koodali

Friday, March 31, 2017

ఆదిపరాశక్తి కధలు.



ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 


 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.


Tuesday, March 28, 2017

ఓం...


ఓం
  శ్రీ హేమలంబ(బి )  నామ సంవత్సరము సందర్భముగా........  
 అందరికి ఉగాది శుభాకాంక్షలండి.

వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి.






Friday, March 24, 2017

శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు.. మరి కొన్ని విషయాలు..



శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః 
***********
శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు..

నిర్గుణుడూ నిర్లేపుడూ కేవలం పరమాత్మ ఒక్కడే. అతడు అవ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవల నిర్గుణ. దుర్ జ్ఞేయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మపరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగం. వీరు అభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలూ పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత డిండిమం . ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి విముక్తుడైనట్టే.

**************

ఇక్కడ నా అభిప్రాయాలు  కొన్నింటిని వ్రాస్తాను.


పాతకాలంలో సంగతి ఎలాఉండేదో కాని, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి ప్రసారమాధ్యమాలు బాగా అందుబాటులోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి.

ఇప్పుడు ప్రజలు ఎక్కువమంది అన్నికులాలవారూ  కూడా   పూజల గురించిన నియమాల గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. పాతకాలంలో శైవులు, వైష్ణవులు, ఇలా అనేక పద్ధతులు ఉండేవి. ఒక విధానాన్ని ఆచరించేటప్పుడు పండుగలు కొన్ని ఉంటాయి.

 శివుణ్నీ, విష్ణువును, ఇంకా అందరు దేవతలనూ ఆరాధించేవారికి ఎక్కువ పండుగలు ఉంటాయి.ఇలాంటప్పుడు ఎక్కువరోజులు నియమాలు పాటించే పరిస్థితి కూడా ఉండవచ్చు.

 మాకు శక్తి ఉంది ఎక్కువ దేవతలను ఆరాధించదలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు అలాగే ఆరాధించుకోవచ్చు.


 శక్తిలేనివాళ్ళు మితంగా పూజలు చేస్తూ కూడా  ఎందరో దేవతలను ఆరాధించుకోవచ్చు   లేక   ఒకే దైవాన్ని ఆరాధించవచ్చు..

 లేక, అందరు దేవతలను ఒకే దైవంగా ఆరాధించవచ్చు.

 ఉదా..లలితాదేవిని ఆరాధించటం ద్వారా అందరు దేవతలను ఆరాధించినట్లే ..అని పండితులు తెలియజేసారు.


హిందూ మతంలో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. పెద్దలు ఎన్నో విధానాలను తెలియజేశారు.

దైవాన్ని నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఆరాధించుకోవచ్చు.

ప్రాచీనులు ఏం చెప్పారంటే, శూద్రులు తమ స్వధర్మాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ కొద్దిగా పూజ చేసినా చాలు, గొప్ప ఫలితాన్ని పొందుతారని తెలియజేసారు. మహాభారతంలో ధర్మవ్యాధుని కధ  ద్వారా ఈ విషయం తెలుస్తుంది.

 మన ప్రాచీనులు సమాజబాగు కొరకు చక్కటి ఆచారాలను ఏర్పరిచారు.

అయితే, కొందరు ప్రజల తెలిసీతెలియక మరియు విపరీత ధోరణి వల్ల ప్రాచీనులు ఏర్పరిచిన ఎన్నో ఆచారాల  అసలు ఉద్దేశ్యాల రూపులు  మారే  విధంగా తయారయ్యాయి.


 నా అభిప్రాయం ఏమిటంటే,  జీవితంలో  ఎప్పుడూ దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 

నైతికవిలువలతో జీవించటం గొప్ప పూజ. ఇలా జీవించేవారు దైవకృపకు పాత్రులవుతారు. చక్కటి విలువలతో జీవించటానికి కనీసం ప్రయత్నించాలి.

ధర్మసంకటం కలిగినప్పుడు, మనల్ని సరైన దారిలో నడిపించాలని దైవాన్ని శరణు కోరటం మంచిది.


కొన్ని విషయాలు..బ్రహ్మచర్యం దాంపత్య ధర్మం..




బ్రహ్మచర్యం దాంపత్య ధర్మం..వంటి విషయాల  గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి... 

గృహస్థాశ్రమంలో భార్యాభర్తల ఏకాంతకార్యం విషయంలో నియమాల గురించి  ఎన్నో సందేహాలు వస్తుంటాయి. 

 అయితే, శ్రీ దేవీ భాగవతము ద్వారా ..తెలుసుకున్న కొన్ని విషయములు..

 నారాయణ మహర్షి నారద మహర్షికి తెలియజేసిన కొన్ని విషయములు .
 

జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైధునాలాపాలు అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైధున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను. అని  తెలియజేస్తూ


 ఇంకా...

  బ్రాహ్మణక్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు.సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధసమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి , అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. అని  తెలుస్తోంది.

పై విషయాన్ని గమనిస్తే,

 
 ఎక్కువ నియమనిష్ఠలు ఉండే బ్రాహ్మణక్షత్రియుల విషయంలో కూడా..  
 నియమాల విషయంలో కఠినత లేకుండా, సరళంగా ఉన్నట్లు  తెలుస్తుంది. అందువల్ల ఈ విషయంలో ఎవరూ భయపడనవసరం లేదు.

 
******************


పాతకాలంలో కొందరు దంపతులు సంతానం కొరకు మాత్రమే ఏకాంతకార్యాన్ని అవలంబించేవారట.


