koodali

Friday, February 27, 2015

ఉపాధి లభించని ఈ రోజుల్లో యువత పరిస్థితి..


ఈ రోజుల్లో అనేక కారణాల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య ప్రపంచమంతటా ఉంది. ఉద్యోగం వచ్చిన వాళ్ళలో కూడా చాలామందికి  ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. 

...............

నాకు తెలిసిన ఒక సంఘటన వ్రాస్తాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుండి పట్టా పుచ్చుకున్న విద్యార్ధులలో కొందరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒక సంవత్సరం ఎదురుచూపుల తర్వాత వారికి  విధులలో చేరే అవకాశం లభించింది. 


ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించని యువకుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. నీ ఫ్రెండ్స్ కు ఉద్యోగం వచ్చింది. నీకు ఇంకా రాలేదేమని ప్రశ్నించే ఇంట్లో వాళ్ళకు  ఏమని జవాబు చెప్పాలో తెలియక, 


ఏరా ! ఇంకా ఉద్యోగం రాలేదా..అని ప్రశ్నించే శ్రేయోభిలాషుల..? పరామర్శలను తట్టుకోలేక నిరుద్యోగ యువకులు నలిగిపోతుంటారు.


ఇలాంటి నిరుద్యోగులు కొందరు , ఉద్యోగం లభించిన  స్నేహితులను  తమకు కొంచెం డబ్బు సాయం చేయమని  అడుగుతుంటారు . 


 డబ్బు సాయం చేయమని ఇతరులను అడిగే పరిస్థితి రావటం దయనీయం. ఇలాంటి నిరుద్యోగుల  పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి.

............

కొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వేల ఎకరాలను ప్రభుత్వాలను అడిగి తీసుకుంటారు. కాని వాళ్ళు కల్పించేది కొద్ది సంఖ్యలో ఉద్యోగాలు మాత్రమే.


 ఉదా..ఒక కంపెనీ తమకు కొన్ని వేల ఎకరాలు ఇప్పిస్తే 500 మందికి ఉద్యోగం ఇస్తామని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతోటి ఉపాధికి అన్ని  ఎకరాలు అవసరమా?

..........

నిరుద్యోగం పెరగటానికి  మితిమీరిన యాంత్రీకరణా ఒక కారణమే. పాతకాలంలో పదిమంది పదిరోజుల్లో చేసే పనిని ఈ రోజుల్లో ఒక్క యంత్రం ఒక్క గంటలో చేసేస్తోంది. ఇక మనుషులు చేయటానికి పనులు ఎక్కడుంటాయి ?


యాంత్రీకరణ అవసరమే కానీ , నిరుద్యోగ సమస్య పెరిగేంతగా యాంత్రీకరణ ఉండకూడదు. 

.................

 ఉద్యోగస్తులను తక్కువగా నియమించి యంత్రాలతో  పనులు చేయించుకుంటున్నారు యజమానులు. యంత్రాలు అయితే జీతాలు పెంచమని అడగవు కదా !  


ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడుగుతుంటారు. వేల రూపాయలు జీతాలు ఇచ్చేవారు  ఉద్యోగస్తులను ఊరికే కూర్చోబెడతారా ? ఇద్దరు చేసే పనిని ఒక్కరితో చేయిస్తారు.


ఉద్యోగస్తులు  జీతం పెరుగుతుందని అనుకుంటున్నారే కానీ, విరగబడి పనిచేయటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అర్ధం చేసుకోవటం లేదు. 


ఒకే వ్యక్తికి నెలకు 70 వేలు ఇచ్చే బదులు నెలకు 40 వేలు ఇచ్చి ఇద్దరు వ్యక్తులను పనిలోకి తీసుకుంటే ఎక్కువమందికి ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.


 ఒక్కరే ఎక్కువ పని చేస్తే అలసట వల్ల శ్రద్ధగా చేయలేరు. పనిలో నాణ్యత ఉండదు. పనిలో నాణ్యత లేకుంటే కంపెనీకీ నష్టమే కదా ! 


