలరా? ఉండలేరు. అందుకని  యయాతి  గాని  శర్మిష్ఠ  గాని   సుఖవంతమైన  జీవితాన్ని  అనుభవించలేదనే  అనుకోవచ్చు.

 దేవయాని  కన్నా  శర్మిష్టకే  ఎక్కువ  బాధ  ఉంటుంది.   కుమారుడు  వృద్ధాప్యాన్ని  అనుభవిస్తుంటే    తల్లికి  బాధగానే  ఉంటుంది  కదా  !

.........................................................


ఇక  శర్మిష్ఠ    యొక్క    సంతానం  తండ్రి  యొక్క   ముసలితనాన్ని    స్వీకరించే  సమయంలో  బాల్యానికి  టీనేజికి  మధ్య  వయస్సు  వారయి   ఉండవచ్చు.

  బహుశా  10  సంవత్సరాలు  అలా  వయస్సు  ఉంటే  బహుశా  అతని  యవ్వనంలోని  మధ్య  వయస్సు    భాగాన్ని  యయాతి  స్వీకరించి  ఉండవచ్చు.  కొంతకాలం  గడిచిన  తరువాత  పురు  తన  యవ్వనాన్ని  తాను  స్వీకరించగా  యయాతి  తన  వృద్దాప్యాన్ని  తను  స్వీకరించి  ఉండవచ్చు.

దయచేసి  ఈ   లింక్  కూడా  చదవగలరు. ...... 

సుకన్య........శర్మిష్ఠ..



6 comments:

  1. భారతం లోనే అన్ని విషయాలూ ఉన్నాయండి. మనం చూసుకుని చదువుకుంటే చాలు. మరొక మాట అప్పటి ధర్మాన్ని ఇప్పటి పరిస్థితులతో కలిపి చూడ కూడదు. అప్పుడు జరిగినావ్టి తప్పొప్పులు ఇప్పుడు చర్చించక్కర లేదు. మనకు కావలసిన మంచి గ్రహిస్తే చాలు.

    ReplyDelete
    Replies


    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు భారతం లోనే అన్ని విషయాలూ ఉన్నాయి.

      అప్పుడు జరిగినవాటి తప్పొప్పులు ఇప్పుడు చర్చించినా ఫరవాలేదండి.

      పురాణేతిహాసాలను కొందరు ప్రజలు అపార్ధం చేసుకుంటున్నారు.

      ( నేనూ ఒకప్పుడు పురాణేతిహాసాలను అపార్ధం చేసుకున్నాను. అలా అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. )

      చర్చ వల్ల అపార్ధాలు తొలగి చక్కటి అర్ధాలు అందరికి తెలిసే అవకాశం ఉంది కదండి.

      Delete
  2. ఈ యయాతికథ గురించి కల్లూరి భాస్కరంగారు విస్తరించి వ్రాస్తున్నారు,

    కొన్నికొన్ని సందర్భాల్లో ఆయన టపాల క్రింద నా అభిప్రాయాలు వ్యాఖ్యల రూపంలో ఇస్తే ఆయన వాటిని ప్రచురించలేదు.

    ఈ నాడు మనం పౌరాణికకథలను కొత్తకొత్త దృక్కోణాలకళ్ళజోళ్ళు పెట్టుకొని చూసి వింత అర్థాలు చెప్పటం మొదలు పెడితే సమస్తపౌరాణికేతిహాసికసాహిత్యమూ తప్పులతడకగానే కనిపిస్తుంది మరి. చాలా విచారించవలసిన సంగతి,

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కల్లూరి భాస్కరంగారు వ్రాసిన టపాలను నేనూ చదివానండి, ఆ టపాలలో వారు వ్రాసిన విషయాల పట్ల నాకు తోచిన అభిప్రాయాలతో ఈ టపాను వ్రాసాను. వారి బ్లాగ్ లో కొన్ని వ్యాఖ్యలను వ్రాసాను.

    మీరన్నట్లు, పౌరాణికకథలను కొత్తకొత్త దృక్కోణాల కళ్ళజోళ్ళు పెట్టుకొని చూసి వింత అర్థాలు చెప్పటం మంచిది కాదు కానీ, పౌరాణికకథల పట్ల అపార్ధాలు తొలగి చక్కటి అర్ధాలు అందరికి తెలిస్తే మంచిదే కదండి.


    పురాణేతిహాసాలను కొందరు ప్రజలు అపార్ధం చేసుకుంటున్నారు.

    ( నేనూ ఒకప్పుడు పురాణేతిహాసాలను అపార్ధం చేసుకున్నాను. అలా అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. )

    ReplyDelete
  4. యయాతి కుమార్తె గా పిలవబడుతున్న మాధవి ఎవరు?
    ఆమె తల్లి ఏ అప్సరస?

    ReplyDelete
  5. నాకు ఏమనిపిస్తోందంటేనండి..పురాణేతిహాసాలలో ఎన్నో విషయాలున్నాయి. వాటిలో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయంటారు. అంటే, కొన్ని మార్పులుచేర్పులు కూడా జరిగాయని ఎందరో అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, ప్రతివిషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించటం కన్నా , వాటిలోని ముఖ్యమైన విషయాలను పట్టించుకోవటం మంచిదని అనిపిస్తోందండి. ఉదా..యయాతి కుమార్తె మాధవి అని చెప్పబడుతున్న కధ ప్రక్షిప్తమో? కాదో? తెలియదు.

    ReplyDelete