లోకంలో ఎన్నో రకాల దంపతులు ఉంటారు.


ఈ విషయంలో దంపతులు ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉండే వారు ఉంటారు. అయితే, భాగస్వామి అభిప్రాయం నచ్చకపోయినా సర్దుకుపోతారు కొందరు. భాగస్వామి అభిప్రాయం నచ్చక వివాహేతరసంబంధాలు చూసుకునే వారు కొందరు ఉంటారు. 

కొందరు భార్యాభర్తలు జనాచారాల పేరుతో..  కష్టంగా ఉన్నాకూడా,  చాలాకాలం జీవితభాగస్వామితో ఏకాంతకార్యానికి దూరంగా ఉంటారు. 


అయితే, జిహ్వచాపల్యాన్ని, కోపాన్ని, అహంకారాన్ని, చెడు ఆలోచనలను నిగ్రహించుకోలేరు. 


నిగ్రహం పాటించలేనప్పుడు , ధర్మబద్ధంగా జీవితభాగస్వామితో ఏకాంతంలో గడుపుతూ, జిహ్వచాపల్యం విషయంలో లిమిట్ పాటిస్తూ, కోపాన్నీ, అహంకారాన్ని, చెడు ఆలోచనలను నియంత్రించుకోవటానికి ప్రయత్నించటం మంచిదనిపిస్తుంది.


  ఎక్కువ కాలం భార్యాభర్తలు ఏకాంతకార్యానికి దూరంగా ఉంటే దంపతుల్లో ఎవరైనా  అసంతృప్తికి గురయితే ఇంట్లో గొడవలు  వచ్చే అవకాశం ఉంది. 


దంపతుల మధ్య  గొడవలు  రాకుండా ఉండటం ముఖ్యం..కుటుంబాలు  బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది.

అయితే, కొన్ని సమయాలలో  భార్యాభర్తలు కొన్ని నియమాలను పాటించటం అవసరం అవుతుంది. . 


ఉదా..సైనికులు , రాజులు యుద్ధ సమయాలలో దేశరక్షణ  విధులలో ఉన్నపుడు  భార్యాభర్తలు  ఎన్నో  నియమాలను పాటిస్తారు.. 


 దీక్షగా పూజలు చేసే సమయాలలో భార్యాభర్తలు  ఎన్నో నియమాలను పాటిస్తారు. 


భార్య గర్భిణిగా ఉన్నప్పుడు పాతకాలంలో భర్తలు  గడ్దం పెంచి నియమాలతో జీవితాన్ని గడిపే ఆచారాలను  ప్రాచీనకాలంలో పెద్దలు తెలియజేసారంటారు.  


  బ్రహ్మచర్యం పాటించేవారికి శక్తి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని  ఆధునికులు కొందరు ఒప్పుకోరు. 


అయితే, బ్రహ్మచర్యం పాటించిన వారికి శక్తి ఎక్కువగా వస్తుందనేది ఎంతో  నిజం. ఈ విషయం బ్రహ్మచర్యాన్ని పాటించిన వారికి చక్కగా తెలుస్తుంది.


వివాహేతర సంబంధాలు, అనైతిక సంబంధాలు తప్పు కానీ, భార్యాభర్తల  సంబంధంలో తప్పు లేదు..


 అయితే, భార్యాభర్తల ఏకాంత కార్యం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. దేనికైనా లిమిట్ ఉంటే బాగుంటుంది. 



ఏదిపడితే అది ఎక్కువగా తింటే శరీరం అరిగించుకోలేదు.  ఇష్టం వచ్చినట్లు ఆహారం తీసుకునే వ్యక్తులు అనారోగ్యం పాలవుతారు.అలాగే శృంగారం విషయంలోనూ లిమిట్ అవసరం.


ఆధునికకాలంలో చుట్టూ ఎన్నో ఆకర్షణలు. ప్రసారమాధ్యమాలు..ఇంకా, ఎన్నో విధాలుగా శృంగారదృశ్యాలు చూస్తూ పిల్లలు పెరుగుతున్నారు. 


చదువులు, ఉద్యోగం అనే  కారణాలతో వివాహాలు ఆలస్యమవుతున్నాయి. 

ఒకే దగ్గర కలిసి ఉంటున్న కొందరి మధ్య అసహజ సంబంధాలు ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 వివాహేతర సంబంధాల కేసులూ ఎక్కువవుతున్నాయి. అనేకకారణాల వల్ల కొందరు భార్యాభర్తలు దూరదూరంగా నివసించటం  ఎక్కువయ్యింది.

ఇలాంటి పరిస్థితులు మారాలంటే, సరైన వయస్సులో వివాహాలు చేయాలి. 


దంపతులు ఉపాధికోసం దూరదూరంగా నివసించటం కాకుండా ఒకే దగ్గర నివసించాలి.అన్యోన్యంగా జీవించాలి.  
 
***********

అయితే, ఎవరైనా సరే, ఒక దీక్షవలె కొంతకాలమైనా సరే లైంగికకార్యానికి దూరంగా ఉన్నప్పుడు చక్కటి ఫలితాలు లభిస్తాయి అన్నది నిజం.


లైంగికవాంఛలను అదుపులో ఉంచుకుంటే ఎన్నో లాభాలున్నాయి. ఇందుకే ప్రాచీనులు పండుగలు వంటి రోజులలో  కొన్ని  నియమాలను పాటించమని తెలియజేసి ఉంటారు.


