koodali

Wednesday, November 30, 2016

దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..2..

 
 
కొన్నినెలల క్రిందట ఒకసారి నేను  మనియార్డర్ చేయటానికి పోస్టాఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెబుతాను. 

పోస్టాఫీసులో కొందరు వృద్ధులు ఉన్నారు.వాళ్ళు పెన్షన్ల కోసం వచ్చారట.


పోస్టాఫీసులో పెన్షన్లు ఇస్తున్నారని పేపర్లో  రాసారు.మైకులో చెబుతున్నారు. అందుకని వచ్చామని అడుగుతున్నారు. 


అయితే పోస్టాఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ..


వార్తలు వచ్చాయి గానీ,  మాకు ఇంకా డబ్బు అందలేదు. మేం ఏం చెయ్యం? రేపు డబ్బు వస్తుందేమో? మళ్ళీ రండి అంటున్నారు. 


 ఆ వృద్ధులలో దూరం నుంచి ఎండలో నడిచి వచ్చిన వారూ ఉన్నారట.


 ఇక చేసేదేమీ లేక వృద్ధులలో కొందరు తిరిగి వెళ్ళారు.


 ఇది చూసిన తరువాత నాకు ఏమనిపించిందంటే... 


 ఈ రోజు పోస్టాఫీసుల నుండి వృద్ధులకు డబ్బు వస్తుందని వార్తలలో చెబుతున్నారు..పోస్టాఫీసుకు వెళ్తే డబ్బు రాలేదంటున్నారు.


అయితే, ఇప్పుడు ఈ వృద్ధులు ఇంటికి వెళ్తే.. 


ఇంట్లో వాళ్ళు , ఈ వృద్ధుల మాటలు నమ్మకుండా ఆ డబ్బు ఏం చేసావని ?  వృద్ధులని అనుమానించే పరిస్థితి కూడా ఉండొచ్చు...అనిపించింది.


ఇలా రకరకాల సంఘటనలు ఉంటాయి. 


దేశంలో..  ఇప్పటికిప్పుడు   డిజిటల్ లావాదేవీలంటే ఎన్నో కోణాల నుంచి ఆలోచించాలి.  ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.


**********

మేము కొన్నేళ్ళు చెన్నైలో ఉన్నాము.మాకు తమిళ్ సరిగ్గా రాదు.


అయితే షాపింగ్ కొరకు మాల్స్ కు వెళ్తే కార్డ్ వాడటం వల్ల మాటతో పనిలేకుండా సరుకులు కొనుక్కునే అవకాశం ఉండేది. 


అయితే, షాపులలో కార్డ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


 బిల్ చెల్లించటం కొరకు షాప్ వాళ్ళకు కార్డ్ ఇచ్చి మరిన్ని సరుకులు కొనటానికి వెళ్ళకూడదు. 


కార్డ్ పక్కకు తీసుకెళ్ళి నెంబర్ కనుక్కుని ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశముందని తెలిసినవాళ్ళు చెబుతున్నారు. 


అందువల్ల,  కార్డ్ ఇచ్చి బిల్ చెల్లించి వెంటనే కార్డ్ తీసుకోవాలి.


( మామూలుగా అయితే షాప్ వాళ్ళు  
కార్డ్ వెంటనే ఇచ్చేస్తారు.)


అయితే, మోసం చేయాలనుకుంటే ఎన్నో పద్దతులుంటాయి. 


వినియోగదారులు గట్టిగా అడగాలన్నా విషయం సరిగ్గా తెలియని పరిస్థితి ఉండొచ్చు..


**********
కొన్ని విదేశాలలో.. షాపుకు వెళ్ళి వస్తువులపై ఉన్న ధరల సూచిని మిషన్ వద్ద చూపించి మనమే సొంతంగా బిల్ చెల్లించే ఏర్పాట్లు కూడా ఉన్నాయట.


 (అంటే, మన వద్ద ఉన్న కార్డ్ షాప్ వాళ్ళకు ఇవ్వకుండా  మనమే కార్డ్ తో బిల్ చెల్లించవచ్చన్నమాట.)


కార్డ్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి .. మన నెంబర్ ఇతరులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


తరచు సిం మార్చటం మంచిదంటున్నారు.


 ఏమైనా ఇకమీదట దేశంలో సైబర్ నేరాలు ఎక్కువ కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.


ప్రస్తుతానికి 100, కొత్త 500 నోట్లు అందుబాటులోకి తెచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి. 


క్రమంగా నగదురహిత లావాదేవీల గురించి నేర్చుకోవచ్చు.



దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..1..

 
సైబర్  నేరాల  వల్ల బాగా చదువుకున్న వాళ్ళుకూడా మోసానికి గురవుతున్న ఈ రోజుల్లో.. 
టెక్నాలజీ అంతగా తెలియని వాళ్ళు ఎక్కువగా మోసపోయి డబ్బుపోగొట్టుకునే అవకాశాలున్నాయి. 
............

మనదేశంలో ఎక్కువమంది ప్రజల ఆర్ధికపరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళలో కొందరు  పెద్ద మాల్స్ కు  వెళ్ళటానికి  జంకుతారు. 

ఉదా ..మా బంధువుల ఇంట్లో పనిచేసె అమ్మాయి కుక్కర్ కొనుక్కోవాలనుకుందట. 

కుక్కర్ అమ్మే షాపుకు వెళ్ళటానికి తనకు జంకు అని చెప్పి, ఇంటామెతో   తనకు మంచి కుక్కర్ కొని తెమ్మని ..డబ్బు తానే ఇస్తానని  అడిగిందట. 

ఇది ఎందుకు రాసానంటే.. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో   ప్రజలు ఉన్నపళాన అందరూ నగదురహిత లావాదేవీలు చేయాలంటే ప్రజలకు కష్టమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు గ్రామీణులు సరుకులు కొనుక్కోవటానికి వీలుగా గ్రామాలలో మాల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. 

