koodali

Wednesday, August 28, 2013

శ్రావణ మాసంలో వచ్చే కొన్ని విశేషాలు మరియు మన రాష్ట్ర విషయాలు....జై తెలంగాణా జై సమైక్యాంధ్ర అంటూ........


శ్రావణ మాసంలో  ఎన్నో  పండుగలు  వస్తాయి.   ఈ  సంవత్సరపు   శుభప్రదమైన  అమరనాధ్  యాత్ర  శ్రావణ  పౌర్ణమికి  పూర్తయింది.  అందరికి  కృష్టాష్టమి  శుభాకాంక్షలు.
........

జై  తెలంగాణా  జై  సమైక్యాంధ్ర , అంటూ  తెలుగు  వాళ్ళు  చేస్తున్న  ఉద్యమాలు  ముచ్చటగా  ఉన్నాయి. 

అయితే,  దేశంలో,  రాష్ట్రంలో  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.  పేదరికం,  అవినీతి,  లంచగొండితనం,  ఆర్ధిక  అసమానతలు, .ఇలా  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.   ఈ   సమస్యల  పరిష్కారానికి  ప్రజలు  ఎందుకు  ఉద్యమాలు  చేయరు  ?  అన్నదే అత్యంత  ఆశ్చర్యంగా  ఉంది. 

స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  ఏళ్ళు  గడిచిపోయాయి.  రాష్ట్రంలో   ఎన్నో   ప్రాంతాలలో  ఫ్లోరైడ్  సమస్య  అలాగే  ఉంది. అవయవాలు  కొంకర్లు  పోయిన   ఫ్లోరైడ్  బాధితులను  చూస్తే    ఎంతో  బాధగా  ఉంటుంది.  ఈ  సమస్య  వల్ల  ఎందరో  బాధలు  పడుతున్నారు.   ఫ్లోరైడ్  సమస్య  తగ్గించటానికి  కుటుంబానికి  రోజు  వంటకు,  త్రాగటానికి  రెండు  బిందెల  శుద్ధజలం  అందిస్తే  చాలు.  ఫ్లోరైడ్  సమస్య  తీవ్రత  చాలా  వరకు  తగ్గుతుంది. 

రాష్ట్రంలో   ఎందరో  రైతులు,  చేనేత    శ్రామికులు  పేదరికాన్ని  తట్టుకోలేక    వేలాది  మంది  ఆత్మహత్యలు  చేసుకున్నారు.
..............................................

తమ  ప్రాంతపు  సమస్యలు  పరిష్కారం  కాకపోవటానికి  ఇతర ప్రాంతాల  వారే  కారణమని   ఒకరినొకరు  తిట్టుకోవటం    ఏమిటో  అర్ధం  కావటం  లేదు.
...............................................

 సీమాంధ్ర  వాళ్ళు  కూడా    రాష్ట్ర  విభజన  విషయంలో  తమ  అభిప్రాయాన్ని  ఇంతకుముందే   గట్టిగా  వినిపించితే  బాగుండేది.

 హైద్రాబాద్ లో  ఎన్నో  పెద్ద  సంస్థలు  ఉన్నాయి,  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  ఉన్నాయి  హైదరాబాద్  బాగా  అభివృద్ధి  చెందింది.  సీమాంధ్ర  సరిగ్గా  అభివృద్ధి  చెందలేదు.  హైదరాబాద్  సహా  తెలంగాణా  విడిపోతే  మా  ప్రాంతాలలో  అభివృద్ధి  చెందాలంటే  చాలా  కాలం  పడుతుంది.  అని  సీమాంధ్రం  వాళ్ళు  అంటున్నారు.

  సీమాంధ్ర  వాళ్ళు   ముందుచూపుతో   తమ  పెట్టుబడిని  హైదరాబాద్  లో  కాకుండా  తమ  ప్రాంతపు  నగరాలలో  పెట్టుబడి  పెట్టి  అభివృద్ధి  చేసుకుంటే   ఇప్పుడు  ఈ  పరిస్థితి  వచ్చేది  కాదు.
............................................