అదేపని ఇద్దరు చేస్తే అలసట లేకుండా శ్రద్ధగా చేయగలరు. అనారోగ్యాలూ రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే కదా ఏ పనైనా చేయగలరు. 

....................

ఇంకో కారణం ఏమిటంటే , పాతకాలంలో స్త్రీలు ఇంటిపనులు చూసుకుంటే పురుషులు సంపాదన వ్యవహారాలు చూసుకునేవారు. 


ఇప్పుడు స్త్రీలు అన్నిరంగాల్లో పురుషులకు పోటీ వస్తున్నారు. అసలే యాంత్రీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గిన ఈ రోజుల్లో యువకుల్లో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది.


స్త్రీలు ఉద్యోగం చేయకపోయినా వాళ్ళను ఎవ్వరూ తప్పు పట్టరు. అదే పురుషులు ఉద్యోగం లేకుండా ఇంటిపట్టున ఉంటే అందరూ సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. దాంతో వాళ్ళలో నిరాశా, నిస్పృహలు పెరుగుతాయి. 


కొందరు మానసికంగా క్రుంగిపోతే, మరి కొందరిలో నేర ప్రవృత్తి పెరిగే అవకాశమూ ఉంది.( తమకు ఉపాధి కల్పించలేని సమాజంపై కోపంతో..) 

...................
 ఆర్ధికపరిస్థితి బాగాఉన్న మహిళలు కూడా ఉద్యోగాల కోసం పోటీపడటం వల్ల ఆర్ధిక పరిస్థితి  సరిగ్గా లేని   మరికొందరికి ఉద్యోగఅవకాశాలు తగ్గే అవకాశం ఉంది.  

 ఉపాధి  లభించక  ఈ  మధ్య  కొందరు  యువకులు  ఆత్మహత్యలు 
 చేసుకున్నట్లు  వార్తలు  వచ్చాయి. 

.......................... 
 ఈ లింకులు  కూడా చదవగలరు. 




Wednesday, February 25, 2015

స్త్రీ పుట్టింటినుంచి తెచ్చుకునే ధనం విషయంలో చట్టబద్ధత ..?


ఎవరైనా కట్నం ఇచ్చినా,తీసుకున్నా శిక్షార్హులే అంటారు.


కట్నం ఇవ్వటము.. తీసుకోవటమూ రెండూ నేరమే అయినా ..ఏదో ఒకరూపంలో అమ్మాయి తరపు వారి నుంచి ధనాన్ని తీసుకుంటూనే ఉన్నారు. 


 పుట్టింటినుంచి మరింత సొమ్ము తీసుకురావాలని కోడళ్ళను ఆరళ్ళు పెట్టే అత్తింటి వారి గురించి  వింటున్నాము. 

.....................

పాతకాలంలో, స్త్రీ ధనాన్ని అత్తింటివారు వాడుకోవటం చిన్నతనంగా భావించేవారు. అందువల్ల స్త్రీ ధనాన్ని పురుషులు వాడుకోవటం ఎక్కువగా జరిగేది కాదు. 


 స్త్రీలకు ఆర్ధికసాయం గురించి ఎంతో దూరం ఆలోచించిన మన పెద్దలు ..స్త్రీలకు ఆభరణాలను పెట్టుకోవటం అనేది ఆచారంగా ఏర్పాటుచేసారు.


 ఈ ఆభరణాలు స్త్రీల ఆధీనంలోనే ఉండేవి. వాటిని వారు తమ తరువాతి తరాలకు అందజేసేవారు. ఎప్పుడయినా ఆర్ధికంగా కష్టం వస్తే ఈ ఆభరణాలు ఆడవాళ్ళను ఆదుకునేవి. 

....................