అక్కడే కుక్కర్లు  వంటి వస్తువులు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది.

***********
ఇంకో సంఘటన చెబుతాను. మాకు ఇంట్లో అంతర్జాలం సౌకర్యం ఉంది. నేను ఒకసారి దేవాలయానికి ఆన్ లైన్ ద్వారా కొంత సొమ్ము పంపాలనుకున్నాను. 

నాకు చేతకాకుంటే ఇంట్లో వాళ్ళు సహాయం చేసారు. ఇంకోసారి ఆన్ లైన్లో ప్రయత్నిస్తే కుదరలేదు.

దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్ళి మనియార్డర్ చేసాము. 

ఇంకొకసారి, మనియార్డర్ చేద్దామని వెళ్తే అక్కడి సిబ్బంది మిషన్ పనిచేయటం లేదన్నారు. 

బాగవటానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని అన్నారు. 
************

పోస్టాఫీసుకు వచ్చే వాళ్ళలో చదువు అంతగా రాని వాళ్ళు , చదువు వచ్చినా అప్లికేషన్స్ రాయటం చేతకాని వాళ్ళు కూడా ఉంటారు. 

నేను పోస్టాఫీస్ వద్ద ఉన్నప్పుడు ఒకామె వచ్చి ఏదో అప్లికేషన్  చూపించి,  రాసిపెట్టమని నన్ను అడిగింది. అవన్నీ నాకు తెలియదు.

 తెలిసీతెలియక నేను ఏదో రాస్తే తప్పులు వస్తే కష్టమని భావించి అప్లికేషన్ రాయటం నాకు తెలియదని చెప్పాను. ఆమె  వెళ్ళిపోయింది.

 ఇలాంటి దేశంలో అంతా నగదురహిత పద్ధతులు అంటే ..

.చదువు రానివాళ్ళు ప్రతిదానికి ఇతరుల సహాయం అడగవలసి వస్తుంది.అప్పుడు వాళ్ళను  మోసం చేసే వాళ్ళూ ఉంటారు. 

ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైద్యవృత్తిలో ఉన్నవాళ్ళలో కూడా బ్యాంకింగ్ గురించి సరిగ్గా తెలియనివారున్నారు. 

వారిలో కొందరు వివరాల కోసం బ్యాంక్ వాళ్ళను, సిఏ వాళ్ళను అడుగుతారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఎవరి పని బిజీ వాళ్ళది. 

ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలనూ అందరూ తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది ?
..............
ఇందువల్ల అందరూ డిజిటల్ లావాదేవీలకు మారటం కంటే ..పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వటం ..చిన్నమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు నగదు వాడటం జరిగితే బాగుంటుంది.
 

విదేశాలకు తరలించబడిన నల్లడబ్బు..మరియు ..

విదేశాలకు తరలించబడిన నల్లడబ్బును తిరిగి రాబట్టాలని డిమాండ్లు చేయటం తేలికే గానీ ..ఆచరణలో ఎన్నో సమస్యలు ఉంటాయి.

మనదేశం నుంచి సంపద  విదేశాలకు తరలకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి విదేశాలకు తరలించిన నల్లడబ్బును వెనక్కితీసుకురావటంలో అనేక విషయాలుంటాయి. 


దేశంలో ఎందరో పేదరికంలో ఉంటే దేశం నుండి  సంపదను విదేశాలకు తరలించేవారిని ఏమనాలి? ఇది దేశానికి ద్రోహం చేయటం అని ఎందుకు అనకూడదు ?


 దేశం నుండి  సంపదను విదేశాలకు తరలించే స్వదేశీయులకే బుద్ధిలేనప్పుడు, తమ లాభం తాము చూసుకుంటున్న విదేశాలు డబ్బు తరలింపుకు తేలికగా ఒప్పుకుంటాయా?

 అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులకు లొంగి ఈ మధ్యనే కొన్ని దేశాలు తమవద్ద నల్లడబ్బు దాచిన వారి వివరాలు అందిస్తామని ముందుకు వస్తున్నాయంటున్నారు.


****************


ప్రస్తుతానికి మన దేశంలో పెరిగిపోతున్న నల్లడబ్బు కట్టడిచేయాలని ప్రయత్నాలు చేయటం ఏంతో అభినందనీయం.

పెద్దనోట్ల రద్దు, బినామీ వ్యవహారాల కట్టడి, బంగారం కొనుగోళ్ళకు పాన్ కార్డ్ ..వంటి చర్యలు దేశభవిషత్తుపై కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. 


పెద్దనోట్ల రద్దు తరువాత 10 రోజులతరువాతైనా  100 నోట్లు, కొత్త 500 నోట్లు ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కష్టాలు తప్పి.. ప్రభుత్వానికి విపరీతమైన పేరు వచ్చేది. 


పెద్దనోట్ల రద్దు తరువాత ఇన్నిరోజులు గడిచినా 100 మరియు కొత్త 500నోట్లు  ఎక్కువగా అందుబాటులోకి రాకపోవటం వల్ల పరిస్థితి అయోమయంగా తయారయింది.

 ప్రభుత్వంలో  ఉన్నత విద్యావంతులు ఎందరో ఉండికూడా ఈ పరిణామాలను ముందుగా అంచనా వేయలేకపోయారో ? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో?

పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం  ప్రజలలో అసహనం పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

*********
ఈ పరిస్థితిలో .. ఏ మాత్రం సౌకర్యాలు లేని మనదేశంలో ఉన్నపళాన అందరూ డిజిటల్ లావాదేవీలు మాత్రమే చేయాలనటం గురించి కొంచెం ఆలోచించాలి..

