koodali

Saturday, May 30, 2015

పాజిటివ్ మరియు నెగటివ్ ఆలొచనలు...

  
ఆలోచనలకు  శక్తి ఉంటుందని పెద్దలు తెలియజేసారు.

పాజిటివ్ గా ఆలోచించటం వలన పాజిటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పాసిటివ్ గా ఆలోచించటం మంచిదని అంటారు.  నెగటివ్ గా ఆలోచించటం వల్ల నెగటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారు.

................

అయితే , కొన్నిసార్లు నెగటివ్ ఆలోచన కూడా అవసరమే అనిపిస్తుంది. ( నెగటివ్ ఆలోచన యొక్క ఫలితం పాజిటివ్ గా ఉన్నప్పుడు..)


 ఉదా..ఒక రాజ్యానికి రాజు అయిన వ్యక్తి  నెగటివ్ గా కూడా ఆలోచించవలసి ఉంటుంది.


 రాజ్యం అంటే శత్రువు దాడిచేసే అవకాశాలు ఎప్పుడూ పొంచి  ఉంటాయి కాబట్టి,  రాజ్యరక్షణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, శత్రువు దాడి చేసినప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగే సత్తా ఉంటుంది.


 అలా కాకుండా... 
అంతా బాగానే ఉంది. లోకంలో అందరూ మంచివారే , రాజ్యంపై ఎవరూ దాడి చేయరు.. అని కేవలం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ  రక్షణ ఏర్పాట్లు చేసుకోకుండా తాపీగా కూర్చుంటే శత్రువు దాడిచేసినప్పుడు పరాజయం పొందే అవకాశం ఉంది.

వ్యక్తుల జీవితంలో కూడా  ముందు  జాగ్రత్తలు  తీసుకోవలసిన  సంఘటనలు ఎన్నో ఉంటాయి .  

.................................. 

చెడు కనకూడదు, చెడు వినకూడదు, చెడు అనకూడదు ..అనే విషయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే...


 మనకు  చేతనైనంతలో చెడును అడ్డుకోవటానికి  ప్రయత్నించవచ్చు . అయినా  తగిన ఫలితం లేనప్పుడు మాత్రం  సాధ్యమయినంతలో చెడ్డ విషయాలకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది.


ఉదా..ఒక వ్యక్తికి చెడు అలవాట్లు లేవనుకోండి. అతని స్నేహితులలో కొందరికి చెడు అలవాట్లు  ఉన్నప్పుడు ,  చెడ్డ అలవాట్లు ఉన్న స్నేహితులతో  ఆ అలవాట్లను మానిపించటానికి ప్రయత్నించ వచ్చు.. 


ఎంత చెప్పినా వాళ్ళు మానకపోతే అలాంటి వాళ్ళతో స్నేహాన్ని మానివేయటం మంచిది. 


అలాంటి వాళ్ళతో  స్నేహాన్ని  కొనసాగిస్తూనే  ఉంటే , చెడ్డ అలవాట్లు లేని వ్యక్తికి కూడా  ఆ చెడ్డ అలవాట్లు అలవాటు అయ్యే ప్రమాదముంది. 


ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ...  చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు..అని పెద్దలు తెలియజేసారు  కానీ, 


.  సమాజంలో  చెడు విషయాలు  జరుగుతున్నా కూడా  పట్టించుకోకుండా,  తప్పించుకుని   ఎవరి మానాన వాళ్ళు బ్రతకాలని పెద్దల ఉద్దేశం కాదు .. అనిపిస్తుంది.


సమాజంలో తప్పులు జరుగుతుంటే అడ్దుకోకుండా  చూస్తూ ఊరుకోవటం కూడా తప్పేనని పెద్దలు తెలియజేసారు.

..........................

 (అయితే, సమాజంలోని  చెడ్డ వాళ్ళ మధ్య ఉన్నాకూడా .. దృఢమైన దైవభక్తి, ఆత్మ బలం ఉన్న వ్యక్తులు  చెడిపోరు.)

......................... 

.వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను . 



Thursday, May 28, 2015

చిన్నారుల రక్షణ గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది...

 
ఈ రోజుల్లో దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము. 

 పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.



( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )


అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  


ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 


  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి. 


పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.   


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా. 


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.

.................................

చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.


    రోజుల్లో  సెల్ ఫోన్స్, ఇంటర్నెట్  వంటి  వాటి  ద్వారా  హింసా దృశ్యాలను ,  శృంగారదృశ్యాలను  ఎప్పుడుపడితే  అప్పుడు  చూసే  అవకాశం  కలిగింది. అసభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల  ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.


   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.

............................... 

 పెద్దవాళ్ళయిన  ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల  రక్షణ   గురించి  కూడా  ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది.  

......................

  ఒక వ్యక్తి  నేరం  చేస్తే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి.  చిన్నతనం  నుండి  తల్లితండ్రుల  పెంపకం,  పరిసరాల  ప్రభావం, ఆర్ధిక  అసమానతలు,  స్నేహసంబంధాలు , మీడియా  ప్రభావం,   మద్యపానం అలవాట్లు.....ఇలా  ఎన్నో  కారణాలుంటాయి. 


  నేరాలను  చేసిన  వారిపట్ల  కఠినమైన  శిక్షలు  ఉండటం  ఎంతో  అవసరం  . అయితే  నేరాలను  తగ్గించాలంటే,  చట్టంతో  పాటు  ప్రజల  బాధ్యత  కూడా  ఎంతో  ఉంటుంది. 

Tuesday, May 26, 2015

ద్వంద్వ ప్రవృత్తి ...నేరాలు...


డబ్బు సంపాదనే ధ్యేయంగా, అక్రమ సంబంధాలు అనేవి తప్పే కానట్లుగా, మద్యాన్ని సేవించటం అనేది అత్యంత సహజంగా మారిన సమాజంలో నేరాలు జరగకుండా ఎలా ఉంటాయి 

నేరాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు ?

మద్యపానం, అసభ్యకర దృశ్యాలను  అదేపనిగా  చూడటం....  వంటి వాటివల్ల  మనుషులు  తమ  విజ్ఞతను, వివేకాన్ని కోల్పోయే  అవకాశం  ఉందని  అందరికీ తెలిసిందే.