దయచేసి ఈ విషయాల గురించి వ్యాఖ్యలు వ్రాయవద్దని మనవి.




Thursday, March 23, 2017

మైకుల ద్వారా ఎక్కువ సౌండ్ ..


 
కొన్ని రాజకీయపార్టీలు, షాపుల అడ్వరటైస్ మెంట్స్ వాళ్లు  రోడ్దు  వెంబడి పెద్ద సౌండుతో మైకులో అనౌన్స్ చేస్తూ వెళ్తుంటారు. ఇవన్ని చాలా ఇబ్బందిగా ఉంటాయి.


కొన్ని మీటింగుల సందర్భంగా  ఎక్కువ సౌండుతో మైకులో చెబుతుంటారు. చుట్టుప్రక్కల ఇళ్ల వారికి  సంగతి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.

మైక్ సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా సరిగ్గా వినబడదు. సౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు తల దిమ్ముగా కూడా అనిపించే అవకాశముంది.


ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫోన్ వచ్చినా సరిగ్గా వినబడదు. టివీలో ఏమైనా కార్యక్రమాలు వినాలన్నా సరిగ్గా వినబడవు.


  మైకులు సౌండ్ ఎక్కువగా కాకుండా తగుమాత్రం సౌండ్ ఉంటే  బాగుంటుంది.

************************


మా ఇంటి దగ్గరలో ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో  మైకు పెడతారు.కొన్నిసార్లు ఎక్కువ సౌండ్ పెడతారు.


చాలా దూరంగా ఉన్న ఇళ్లవారికి కూడా వినబడాలని దేవాలయం వారి అభిప్రాయం కావచ్చు.

అయితే, దగ్గరి ఇంటి వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మేము దేవాలయానికి దగ్గరగా ఉన్నాము కాబట్టి చాలా సౌండ్ వినిపిస్తుంది.


 దైవానికి సంబంధించిన విషయాల గురించి ఇలా రాయటం పాపం అని కొందరు అనుకుంటారేమో కానీ, పాపం కాదని నా అభిప్రాయం.

మైక్ ఎక్కువ సౌండ్తో కాకుండా కొద్దిగా తగ్గించి పెడితే ఎంత బాగుంటుందో కదా! అనిపిస్తుంది.


 సౌండ్ ఎక్కువగా లేకుండా తగుమాత్రం ఉన్నప్పుడు బాగుంటుంది. ఇబ్బందేమీ ఉండదు.

పాతకాలంలో మైకులు లేని కాలంలో దైవ స్తోత్రాలను శ్రావ్యంగా గానం చేసేవారట.. కొన్ని స్తోత్రాలయితే పైకి వినిపించకుండా చదువుకునేవారట.


ఇప్పుడు చాలా వాటిని మైకుల్లో గట్టిగా వినిపిస్తున్నారు.
ఇదంతా ఏమిటో అర్ధం కాదు .




భగవంతుడు చండశాసనుడు కాదు....పరమ కరుణా సముద్రుడు , మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..

Sunday, October 31, 2010


సాయి సాయి

పూజా నియమములను ఉన్నదున్నట్లు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి కఠిననియమములను పాటించి ...... దైవాన్ని ఆరాధించి శీఘ్రముగా పరమాత్మను పొందాలనుకొనేవారు ఎందరో ఉంటారు.

సామాన్యులు కూడా సరియైన పధ్ధతులను తెలుసుకోవటం ద్వారా వారికి వీలయినంత నియమములను పాటించటానికి ప్రయత్నిస్తారు.

లౌకికపరమయిన కోరికలను (విద్య, ఉద్యోగం ) సాధించాలంటేనే, ఎన్నో కష్టాలు, త్యాగాలు అవసరమవుతాయి. అలాంటిది మరి, అత్యున్నతమమయిన పరమాత్మను పొందాలంటే కొంచెం కష్టపడటం తప్పదు మరి.

ఏదైనా కష్టపడి పొందిన దానిలో ఉన్న తృప్తి ఎక్కువ కూడా కదండి.

అలాగని అన్ని నియమములను పాటించగలమా ? అని అందరూ నిరాశ చెందనవసరం లేదు. భగవంతుడు సామాన్యులకు, అసామాన్యులకు కూడా సులభంగా అందే అందరివాడు.

ఉదా... అందరూ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పూజలు చేయలేకపోవచ్చు.

అందరికి పెద్ద పెద్ద గ్రంధములు చదివి భగవంతుని గురించి విస్తారంగా తెలుసుకొనే పాండిత్యం లేకపోవచ్చు.

కొందరు ఆరోగ్యం సహకరించకపోవటం, ఇంకా, రకరకాల కారణముల వల్ల కఠిననియమములను పాటించలేకపోవచ్చు.

కానీ భగవానుడు భక్తసులభుడు. కేవలం ప్రేమభక్తి ఉన్నంత మాత్రమునే దైవం భక్తులను అనుగ్రహించిన కధలెన్నో మనకు ఉన్నాయి. అందుకని ఎవరూ నిరాశ పడనవసరంలేదు.

శ్రీ వైభవలక్ష్మీ పూజా వైభవము పుస్తకములో ఏ విధమైన కోరికలు లేకుండా ,కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు సామాన్యనియమములను పాటించటం తప్ప కఠిననియమములను పాటించనవసరంలేదని నేను చదివానండి.