సీమాంధ్ర  ప్రాంతాలు  హైదరాబాద్ లా  అభివృద్ధి  చెందకపోవటానికి    తెలంగాణా  ప్రజలు  కారణం  కాదు కదా  !  
 
తమ  ప్రాంతాలను  కూడా  హైదరాబాద్ లా   అభివృద్ధి  చేయమని  సీమాంధ్ర  ప్రజలు  తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   అభివృద్ధి  చేయించుకోవలసింది . 
 ..........................................

 తెలంగాణాలోని   ఫ్లోరైడ్  సమస్యలు  , రైతుల  సమస్యలు,    చేనేత  శ్రామికుల  సమస్యలు,  పరిష్కారం  కాకపోవటానికి  సీమాంధ్ర  ప్రజలు  కారణం  కాదు కదా  ! 

 ఫ్లోరైడ్  వంటి  ఎన్నో  సమస్యలు  పరిష్కారం  చేయాలని   తెలంగాణా  ప్రజలు   తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   పరిష్కారం   చేయించుకో
వలసింది .
...........................................
 
 సమస్యలు  పరిష్కారం  కావాలంటే ఆ ప్రాంత  ప్రజలు  మరియు  ప్రజా  ప్రతినిధులు ,  అధికారులు   కృషిచేయాలి.    తమ  ప్రాంత  అభివృద్ధి    మరియు   సమస్యలు   పరిష్కారం  కోసం   ప్రజలు  ఉద్యమాలు   చేస్తే  బాగుంటుంది.
............................................

. ఇంకా  ఏమనిపిస్తుందంటే,.............

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన   వెంటనే   హైదరాబాద్ ను   రాష్ట్ర ముఖ్య రాజధానిగాచేసి....... కర్నూలు, వైజాగ్, విజయవాడలను ...... మిగతామూడు   ప్రాంతాలకూ   ఉప రాజధానులుగా చేసి , అభివృద్ధి చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

అంటే ,  ఒక ముఖ్య రాజధాని , మూడు ఉప రాజధానులు అన్నమాట.........

 అంటే,  రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతిచిన్నపనికీ హైదరాబాదుకు రాకుండా హైదరాబాదులోని ముఖ్య కార్యాలయాలకు ఉప కార్యాలయాలను ... ఉప రాజధానుల్లోనే ఏర్పాటు చేస్తే   బాగుండేది అనిపిస్తుంది. .

 అన్ని ప్రాంతాల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను తమ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేసుకుంటే ........ ఇప్పుడు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అనిపిస్తుంది.

అప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు రాకుండా అందరూ బాగుండేవారు అనిపిస్తుంది.
..............................................

 ఇప్పుడు  కృష్ణా,  గోదావరి,  నీటి  వాటాల  కోసం   తెలుగువాళ్ళు  తమలో  తాము  తిట్టుకుంటున్నారు. 


 ఎగువ  రాష్ట్రాలైన  కర్ణాటక,  మహారాష్ట్రలు    మరిన్ని  నీటి  ప్రాజెక్ట్స్  కట్టుకుంటే  కృష్ణా,  గోదావరి  నీటి  కోసం  తెలంగాణా  , సీమాంధ్ర  వాళ్ళు  కొట్లాడుకునే  అవసరం  భవిష్యత్తులో  ఉండదు.
.....................................................

   ఈ  దేశ  ప్రజలు  ఎందరో  పేదరికంతో  అల్లాడుతుంటే   అభివృద్ధి  చెందిన   విదేశాల  వాళ్ళు  కూడా   మరింత  అభివృద్ధి  కోసం  ఈ  దేశం   వచ్చి  సంస్థలు  పెట్టి   లాభాలను  పొందుతున్నారు. మన  దేశంలోని   చిల్లర  మరియు  మధ్య  తరగతి   వర్తకులతో  పోటీ  పడుతున్నారు. 

ఇతరదేశాల  వాళ్ళు  ఇక్కడికి  వచ్చి   వ్యాపారాలు,  సంస్థలు  పెట్టుకుని  లాభాలను  పొందుతున్నా  మనకేమీ  బాధ  ఉండదు.  సాటి  తెలుగువారు  వచ్చి  సంస్థలు  పెట్టి  లాభాలు  పొందితే  మాత్రం  మనకు  బాధ  కలుగుతుంది.