 ఈ రెండింటిని కట్టడి చేస్తే అసభ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన నేరాలు చాలా వరకూ తగ్గుతాయి.

................. 
 
పాతకాలం వాళ్ళు.. శృంగార చర్యలు ఇతరులు చూడకుండా జాగ్రత్తపడేవారు. ఇతరుల కంటపడితే సిగ్గుపడేవారు. ఇప్పుడు సిగ్గుపడటం తగ్గిపోయింది. 

 శృంగారం అంటే చాటుగా ఉండవలసిన  విషయం. ఇప్పుడు అది బహిరంగం అయిపోయింది. (బరితెగింపు అనుకోవచ్చు.) 


ఇంట్లో టీవీని ఒక్క నొక్కు నొక్కితే చాలు..  ఆడమగ ఒకరినొకరు కౌగలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం ..వంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. 


 ఇలాంటి దృశ్యాలు   చూసేవాళ్ళ మనస్సు చెదిరే అవకాశం ఉంది. 


చిన్న  పిల్లల మనస్సు మీద , టీనేజ్ పిల్లల మనస్సు మీద ఇలాంటి దృశ్యాలు  ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. 

................

ఇలాంటి దృశ్యాలలో చూస్తుంటే..కొందరు భారతీయ స్త్రీలు కూడా పైన ఒక చిన్న  గుడ్డపేలిక,   క్రింద ఒక చిన్న చెడ్డీ ధరించి కనిపిస్తుంటారు.  ఇలా తిరగటానికి కొందరు ఏ మాత్రమూ సిగ్గుపడటం లేదు.


 సిగ్గుపడక పోగా, మేము తక్కువ దుస్తులే వేసుకుంటాము... సరిగ్గా దుస్తులు వేసుకోమని మాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు..అంటూ గొడవ  చేయటం అత్యంత బాధాకరం .  

 ...................

సమాజంలో ఎక్కువమంది ద్వంద్వ ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రక్క నీతులు చెబుతూనే మరో ప్రక్క పాపపు పనులు చేస్తున్నారు. 


ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలున్న సినిమాలు తీసేవాళ్ళు కూడా  సమాజం చెడిపోతూందని స్పీచ్లు ఇస్తుంటారు.


మనుషులను పాడు చేసే మద్యాన్ని అమ్మే వాళ్ళు కూడా  సమాజం చెడిపోతూందని నీతులు చెబుతుంటారు. 


ఇతరులను  మోసం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు కూడా సమాజం చెడిపోతూందని గోల పెడుతుంటారు.


కొన్ని వార్తాపత్రికలలో  ఒక పేజీలో నీతులు ఉంటాయి.  ప్రక్క పేజీ తిప్పితే అసభ్యకర చిత్రాలు  కనిపిస్తాయి. ( అంటే అర్ధనగ్న చిత్రాలు,  స్త్రీపురుషుల ఆలింగనాది బొమ్మలను వేస్తుంటారు.)


కొన్ని  చానల్స్  కూడా ఇంతే. ఒక వంక సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల బోలెడు జాలి చూపిస్తూ .. నీతులు వల్లిస్తూనే...   ఇంకొక వంక  అసభ్యకర   చిత్రాల దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.


ఇవన్నీ గమనిస్తే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు.


 ఎన్నో నీతులు చెబుతూ ధర్మాధర్మాలు తెలిసినవాళ్ళు కూడా  సమాజానికి హాని కలిగించే పనులు  చేయటం అత్యంత బాధాకరం . 

.............
 నేరాలు తగ్గాలంటే....పోర్న్ సైట్లకు నిషేధం విధించటం, అసభ్యకరమైన సినిమాలను, సీరియల్స్ను, దృశ్యాలను ప్రదర్శించకుండా నిషేధం విధించటం, మద్యాన్ని నిషేధించటం..వంటి చర్యలను పటిష్టంగా అమలుపరచినప్పుడు చాలా నేరాలు తగ్గుతాయి.

నేరాలు తగ్గాలంటే.... ఆర్ధిక అసమానతలు తగ్గే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా చాలా అవసరం.


ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా  నేరాలు జరిగితే నేరస్తులను కఠినంగా  శిక్షించాలి. మళ్ళీ అలాంటి నేరం ఎవరూ చేయటానికి భయపడేంత కఠినంగా శిక్షించాలి.

.............................. 

నేరాలు ఎవరు చేసినా తప్పు తప్పే. పేద..ధనిక అనే తారతమ్యం ఉండకూడదు. 

అయితే , నేరాలు జరగటానికి  ప్రేరణ కలిగించిన  మూలకారకులైన వ్యక్తులను  కూడా చాలా  కఠినంగా శిక్షించాలి.

........................ 
 సమాజానికి హాని చేసే విధంగా ప్రవర్తించే వాళ్ళు  ఎవరైనా శిక్షార్హులే. ఒకవేళ  వాళ్ళు ఇక్కడి న్యాయస్థానం ముందు నుంచి తప్పించుకున్నా భగవంతుని తీర్పు నుండి తప్పించుకోలేరు. 


Wednesday, May 20, 2015

ఇంటింటికో కధ ..

 

 

ఒకటవ కధ....ఒక విధానం..

   మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు. వారు అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంట్లోఉంటారు. వారి తల్లితండ్రితో ఉంటారు. అందరితో సందడిగా ఉంటుంది వారిఇల్లు. తల్లిదండ్రులకు కూడా ఒక గది వేరేగా ఉంది.

 ..... 
ఇంకొక విధానం..
ఇంకొకకుటుంబంలో కొందరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండటం కాకుండా, పక్కపక్క ఇళ్ళు కట్టుకుని ఉండేవారు. వారి తల్లితండ్రితో ఉంటారు..వీరి ఇళ్ళు కూడా అందరితో సందడిగా ఉంటాయి.
 

**********************

మనుషులన్నాక బేధాభిప్రాయాలు సహజం. సర్దుకుపోతేనే కదా జీవితం సవ్యంగా సాగుతుంది.
 అయితే అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా ! 
అందరి జీవితాలూ సవ్యంగా ఉంటే ఇక చెప్పుకోవటానికి ఏముంటుంది ?మనం ఎంత బాగా ఉన్నా అవతలి వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే కష్టాలే. 
..........................