మరి మన లౌకికపరమైన కోరికలు తీరాలంటే చేసే పూజలలొ నియమాలను పాటించటానికి మనము కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు ? .....ఆ కోరికలు కూడా ప్రపంచానికి కీడు చేసేవిగా ఉండకూడదు.

శ్రీ లలితా సహస్ర నామములలో ...సుఖారాధ్యా... అనే నామము  కూడా తెలుపబడింది.

ఇంకా,

శిరిడి సాయి ఇలా అన్నారట....." ఎవరు అదృష్ష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో, వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరంలేదు. భక్తి యున్నచోటనే నా నివాసము " అని.

Monday, March 20, 2017

గోవు ...గృహప్రవేశం.



గోవు   సకల   దేవతాస్వరూపం   కాబట్టి,   నూతన  గృహప్రవేశ   సమయంలో     ఆవును    తీసుకు  వచ్చి     గృహప్రవేశం   చేయిస్తే  మంచిదంటారు. .


 పాతకాలంలో   అపార్ట్మెంట్స్  లేవు  కదా  !  అప్పుడు     గోవు   గృహప్రవేశానికి    ఏమీ  ఇబ్బంది  ఉండేది  కాదు.

 అయితే  ఈ  రోజుల్లో  అపార్ట్మెంట్స్  పుణ్యమాని  ఎన్నో  అంతస్తుల  ఎత్తున  ఇళ్ళు  ఉంటున్నాయి  . 

అయినా  మనవాళ్ళు  ఊరుకోరు  .....  .  కొందరు   ఆవును  పైవరకు       తీసుకెళ్ళి    మరీ   గృహప్రవేశం  చేయిస్తున్నారు. 

ఇవన్నీ  చూసే  ఈ  కాలం  పిల్లలు  పూర్వులు  ఇలాంటి  ఆచారాలను  ఎందుకు  పెట్టారో  !  అనుకునే  అవకాశం  ఉంది.     పూర్వీకులు  ఈ  ఆచారం  పెట్టినప్పుడు   ఇలాంటి  అపార్ట్  మెంట్స్   లేవు  కదా  !

మా   చిన్నతనంలో  మేము  ఒక  గృహం   కొన్నాము.  .  గృహప్రవేశానికి  తెల్లవారు  ఝామున  ముహూర్తం  కుదిరింది.

గృహప్రవేశానికి   మేము  తెల్లవారు  ఝామున  వెళ్ళగా  ఇంటి  ఆవరణలో    ఒక  ఆవు  దూడకు    జన్మ  ఇచ్చింది.  ఆ  ఆవు  ఎవరిదో  మాకు  తెలియదు.  రోడ్డు  మీద  కొన్ని  ఆవులు  తిరుగుతుంటాయి  కదా  ! ఎవరి  ఆవో  మరి.

అలా ఆ   ఆవు  దాని  కదే  రావటం,     దూడ  పుట్టడం  ...  చాలా  శుభ సూచకమ్   అన్నారు.  అలా    జరగటం  మాకు  కూడా  చాలా  ఆశ్చర్యాన్ని  ,  ఆనందాన్ని  కలిగించింది. 

  నూతన గృహప్రవేశ  సమయంలో  ఆవు  యొక్క  ప్రవేశం   మంచిది ...   అని  పెద్దలు   చెప్పిన  మాట  నిజమే  కానీ , 

 మారిన  కాలమాన   పరిస్థితుల్లో   ఎంతో  ఎత్తైన  అపార్ట్మెంట్స్  ను     బలవంతానా (  మెట్ల మీద   )   ఎక్కించి   ఆవుదూడలను  ఇబ్బంది  పెట్టటం   అనేది   ఎంతవరకూ  భావ్యమో   ఎవరికి   వాళ్ళు  ఆలోచించుకోవాలి. 

  ఇలా   పెద్దలు  చెప్పిన  ఎన్నో   ఆచారాలు     రూపు  మారి  పోతున్నాయి  కొందరు  ప్రజల    విపరీత  ధోరణి  వల్ల.






ఆచారాలు అనుకుంటూ ..అతిగా ఆలోచిస్తూ..


ఈ మధ్య జరిగిన విషయాన్ని తెలియజేస్తాను.  మాకు  తెలిసినవాళ్ళు వాళ్ళింటికి రమ్మని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. మేము కూడా వాళ్ళింటికి వెళ్ళాలని అనుకున్నాం. 

అనుకోకుండా మా బంధువులు కూడా మొన్న వారింటికి  వెళ్దామని అనటంతో  బయల్దేరటం జరిగింది.  అయితే, అప్పటికే సాయంత్రమవుతోంది.

తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమవుతుందేమో అనిపించి,  త్వరగా సాయంకాలపు దీపారాధన కొంచెం పూజ చేసి మరికొంచెం పూజ తిరిగి వచ్చాక చేద్దాములే అనుకుని వాళ్ళింటికి వెళ్ళాము. 


అక్కడ మాటల్లో ఆ ఇంటామె ఏమన్నదంటే, వాళ్ళ దూరపుబంధువు మరణించటం వల్ల మైల కారణంగా ప్రస్తుతం పూజ చేయటం లేదని చెప్పటం జరిగింది.

ఆ మాటలు వినటంతోనే నా మనసులో అయ్యో !తిరిగివెళ్ళాక కొంచెం సేపు పూజ చేయాలనుకున్నాను కదా! ఇప్పుడు మళ్లీ తలస్నానం చేసి  పూజ చేయాలి కాబోలు  లేక పసుపు నీళ్లు జల్లుకుని పూజ చేస్తే సరిపోతుందా ? ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాకూడా పరిపరివిధాలా  ఆలోచనలు వచ్చాయి.