మనలో  మనమే  కొట్టుకోవటం    మానివేసి  దేశాభివృద్ధికి  కృషిచేసినప్పుడే  అందరికి  అభివృద్ధి  ఉంటుంది. 
................................................



ఇక  ఉద్యోగాలు  గురించి    తెలుగువారి  మధ్య  జరుగుతున్న  మాటల  యుద్ధం  గమనించితే   ఎంతో  ఆశ్చరంగా  ఉంటుంది.  హైదరాబాద్లో  సీమాంధ్ర  వాళ్ళే  కాదు  ఇతరరాష్ట్రాల    వాళ్ళు  ఎందరో  వచ్చి  ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేసుకుంటున్నారు. 


రాజధానిని  త్యాగం  చేసిన  సీమాంధ్ర  వాళ్ళు  వస్తే  మాత్రం  వలసవాదుల  వల్ల  మా  ఉద్యోగాలు,  వ్యాపారాలు  పోతున్నాయి .  అనటం  ఆశ్చర్యంగా  ఉంది.


ఆ  మాటకొస్తే   అన్ని  ప్రాంతాల  తెలుగు  వాళ్ళు    మెరుగైన  ఉపాధి  కోసం  ఇతర  రాష్ట్రాలకు  ,  ఇతర  దేశాలకూ   వెళ్తున్నారు. 



 మనము   ఉపాధి  కోసం  ప్రపంచం  అంతా  తిరుగుతున్నప్పుడు  మన ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అంటే  న్యాయం  కాదు  కదా ! 

 మన  ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అన్నప్పుడు  మనమూ  ఇతర  ప్రాంతాలకు  వెళ్ళకూడదు ,  వెళ్ళిన   వాళ్ళు   తిరిగి  వచ్చేయాలి..  భవిష్యత్తులో  మన  పిల్లలను  విదేశాలకు  పంపకూడదు.

ఉపాధి  కోసం   మనము  ఇతర  దేశాలకు   వెళ్తే   కొంతకాలానికి  అక్కడి  వాళ్ళూ  మనల్ని  పొమ్మంటారు.  వాళ్ళ  ఉపాధి  అవకాశాలను  మనం  కొల్లగొడుతున్నామని.

 స్థానికులు  వలసవాదుల  మధ్య  జరుగుతున్న  గొడవలు  ప్రపంచమంతటా  ఎన్నో  దేశాలలో  జరుగుతున్నాయి.  అయితే  ఒకే  భాష   మాట్లాడే  వారి  మధ్య  ఇలాంటి  విభేదాలు  రావటం  పరిస్థితి  తీవ్రతను  తెలియజేస్తోంది. 



 ఇవన్నీ  గమనించే  మన  పూర్వీకులు  జననీ  జన్మభూమి  స్వర్గాని  కంటె  గొప్పవని  తెలియజేశారు. అందుకే   ఎక్కడివారు  అక్కడే  ఉండి  తమ  ప్రాంతాలను  అభివృద్ధి   చేసుకునేవారు.  అప్పుడు  ఇన్ని  సమస్యలు  ఉండేవి  కాదు.


............................

కొందరు  ఉద్యోగస్తులకు  ట్రాన్స్ఫర్ల  బాధ  ఒకటి. 

 ట్రాన్స్ఫర్ల  వల్ల  అక్కడికి  ఇక్కడికి  మారే  ప్రజల  పరిస్థితి  మరీ  ఘోరం    వారికి  తమ  స్థానికత  ఏమిటో  తెలియదు.    స్థానికులు  వలసవాదులు  అంటూ  గొడవలు  వచ్చినప్పుడు  తాము  ఏ  ప్రాంతానికి  చెందుతామో  దిక్కుతోచని  పరిస్థితి  వారిది. 


 అందుకే  సంస్థలు  ఉద్యోగాలు  ఇచ్చేటప్పుడు  స్థానికులకే  ప్రాముఖ్యతనివ్వాలి.
 ............................
 
