పూజల యొక్క విధివిధానములను పాటించటములో నాకు వచ్చిన సమస్యలు, సందేహములను గురించి ఇంతకుముందు వ్రాశాను కదండి.
శ్రీ లలితాసహస్రనామములలో సుఖారాధ్యా అనే నామమును గురించి విన్నాక ధైర్యం వచ్చిందండి.
అలాగే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ కూడా తెలియజేసారు కదండీ .... ఎవరయినా భక్తితో ........ కొద్దిగా జలమును గానీ, పుష్పములను గానీ, ఫలములను గానీ సమర్పించినా చాలు తాను స్వీకరిస్తానని. ..నిజంగా భగవంతుడెంతో దయామయుడు.
పెద్దలు ఒక అత్యుత్తమ సాధకుని గురించి ఎంతగా ఆలోచిస్తారో ఒక అతి సామాన్య భక్తుని గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.
ప్రపంచములోని ప్రతి ఒక్కరూ దైవానికి దగ్గరవ్వాలని వారి తాపత్రయము.
ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో విధముగా ప్రవర్తించవలసి ఉంటుంది.
అందుకేనేమో పూజల విధివిధానముల విషయములో పెద్దలు ఒక్కోదగ్గర గట్టిగా చెబుతారు. ఒక్కోసారి పట్టు సడలిస్తారు.
పూజానియమాలను ఉన్నదున్నట్లు చెప్పటము వల్ల శక్తి ఉన్నవాళ్ళు వాటిని పాటించి ఫలితములను శీఘ్రముగా పొందుతారు. అందరికీ అంత శక్తి ఉండదు కదా.
అటువంటి వారు నిరాశపడకుండా పెద్దలు మనకు ఎన్నో ఉపాయములను ఎందరో భక్తుల కధల ద్వారా తెలియజేసారు.
ఉదా..కొంతమందికి సంసార బాధ్యతల వల్ల ఎక్కువసేపు పెద్దపెద్ద పూజలు చెయ్యలేకపోవచ్చు. ధర్మవ్యాధుని కధ ద్వారా స్వధర్మమును ఆచరిస్తూ కూడా దైవమునకు దగ్గర అవ్వచ్చునని తెలియజేసారు.
కొంతమంది ఎన్నో పాపాలు చేసి తరువాత తప్పు తెలుసుకుని అయ్యో మనకు దైవ పూజ చేసే అర్హత ఉందోలేదో అనుకుంటారు. నిగమశర్మోపాఖ్యానము ద్వారా అలాంటివారికి కూడా దైవపరమయిన ఆశను కల్పించారు. వారు మంచి మార్గములోకి వచ్చే మార్గమును తెలియజేసారు.
ఇంకొంతమంది ఉంటారు. ఇవన్నీ విని ...... అయితే విధివిధానములు పెద్దగా పాటించనక్కరలేదులే ........ అనేసుకునే బధ్ధకస్తులూ ఉంటారు. విధివిధానములు సరిగ్గా పాటించాలి అని కొన్ని కధల ద్వారా గట్టిగా చెప్పటము వల్ల ఇటువంటివారి బధ్ధకమును పోగొట్టవచ్చు.
మళ్ళీ ఇవన్నీ విని జనం భయపడకుండా ఈ విధమయిన గొప్ప భక్తుల కధలను తెలియజేసారు.
ఒక భక్తుడు ..భక్తిపారవశ్యములో పడి దైవమునకు పండ్లకు బదులుగా తొక్కలను నివేదించారట..... ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఆ తొక్కలనే ఆప్యాయముగా స్వీకరించారట.
అప్పుడు .... ఆ భక్తుడు అయ్యో తొక్కలను సమర్పించానే అని బాధపడి మళ్ళీ పూజను విధివిధానముగా చేసి ఈ సారి జాగ్రత్తగా తొక్కలు కాకుండా పండ్లనే దైవమునకు నివేదించగా ... ఆ భగవంతుడు స్వీకరించలేదట.
ఎందుకంటే రెండవసారి చేసిన పూజలో భక్తి శాతము తగ్గినందువల్ల. దీనిని బట్టి అన్నిటికన్నా భక్తి ప్రధానమని తెలుస్తోంది.
ఇంకా నాకు ఏమని అనిపిస్తోదంటేనండీ, ఏదైనా సరిగ్గా పాటించటమువల్లా ఉత్తమ ఫలితములను శీఘ్రముగా పొందవచ్చును. అయితే ఒకోసారి అలా పాటించటము కుదరదు కదండి.
ఉదా..పూజ చేసేటప్పుడు షోడశోపచారములు సమర్పించే సమయములో రత్నఖచిత సిం హాసనము సమర్పించటము విషయములో పుష్పములు వేసి నమస్కరించి సరిపెట్టుకుంటారు గదా.....
అలాగే మధుపర్కములు సమర్పించే విషయములో కూడా చాలామంది అక్షతలు సమర్పించి సరిపెట్టుకుంటారు కదా...... ఇలాగే కొన్నికొన్ని ఇతరమయిన విషయములలో కూడా ఉన్నదున్నట్లు చేయటము కుదరక పోవచ్చు.
ఇలా ధర్మ సందేహములు వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించి ఏమి చేయాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తెలియకపోతే దైవంపైన భారం వేయటము ఉత్తమమయిన పధ్ధతి. ఆ తరువాత పెద్దలు చెప్పిన శ్రీ దైవాపరాధ క్షమాపణ స్తోత్రము చెప్పుకోవలెను. ....
ఇంతవరకు వ్రాసిన దానిలో తప్పులున్నచో దయచేసి క్షమించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
చాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteఏపని అయినా మనస్ఫూర్తిగా చేస్తే ఫలితము కలుగుతుంది అని చెప్పటానికి ఇవన్నీ ఉదాహరణలు కదా. మంచి పోస్ట్.
ReplyDeleteమీకు నా కృతజ్ఞతలండి. మీకు ఈ టపా నచ్చినందుకు, మరియు మీ అభిప్రాయములు తెలిపినందుకు. .
ReplyDeleteమీకు నా కృతజ్ఞతలండి. మీకు ఈ టపా నచ్చినందుకు, మరియు మీ అభిప్రాయములు తెలిపినందుకు. . మీరు చెప్పినది నిజమండి. ఏ పని అయినా మనస్పూర్తిగా చేస్తేనే దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దలు అందుకే ఎన్నో ఉదాహరణలు మనకు తెలియజేసారండి.
ReplyDelete