 కొడుకూ కూతురూ సమానమేనని భావించే ఎంతో మంది తల్లితండ్రులు తమ కూతుళ్ళకూ కొంత ధనాన్ని ఇష్టపూర్వకంగానే ఇస్తుంటారు.


ఎక్కువ ఆస్తి లేని వాళ్ళు కూడా అప్పోసప్పో చేసి కొంత ధనాన్ని ఇవ్వటమూ జరుగుతోంది. ( అత్తింటి వారు అడుగుతారు కాబట్టి..) 

..............................

 అయితే, కట్నం ఇవ్వటం, పుచ్చుకోవటం నేరం.. అనే పరిస్థితి వల్ల సొమ్ము ఇచ్చిన పుట్టింటివారూ తీసుకున్న అత్తింటివాళ్ళు కూడా ఆ విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ గోప్యత వల్ల ఆడవాళ్ళకే నష్టం జరుగుతోంది.


 ఎలాగూ ధనాన్ని ఇస్తున్నప్పుడు, ఇంత  ఇచ్చామని చెప్పుకునే వెసులుబాటు ఉంటే, ఆ విషయాన్ని ఆడపిల్లల తరపు వాళ్ళు  ధైర్యంగా బయటకు చెప్పుకోగలరు. 


 కోడలు తెచ్చిన  స్త్రీ ధనాన్ని ( కట్నాన్ని ? ) దిగమింగి కోడళ్ళను బయటికి గెంటే పరిస్థితి ఉన్నప్పుడు .. 


.తీసుకున్న స్త్రీ ధనానికి చట్టబద్ధత ఉంటే , అమ్మాయిల తరపు వాళ్ళు  ధైర్యంగా తాము ఇచ్చిన సొమ్మును  అత్తింటి వారి వద్ద నుంచి వసూలు చేసి, అమ్మాయికి తిరిగి ఇవ్వగలుగుతారు.

.................

ఈ రోజుల్లో పుట్టింటి ఆస్తిలో అమ్మాయిలకూ భాగం కల్పించారు. ఇందువల్ల ఆడవాళ్ళకు కొంత  నష్టం జరిగే అవకాశమూ ఉందనిపిస్తుంది. 


ఉదా.. కోడలి పుట్టింటివారిని ఇబ్బంది పెట్టాలని, వారి ఆస్తి మీద కన్నేసి, మరింత ఆస్తి తెమ్మని కోడలిని జీవితాంతమూ వేధించే అవకాశమూ ఉంది.


 దీనికన్నా, వివాహసమయంలో కొంతసొమ్మును ముట్టచెపితే అప్పటితో సరిపోతుంది కదా ! అమ్మాయి పుట్టింటి వారికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనిపిస్తోంది.

.............

ఈ రోజుల్లో కూడా, కోడళ్లను ఆరళ్ళు పెట్టే అత్తలు చాలామందే ఉన్నారు. అలాగే వయసుడిగిన అత్తలను ఆరళ్ళు పెట్టే కోడళ్లూ ఉంటారు.


భర్త మరణించినా లేక అత్తింటివారు బయటకు తోసేసినా.. పాతకాలంలో అయితే ఇలాంటి స్త్రీలు అత్తింటిలోనో, పుట్టింటిలోనో ఉండేవారు. తల్లితండ్రులు లేకపోయినా సోదరులు ఆదుకునేవారు.ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వారు చూసుకోవటమే కష్టంగా ఉంది.

................. 

 స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి తోటి స్త్రీలకు సాయంగా నిలబడాలి. ఉదా..భూమిక హెల్ప్ లైన్ .. వంటి సంస్థలు ఆడవాళ్ళకు చేయూతనిస్తున్నాయి. ఇలాంటి సంస్థలు మరిన్ని ఏర్పడితే స్త్రీలు సాయం కోసం పరాయి మగవారిని అడిగి మోసపోకుండా ఉంటారు. 