రెండవ కధ.......
ఇంకొక కుటుంబం ఉన్నారు. వారిది జాయింట్ ఫామిలీయే. కొడుకుకోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అత్తగారు ఒకసారి మా ఇంటికి వచ్చారు.

 ఆవిడ చెప్పిన విషయాలు ఏమంటే .....ఆ పెద్దవాళ్ళకు ఉదయాన్నే మెలకువ వచ్చేస్తుందట. వారికి టీవీలో భక్తి కార్యక్రమాలు చూడాలనిపిస్తుందట.



 కానీ ప్రొద్దున్నే టీవీ పెడితే టివీ సౌండ్ వల్ల కొడుకు కోడలు ఏమైనా అనుకుంటారేమోనని వీళ్ళు ఫీలవుతుంటారట. అంటే కొడుకు వాళ్ళు కొంచెం లేటుగా నిద్ర లేస్తారట. .


ఇంకా సాయంత్రం పూట పెద్దవాళ్ళకేమో పండ్లు లేక ఏదైనా లైట్గా తింటే చాలు అనిపిస్తుందట. పెద్దవాళ్ళకు బీపీ, సుగర్ .....వంటి అనారోగ్యాలు ఉంటే దానికి తగ్గట్లుగా ఉప్పు, కారం, పంచదార వంటివి తగ్గించి తీసుకోవాలి కదా ! 


కొడుకు వాళ్ళకేమో స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమట. 
ఇలాంటి సమస్యలతో సర్దుకుపోలేక వారు ఏం చేశారంటే..

వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఒక భాగంలోనేమో పెద్దవాళ్ళు ఉంటే , ఇంకో భాగంలో కొడుకు వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారట. ఇప్పుడు వాళ్ళకు బాగానే ఉందట.
.. పెద్దవాళ్ళు వాళ్ళకు ఇష్టమయినట్లు ఉదయాన్నే భక్తి ప్రోగ్రాంస్ చూడటం ...తమకు నచ్చినట్లుగా వంట చేసుకుంటున్నారట.


తమకు ఏమైనా అనారోగ్యం వస్తే దగ్గరలో పిల్లలు అండగా ఉన్నారని పెద్దవాళ్ళకు 
ధైర్యంగా ఉంటుంది .......


కొడుకు వాళ్ళకేమోతాము ఉద్యోగం నుంచి ఆలస్యంగాఇంటికి వచ్చినా లేక ఏదైనా ఊరెళ్ళినా పిల్లలనుచూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది
 మొత్తానికి ప్రస్తుతం బాగానే ఉందనిఆవిడ చెప్పుకొచ్చారుఇలా ఉండే కుటుంబాలు ఈమధ్యమరికొన్నింటిని చూసాను.

**********************

మూడవ కధ........
ఇంటిపనీ, ఆఫీసు పనితో సతమతమయ్యే కోడళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఉద్యోగం చేసే కోడలికి ఇంటిపనిలో ఇష్టంగా సహాయం చేసే అత్తగార్లూ ఉన్నారు కానీ ........వారి సంఖ్య తక్కువ.

అలాంటి ఒక అత్తగారికధ....... కోడలికి వంట రాదని అత్తగారే ఉదయం పూటవంట చేసి భోజనం బాక్సులో పెట్టి కోడలికి ఇచ్చేవారట.వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట.సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం, ఇంటిపని పట్టించుకోకపోవటం .......అలా అత్తాకోడళ్ళకు గొడవలు అయిపోయాయి. ఇలాంటి అత్తకుఇలాంటి కోడలు రావటమే వింత .
***********************
నాలుగవ కధ........
కొందరు పెద్దవాళ్ళు పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు.  
నాకు తెలిసిన ఒక పెద్దామె కూతురు ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక పాప. కెరీర్ పోతుందని చెప్పి ఆ అమ్మాయి తన నెలల వయస్సున్న చంటిపాపను తల్లిదండ్రుల దగ్గర విడిచి ఉద్యోగంలో చేరిపోయింది. . 

పెద్దవాళ్ళకు సాయానికి పనివాళ్ళున్నారు. ఎంతైనా చంటిపిల్లల పని అంటే శ్రమే కదా ! . పనివాళ్ళు రానిరోజున పెద్దవాళ్ళ పని చాలా కష్టమైపోయేది. 

చంటిపాపను క్రెష్  అంటూ పరాయి వారి పెంపకంలో వదలలేక ఆ పెద్దవాళ్ళు అలాగే ఇబ్బందులు పడ్డారు. ఇదంతా చూసి వారి అమ్మాయి పాపను క్రెష్ లో వేసింది.

ఇలాంటివారిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, 
వారు వారి అమ్మాయిని చదివించి ఉద్యోగంలో చేర్పించటానికి ముందే ఈసమస్యల గురించి ఆలోచించుకుంటే బాగుండేది. .
 ఇప్పుడు చంటిపాపను క్రెష్లో చేర్పించటం కన్నా.. ఓపిక తెచ్చుకుని పెద్దవాళ్ళే పాపను పెంచటం న్యాయం అన్నది నాఅభిప్రాయం.

*********************

అయిదవ కధ.....
అయితే మరి కొందరు పెద్దవాళ్ళకేమో తమ మనుమలను,మనుమరాండ్రను పెంచిపెద్దచేయాలని ఎంతో సరదాగా ఉంటుంది. 

కానీ ఆ పిల్లల తల్లిదండ్రులేమో తమ చంటి పిల్లలను పెద్దవాళ్ళ దగ్గరకు పంపరు . తామే పెంచుకుంటాము అని క్రెష్ లో వేస్తుంటారు.

అక్కడ సరిగ్గా చూసినా చూడకపోయినా నోరులేని చంటిపిల్లలు తమ అభిప్రాయాలను పెద్దవాళ్ళకు చెప్పలేరు కదా పాపం !

చంటిపిల్లలను పెంచే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి దగ్గరే పెంచటం మంచిది.

*********************

కొందరు పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉందామని వచ్చి తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే ,

 మేము మా పిల్లలను పెంచి పెద్దచేసి ఇప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండాలనీ , నాలుగు ఊళ్ళు తిరిగిరావాలనీ అనుకున్నాము. కానీ , పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు. 