అయినా నగదురహిత లావాదేవీలు కూడా అంత సేఫ్ కాదు. అందులోనూ అనేక సమస్యలు ఉంటాయి. సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసి డబ్బు తీసుకోవటం వంటి ప్రమాదాలున్నాయి. 

ప్రస్తుతానికి టెక్నాలజీ తెలిసిఉన్న ప్రజలు డిజిటల్ లావాదేవీలు చేస్తే... అంతగా తెలియని ప్రజలు నగదు వాడుకుంటారు. క్రమంగా డిజిటల్ లావాదేవీలను ప్రజలకు నేర్పించవచ్చు. 




Monday, November 28, 2016

శ్రీ చక్రము..




ఓం.
శ్రీ భువనేశ్వరుడు శ్రీ భువనేశ్వరీ దేవి {శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి} కొలువున్న మణిద్వీపం , చింతామణి గృహము పరమాద్భుతముగా ఉంటాయంటారు.
సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన ఆ పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.

త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.
***********
శ్రీ చక్రం
శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం  కాశ్మీరీ హైందవము ఆధారితమైన తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి.దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది....

(ఈ విషయములను  వికీపీడియా నుండి సేకరించటమైనది.)
*************
శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.
( ఈ విషయములను  వికీపీడియా నుండి సేకరించటమైనది.)

*************
నాకు శ్రీ చక్రం గురించిన విశేషములు అంతగా తెలియవు. అయితే ఈ మధ్య శ్రీ చక్రాన్ని గమనించినప్పుడు నాకు తోచిన కొన్ని విషయాలు ఏమిటంటే...

అందులో విష్ణుమూర్తికి సంబంధించిన నామము ఆకారము మరియు పానవట్టముతో కూడిన శివలింగంగా లేక త్రిపుండ్రములు ఆకారముగా కూడా అనిపించాయి..


బిందువు వద్ద ఈ విశేషములను గమనించవచ్చు. కొంతvఆకారమును పోలిన ఆకారములో దీపశిఖను బోలిన డైమండ్ ఆకారము విష్ణుమూర్తి నామమును పోలి ఉంది.

అక్కడే శివుని త్రిపుండ్రములు లేక పానవట్టంతో కూడిన శివలింగం వలె కూడా గమనించవచ్చు.

శ్రీ చక్రములో బ్రహ్మకు సంబంధించిన విశేషం కూడా ఉన్నట్లు భావించవచ్చు.

 శ్రీ చక్రాన్ని గమనించినప్పుడు నాకు తోచిన కొన్ని విషయాలను వ్రాసాను.

 అంతా దైవం దయ. శ్రీ మాత్రేనమః శ్రీ పరమాత్మనేనమః.
**************

ఆసక్తి ఉన్నవారు శ్రీ చక్రము చిత్రములు అంతర్జాలములో చూడగలరు.

శ్రీ చక్రములో ఎన్నో విశేషములు ఉంటాయంటారు. నాకు వాటి గురించి అంతగా తెలియదు.
  వ్రాసిన విషయములలో పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Friday, November 25, 2016

దసరా రోజులలో ఒకసారి ...కొన్ని విషయాలు ..


మేము కొంతకాలం క్రిందట దసరా రోజులలో ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఏర్పాట్లు బాగా చేసారు. 

క్యూలో ఉన్నవారికి మంచి నీరు పాకెట్స్,మజ్జిగ ప్యాకెట్లు అందజేసారు. అయితే ఆ పాకెట్ల పైన దేవుని చిత్రాన్ని ముద్రించారనిపించింది .


 కొందరు ప్యాకెట్లు అక్కడే పడేయటం, ఆ పాకెట్లను క్యూలో వెళ్ళే వారు కాళ్ళతో తొక్కే పరిస్థితి ఉంది.


ఖాళీ పాకెట్లు వేయటానికి డస్ట్ బిన్లు ఉన్నా కూడా ఎక్కువ పాకెట్లు క్యూలైన్ల వద్ద పడేసి కనిపించాయి.


  ప్యాకెట్ల పైన దేవుని చిత్రం ముద్రించకుండా ఉంటే బాగుండేది.


******************
ఇంకో విషయం ఏమిటంటే..క్యూలో ఉన్న పసిపిల్లలకు చిన్న కప్పులతో పాలు కూడా అందజేసారు.


 పసిపిల్లలకు పాలు అందించాలన్న ఆలోచన బాగుంది. అయితే పాలు బాగా వేడిగా ఇచ్చారట.


 మాకు ముందు ఒక చిన్నపాప ,తల్లి ఉన్నారు.
 పాలు బాగా వేడిగా ఉండటం వల్ల తల్లి చల్లార్చటానికి ఊదుతోంది.


 అయితే క్యూ ఆగినప్పుడు ఊదుతోంది. క్యూ కదిలినప్పుడు  నడుస్తూ కప్పులోని పాలను చల్లార్చటం కుదరటం లేదు.
ఎలాగో చల్లార్చి పాపకు త్రాగించింది.
ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే, పసివాళ్ళకు పాలు సరఫరా చేయాలనే ఆలోచన మంచిదే అయినా సరఫరా చేసేవాళ్ళు వేడిపాలు కాకుండా చల్లార్చిన పాలు ఇస్తే బాగుండేది.


 క్యూలైన్లలో అసలే హడావిడిగా ఉంటుంది. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు సరిగ్గా గమనించక వేడిపాలను పిల్లలకు పట్టించేస్తే నోరుకాలిన పసివాళ్ళు తమ బాధ చెప్పటానికి వారికి మాటలు కూడా రావు కదా..



పొరపాట్లు ఎవరికైనా వస్తాయి. అయితే ఇకమీదట అందించాలనుకుంటే .. పిల్లలకు బాగా వేడిపాలు కాకుండా  ..గోరువెచ్చని పాలు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.