ప్రజలు  తమ  సమస్యల  పరిష్కారానికి,  ఉద్యమాలు  చేయాలి  గానీ  రాజకీయులకు  ఉపయోగపడే  విధంగా  ఉద్యమాలను  చేసి  ఎందుకు  కష్టపడతారో  అర్ధం  కాదు. 



  దేశంలోని  రాష్ట్రాలను  విభజిస్తే  ఎంతో  అభివృద్ధి    ఉంటుందని     కొందరు  అరచేతిలో  స్వర్గాన్ని  చూపిస్తున్నారు. 

విభజించినా  మనకు  ఇదే  నాయకులు  ఉంటారు.  కదా  ! వీళ్ళు  ఫ్లోరైడ్  వంటి  సమస్యలను  ఇంతకు  ముందే  ఎందుకు  పరిష్కరించలేదో  అర్ధం  కాదు.

ఎన్నికలప్పుడు   అధికారం  కోసం  రాజకీయ  నాయకులు  ఎన్నో  వాగ్ధానాలను  చేస్తారు.  ప్రజలకు  అరచేతిలో  స్వర్గం  చూపిస్తారు. 


  ఎన్నికలలో  గెలిచిన  తరువాత  ఎక్కువమంది  నాయకులు  తాము  చేసిన  వాగ్ధానాలను  అమలు  చేయరు.  చేస్తే   స్వాతంత్ర్యం  వచ్చిన  ఇంతకాలం  తరువాత  కూడా  దేశంలో   ఇన్ని  సమస్యలు  ఎందుకుంటాయి  ?
...................................


ఎన్నో  భాషల  ప్రజలు  ఉన్న  మన  దేశంలో  భాషా  ప్రయుక్త  రాష్ట్రాల  ఏర్పాటు  వల్ల  ఎన్నో  లాభాలున్నాయి.  పరిపాలన  ఆ  రాష్ట్ర  ప్రజల  మాతృ  భాషలలో  ఉండటం  వల్ల  ప్రజలకు చట్టం  గురించి  సులభంగా  అర్ధం  అవుతుంది.

 ఎక్కువగా  తెలుగు  మాట్లాడే  ప్రజలున్న  ఒకే  రాష్ట్రంలో  తెలంగాణా  అని,  రాయలసీమ  అని,  కోస్తా  అని,  ఉత్తరాంధ్రా  అని  ఎందుకు  పేర్లు  పెట్టారో?  అంతా  మన  ఖర్మ.

 ఇప్పుడు  అన్ని  ప్రాంతాల  వాళ్ళు  రాజధాని  మా  ప్రాంతంలోనే  ఉండాలని  పట్టుబడుతున్నారు.  కొందరు  మూడు  లేక  నాలుగు  రాష్ట్రాలు  చేయమంటున్నారు.  కొందరు  మన్య  సీమ  రాష్ట్రం  కావాలంటున్నారు.  కొందరు   రాయలసీమలోని  కొన్ని  ప్రాంతాలను  కర్ణాటకలో  కలపాలంటున్నారు.  ఇలా   మనలో  మనము  తిట్టుకుంటుంటే  కొందరు  చిత్తూరు  సహా  తిరుమలను  తమ  రాష్ట్రంలో   కలపాలంటున్నారు.  


ఇవన్నీ  చూస్తుంటే  కొంతకాలానికి  తెలుగువాళ్ళకంటూ  ఒక్క   రాష్ట్రం    అయినా  ఉంటుందా ?  అనిపిస్తోంది.  
........................

 తమలో  తాము  గొడవలు  పడే  కుటుంబం  కాని  రాష్ట్రం  కానీ  దేశం  కానీ  బాగుపడినట్లు  చరిత్రలో  లేదు.

 
రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా ఎప్పటికీ ప్రక్కప్రక్కనే జీవించవలసిన ప్రజల మధ్యన ఇంతలా అపార్ధాలు, ఆవేశాలూ పెరగటం మంచిదికాదు.

అది ముందుముందు అనర్ధాలకు దారి తీస్తుంది.
 .........................

మనదేశ  రక్షణ శాఖలో    అన్ని  రాష్ట్రాలకు  చెందిన   సైనికులు    ఉన్నారు.  వాళ్ళందరూ   కాపలా  కాస్తుంటే  మనం  తీరికగా  మనలో  మనం  గొడవలు  పడుతున్నాము.