అప్పటివరకూ జీవితంలో కష్టపడి మళ్ళీ పిల్లల వద్ద ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనీ నెత్తినేసుకుని చెయ్యాలంటే పెద్దవయస్సు వాళ్ళకి ఇబ్బందే మరి.

( పూర్వం అంటే కోడళ్ళు ఇంటిపనీ, వంటపనీ, చంటి పిల్లల పనీ చేసుకుంటే ....తాత బామ్మలు తమ మనుమలు, మనుమరాండ్రతో ఆడుకోవటం, వారికి కధలు చెప్పటంతో కాలక్షేపం చేసేవారు.
 )

యిలా రకరకాల కారణాల వల్ల ....కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడటం లేదు.వారికి పిల్లలతోనూమనుమలుమనుమరాళ్ళతో కలిసిజీవించాలని ఉన్నా కూడా .... విడిగా ఉంటున్నారు.

ఇంకొక పెద్ద కారణం ఏమంటే ...... పెద్దవయస్సులో పనిభారం పెరిగి ఏమైనా అనారోగ్యం వచ్చి మూలన బడితే వాళ్ళను చూసేవాళ్ళు ఎవరు ? అన్నది కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య అయిపోయింది కదా! .

*******************

ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే,

 చంటిపిల్లలనుసంరక్షించటానికి..... వృద్ధులను సంరక్షించటానికి,.....కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడువారిని సంరక్షించటానికి ......మరిన్ని రోబోట్లనుశాస్త్రవేత్తలు తయారుచేయాలేమో !!..

మనుషులు బిజీఅయిపోయారు కదా !)

*******************

పైన వ్రాసిన విషయాలు చదివి నావి అన్నీ నెగెటివ్ ఆలోచనలు అని చాలామంది విమర్శిస్తారు. చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసే వ్రాసాను . . రోజూ వార్తాపత్రికల్లో ఇంతకంటే చిత్రమైన జీవితకధలను చదువుతున్నాము.

భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విడాకులు, టీనేజీ పిల్లలలో పెరుగుతున్న దురభ్యాసాలు, సమాజంలో పెరుగుతున్న అక్రమసంబంధాలు , ఇవన్నీ చూస్తూ కూడా సమాజం అంతా బాగుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే..


దురదృష్టమేమిటంటే..  మద్యపానం, అర్ధనగ్నంగా దుస్తులు ధరించటం , ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి సమాజంలో గౌరవం లభించటం
.

Friday, May 15, 2015

కొన్ని సమస్యలు...

 
 అత్తగారి సాధింపులు అనే సమస్య వల్ల  చాలామంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు.. అనే విషయం గురించి ఇంతకు ముందు వ్రాయటం జరిగింది.
..........

స్త్రీల ఇంకొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఒక స్త్రీ యొక్క కాపురంలో సమస్యలు రావటానికి ఇంకొక స్త్రీ కారణం కావటం... 


ఈ సమస్య వల్ల కూడా ఎంతో మంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు...ఈ సమస్య వల్ల కొందరు స్త్రీలు ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది.

.......................... 

ఈ మధ్య కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే,  మా ఇష్టం ప్రకారం స్వేచ్చగా  తిరిగితే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నారు.


ఇష్టం వచ్చినట్లు తిరగటం అంటే , ఇతరుల జీవితంలోకి ప్రవేశించి వాళ్ల జీవితాలను పాడుచేయటం  జరుగుతుంది . 


స్త్రీలైనా, పురుషులైనా కట్టుబాట్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం తప్పే. 


భార్య పిల్లలు ఉన్న పురుషుడు భార్యకు  అన్యాయం చేసి ఇంకొక ఆమెతో జీవితం గడపటం చూస్తున్నాము.

 ఇలాంటి సంఘటనలలో.. పురుషుడు  కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తుండగా.. సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమె స్ఠానాన్ని పొందటానికి ప్రయత్నించే స్త్రీని ఏమనాలి ?


సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమెకు మానసికవేదన కలగటానికి కారణ
మయ్యే  స్త్రీలు ఎందరో ఉన్నారు.
..............................  
ఇవన్నీ గమనిస్తే ఏం తెలుస్తుందంటే,  స్త్రీల  కష్టాలకు ..   కొందరు పురుషులు  మరియు    కొందరు   స్త్రీలు కూడా కారణం అని  స్పష్టంగా తెలుస్తుంది.

స్త్రీల  కష్టాలలో  సాటి  స్త్రీల  పాత్ర  ..అనే  సమస్య గురించి కూడా అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది .


 

Wednesday, May 13, 2015

ఓం .. కొన్ని విషయములు.. అద్భుతమైన ప్రాచీన విజ్ఞానము ..


ఓం .. శ్రీ రామశ్రీరామశ్రీరామ
సీతారాములకు వందనములు. 
ఈ రోజు హనుమంతుల వారి జయంతి . 
సువర్చలా సమేత ఆంజనేయస్వామికి వందనములు.
..............
పెద్దలు అనేక విషయాలను తెలియజేసారు .
......................... 

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు..

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయః 

మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ||
 భ.గీ..7-7 శ్లో||

ఒక సూత్రంలో మణులు కూర్చినట్లు ఈ జగత్తంతా నాలో ఇమిడి ఉన్నది.


శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్లు అనంతం నుంచి అణువు వరకూ జగత్తంతా ఒక సూత్రంలో బంధించబడింది.


దీనినే ఆధునిక శాస్త్రవేత్తలు  SuperString అంటున్నారు . 


ఆధునిక శాస్త్రవేత్తలు, స్ట్రింగ్ సిద్ధాంతం ..అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం Quarks,Lepton, కణములు (Particles) కాదనీ,అవి సూక్ష్మమైన,కంపించే గుణం కలిగిన తీగల వంటివని నిర్ధారించారు. 
.............

ఈ జగత్తును ఏడు పదార్ధాలుగా విభజించినది వైశేషిక శాస్త్రం. అవి 1.ద్రవ్యము,2.గుణము,3.కర్మము,4.సామాన్య,5.విశేష, 6.సమవాయ,7.అభావ అని వివరించారు.