******************

కొంతమంది ఏమనుకుంటారంటే.. నేను మంచిపనులు చేసినా కష్టాలు వచ్చాయని వాపోతారు. దేవుణ్ణి నిందించటానికి కూడా వెనుకాడరు.

అయితే ఇలాంటప్పుడు, తాము మంచి అనుకుని చేసిన పనిలో ఏమైనా పొరపాట్లు వచ్చాయేమోనని ఆలోచించాలి.


 చేసిన పనిలో పొరపాట్ల వల్ల ఇతరులకు కష్టం కలిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయో?


ఉదా.. ఎవరైనాఎక్కువ ఆలోచించకుండా లేక ఇతరులకు పనులు అప్పగించేసి వాళ్ళు పెద్దగా ఆలోచించకుండా పొరబాట్లు చేస్తే.. పెద్దవాళ్ళు  అనేకకారణాల వల్ల వేడిపాలను పిల్లలకు పట్టించేస్తే తద్వారా  బాగా వేడిపాలు త్రాగిన పసిపిల్లలకు బాధ కలిగితే దానిఫలితంగా పొరపాట్లు చేసిన పెద్దవాళ్ళకు పాపం వస్తుందో? పుణ్యం వస్తుందో? పుణ్యము,పాపము కొంచెం కొంచెం వస్తాయో?


************

ఇంకో విషయం ఏమిటంటే..
ఈ మధ్య విజయవాడ దుర్గమ్మ దేవాలయం వారు  శత చండీసహిత రుద్రయాగాన్ని నిర్వహించారు.

అయితే యాగాన్ని దేవాలయానికి మరింత సమీపంలో నిర్వహిస్తే ఎక్కువమంది భక్తులు వచ్చేవారనిపిస్తుంది.
అయితే అక్కడే నిర్వహించటానికి వారి కారణాలు వారికి ఉంటాయి లెండి.

********************
 
పాకెట్లపై దేవుని చిత్రాన్ని ముద్రించటం మరియు క్యూలైన్లలో పిల్లలకు బాగా వేడిపాలను అందించటం గురించి ఇంతకుముందే వ్రాయాలనుకున్నాను. అయితే అనేకకారణాల వల్ల ఆలస్యంగా వ్రాయటం జరిగింది.



Wednesday, November 23, 2016

భారతీయుల పొదుపు చేసే లక్షణం ఏమైనట్లు?


పాత కాలంలో భారతీయులకు పొదుపు చేసే లక్షణం ఉండేది.ఆధునిక కాలంలో ఖర్చు చేసే లక్షణం బాగా పెరిగింది. డబ్బున్నవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు కూడా విపరీతంగా ఖర్చుపెడుతున్నారు.

ఒకే వ్యక్తి ఎక్కువ సెల్ ఫోన్లు వాడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం గాడ్జెట్లపై మోజు పెంచుకుని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనేయటం వంటివి ఎక్కువయ్యాయి.షాపులకు వెళ్ళినా ఎంత ధర అయినా కొనేస్తున్నారు.

ఇలా విపరీతంగా కొనటం వల్ల వస్తువుల తయారీ పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. సహజవనరులు కూడా త్వరగా తరిగిపోతాయి.
..................
మనిషి సుఖంగా జీవించాలంటే బోలెడు డబ్బు అవసరం లేదు.

విపరీతంగా కొనటం అలవాటయిన ప్రజలకు ఇప్పుడు కష్టంగా ఉంది.

అయితే వీళ్ళలో నిత్యావసరాలు కొరకు సరుకులు  కొనటం ఎలాగో తెలియక కష్టాలు పడుతున్న ప్రజలు కూడా ఉన్నారు.
 ..................
  ఈ రోజుల్లో వ్యాపారస్తులు ధరలు బాగా పెంచేస్తున్నారు. అయినా జనం వస్తువులు కొంటూనే ఉన్నారు.

అధిక ధరలను ప్రభుత్వం నివారించాలి. అప్పుడు అధిక జీతాలు ఇవ్వనవసరం లేదు. ప్రజలు అధిక ఖర్చులను తగ్గించుకోవాలి.
................
సమాజంలో అవినీతి బాగా పెరిగింది. విలాసవంతమైన జీవితం కోసం ఎలా అయినా డబ్బు సంపాదించటానికి చాలామంది ప్రజలు వెనుకాడటం లేదు. 

 తప్పు చేయటానికి సామాన్యులు, ధనికులు, చదువుకున్నవారు, చదువుకోని వారు అనే తేడా ఉండటం లేదు. ఎవరి స్థాయిలో వారు అవినీతిపనులు చేస్తున్నారు.
.................

ఇప్పుడు కోట్లాదిసొమ్ము ఉన్న వారిలో చాలామంది ఒకప్పుడు పేదవారే. వారిలో కొందరు అవినీతిపనులు చేసి పైకి వచ్చి ఉండవచ్చు.
ప్రారంభ దశలోనే వీరి చర్యలకు అడ్డుకట్ట వేసినట్లయితే పెద్దమొత్తం డబ్బు వారి దగ్గర ప్రోగుపడేదికాదు.
...................
విదేశాలలో ఉన్న నల్లడబ్బును తిరిగి తెస్తామని, నల్లడబ్బు నియంత్రిస్తామనటం మంచిపనే.


బినామీలను కట్టడి చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ చక్కగా ఆచరణలో సఫలమవ్వాలని అందరమూ మనసారా కోరుకుందాము.

 అలాగే ప్రస్తుతానికి  ప్రజల ఇబ్బందులు తగ్గేలా వేగంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

.................
ఇప్పుడు పెద్దనోట్ల రద్దువలన కొంతకాలం వ్యాపారాలు తగ్గితే వచ్చే నష్టమేమీలేదు. 