ఎంతైనా మనమందరం ఒకటి.

 ఈ సమస్యలు సామరస్యంగా , త్వరగా పరిష్కారం అవ్వాలనీ ,అప్పుడు పేదప్రజల సమస్యల పరిష్కారానికి  ఎక్కువ   సమయం ఉంటుందని ఆశిద్దాము.

 
ఈ  దేశ  ప్రజలతో పాటూ ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ ,ఇంకా లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.


7 comments:

  1. "ఈ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎందుకు ఉద్యమాలు చేయరు"

    చేసారండీ మీరు గమనించలేదేమో. ఉ. మీరు చెప్పిన ఫ్లోరోసిస్ సమస్యపై జలసాధన సమితి ఇరవై ఏళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉంది. ఇక విసిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఈ సమస్య పరిష్కారం కాదని వారు తెలంగాణా ఉద్యమంలో భాగమయ్యారు.

    "హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. సీమాంధ్ర సరిగ్గా అభివృద్ధి చెందలేదు"

    అభివృద్ధి చెందినా హైదరాబాదు నగరాన్ని చూసే తెలంగాణాను కలుపుకున్నారు. ఇప్పుడు మేమే అభివృద్ధి చేసామని పోజులు ఒకటే దంపుడు.

    "ఫ్లోరైడ్ వంటి ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణా ప్రజలు తమ ప్రజాప్రతినిధులను గట్టిగా అడిగి పరిష్కారం చేయించుకోవాలి"

    అడిగి అడిగి విసుగొచ్చింది. ఒకవేళ నల్లగొండకు నీళ్లిస్తే డెల్టా రైతులు ఊరుకోరని ఇవ్వలేదు.

    "హైదరాబాద్లో సీమాంధ్ర వాళ్ళే కాదు ఇతరరాష్ట్రాల వాళ్ళు ఎందరో వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు"

    వాళ్ళెవరూ పెత్తనం చలాయించలేదు. మీరు ఎవరు అని అడిగిదే మేము తెలంగాణా వారిమని గర్వంగా చెబుతారు.

    "తమ ప్రాంతాలను కూడా హైదరాబాద్ లా అభివృద్ధి చేయమని సీమాంధ్ర ప్రజలు తమ ప్రజాప్రతినిధులను గట్టిగా అడిగి అభివృద్ధి చేయించుకోవాలి"

    ఒక మహానగరం ఏర్పడడానికి ఎన్నో శక్తులు తోడ్పడతాయి. అరిచి గీపెట్టినా ఇంకో హైదరాబాదు రావడం కల్ల.

    "రాజధానిని త్యాగం చేసిన సీమాంధ్ర వాళ్ళు వస్తే మాత్రం వలసవాదుల వల్ల మా ఉద్యోగాలు, వ్యాపారాలు పోతున్నాయి"

    అంత పెద్ద మాటలు అక్కరలేదు. గుడారాలలో ఉన్నది కూడా ఒక రాజధానా?

    "మనము ఉపాధి కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు మన ప్రాంతానికి ఎవరూ రాకూడదు అంటే న్యాయం కాదు కదా"

    ఎవరూ అన్ని మాటలు మీకు ఎక్కడ వినిపించాయో? ప్రభుత్వ ఉద్యోగాలలో న్యాయమయిన వాటా అడగడానికి "మమ్మల్ని వెళ్ళగొడతారు" అని ప్రచారం చేయడం తప్పు కాదా?

    "పరిపాలన ఆ రాష్ట్ర ప్రజల మాతృ భాషలలో ఉండటం వల్ల ప్రజలకు చట్టం గురించి సులభంగా అర్ధం అవుతుంది"

    రెండు తెలుగు రాష్ట్రాలున్నా ఇదే జర్గుతుంది కదా?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను బందువులు, ఆత్మీయులు ఉన్నారు.
      మాది సంచార జాతి. అంటే బదిలీలు ఉన్న ఉద్యోగం.