అంతేకాదు, అత్తింటివారి వల్ల అన్యాయం జరిగినప్పుడు , ఆడవాళ్ళకు ఆర్ధికంగా ఆసరాను కల్పించేలా ఏర్పాటు ఉండాలి.


(అయితే ఇలాంటి చట్టాలను ఆడవాళ్ళు తమ స్వార్ధం కోసం ఉపయోగించి, అమాయకులైన అత్తింటివారిని బెదిరించే అవకాశం ఉండకూడదు. )


స్త్రీలు పుట్టింటి నుంచి తెచ్చే సొమ్ముకు  చట్టబద్ధత ఉంటే బాగుంటుందని..  ఒక కాలేజ్ అమ్మాయి  వెలిబుచ్చిన  అభిప్రాయాన్ని వార్తాపత్రికలో చదివిన తరువాత, నాకు తోచిన ఆలోచనలతో.. ఈ టపా వ్రాయటమైనది.

Monday, February 23, 2015

ఈ రోజుల్లో చాలామంది స్త్రీల పరిస్థితి ...

 
 
ఈ రోజుల్లో స్త్రీలు మగవారితో పోటీ పడుతున్నారు.  అయితే, మారిన పరిస్థితిలో ఎంతమంది మహిళలు నిజంగా సంతోషంగా ఉన్నారు ? 
.................... 

తాము సూపర్ విమెన్ అని నిరూపించుకోవటం కోసం కొందరు స్త్రీలు  ఎన్నో పనులు నెత్తిన వేసుకుంటున్నారు. తెల్లారిలేస్తే రాత్రి పడుకునేవరకూ విశ్రాంతి అనేది తగ్గిపోయింది. ఇంతా చేసి మహిళలు సాధించింది ఏమిటన్నది అర్ధం కావటం లేదు.


 ఎన్ని పనులు చేసినా సరే, స్త్రీలు గొప్పవారని అనే మగవాళ్ళు ఎంతమంది?  స్త్రీలు ఎంతో గొప్పవారు..అంటూ తమ బాధ్యతలను కూడా తెలివిగా స్త్రీల నెత్తిన వేస్తున్న మగవాళ్ళ సంఖ్యా ఎక్కువవుతోంది.


 ఇంటి బాధ్యతలు ఒక వైపు.. బయట బాధ్యతలు ఒక వైపూ వేసుకుని రెండు పడవల ప్రయాణంలా దేనికీ సరిగ్గా న్యాయం చేయలేక అలసిపోతున్నారు ఎక్కువమంది మహిళలు.

.................

 పూర్వపు స్త్రీలకు ఇంటిని సర్దుకుంటే సరిపోయేది. ఇంటి పనులు అయిన తరువాత మధ్యాహ్నం  విశ్రాంతి లభించేది. అప్పుడు, ఇరుగుపొరుగు అమ్మలక్కలతో కష్టమూసుఖమూ చెప్పుకుని సేదతీరేవారు. 


వారి కబుర్లలో ఎన్నో అంశాలు చోటుచేసుకుని కొత్తకొత్త విషయాలను ఒకరినుంచి ఒకరు తెలుసుకునేవారు.


 స్త్రీలకు ప్రకృతిసిద్ధంగా వచ్చే నెలసరి, గర్భాన్ని ధరించటం వంటి సమయాల్లో ఇంటిపట్టున ఉండి విశ్రాంతిని పొందేవారు. 


పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ బిడ్డల ఎదుగుదలలో స్వయంగా పాలుపంచుకుంటూ వారి ఆటలను ముద్దుమురిపాలను చూసుకునేవారు. పిల్లల ఆలనాపాలనా చక్కగా చూసుకుంటున్నామనే తృప్తి వాళ్ళకు ఉండేది. 

...................

 పిల్లలు పుట్టిన దగ్గరనుంచి కొన్నిసంవత్సరాల వరకు చక్కటి ఆహారం, సరైన పర్యవేక్షణ అవసరం. 