ప్రస్తుతానికి పెద్దనోట్లు ఎక్కువ అందుబాటులో లేవుకాబట్టి.. ప్రజలు అనవసరమైన కొనుగోళ్ళు చేయకుండా నిత్యావసరాలకు డబ్బు ఉంచుకోవాలి. 

చాలామందికి కార్డులు ఉన్నాయి కదా! వాళ్ళు కార్డులు వాడితే సరిపోతుంది. అప్పుడు బ్యాంకుల ముందు ఎక్కువ క్యూలు ఉండవు.

అయితే భారత దేశంలో చాలామంది చదువుకున్న వారికి కూడా కార్డులు వాడకం, బ్యాంకుల లావాదేవీల వంటివి సరిగ్గా తెలియదు.

దేశంలో పూట గడవక నిత్యావసరాలు తీరని ప్రజలు ఎందరో ఉన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ప్రభుత్వ ఆఫీసులు చాలా ఉన్నాయి.విద్యుత్ సరఫరా సరిగ్గా లేని ఊళ్ళూ ఉన్నాయి.

 ఇలాంటి దేశంలో నగదురహిత లావాదేవిలు వంటివి జరగాలంటే చాలా మార్పులుచేర్పులు జరగాలి.
.............
ఇప్పటికిప్పుడు దేశమంతా నగదు రహిత లావాదేవీలకు  ఏర్పాట్లు చేయాలన్నా చాలా సమయం పడుతుంది.

ఉన్నపళంగా ప్రజలందరూ నగదురహిత లావాదేవీ విధానాలకు మారిపోవాలి ..అప్పటివరకూ కొత్తనోట్లు విడుదల చేయం.. అని కూర్చుంటే మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి కష్టాలు తప్పవు.

అందువల్ల ప్రస్తుతానికి కొత్తనోట్లను త్వరగా విడుదల చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలి. క్రమంగా నగదురహిత చర్యలు చేపట్టవచ్చు.


Monday, November 21, 2016

ఓం..కొన్ని విషయములు..


ఓం.
శ్రీ విశ్వనాధాష్టకము.

గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాప హారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

వాచామ గోచర మమేయ గుణస్వరూపం
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకు శాభయవరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణాచల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

పంచాననం దురిత మత్తమదంగజానాం
నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం
దావానలాం మరణశోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయం
నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

రాగాదిదోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం .

వారాణసీ పురపతేః స్తవం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతేచ మోక్షం .

విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

ఫలం..ధనధాన్యాలూ, విద్యా విజయాలూ, ఇహపర సర్వ సౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్టకము.

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ .

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ .

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ .

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .


ఉర్వీసర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

దేవీసర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ .

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహీ చ పార్వతి
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
భాందవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ .

ఫలం..ఇహానికి ఆకలిదప్పులూ..పరానికి ఏ కలి తప్పులూ కలగకపోడం.
............


శ్రీ కాల భైరవాష్టకం..

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..



భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..



శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..



భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..



ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.. 



అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..



భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..



కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


**********************
వకుళమాత ఆలయాన్ని పునరుద్ధించమని న్యాయస్థానం తీర్పు చెప్పటం ఎంతో ఆనందకరమైన విషయం. దైవానికి వందనములు.

 తీర్పు ఇచ్చిన న్యాయస్థానం వారికి కృతజ్ఞతలు. ఈ విషయం గురించి ఎంతో కృషిచేసిన పరిపూర్ణానంద గారికి మరియు కృషి చేసిన అందరికి అభినందనలు.
 

Thursday, November 17, 2016

ప్రభుత్వం వెంటనే 500వందలు,100 నోట్లను దండిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి..


రోగికి ఆపరేషన్ చేయాలంటే ఇచ్చే మత్తుమందు ఎంతకావాలో అంతే ఉండాలి. డోస్ ఎక్కువయినా..తక్కువయినా సమస్యే.

 పెద్దనోట్ల రద్దు తరువాత ఇప్పటికే చాలారోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దుకన్నా ముందు ..విదేశాలకు తరలించిన  నల్లడబ్బు గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి ప్రజలలో ఉంది.

బాగా నల్లడబ్బు ఉన్న వారి పని పడితే బాగుండేదని కూడా  చాలామందికి మనసులో ఉంది.

అయినా కూడా, నల్లడబ్బు, నకిలీ నోట్ల సమస్యలు కొంతవరకైనా తీరుతాయనే ఆశతో ప్రజలు ఇబ్బందులు ఓర్చుకుంటున్నారు.

* అసలే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, బాగా డబ్బు ఉన్నవారి బకాయిలు బ్యాంకుల వాళ్ళు రద్దు చేశారన్నట్లు వస్తున్న వార్తలు ప్రజలలో మరింత అసహనాన్ని పెంచుతున్నాయి.

( అయినా, రైతుల రుణాలు మాఫీ చేయమంటే ఏడ్చిపోయే బ్యాంకుల వాళ్ళు ..డబ్బున్న వాళ్ళ రుణాలు ఉత్సాహంగా మాఫీ చేయటమేమిటి?)

* బడా వ్యక్తుల బాకీల రద్దు వంటి  చర్యలు..  ప్రభుత్వంపై నమ్మకాన్ని సడలేలా చేస్తున్నాయి.

ప్రజలు తమను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటూ ..  ప్రభుత్వం కొత్తనోట్ల విడుదల ఆలస్యం చేస్తే..  ప్రభుత్వంపై ఆగ్రహం బాగా పెరిగే అవకాశం ఉంది.

* అందువల్ల, ప్రభుత్వం వెంటనే 500వందలు,100 నోట్లను దండిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి..