 ఇంటికి వచ్చాక ..తలస్నానం చేయాలా ? వద్దా ? అనుకుంటూ..కొద్దిసేపటి క్రితం వాళ్ళింటికి వెళ్ళేముందు స్నానం చేసే వెళ్ళాను కదా! ఇప్పుడు అసలే దేశంలో ఎందరో నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే,  మళ్ళీమళ్ళీ స్నానాలు చేస్తూ నీళ్లు వేస్ట్ చేయటం మరింత పాపం..అని సర్ది చెప్పుకోవటానికి ప్రయత్నించాను కానీ, కుదరలేదు. 

అయితే,  నా పీకులాటను  జయించలేకపోయాను. 

ఇష్టం లేకపోయినా  తలస్నానం కానిచ్చాను. మళ్ళీ  కొద్దిసేపు పూజ చేసాను కానీ ...ఆలోచనలతో మనస్సు అయోమయంగా అనిపించింది. 

ఇవన్నీ పాటించాలంటే కష్టంగా ఉంది. అలాగని పాటించకుండా ఉండాలన్నా భయంగా ఉంది.


వచ్చేటప్పుడు  ఆమె కొన్ని కమలా పండ్లు ఇవ్వటం జరిగింది. మైల ఉన్న ఇంటినుంచి తెచ్చిన కమలాపండ్లు ఏం చేయాలి? వాటిపై కూడా పసుపు నీళ్లు జల్లి తినవచ్చా? లేక బైట పడేయాలా?  బైట వేస్తే ఆ పండ్లు ఎవరైనా తీసుకుంటే మైల వారికి అంటుకుని  నాకు  పాపం తగులుతుందా?  ఇలా ఎన్నో సందేహాలు వచ్చాయి.


 నాకు ఏమనిపించిందంటే,  ఆలోచనలకు అంతుండదు. మరీ ఎక్కువ  ఆలోచించకుండా  కుదిరినంతలో ఆచారాలను పాటించటం మంచిది. అనిపించింది.

 ఉదా..మైల ఉన్న ఇంటికి వెళ్ళి వచ్చాక స్నానం చేయటం కుదరనప్పుడు కాసిని పసుపునీళ్ళు జల్లుకుంటే సరిపోతుందనిపించింది. పసుపు నీళ్ళు జల్లుకుని శుద్దిచేయటం కూడా పెద్దలు చెప్పినదే కదా! 


 అయినా,  ఎక్కడో దూరపుబంధువుల వల్ల వచ్చిన మైలకు పెద్ద పట్టింపులు  ఉండకపోవచ్చు. పరిస్థితిని బట్టి మనం ప్రవర్తించాలి.

డాక్టర్ల విషయంలో  అయితే, ఇలాంటి పట్టింపులు పాటించాలంటే అస్సలు కుదరదు.

********************
  ఇలాంటి  ఆచారాలు ఏర్పరచటం  వెనుక కొన్ని కారణాలు ఉండిఉంటాయి. సమీప బంధువులు మరణించిన  వారికి మైల అనటంలో కొన్ని కారణాలు ఉంటాయి.

 విచారంలో ఉన్నవారు కొద్దిరోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలనటంలో ఎన్నో అర్ధాలుంటాయి.

  ఉదా..శుభకార్యం వెంటనే పెట్టుకుంటే  పోయినవారు గుర్తు వచ్చి దుఃఖం  కలిగితే ,శుభకార్యం జరుగుతున్న వేళ చుట్టుప్రక్కల ఇతరులకూ విచారం కలిగే అవకాశముంది.

 ఇంకా, మైల ఉన్న వారింటికి  పలకరింపులకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు స్నానం చేయటం వల్ల అక్కడి వారు వెలిబుచ్చిన విచారం నుంచి కొంత మనసు తేలికవుతుంది. 

 అయితే, దూరపు బందువుల వల్ల మైల వచ్చిన వారికి అంత విచారం ఉండకపోవచ్చు కాబట్టి,   పలకరింపులకు వెళ్ళి వచ్చిన వారు తప్పనిసరిగా తలస్నానాలు చేయనవసరం లేదేమో... కొన్ని పసుపునీళ్ళు జల్లుకుంటే సరిపోతుందని నాకు అనిపించింది.

ఏమైనా పరిస్థితిని బట్టి ఎవరి విచక్షణతో  వారు నిర్ణయాలు తీసుకోవాలి.

అంతేకానీ, ఆచారాలు అనుకుంటూ..అతిగా ఆలోచిస్తే ..గందరగోళం లో పడి .. జీవితలక్ష్యమైన దైవభక్తికే దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.


Sunday, March 19, 2017

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.

Monday, October 4, 2010


దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.



నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ? అనిపించిందండి. తరువాత నాకు జరిగిన అనుభవాల ద్వారా నాకు అనిపించినది చెబుతాను అండి.


ఒకసారి ....... గుడికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు జరగకుండా పూజ జరగాలనే ఆలోచనలోపడి ................ ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోవటము జరిగేది. అంటే తీర్ధప్రసాదములు తీసుకుని బయటకు వచ్చాక తీరిగ్గా గుర్తు వచ్చేది.