"...ద్రవ్యగుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్ధానాం..." - వైశేషిక దర్శనం


ద్రవ్యములను (matter) తొమ్మిది భాగాలుగా గుర్తించాడు.1.పృధ్వి,2.జల, 3.తేజ, 4.వాయు, 5.ఆకాశం,  6.దిక్, 7.కాల, 8.మనస్సు, 9.ఆత్మ.



"పృధ్వి వ్యాపస్తేజో వాయురాజ్కాశం కాలోదిగాత్మా మన ఇతి ద్రవ్యాణి!

-వైశేషిక దర్శనం

కణాద మహర్షి వివరించినట్లుగా మనస్సు- ఆత్మ రెండూ ద్రవ్యములే.(Matters).

.................

"Matter and energy cannot be created or destroyed "......అని ఆధునిక శాస్త్రవేత్తలు తెలియజేసారు. 


అయితే, రూపాన్ని మార్చుకునే అవకాశం ఉంది. 


ఉదా..నీరు ఆవిరి లా మారవచ్చు, ఆవిరి మరల నీరుగా మారవచ్చు, నీరు మంచుగానూ మారవచ్చు. ఇవన్నీ గమనిస్తే జన్మలు,పునర్జన్మలు ఉంటాయని తెలుస్తుంది.

................

పదార్ధాలను చిన్నవి చేస్తూ పోతే ...చివరికి  ఒక స్థితిలో అది తన మూల స్వభావాన్ని కోల్పోతుంది.  -వైశేషిక దర్శనం 7-1-12-14సూ.

......

 బ్లాక్ హోల్స్ .. వంటి ఎన్నో విషయాల గురించి  ఆధునిక శాస్త్రవేత్తలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. 

ఇక, దైవం మోక్షం..వంటి విషయాల గురించి ఆధునిక భౌతికవాదులకు తెలిసింది చాలా తక్కువ.

............

దైవం మోక్షం..వంటి విషయాల గురించి  దైవానికే తెలుస్తాయి. బహుశా మోక్షాన్ని పొందిన జీవులకు కూడా ఈ రహస్యం తెలుస్తుందేమో..

...............

భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు..ETERNALLY TALENTED INDIA-108 FACTS..అనే పుస్తకం నుండి కొన్ని వివరములు సేకరించటం జరిగింది. 


 ప్రచురించిన విషయాలలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో ..  దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .



Monday, May 11, 2015

కొందరు పిల్లలు

 తమ సుఖసంతోషాలను ఎంతో త్యాగంచేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే ......వృద్ధులైన ఆ తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టక, అనారోగ్యం వస్తే పట్టించుకోని పిల్లలు ఎందరో ఉన్నారు. 

అయితే,తల్లిదండ్రులను చక్కగా చూసుకునే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. 

Saturday, May 9, 2015

ఆదర్శవంతమైన పెద్దవాళ్ళకు వందనాలు..

ఇంతకుముందు ఒక టపాలో కొందరు అత్తగార్లు కోడళ్లను పెట్టే ఆరళ్ళ గురించి, ఇలాంటి గొడవల వల్ల  కొన్ని వివాహాలు విడాకుల వరకూ వెళ్ళటం గురించీ రాసాను. 

పిల్లల అభివృద్ధి కోసం తల్లితండ్రి ఎంతో కష్టపడతారన్నది  నిజమే.  పిల్లలకు కూడా తల్లితండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఇదీ సహజమే. 


అయితే మనం మాట్లాడుకుంటున్నది  పిల్లల వివాహం తరువాత వచ్చే సమస్యల గురించి. 

...................

పిల్లలకు తల్లితండ్రి ముఖ్యమే. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. మరి జీవితభాగస్వామి ముఖ్యం కాదా ? 


తల్లా ? పెళ్లామా ? అని వెనకటికి ఒక సినిమా వచ్చింది. నా అభిప్రాయం ఏమిటంటే తల్లీ ముఖ్యమే. భార్యా ముఖ్యమే. 

............

 తల్లితండ్రిని వదిలి అత్తింటికి వచ్చిన అమ్మాయి పట్ల అమ్మగా ఆదరణ చూపించలేకపోయినా, అత్తగారు  మానవత్వం మరిచిపోకుండా ఉంటే బాగుంటుంది.  

................

అత్తను కష్టపెట్టే కోడలంటే అత్తగారికి  కోపం ఉంటే అర్ధం చేసుకోవచ్చు. 


మంచిగా ఉండాలనుకునే కోడళ్ళను కూడా ఆరళ్లు పెట్టే అత్తలను ఎలా అర్ధం చేసుకోవాలి?

 బ్రతుకు మీదే విరక్తి వచ్చేలా సూటిపోటి మాటలనే అత్త అంటే గౌరవం ఎలా కలుగుతుంది ? 


 ఆస్తి ఇస్తారు కాబట్టి, ఎన్ని ఆరళ్లయినా పెట్టే హక్కు పెద్దవాళ్ళకు ఉంటుందా ?
..........

ఆస్తి విషయం  గమనించితే, అబ్బాయికి  తల్లితండ్రి ఆస్తి ఇస్తారు...అలాగే... భార్య కూడా ఆస్తిని తన పుట్టింటి నుంచి తెస్తుంది కదా !


తల్లితండ్రి తమ పిల్లలకు బోలెడు ఆస్తి సంపాదించి ఇవ్వటం అనేది మానుకోవాలి. ఆస్తి సంపాదనలో పడి, చిన్నతనంలో పిల్లల బాగోగులు దగ్గరుండి చూసుకోవటం కూడా తల్లితండ్రికి సరిగ్గా కుదరటం లేదు.

....................

కొందరు అత్తలు కోడళ్ళను అనే సూటిపోటిమాటలు వింటే జీవితమంటేనే విరక్తి కలుగుతుంది. పెళ్ళి ఎందుకు చేసుకున్నామో? అనికూడా  అనిపిస్తుంది.  కొందరికి  అనారోగ్యం  పరిస్థితి కూడా వస్తుంది. 



ఆ మధ్య  ఒక  ఆమెను   చూసాను. ఆమె  అత్తింటి వారి ఆరళ్ళతో మానసికంగా,శారీరికంగా అనారోగ్యం పాలయితే, పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. మనిషి చిక్కిశల్యమైన శరీరంతో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. 