బినామీల విషయంలో చర్యలు తీసుకోవాలనుకోవటం చాలా బాగుంది.
--------
  పాతకాలంలో భారతప్రజలకు పొదుపు అలవాటు ఉండేది.

ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే..బాగా పెరిగిన జీతాలు, బాగా పెరిగిన ధరలు..బాగా పెరిగిన ఖర్చులు..ఇలాంటప్పుడు,100 నోట్లు ఏం సరిపోతాయి?

 * అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాకుండా.. ఎక్కువగా 100, 500 నోట్లను వెంటనే విడుదల చేస్తే జనానికి ధైర్యం వచ్చి క్యూలు తగ్గిస్తారు.
******

* చిల్లర సమస్య తగ్గటం కోసం దేవాలయాల హుండీ డబ్బు వాడాలనుకోవటం బాగానే ఉంది కానీ, తీసుకున్న హుండీల సొమ్ముకు సరిపడినంత పెద్దనోట్లను(సొమ్మును) దేవాలయాలకు వెంటనే ఇవ్వాలి.
  1. **********************

  2. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ చెబుతున్నారు.

    కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే.

    అయితే,  కొందరు ఏం చెబుతున్నారంటే పెద్దనోట్ల రద్దు వల్ల
    సినిమా హాల్స్ ఖాళీగా ఉన్నాయని..బంగారం షాపులు, మద్యం షాపులు, రియల్ ఎస్టేట్, నాన్ వెజ్ షాపులు,..వంటివి వ్యాపారం జరగక వెలవెలపోతున్నాయంటూ వాపోతున్నారు. 
  3.  
     కొన్ని రోజులుసినిమాహాల్ కు వెళ్లి సినిమా చూడకపోతే వచ్చే నష్టమేమీ లేదు.
    కొన్ని రోజులు బంగారం కొనకపోతే ఏమీకాదు, నాన్ వెజ్ తినకపోయినా ఏమీ కాదు, విపరీతంగా ధరలు పెరిగిన ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నాళ్ళు ఆగితే నష్టమేమీ లేదు.

    ఇక మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటమనేది ఎంతో దారుణం.

    కొందరు జనం మనస్తత్వం విపరీతంగా ఉంది. ఉప్పు ధరలు పెరిగాయంటూ వార్తలు వస్తే చాలు ముందూవెనుకా ఆలోచించకుండా కిలోలకొద్దీ ఉప్పు కొని దాచేసారు.

    ఇలాంటి మనస్తత్వం ఉన్న జనాలు డబ్బు విషయంలో మరింత ఎక్కువ ఆలోచిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

    డబ్బు విషయంలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది.

    పెద్దనోట్ల రద్దు తరువాత జనాలు కంగారుపడిపోయి తమవద్ద ఉన్న 100 నోట్లను ఎక్కువగా వాడకుండా దాచుకుంటున్నారు.

    ఏటీఎం లలో ఎంత డబ్బు వేసినా నిమిషాలలో ఖాళీ అయిపోతున్నదంటున్నారు.

    క్యూలు పెరగటాన్ని గమనిస్తే కొందరు నిజంగా అవసరాలకు తీసుకుంటుంటే మరికొందరు డబ్బు నిలువ పెట్టుకుకోవటం మంచిదని భావించి క్యూలో ఉంటున్నారనిపిస్తుంది.

    జనాలు ముందస్తు భయంతో అవసరానికన్నా ఎక్కువ నోట్లు తెచ్చుకుని దాచుకోవటం వల్ల నోట్ల కొరత వస్తుంది.

    ఇందువల్ల కొన్ని రోజులు ఈ సమస్యలు కొనసాగే అవకాశం ఉంది.

  4. **************************
  5. ఇక, డబ్బున్న పెద్దవాళ్ళను పట్టుకోవచ్చు కదా అంటున్నారు.

    ఈ విషయంలో మరింత ఎక్కువ దృఢత్వం కావాలి. డబ్బున్న పెద్దవాళ్ళు అన్ని పార్టీలలోనూ ఉన్నారు.

    అవినీతి పనులతో డబ్బుకూడబెట్టడం ఎవరి విషయంలోనైనా తప్పే.

    డబ్బు సంపాదన విషయంలో చట్టప్రకారం ప్రవర్తిస్తే అందరికీ మంచిది.

    ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే నల్లడబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా భయం వస్తుంది.

    అలా కాకుండా,ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల ..బ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం తమనేమీ చేయలేదనే ధైర్యం వస్తుంది.
    ఇక ప్రజలే ఆలోచించుకోవాలి.

  6. *******************
  7. దేశంలో ఎప్పటినుంచో 100, 50, 10..నోట్లు సరిపడా అందుబాటులో లేవు కాబట్టి..
    .పెద్దనోట్ల రద్దు ప్రకటనకు కొన్ని నెలలకు ముందే..100, 50,10..నోట్ల కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉండవలసింది.

    ఇప్పుడు 2000నోట్లు ముద్రించారు కదా! దాని బదులు కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ముద్రించి రడీగా ఉంచవలసింది.

    పెద్దనోట్లు రద్దు ప్రకటన తరువాత వారం లోపే.. కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు ఉన్న గందరగోళం ఉండేది కాదు.

Wednesday, November 16, 2016

మరి.. ప్రజలు యుద్ధం చేయాలని ఎందుకు కోరినట్లు?



 ఎక్కువగా 100 మరియు కొత్త డిజైన్ 500 నోట్లు ప్రింట్ చేసి ఉంచుకుని పెద్దనోట్ల రద్దు ప్రకటన చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు.

 అయితే ఈ ఇబ్బందుల వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.


కొన్ని నోట్లు రద్దు చేస్తేనే ప్రజలు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.


దొంగ నోట్లు మరియు నల్లడబ్బు పై యుద్ధం అంటేనే వస్తే కష్టాలు తట్టుకోలేకపోతున్నాము.