ఏమంటే హుండీలో కానుకలు సమర్పించటము మరిచిపోవటమో, లేక తీసుకువెళ్ళిన పండ్లు సమర్పించటం మర్చిపోయి సంచీలో ఉండిపోవటమో ........ కొన్ని ఉపాలయములు చూడలేదని గుర్తు రావటము ........ ఇలాగన్నమాట..........


ఇలా గుడిలోనుంచి ఒకసారి బయటకువచ్చాక ............. మళ్ళీ తిరిగి వెళ్ళి ఉపాలయములు దర్శించుకోవటము ............... ఇలా చేసినప్పుడు చుట్టూ అక్కడివాళ్ళు నన్ను వింతగా చూస్తున్నట్లు నాకు అనిపించిందండి.

ఎందుకంటే ఇప్పుడే తీర్ధప్రసాదములు తీసుకుని వెళ్ళి మళ్ళీ ...................... అప్పుడే వస్తే ఎవరైనా కొంచెం ఆశ్చర్యముగా చూస్తారు గదండి. ( ఏమో వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు అలా అనిపించేది. )


ఇలా కొన్ని సార్లు జరిగాక నాకు ఏమని అనిపించిది అంటేనండి.......ఇలా ఎవరూ అతిగా చేయకుండా ...... అంటే ఏదోఒకటి మర్చిపోయి గుడిలోకి బయటకు తిరగటం ...... ఇలాంటివి ఆపటానికే పెద్దలు అలా చెప్పారేమోనని.


ఇలా ఒకటిరెండుసార్లు జరిగాక నాకు ఓపిక లేక భగవంతునితో దేవా ......... పూజలో జరిగే లోటుపాట్లకు క్షమించు..... నాకు శక్తి మేరకే చేయగలను . అని చెప్పేసాను..


అప్పటినుంచి ఏదయినా మర్చిపోయి ఇంటికి వచ్చేసినా భయపడటంలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ......... లోటుపాట్ల గురించి అతిగా ఆలోచించకుండా, ప్రశాంతముగా నా శక్తి కొలది ప్రవర్తించటము మంచిదని అలా ప్రయత్నిస్తున్నాను.


ఇంతగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటేనండీ ..... ఈ రోజుల్లో దేవుని గురించి తక్కువగా ............. విధి విధానముల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండే నా లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారేమోనని......... ఇలా వ్రాయాలనిపించిందండి.


ఇలాంటివారు అతిగా ప్రవర్తించి మూఢత్వముగా మారకూడదని నా ఆలోచన.

పూజలో జరిగే లోటుపాట్ల వలన వచ్చే పాపం కన్నా.... అతిగా ఆఆలోచనల్లో పడి భగవంతుని భక్తికి దూరమవ్వటము మరింతపాపమని నాకు అనిపించింది అండి.

 సాయి కూడా పూజ ఎట్టిదయినా బుద్ది ప్రధానమనితెలియజేసారట.
 రామకృష్ణపరమహంస వారు కూడా దైవముతోమనము చనువుగా ఉండాలి....... భయపడటమెందుకు అనిఅనేవారట..

.అసలు పూజ చెయ్యటము దైవం కొరకే ...... మనముఅసలు లక్ష్యమునకు దూరము కారాదు. 

3 COMMENTS:

  1. అన్ని విధాల పూజల లోకి 'మానసిక పూజ ' ఉత్తమమైనది అంటారు...మనసు దైవం మీద లగ్నం చేస్తే చాలు....ఎక్కడో అలోచిస్తూ గంటలు గంటలు పూజ చేసే కంటే మనస్సులో ఒక్క క్షణం చిత్తసుధ్ధిగా దేవుణ్ణి తలుచుకున్నా చాలు!!
    ReplyDelete
  2. మీకు నా కృతజ్ఞతలండి, మీరు చక్కగా చెప్పారండి.
    ReplyDelete

Saturday, March 18, 2017

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..

 

Saturday, September 18, 2010

 

ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది.

అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.

అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు.

ఇంకో సంఘటన. ........మేము  చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి.  తిరిగి వచ్చే
టప్పుడు  మా  ఇంట్లో వారు  ఫ్రెండ్స్ ఇంటికి,  షాప్స్ కు వెళ్ళాలంటారు.  నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.  నేను అలా ఎవరింటికీ వెళ్ళకూడదట..అని చెప్తే చిన్న గొడవ అవుతుంది.
 
నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో   సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని.

కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం కాదు. . ఇంకా ఏమని అనుకున్నానంటేనండి ..భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 

Thursday, March 16, 2017

ఒక గొప్ప భక్తుని గురించిన కధ...


ఒకప్పుడు నారదులవారు తామే గొప్ప విష్ణుభక్తులమని భావించి, ఆ మాట విష్ణుమూర్తి ద్వారా వినాలనుకుని వైకుంఠానికి వెళ్లి అడగగా, విష్ణుమూర్తివారు  భూలోకంలో కూడా ఒక రైతు తనకు గొప్ప భక్తుడని తెలియజేస్తారు. 


 అంత గొప్ప భక్తుడు ఎలా ఉంటాడో చూడాలని కుతూహలంతో నారదుడు భూలోకానికి వెళ్లి చూడగా, ఆ రైతు తన స్వధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ తనకు వీలు కుదిరినంతలో విష్ణుమూర్తిని తలచుకోవటం గమనించి,

 నారదులవారు విష్ణుమూర్తితో ...కొద్దిసేపు మాత్రమే భగవంతుని తలచుకునే రైతు అంత గొప్ప భక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించగా..