చిన్నతనం నుండి సమతులాహారం తో, పెద్దవాళ్ళ ఆలనాపాలనాలో పెరిగిన పిల్లలలో శారీరిక, మానసిక ఎదుగుదల బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. 


ఈ రోజుల్లో చాలామంది పిల్లల చిన్నతనం క్రెచ్ లకు మరియు హాస్టల్స్ కు పరిమితం అయిపోయింది.

...............

ఉదయం , పిల్లలు  నిద్రలేచి ఆదరాబాదరాగా  ఏదో ఒకటి తిని స్కూలుకు వెళ్ళిపోతారు.( కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమయం ఉండదు కొన్నిసార్లు.) 


చిన్న వయసున్న పిల్లలు కూడా బండెడు బరువున్న పుస్తకాల బరువుతో బస్సులలో నుంచుని స్కూలుకు వెళ్ళటం కూడా కనిపిస్తుంది.


ఇక, స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ గోడకుర్చీ వేసినట్లు కుర్చీలలో కూర్చుని  పాఠాలు వినాలి. నెలసరి సమయంలో ఆడపిల్లలకు విశ్రాంతి  అవసరం. 


నిట్రాయిలా గంటల తరబడి కూర్చోవటం అనేది..తరువాత కాలంలో వారి ఆరోగ్యం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో ఎందరో అమ్మాయిలు చిన్నవయస్సుకే నడుం నొప్పితో బాధ పడుతున్నారు.

...................

ఇక ఉద్యోగాలు చేసే స్త్రీలకు ఎన్నో సమస్యలు. ఆఫీస్ ఇంటికి దూరంగా ఉంటే బస్సులలో, షేర్ ఆటోలలో ఇరుక్కుని కూర్చుని వెళ్ళవలసి ఉంటుంది. 


బస్సులలో సీట్ దొరకకపోతే నిలబడి వెళ్ళవలసి ఉంటుంది.


 ( అందరికీ కార్లు ఉండవు కదా ! ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరికి కారు ఉండే అవకాశాలు తక్కువే.)  

.................

ఇక గర్భిణి స్త్రీల సమస్యలు చెప్పనే అక్కర్లేదు. గర్భం వచ్చిందని తెలుసుకునే లోపలే బస్సు లేక ఆటో ప్రయాణాల్లో కుదుపులకు,  ప్రారంభపు నెలల్లోనే గర్భం పోయే ప్రమాదమూ పొంచి ఉంది. గర్భం ధరించినట్లు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.


సున్నితమైన గర్భ సంబంధ సమస్యలు ఉన్నవారికి కారు ప్రయాణమూ ప్రమాదమే. 

గర్భంలో పిండానికి  అవయవాలు ఏర్పడే సమయంలో తల్లి జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి. ఏదిపడితే అది జంక్ ఫుడ్ లాంటివి..  తినకూడదు. 


 నచ్చినట్లు  ఆహారం వండుకోవటానికి, తాపీగా తినటానికి సమయం ఎక్కడిది ? 

......................

ఇక, ప్రసవానంతరం చంటిపిల్లలను స్వయంగా చూసుకోలేని నిస్సహాయ పరిస్థితి. ప్రభుత్వరంగసంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా స్త్రీల కొరకు కొన్ని సెలవులను ఇస్తారు. 


అయితే, సెలవు ముగిసిన తరువాత అయినా ఆఫీసుకు వెళ్ళాలి కదా! చంటిపిల్లలను ఎక్కడో క్రెచ్లలో వదిలివెళ్ళాలంటే ప్రాణం ఉసూరుమంటుంది.

................

 ఒక ప్రక్క  బయట నెరవేర్చవలసిన టార్గెట్లూ మరో ప్రక్క ఇంటి బాధ్యత మధ్య నలిగిపోతూ ఉంటారు. తద్వారా  ఎన్నో అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశమూ ఉంది.