మరి ఇతరదేశాలతో యుద్ధం వస్తే ఏం చేసేవారు?
యుద్ధం అంటే మరెన్నో ఇబ్బందులు ఉంటాయి కదా!


 ఆ మధ్య సరిహద్దులలో మన సైనికులను చంపినప్పుడు దేశంలో చాలామంది పొరుగుదేశంపై యుద్ధం ప్రకటించాల్సిందేనంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

మీడియాలో కూడా యుద్ధం గురించి చర్చలు. యుద్ధం చేయాల్సిందేంటూ అనేకమంది ఆవేశంతో ఊగిపోయారు. 


యుద్ధం ప్రకటించటం లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసారు. 


************
యుద్ధమంటే వారి దృష్టిలో ఏమిటి ?

కార్గిల్ యుద్ధంలా సైనికుల వరకే పరిమితమనా? దేశప్రజలకు అసౌకర్యం కలగకుండా సైనికులు మాత్రమే త్యాగాలు చేయాలనా?


మరణించిన సైనికుల ఆత్మ శాంతి కొరకు అంటూ.. రెండు నిమిషాలు మౌనం, ఒక కొవ్వొత్తి వెలిగించటం అంతటితో అయిపోతుందా?

దేశ ప్రజల రక్షణ కొరకు ..సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా పద్ధతిగా జీవించటానికి ప్రయత్నించాలి.

 ఇప్పటివరకూ సైనికులు ఎంతో  శ్రమపడుతూ శత్రువులను సరిహద్దుల వద్దే  తిప్పికొడుతూ దేశప్రజలకు శ్రమలేకుండా కాపలాకాస్తున్నారు.


 అయితే పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.

 యుద్ధమంటే ... శత్రుదేశం బాంబులు వేస్తుందనే భయంతో రాత్రిపూట విద్యుత్ నిలిపివేస్తారు.


ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ?ఎందరు మరణిస్తారో ? ఎందరు వికలాంగులు అవుతారో తెలియదు.
 రవాణావ్యవస్థ స్తంభిస్తుంది. ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.


 ఇతరదేశాలపై యుద్దం  చేయాలా? వద్దా అనేది మనం నిర్ణయించుకోవచ్చు.


 మనదేశంపై యుద్ధం చేయాలా ? వద్దా? అనేది మన చేతిలో విషయం కాదు.

 అందువల్ల ప్రజలు కష్టాలు ఓర్చుకోవటాన్నినేర్చుకోవాలి.

యుద్ధ పరిణామాలతో పోల్చుకుంటే పెద్దనోట్ల రద్దు పరిణామాల ఇబ్బందులు చాలా చిన్నవి.


 ఈ ఇబ్బందులే భరించలేని  జనాలు యుద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయటం హాస్యాస్పదం.

*****************
పెద్దనోట్ల రద్దు వల్ల నల్లడబ్బు పూర్తిగా పోకపోయినా ఈ విషయం గురించి అందరికీ పెద్ద కదలిక వచ్చింది.

 ఇక మరో పెద్ద విషయం నకిలీ కరెన్సీ..పెద్దనోట్ల రద్దు  అనేది నకిలీ కరెన్సీ విషయంలో చాలా  ప్రభావాన్ని చూపిస్తుంది.


అప్పట్లో .. ప్రభుత్వం యుద్ధం  విషయంలో ముందడుగు వేయటం లేదనే విమర్శలు వినిపించాయి.నిజంగా యుద్ధానికి వెళ్తే ఈ ప్రజలే ప్రభుత్వాన్ని విమర్శించేవారేమో?


యుద్ధం వల్ల ఏ దేశానికైనా కష్టాలు తప్పవు.


 అన్ని దేశాలవాళ్ళు ఇతర దేశాలను రెచ్చగొట్టడం మాని ఎవరిదేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది.


*******************
* యుద్ధాలు రాకుండా అన్ని దేశాల వాళ్ళు మంచిగా ఆలోచించాలని దైవాన్ని ప్రార్దిద్దాము.

*************
దయచేసి కామెంట్స్ వద్ద కూడా చూడగలరు. టపా పెద్దదైపోతుందని కామెంట్స్ వద్ద మరికొన్ని విషయాలను వ్రాయటమైనది.



Monday, November 14, 2016

కార్తిక పౌర్ణమి.. సోమవారం..




త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.

Saturday, November 12, 2016

కొంత పన్నులు తగ్గిస్తే ..




మన ప్రజలకు క్యూలు కొత్త కాదు. సామాన్యులకు కొన్ని కష్టాలూ కొత్తకాదు.

నల్లడబ్బు సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే తాత్కాలిక క్యూలు, కొన్ని కష్టాలు పెద్దలెక్కలోనివి కావు.


 అయితే పెద్దనోట్లు రద్దు విషయం కొందరు పెద్దలకు ముందే తెలిసి సర్దుకోవటం జరిగితే మాత్రం అది అన్యాయమే.
..............


 పన్ను కట్టే విషయంలో పెద్దవాళ్ళను  వదలకూడదు.

విదేశాలలో దాచిన నల్లడబ్బు  వెనక్కి వచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
.........


దేశప్రజలు ఎందరో తిండి లేక బాధపడుతుంటే  పార్లమెంట్ వద్ద  తక్కువరేటుకు భోజనం ఎందుకు?  దేశప్రజలకు కూడా తక్కువరేటుకు భోజనం అందించండి.
...................


 ప్రజలు కూడా పన్నులు కట్టడంలో మోసాలు చేయకూడదు.


 ప్రభుత్వం ఖజానా బాగుంటేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది.
............