విష్ణుమూర్తి ..అంచులవరకూ నిండుగా తైలంతో నిండిన ఒక పాత్రను నారదుని తలపై ఉంచుకుని తైలం కింద ఒలకకుండా కొంతదూరం వెళ్లి రమ్మంటారు.

తిరిగి వచ్చిన నారదునితో.. ఇంతవరకూ ఎన్నిసార్లు దైవాన్ని తలచుకున్నావని విష్ణుమూర్తి  ప్రశ్నించగా, తైలం క్రింద ఒలకకుండా జాగ్రత్తగా చూసుకునే కంగారులో తాను దైవప్రార్ధన సరిగ్గా చేయలేకపోయానని నారదుడు సమాధానమిస్తారట.

 ఈ కధ వల్ల ఏమని తెలుసుకోవచ్చంటే .. స్వధర్మాన్ని నిజాయితిగా పాటిస్తూ వీలుకుదిరినంతలో దైవప్రార్ధన చేసినా చాలు .. దైవానుగ్రహాన్ని పొందవచ్చని తెలుస్తుంది.

ఈ కధను అంతర్జాలంలో ఒక దగ్గర ఇంగ్లీష్ లో చదివి  రాసాను. సంభాషణల్లో ఎక్కడైనా తేడాలు  ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..


ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.

ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.


ఆచారవ్యవహారాల్లో  క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. 

ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు. 

అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 

ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది. 


 షిరిడి సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. ఇంకా,  భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.

సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట....

 .భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.

**************
ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం. 

ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.


దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు. 

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.


 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.


 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు  మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 


Wednesday, March 15, 2017

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..మరి కొన్ని విషయాలు...



మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో  అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.

 అయితే, అపార్ట్ మెంట్  లో  తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు.


ఆ పెద్దామె ఎన్నో  కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు.

ఉదా.. సెక్రటరీ,  శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు  బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట.

ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో  గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు.


కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.

నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను.

సెక్రటరీ గారు  విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు.


విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి.

అప్పటివరకూ విపరీతంగా  హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు  ఆశ్చర్యం అనిపించింది.

కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో  ఆ అపార్ట్ మెంట్  మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్   విషయాలు సరిగ్గా తెలియలేదు.


 అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట.  తరువాత ఏం జరిగిందో తెలియదు.

 ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో?


*******************
మరి కొన్ని విషయాలు... 

శుభకార్యం కొరకు శుభముహూర్తం చూడాలంటే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

ఉదా..ఒక కారు కొనాలంటే నెలలో తక్కువ  ముహూర్తాలే  చెప్పబడి  ఉంటాయి. 

వారి నక్షత్రానికి..  వస్తువును  కొనాలని అనుకునే సమయానికి ఉన్న నక్షత్రం...విపత్తార  కాకుండా ఉండాలి.

ఇంకో రోజు అన్నీ బాగున్నాయనుకుంటే,  మంగళవారం, శనివారం వచ్చిందనుకోండి. 

మంగళవారం జయవారం ..అంటూనే కొన్ని పనులు చేయకూడదంటారు. వాహనం కొనటం చేయవచ్చోలేదో ? కానీ,  కొందరికి మంగళవారం ఏ పనీ చేకూడదని  కూడా పట్టింపు ఉంటుంది. 

ఇంకో రోజు అన్నీ కుదిరేటట్లు ఉంది.. అనుకుని సంతోషపడేసరికి మూఢమి  జరుగుతోందని గుర్తు వస్తుంది.ఈ మూఢమి  తమిళులకు లేదట. హిందువులలోనే ఎన్నో తేడాలున్నాయి. ఒకరికి మంచి సమయం, ఇంకొకరికి మంచికాదు అని.

 ఇలా చూస్తూ ఉంటే వాహనం కొనటం ఎప్పటికప్పుడు వాయిదాపడుతుంటుంది. ఏ పనైనా  ఎప్పటికప్పుడు  వాయిదాలు పడుతుంటే కష్టం. 

అసలు ఏ ముహూర్తానికైనా 100 శాతం అన్నీ సరిగ్గా కుదరటం చాలా కష్టం.

 అందువల్ల, ఎవరికి వారు శుభముహూర్తాలు చూసుకోవటం కాకుండా, పండితులకు చెబితే వారే నిర్ణయిస్తారు. ఎవరికి వారు ముహూర్తం చూసుకుంటే చూస్తూచూస్తూ దేన్నీ విడిచిపెట్టలేరు. బయటివారైతే పట్టువిడుపుతో ఉన్నంతలో మంచి ముహూర్తం నిర్ణయించి ఇస్తారు.

దయచేసి దిగువన  లింక్ వద్ద కూడా చదవగలరు. 

పంచాంగం..మరి కొన్ని విషయాలు...

***************
ప్రశాంతంగా కొద్దిసేపు  పూజ చేద్దామంటే, అక్కడ కూడా  ఎన్నో నియమాలు, ఆంక్షలున్నాయి.

ఉదా..  దీపంలో  ఇన్ని వత్తులే ఉండాలి... అని  చెబుతారు .   ఇలాంటి  నియమాలను ఉల్లంఘిస్తే బోలెడు కష్టాలు వచ్చిపడతాయని భయపెడుతుంటారు కొందరు.

 పూజలో పొరపాట్లు వస్తే ..  కొత్త కష్టాలొస్తాయంటే  అయోమయం  కలుగుతుంది.   