      రాష్ట్రం సంగతి అలా ఉంచితే.... ఒకే భాష మాట్లాడే వాళ్ళ మధ్య పెద్దగా కారణాలు లేకుండానే ఇంతలా అపార్ధాలు రావటం అనేది ఎంతో బాధాకరమైన విషయం.

      తమ స్వార్ధం కోసం అందరి మధ్య తగువులు పెట్టేవాళ్ళు పాపాత్ములు.
      .........................
      * చేసారండీ మీరు గమనించలేదేమో. ఉ. మీరు చెప్పిన ఫ్లోరోసిస్ సమస్యపై జలసాధన సమితి ఇరవై ఏళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉంది. ఇక విసిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఈ సమస్య పరిష్కారం కాదని వారు తెలంగాణా ఉద్యమంలో భాగమయ్యారు.

      * ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అంటే ఉద్యమాలు చేసే అవసరం ఉంది. అది కేంద్రం వరకు వెళ్ళే విషయం కాబట్టి.

      ఫ్లోరైడ్ వంటి స్థానిక సమస్య పరిష్కారానికి కూడా ఉద్యమాలు చెయ్యవలసి రావటం ప్రజల దురదృష్టం. ప్రజల సమస్యల పరిష్కారానికే కదా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేది.

      ఇప్పటికైనా జలసాధన సమితి మరియు hmtv వంటి ప్రైవేట్ సంస్థల వల్ల ఫ్లోరైడ్ సమస్యకు కదలిక వచ్చింది.
      ............................
      * అభివృద్ధి చెందినా హైదరాబాదు నగరాన్ని చూసే తెలంగాణాను కలుపుకున్నారు. ఇప్పుడు మేమే అభివృద్ధి చేసామని పోజులు ఒకటే దంపుడు.

      * పూర్వపు హైదరాబాద్ ఫొటోలను ఇప్పటి హైదరాబాద్ ఫోటోలను పోల్చి చూస్తే మీరు చెప్పేది ఎంతవరకు నిజమో తెలుస్తుంది.
      మరి సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారని కూడా అంటున్నారు కదా !
      ...................................
      * అడిగి అడిగి విసుగొచ్చింది. ఒకవేళ నల్లగొండకు నీళ్లిస్తే డెల్టా రైతులు ఊరుకోరని ఇవ్వలేదు.

      * ఎంత అడిగినా పట్టించుకోని వాళ్ళను నమ్మితే .........
      .................................
      * వాళ్ళెవరూ పెత్తనం చలాయించలేదు. మీరు ఎవరు అని అడిగిదే మేము తెలంగాణా వారిమని గర్వంగా చెబుతారు.

      * ఎదుటివాళ్ళమీద సదభిప్రాయం లేనప్పుడు పెత్తనం చెలాయించకపోయినా చెలాయించినట్లే కనిపిస్తుంది.

      అయితే సీమాంధ్ర వాళ్ళు కూడా మేము తెలంగాణా వాళ్ళం అని చెపితే సరిపోతుందన్నమాట. అప్పుడు వాళ్ళను దోపిడీదారులు అనరాండి ?

      అయితే మన వాళ్ళు ఇతరదేశాలకు వెళ్ళినప్పుడు మేము భారతీయులం అని కాకుండా మేము విదేశీయులం అని చెప్పే వారే మంచివారు అని మీ ఉద్దేశం కాబోలు.
      .............................
      * ఒక మహానగరం ఏర్పడడానికి ఎన్నో శక్తులు తోడ్పడతాయి. అరిచి గీపెట్టినా ఇంకో హైదరాబాదు రావడం కల్ల.

      * ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు గాని నేను గానీ ఇప్పుడే ఏమీ చెప్పలేము.
      .........................
      * అంత పెద్ద మాటలు అక్కరలేదు. గుడారాలలో ఉన్నది కూడా ఒక రాజధానా?

      * అప్పుడు కొన్ని నగరాలు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండక పోవచ్చు. . అభివృద్ధి చెందిన నగరాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అయినా వాళ్ళు రాజధాని కోసం పట్టుబట్టలేదు.
      .....................