ఇక, ప్రభుత్వాలు  విపరీతమైన పన్నులతో బాదటం, పెనాల్టీ టాక్స్ అంటూ భారీ మొత్తం ...కాకుండా కొంత పన్నులు  తగ్గిస్తే ఎక్కువమంది ప్రజలు పన్ను కట్టడానికి ముందుకు వస్తారు.


  తద్వారా నల్లడబ్బు తగ్గుతుంది.



100, 50, 10...నోట్ల సమస్య... ఇంతకుముందు కూడా ఉంది...




100, 50, 10...నోట్ల సమస్య ఇప్పుడు వచ్చింది కాదు. ఇంతకుముందు కూడా ఉంది.

ఇంతకుముందు కూడా రైతుబజారు వెళ్తే  500, 1000..నోట్లు  తిసుకునేవారు కాదు. చిల్లర ఇవ్వమంటారు.
 
అందువల్ల చిన్న నోట్లు అవసరం ఎక్కువగా  ఉంటుంది.

  ఇంతకుముందు కూడా పెద్దపెద్ద మాల్స్ లో ఎక్కువగా  పెద్దనోట్లు తీసుకునేవారు.
 చిన్న షాప్స్ లో పెద్ద నోట్లకు చిల్లర దొరకటం కష్టం.

బస్సులలో టికెట్ తీసుకునే విషయంలో,  తక్కువ మొత్తంలో సరుకులు కొనే సందర్భాలలో.. చిల్లర లేక వ్యాపారస్తులు వినియోగదారులు గొడవలు పడటం ఇంతకుముందే ఉంది.

ఇలాంటప్పుడు ప్రభుత్వాలు 100, 50.10..నోట్లు ఎక్కువగా ముద్రించాలి.
చిన్న నోట్లను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
................

పెద్దనోట్ల రద్దుతో ఎక్కువమంది సామాన్య మధ్యతరగతి వారు కూడా  తమ వద్ద ఉన్న 100, 50..నోట్లు దాచుకుని బయట కొనుగోళ్ళ కోసం 500, 1000 నోట్లే తెస్తున్నట్లున్నారు.

 పాత నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు  లేక ప్రభుత్వ కార్యాలయాలలో పన్నులు కట్టుకోవచ్చు.

అంతేకానీ కూరల షాపులలో, టీ కొట్టులలో పెద్దనోట్లు ఇస్తే వాళ్ళు మాత్రం ఆ పెద్ద నోట్లను ఏం చేసుకుంటారు ?

 ఈ విషయం తెలిసికూడా కొందరు ప్రజలు సరుకులు కొనటానికి చిన్నవర్తకుల  వద్దకు వెళ్ళటం.. వాళ్ళు తీసుకోమని తిరస్కరిస్తే...ఆ విషయాన్ని ఫిర్యాదు చేయటం జరిగింది.

 చిన్న టీ షాపుకు,చిన్న కూరల షాపుకు 500, 1000 నోట్లు ఎందుకు పట్టుకెళ్ళటం?

మనీ,మనీ.....



ఇప్పుడు జరిగిన పెద్దనోట్ల రద్దు.. తదనంతర పరిణామాల వల్ల దేశంలో అందరికీ పన్నుల గురించి చాలా అవగాహన వచ్చింది.

 పన్ను కట్టకపోయినా ఏమీ కాదులే..అనే ధోరణి తగ్గుతుంది. బడా వాళ్ళకు కూడా కొంత కదలిక వస్తుంది.
..................


అయితే ఇప్పుడు పెద్దనోట్లు ఎందుకు రద్దు చేయటం... మళ్ళీ తిరిగి తేవటం ఎందుకు ?అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. కొత్తనోట్లు పాతనోట్లను పోలిలేవు. కొత్తనోట్లు డిజైన్ మారింది.


 ఇలా అప్పుడప్పుడు పాతనోట్లను రద్దుచేయటం..కొత్త డిజైన్  తో కొత్తనోట్లను  తేవటం వల్ల దొంగనోట్లు  సమస్య, నల్లడబ్బు సమస్య కొంతకాలం.. కొంతవరకూ తగ్గుతుంది.
 
అయితే ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఇకపై ప్రజలు 2000నోట్లను భారీగా నిల్వ చేయటానికి భయపడతారు.
...........

 ఈ చర్యల వల్ల రియల్ ఎస్టేట్ భారీగా దెబ్బతిని సామాన్య ,మధ్యతరగతి ప్రజలు నష్టపోతారని కొందరు ప్రచారం చేస్తున్నారు.

నిజం చెప్పాలంటే ..ఇప్పుడు  ఇళ్ళు, స్థలాలు ధరలు  సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? 


 ఈ పరిణామాల వల్లనయినా రియల్ ఎస్టేట్ ధరలు దిగివస్తే మంచిది.


ఇక , భారీ ఎత్తున బంగారం కొంటున్నవారిపై నిఘా ఉంచుతున్నారు కదా!
............


అయితే మనదేశంలో చాలామంది చదువుకున్నవాళ్ళకు కూడా బ్యాంక్  వ్యవహారాల గురించి సరిగ్గా తెలియదు.

ఇలాంటప్పుడు పెద్దనోట్లన్నీ రద్దు చేయటం సరైనది కాదు.


 2000 నోటు బదులు కొత్త 1000నోటు వస్తే బాగుంటుంది.

 100 నోట్లతో  మాత్రమే ఎక్కువమొత్తంలో  లావాదేవీలు నిర్వహించటం కష్టం. అందువల్ల 500, 1000 నోట్లు ఉండటం అవసరమే.


 అన్ని లావాదేవీలూ బ్యాంకుల ద్వారా మాత్రమే నిర్వహించటం   ఇంకా అభివృద్ధి చెందని మన దేశంలో ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు.


 సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని లావాదేవీలు ఆన్ లైన్  ద్వారానే జరగాలన్నా కష్టమే.