 పాపపరిహారార్ధం చేసే పూజలకు, కోరికలు తీరటం కొరకు చేసే పూజలకు ఎన్నో నియమాలు ఉండవచ్చు.

 కానీ, నిత్యపూజకు కూడా ఎన్నో నియమాలు చెబుతుంటారు. 

నియమాల విషయంలో కూడా  భిన్నాభిప్రాయాలున్నాయి.

నియమాలు ఉండటం ఎంతో అవసరమే. అలాగని ప్రతిదానికి విపరీతమైన నియమాలు, నిషేధాలు ఉంటే  విసుగుపుట్టి, అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది.

  చాలా  నియమాలు ప్రాచీనకాలం నుండి ఉన్నవి కాకపోవచ్ఛు . మధ్యకాలంలో చేర్చబడ్డవి కావచ్చు . 

గ్రంధాలలో కూడా కొన్ని విషయాలు (ప్రక్షిప్తాలు)మధ్యకాలంలో చేర్చబడ్డాయంటారు. 

ఇవన్నీ చూస్తే ఏం చేయాలో? ఏం చేయకూడదో ?  అని అయోమయంగా అనిపిస్తుంది. 
*************
 ఇంకో  విషయం ఏమిటంటే,  నియమాలను పాటించటం విషయంలో కొన్నిసార్లు కొందరు కుటుంబసభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వస్తున్నాయి.

ఇంట్లో గొడవలు కూడా జరుగుతుంటాయి.ఇలాంటప్పుడు  ప్రశాంతంగా పూజ కూడా చేయటం కష్టం.

 నియమాల విషయంలో భయం ఉన్నవారు వాటిని పాటించాలనుకుంటే ...కొందరు కుటుంబసభ్యులేమో నీ చాదస్థంతో మమ్మల్ని విసిగించవద్దంటారు.

ప్రాచీనులు  ఏం చెప్పారంటే, కలియుగంలో పెద్దపెద్ద పూజలు చేయలేకపోయినా, దైవనామస్మరణ చక్కటిమార్గమని తెలియజేసారు.

 జీవితంలో దైవభక్తి కలిగి ఉండి, పాపభీతి కలిగి, నైతికవిలువలకు విలువనిస్తూ జీవించటానికి ప్రయత్నించటం వల్ల దైవకృపను పొందగలరు. సరైన పద్ధతిలో జీవించే శక్తినిమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిది. 

 దైవస్మరణకు, దైవనామస్మరణకు ఆంక్షలు  ఉండవు..  చక్కగా దైవాన్ని తలచుకోవచ్చు.
*****************
జీవితంలో అన్నీ తేలికగా జరిగిపోవాలంటే కుదరదు. సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలంటేనే ఎంతోకొంత  కష్టపడాలి.అలాంటిది జీవితంలో ఉన్నతమైన మోక్షం..  దైవాన్ని పొందాలంటే ఎంతోకొంత కష్టపడక తపదు.కొన్ని నియమాలను పాటించక తప్పదు.

అయితే, మూఢాచారాలను, అర్ధం లేని నియమాలను వదిలేయాలి.
కొన్ని ఆచారాలను గమనిస్తే...

ఉదా..గృహప్రవేశసమయంలో గోమాతను ఇంట్లో ప్రవేశింపజేయటాన్ని ఒక ఆచారంగా పాటిస్తారు. అలాగని ఆధునిక కాలంలో అపార్ట్మెంట్స్ గృహప్రవేశాలలో... గోవులను కష్టపెడుతూ బలవంతంగా మెట్లపైకి లాక్కెళుతూ గృహప్రవేశాలు జరుపుకోవటం సరైనది కాదు.

 అలా చేయటం కన్నా, మనసులో గోమాతను స్మరించుకోవటం మంచిది. గోశాలకెళ్లి గోవులకు కొంత గ్రాసం సమర్పించటం వంటివి కూడా చేయవచ్చు.

ఉదా..ఏదైనా పనికొరకు బయలుదేరివెళ్ళేటప్పుడు భర్త మరణించిన స్త్రీ ఎదురువస్తే అపశకునం అని వెనక్కి వెళ్లిపోతారు కొందరు. అలా చేస్తే ఆ స్త్రీ మనస్సు బాధపడుతుంది. 

ముత్తైదువ ఎదురువస్తే మంచి శకునమని నమ్ముతారు. 

భర్త పోయిన స్త్రీలలో అయినా,  భర్త ఉన్న స్త్రీలలో అయినా...మంచిగుణాలు, చెడ్డగుణాలు ఉన్నవారుంటారు. కొంత మంచి,కొంత చెడుగుణాలు ఉన్నవారుంటారు. 

 చెడుప్రవర్తన గలవారి శకునం మంచిదికాదని నా అభిప్రాయం. 

ఎవరు ఎటువంటి వారో మనకు తెలియదు కాబట్టి, ఎవరు ఎదురు వచ్చినా వారి ముందే గిరుక్కున వెనక్కి తిరిగివెళ్ళకుండా, మనస్సులో దైవాన్ని ప్రార్ధించుకుని ముందుకు  వెళ్ళవచ్చు.ఇలా ఎన్నో విషయాలుంటాయి.  

జీవితంలో  విచక్షణతో ప్రవర్తించటం మంచిది. మనకు తోచనప్పుడు సరైన బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిది.


  .మన పూర్వకర్మ, వర్తమానకర్మ..ఇవన్నీ బేరీజు వేసుకుని దైవం మనకు తగిన విధంగా ప్రసాదిస్తారు.