  ఇలా ఆరళ్లు పెట్టే వారిని పెద్దవాళ్ళంటూ గౌరవించాలా ? నరరూపరాక్షసులు అంటేనే వాళ్ళకు సరయిన మాట.

...................

పిల్లలకు వచ్చిన జీవితభాగస్వామి అభిప్రాయాలకు....  అత్తింటి వారి అభిప్రాయాలకు  అంతగా కలవకపోవచ్చు. 


 కోడలు నచ్చలేదని కొడుకుతో అంటూ అదే పనిగా పితూరీలు చెబుతూ ఉంటే ఆ అబ్బాయి ఏం చేయగలడు ? 


 కని, పెంచిన తల్లితండ్రికి నచ్చచెప్పలేక..ఇటు జీవితాంతమూ కలిసిఉంటానని  పెళ్లిలో ప్రతిజ్ఞ చేసి కట్టుకున్న భార్యకూ నచ్చచెప్పలేక మధ్యలో నలిగిపోతాడు.


 ( తల్లితండ్రి అభిప్రాయాలకూ పిల్లల అభిప్రాయాలకూ కూడా తేడాలు ఉండే అవకాశం ఉంది.మరి,  వాళ్ళు బాగానే ఉంటారు కదా!)

..................

కొందరు అత్తగార్లు తాము తమ అత్తను సరిగ్గా ఆదరించకుండా  ఇంట్లోనుంచి గెంటేసినా కూడా, తమ కోడలిపై మాత్రం పెత్తనం చేస్తుంటారు. 


కోడలిని, కోడలి తరపు వాళ్లను ఇంకా కట్నం తెమ్మని , తమకు  మర్యాదలు సరిగ్గా జరగటం లేదని సతాయిస్తుంటారు.

......................

 తన కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉంటే మురిసిపోయే  అత్తగారు... కొడుకు కోడలు  అన్యోన్యంగా ఉంటే   సహించలేకపోవచ్చు .  . కూతురి విషయంలో ఒక రకమైన న్యాయం..కోడలి విషయంలో ఇంకో న్యాయమా? 

..............

వివాహం అంటే రెండు కుటుంబాలు సంబంధం కలుపుకోవటం ఉంటుంది. అలాంటప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపు వాళ్లు సఖ్యతగా ఉండాలి. అప్పుడే అంతా సంతోషంగా ఉంటారు. 


కోడళ్ళతో కొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు కఠినంగా ఉండే వాళ్ళూ ఉంటారు. ఇలా ఎందుకుంటారో అర్ధం కాదు.

కోడలిని చక్కగా చూసుకునే అత్తగార్లు కూడా ఉన్నారు.  పంతాలు, పట్టింపులూ  తగ్గించుకుని  అందరూ కలిసిమెలసి ఉంటే..పెద్దవాళ్ళ పెద్దరికం విలువ పిల్లలకు తెలిసి వస్తుంది. ఇలాంటి ఆదర్శవంతమైన పెద్దవాళ్ళకు వందనాలు.




Friday, May 8, 2015

చతురాశ్రమ ధర్మాలు ..

 మనిషి జీవితంలో ఎన్నో దశలుంటాయి. బాల్యం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్యం.
ఇప్పటి వృద్ధులు ఒకప్పటి పిల్లలే... . నేటి పిల్లలే భవిష్యత్తులో వృద్ధులవుతారు. 
...............

మనిషి జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగటానికి పెద్దలు ఎన్నో విషయాలను తెలియజేసారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసం..అనే చతురాశ్రమాలను  తెలియజేసారు.


 బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం తో  ..  బ్రహ్మచర్యాశ్రమం,  వివాహంతో    గృహస్థాశ్రమం, శరీరం వడలే దశలో..  వానప్రస్థం,  ఇక తరువాత సన్యాసాశ్రమం .

...................

బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం చాలామంది విషయంలో సాఫీగానే  జరిగిపోతాయి. 


వానప్రస్థం, సన్యాసం  దశలే  కష్టంగా  ఉంటాయి. ప్రయత్నిస్తే  ఈ  సమయాన్ని  కూడా  సాఫీగా గడుపుకోవచ్చు .  

...................

మనిషి మనసుకు, కోరికలకు వృద్ధాప్యం  ఉండకపోవచ్చు. అయితే శరీరానికి వృద్ధాప్యం ఉంది కదా!   నడివయస్సు వచ్చేసరికి  శరీరం   యవ్వనంలోలా  పనిచేయలేదు .


ఇష్టమైనంత ఆహారాన్ని తినాలని ఉన్నా శరీరం సహకరించదు. మనస్సును అదుపులో ఉంచుకోవటం తప్పనిసరి అవుతుంది.ఈ విధానం చాలా  విషయాలకు  వర్తిస్తుంది. 



వానప్రస్తం అంటే, ప్రాచీనకాలంలో కొందరు వనాలకు వెళ్లి జీవించేవారట. అందరికీ అలా ఆచరించే  ఓపిక  ఉండకపోవచ్చు.


ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో..  అరణ్యాలకు  వెళ్ళకుండా,  సంసారంలో  ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూ కూడా దైవకృపను పొందటానికి  ప్రయత్నించవచ్చు. 

..................

ఇక, సన్యాసం అనే విషయం  ఈ రోజుల్లో ఎక్కడో అరుదుగా తప్ప, అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు.


దైవకృపను పొందటానికి .. సాధ్యమయినంతలో రాగద్వేషాలను అదుపులో ఉంచుకుంటూ  జీవించటానికి ప్రయత్నించవచ్చు.

............................

 వృద్ధులైన  పెద్దవాళ్లను  పిల్లలు  ఆదరించాలని   కూడా పెద్దలు    తెలియజేసారు.  


పిల్లలు పెద్దవాళ్ళను  ఆదరించాలి . తాము  కూడా  భవిష్యత్తులో  వృద్ధులమవుతామని  గుర్తుంచుకోవాలి .  

 ............................. 

మరణానంతరం కూడా ఆత్మ  ఉంటుందని పెద్దలు తెలియజేసారు. ఆత్మ మోక్షాన్నీ పొందవచ్చు లేక మరుజన్మనూ పొందవచ్చు.