      * ఎవరూ అన్ని మాటలు మీకు ఎక్కడ వినిపించాయో? ప్రభుత్వ ఉద్యోగాలలో న్యాయమయిన వాటా అడగడానికి "మమ్మల్ని వెళ్ళగొడతారు" అని ప్రచారం చేయడం తప్పు కాదా?

      * అయితే వ్యాపారాలలోను, ప్రైవేట్ సంస్థలలో స్థానికుల కన్నా ఇతరులు వచ్చి అధిక సంఖ్యలో ఉపాధి పొందితే స్థానికులకు అన్యాయం జరగదంటారా ?
      ............................

      * రెండు తెలుగు రాష్ట్రాలున్నా ఇదే జర్గుతుంది కదా?

      * భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నయి. అని చెప్పటానికి ఆ వాక్యం రాశానండి.

      తెలంగాణా ప్రాంతం రెండయినా, సీమాంధ్ర ప్రాంతం మూడయినా ఇదే జరుగుతుందండి.

      Delete
  2. కేవలం ఆధ్యాత్మిక విషయాలు రాసే మీరు ఇలా సమకాలీన సమస్యలపై విపులంగా రాయడం అభినందనీయం.. కే.సీ.ఆర్ నిద్ర లేపి గిల్లీ వరకు ఈ వుద్యమం ఎందుకు పడుక్కుందో తెలియదు.. అయితే ఈ మధ్య పనిచేసిన ముఖ్య మంత్రులుగా పనిచేసిన ఇద్దరు పెద్దల ధనదాహం, భూకబ్జా ల కారణంగా తెలంగాణా వారిలో అసహనం రగిలింది.. ఇది వాస్తవం.. అధికారికంగా, అనధికారంగా భూములన్నీ ప్రైవేట్ పరం అయిపోయాయి రాష్ట్రమంతా.. దాని పర్యవసానమే ఈ వుద్యమాలు.. గద్దెనెక్కితే రాష్ట్రాన్ని అందినంత దోచుకోవచ్చు అడిగేవాడు ఎవడూ లేడు అన్న భావం ఇవేళ రాజకీయ నాయకులలో వున్నది.. అందుకే ప్రజలను పావులుగా మార్చి వుద్యమాలు నడుపున్నారు..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నేను ఇంతకు ముందు కూడా ఇలాంటివి వ్రాశానండి. అప్పుడు కూడా Jai Gottimukkala గారు వ్యాఖ్యానించారు.

      Delete
  3. మీ టపా మొత్తానికి వ్యాఖ్య రాయాలంటే మరో టపా అయ్యేలా వుంది. :) ఒక మాట ముఖ్యంగా చెబుతున్నా! "తులసి ఆకులు ఫ్లోరైడ్ ఉన్న నీటిలో వేసి నీటిని నిలువ ఉంచితే ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా గణనీయంగా లేదా పూర్తిగా తొలగిపోతోందని నల్గొండ కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు కొంత మంది స్థానిక మేధావులు చేసిన పరిశోధన ఫలించింది. ఇప్పుడు ఫ్లోరైడ్ ఉన్న చోట్ల తులసి మొక్కలు పంచిపెడుతున్నారు.తులసి వనాలు పెంచుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. aa vishyam cheppalisindhi collector kadu sthanikaa medhavulu kadu , authorized lab cheppali adhi kaka pothe .. AP prabuthvam ilaa cheppali are meeku krishna nillu eppatiki ravu meeeku thulsi akule gahti ani

      Delete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, ఫ్లోరైడ్ బాధలకు తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయంటున్నారు.
    ఈ విషయంలో పరిశోధనలు చేసినవారికి , అధికారులకు మరియు ఇలాంటి ఉపయోగపడే మంచి విషయాలను నలుగురికి తెలియజేసే మీలాంటి వారికి అందరికి కృతజ్ఞతలండి.

    ఈ విధంగానైనా ఫ్లోరైడ్ కష్టాలు తొలగితే అంతే చాలు.

    దైవం సృష్టిలో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మనం వాటి విలువను తెలుసుకుని ఉపయోగించుకోవాలి.

    కొన్ని ఎండిన మునగకాయ గింజలను నీటిలో కలిపితే నీటిలోని కలుషితాలు అన్నీ పోతాయంటారు.

    ReplyDelete