 మోక్షమే వస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. ఒకవేళ మోక్షాన్ని పొందలేకపోయినా చక్కటి మరుజన్మ రావాలంటే,   కనీసం   జీవిత మలిసంధ్యలో అయినా దానికి తగ్గ ప్రయత్నం చేయటం  అవసరం.

............................ 

జీవిత చరమాంకములో కూడా  అనవసరమైన సంపాదనా  యావతో,  పంతాలు, పట్టింపులతో, ఆధిక్యతా పోరాటాలతోనే  పొద్దుపుచ్చితే , మరణించిన తరువాత నరకయాతనలతో బాధలు పడవలసి వస్తుంది.


అలా కాకుండా ఉండాలంటే , పదుగురికి ఆదర్శంగా జీవించాలి  తప్ప, ఆరాటాలూ, పోరాటాలతో జీవితం  గడిపితే మరుజన్మ దీనాతిదీనంగా ఉండే అవకాశం  ఉంది... .అప్పుడు చింతించి ప్రయోజనం ఉండదు.

...............

సరైన మార్గంలో జీవించటానికి  తగినంత  శక్తినివ్వమని   శాశ్వత  బంధువు అయిన  దైవాన్ని ప్రార్ధించాలి.


శ్రీ దేవీ భాగవతము, ఒక యోగి ఆత్మ కధ..గ్రంధముల ద్వారా ఎన్నో విషయములను తెలుసుకోవచ్చు.




Wednesday, May 6, 2015

పెళ్ళిళ్ళు..పంతాలు, పట్టింపులూ..

 
వివాహాలు కలహాల కాపురాలుగా మారటానికీ, విడాకులు కావటానికి పెద్దవాళ్ళ పంతాలు, పట్టింపులూ కూడా కారణాలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న విషయం.  

పిల్లలకు వివాహాలు చేయాలని  తాపత్రయపడి వివాహాలు చేస్తారు పెద్దవాళ్లు.


 అయితే వివాహం  అనుకోవటం తరువాయి పెట్టుపోతలు, మర్యాదలు..అంటూ  పెళ్ళికుమార్తె తరపు మరియు  పెళ్ళి కొడుకు తరపు పెద్దవాళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు మొదలవుతాయి. 


ఈ గొడవలే  భార్యాభర్త  జీవితమంతా గొడవలు పడటానికి చాలావరకూ కారణాలవుతాయి.

.............................. 

ఈ పంతాలు, పట్టింపులు ఆడవాళ్ళలో అధికంగా కనిపిస్తుంటాయి.


కోడలు వచ్చేసరికి కుటుంబంలో తన ఆధిక్యత తగ్గుతుందేమో? అనే అభద్రత వల్ల కావచ్చు... సాధారణంగా చాలా మంది అత్తగార్లు కోడళ్ళను  సాధించటం మొదలుపెడతారు.


 కోడలు ఎంత మంచిగా ఉండటానికి ప్రయత్నించినా ప్రతిపనిలో వంకలు చూపిస్తూ కోడలిని సాధిస్తుంటారు.


చిత్రమేమిటంటే ,అత్తగారి సాధింపులు అనుభవించి  ఎన్నో బాధలు పడ్ద కోడలు,  తాను అత్తగారుగా మారిన తరువాత తన కోడలిని ఎందుకు సతాయిస్తుందో ? అర్ధం కాని విషయం. 

....................

ఒకవేళ అత్తగారు తన కోడలిని ప్రేమగా చూసుకుందామని అనుకున్నా కూడా.. బంధువులు, ఇరుగుపొరుగు .. అత్తకు, కోడలికి మధ్య తగవు పెట్టేస్తారు. 


మా దూరపు బంధువులలో ఒకామె కాబోయే  కోడలిని  ప్రేమగా చూసుకోవాలనుకుంది. వివాహం జరిగి కొత్తకోడలు అత్తవారింటికి వచ్చింది. ఇంట్లో బంధువులు  కూడా ఉన్నారు. 


అత్తగారు కోడలితో ఆప్యాయంగా మాట్లాడుతోంది. ఇది చూసి సహించలేని అత్తగారి తరపు బంధువులు కొందరు ( స్త్రీలు) ఆమెతో.. 


కోడలితో ఇంత మంచిగా మాట్లాడితే తరువాత నీ నెత్తికెక్కి కూర్చుంటుంది. అని చెప్పటం నేను స్వయంగా విన్నాను.


 కొంతసేపటికి  అబ్బాయి తరపు బంధువులలో కొందరు మహిళలు , చిన్న విషయానికే  అమ్మాయి తరపు బంధువులతో గొడవ పెట్టుకోవటమూ జరిగిపోయింది. 


కొంతకాలానికి  ఆ అత్తాకోడలికి మధ్య సరిపడక  వేరు కాపురం పెడతామని కోడలు అడగగా, అత్తింటివాళ్ళు ఒప్పుకోలేదు.


 మరికొంతకాలానికి భార్యాభర్త గొడవలు పడటం , విడాకులు  కూడా జరిగిపోయాయి.( వారికి ఒక బిడ్ద కూడా ఉన్నాడు.)

.................................. 

ఈ రోజుల్లో అమ్మాయి తరపు పెద్దవాళ్ళు కూడా గట్టిగానే ఉంటున్నారు.


అత్తింటి నుంచి అమ్మాయి  ఏడుస్తూ ఫోన్లు చేయగానే అత్తింటి వారిపై కేసు వేస్తామని బెదిరించటం, లేకపోతే  విడాకులు ఇచ్చేయమని అనటం ఎక్కువగా జరుగుతోంది.


 అమ్మాయి నిజంగానే అత్తింట్లో చాలా కష్టాలు అనుభవిస్తుంటే  పుట్టింటి వారు ఆదుకోవటంలో తప్పులేదు కానీ , చిన్నచిన్న విషయాలకే అత్తింటి వారిని బెదిరించటం సరైనది కాదు. 

............................... 

(అభిప్రాయభేదాలు తల్లిబిడ్దలకు కూడా వస్తాయి. అత్తింటి వారితో అభిప్రాయభేదాలు ఉండటం సహజమే. అయితే అందరూ సర్దుకోవాలి..తెగేదాకా లాగకూడదు.


మరీ సర్దుకోలేకపోతే ఇక ఎవరిష్టం వాళ్ళది..రెండో  పెళ్లి వాళ్లతో అయినా సర్దుకుపోక తప్పదు కదా !)

..............

ఒక జంట  వివాహం భగ్నం కావటంలో..  కొందరు  బంధువులు, ఫ్రెండ్స్ పాత్రతో పాటు  కొందరి విషయంలో  తల్లితండ్రి పాత్ర   కూడా ఉండటం అనేది అత్యంత బాధాకరమైన విషయం.


 తమ పంతాలు, పట్టింపులతో సనాతన  భారతీయ వివాహవ్యవస్థ  విచ్చిన్నం కావటానికి కారణం అవుతున్న వారు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు. 

...............

పెద్దవాళ్ళకు విన్నపం ఏమిటంటే .. పిల్లలు వివాహం  చేసుకుని  సుఖంగా ఉండాలని అనుకుంటే , వాళ్లు చక్కగా కాపురం చేయటానికి సహకరించండి. 


పిల్లల జీవితాల కన్నా..  పెద్దవాళ్ల పంతాలు, పట్టింపులు, ఆధిక్యతలే ముఖ్యం అనుకుంటే మీ పిల్లలకు వివాహాలు చేయకండి.


మీరు పచ్చగా ఉంటే చూడలేని కొందరు ఇరుగుపొరుగు, ఫ్రెండ్స్, బంధువులు..మీ కుటుంబంలో గొడవలు సృష్టించటానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్దిగా నమ్మకండి.

..................
అయితే..  కొడుకుకోడలు, కూతురుఅల్లుడూ.. గొడవలు పడుతుంటే  సర్దిచెప్పి ,వాళ్ల జీవితాలు సాఫీగా నడవటానికి చేతనైనంత  సాయం చేసే  తల్లితండ్రులూ ఎందరో  ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళకు వందనాలు.



Monday, May 4, 2015

ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

స్త్రీల కష్టాలకు  పురుషులతో పాటు  సాటి స్త్రీలు కూడా కారణమే.
ఉదా..చాలామంది అత్తాకోడళ్ళకు  పడకపోవటం ఎప్పటినుంచో ఉంది.

 మంచిమనిషి అని పేరు తెచ్చుకున్న అత్త గారు కూడా కోడలి విషయంలో రాక్షసంగా ప్రవర్తించే అవకాశముంది.


 మంచిమనిషి అని పేరు తెచ్చుకున్న కోడలు కూడా అత్తగారి పట్ల రాక్షసంగా ప్రవర్తించే అవకాశముంది. 

............................... 

 ఒకరంటే ఒకరికి పడని అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండటం కష్టమే . అదొక  నరకం. 


  సూటిపోటిమాటలతో  కోడలిని చిత్రవధ చేసే అత్తగారితో కలిసి ఉండటం అంటే మహా నరకమే.

.............................. 

పురుషులు స్త్రీలను తెగ కష్టాలు పెట్టేస్తున్నారని అంటారు కానీ, 


 ఇంటి  నాలుగు  గోడల మధ్య ...   అత్తలు అనబడే కొందరు నరరూప రాక్షసులు   కోడళ్ళను  పెట్టే చిత్రహింసల గురించి ఎందుకు మాట్లాడరు ? 

.................................. 

కొడుకుకోడలు మధ్య  గొడవలు సృష్టించి కోడలిని కొడుకుతో తిట్టించి, కొట్టించి రాక్షసానందాన్ని పొందే అత్తలు ఎందరో ఉన్నారు. అత్తకు వంతపాడే ఆడబిడ్దలూ ఉంటారు.

.............................. 

 ఇక,  కొందరు కోడళ్లు కూడా అత్తలకు నరకం చూపిస్తుంటారు. 


మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అత్తగారికి అతి శుభ్రం ఎక్కువ. కోడలికేమో అతి బద్ధకం. 


వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట. సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం, పార్టీలు, ఫంక్షన్స్ అంటూ తిరగటం, ఇంటిపని పట్టించుకోకపోవటం...అలా గొడవలు అయిపోయాయి.



అత్తగారి గురించి కోడలు ఆఫీసులో ఆడవాళ్ళతో చెప్పగా.. వాళ్లు ఇంటికి ఫోన్ చేసి అత్తగార్ని తిట్టారట.   గొడవ చిలికిచిలికి గాలివాన అయి... అత్తాకోడళ్లు విడిపోయి  వేరే ఇళ్ళలో ఉంటున్నారు.

........................

అయితే, విడిపోయినా అత్తాకోడళ్ళ మధ్య శత్రుత్వం తగ్గలేదు.

 అత్తగారేమో తన కోడలి వల్ల తాను ఎన్ని కష్టాలు పడిందో అదేపనిగా ఇరుగుపొరుగు వారితో చెప్పుకోవటం..కోడలేమో తన అత్తగారి వల్ల  తాను ఎన్ని కష్టాలు పడిందో  అదేపనిగా ఆఫీసు వాళ్ళతో చెప్పుకోవటం కొనసాగించారు.

 అలా .. కొంతకాలానికి ఇద్దరికి అనారోగ్యం కలిగింది. 

  అత్తగారికి పక్షవాతం వచ్చింది. కోడలికి గర్భసంచి అనారోగ్యానికి గురయ్యి పిల్లలు పుట్టకుండానే గర్భసంచి తీసివేయవలసి వచ్చింది. 

............................. 

అభిప్రాయాలు కలవని వాళ్ళు ఎందరో  లోకంలో ఉంటారు.పరస్పర  విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా స్నేహంగా ఉండటం కనిపిస్తుంది. 

అయితే, కుటుంబసభ్యుల మధ్య మాత్రం  గొడవలు తారాస్థాయికి వెళ్ళటమే బాధాకరం. 
........................
 ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

 స్త్రీల కష్టాలకు పురుషులు మాత్రమే కారణం, పురుషాధిక్యత నశించాలి..అంటూ గొంతులు చించుకోవటాలు ఎందుకో ?

 స్త్రీల పట్ల  సాటి  స్త్రీల ఆధిక్యత  నశించ నవసరం లేదా ?