అనారోగ్యంతో పనికి వెళ్ళలేకపోతే ఉద్యోగమో లేక వ్యాపారమో ఊడిపోతుంది.  అనారోగ్యం వచ్చి మంచాన పడితే చూసే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న. ఇంట్లో అందరూ  ఎవరి పనితో వారు బిజీ కదా !

................

ఇంటాబయటా  పనిచేయలేక..  ఇంటిపట్టునే ఉండాలి.. అని ఎవరైనా భావించినా ఉండే పరిస్థితి అంతలా కనిపించటం లేదు.


 కొందరు స్త్రీలు ఏమన్నారంటే , ఇంటాబయటా కష్టపడాలని మాకూ లేదు. అయితే, ఉద్యోగం మానేస్తే మగవారు ఊరుకుంటారా ? మేము కూడా సంపాదిస్తేనే ఇల్లు గడవాలి అంటారు. అన్నారు. 


ఇదండి పరిస్థితి.. ఈ రోజుల్లో చాలామంది  మహిళల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుంది. 

..............
ఆదాయం అవసరమే కానీ ఆరోగ్యమూ అంతకన్నా ముఖ్యం కదా ! కొన్ని కోరికలను తగ్గించుకుంటే తక్కువ ఆదాయమైనా సరిపోతుంది.
.................

ధరలు పెరుగుతుంటే ధరలు తగ్గేటట్లు  చర్యలు తీసుకోవాలి   కానీ పెరిగే రేట్ల వెంట పరుగులు తీయటం అంటే ఎండమావుల వెంట పరుగులు తీయటం వంటిది.

.......................... 
ఇక , స్త్రీలకు పనిచేసే చోట ఎన్నో వేధింపులు ఉండే అవకాశం ఉంది. 

 కొన్ని పాఠశాలలో చిన్నపిల్లలను  లైంగికంగా వేధిస్తున్న కేసులను గురించి వింటుంటే , ఆడవారి పరిస్థితి మెరుగయ్యిందా లేక దిగజారిందా అనేది అర్ధం కావటం లేదు.

.........

డబ్బు సంపాదిస్తేనే స్త్రీల గొప్పదనం తెలుస్తుందా ? ఇంటిపట్టున ఉండి గృహనిర్వహణను చూసుకోవటం  చిన్నతనం ఎలా అవుతుంది ? ఇంటిని చక్కదిద్దుకుంటే  సమాజాన్నీ  చక్కదిద్దినట్లే కదా !


కుటుంబంలో సంపాదన బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో...  కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటం కూడా అంతే ముఖ్యమైనది. 

......................... 

ఇంటిని చక్కదిద్దుకుంటూనే తీరికసమయాన్ని సమాజసేవకూ కేటాయిస్తూ తృప్తిగా జీవిస్తున్న స్త్రీలెందరో ఉన్నారు.


 ఎంతో గొప్ప ఆదాయం వచ్చే ఉద్యోగాలను వదిలి కుటుంబాన్ని చూసుకుంటూనే..  సమాజసేవనూ చేస్తూన్న వారిలో ఇంఫోసిస్ సుధామూర్తి ,  మిచెల్ ఒబామా..వంటి గొప్ప స్త్రీలూ ఉన్నారు. 


Friday, February 20, 2015

ఆ రోజుల్లో ..ఈ రోజుల్లో..కొన్ని విషయాలు..

 
కొందరు ఏమంటారంటే, పాతకాలంలో  ఏమీ బాగుండేది కాదు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అంటారు. అయితే, కొన్ని విషయాలను చూద్దాము..
...........
పాతకాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా   భోగి రోజున భోగిమంటలు వేసేవారు. ఇంట్లో ఉన్న విరిగిపోయిన , పాతవైన  చెక్కసామాను..వంటివి ఆ మంటలలో  వేసేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రమయ్యేది.

ఇప్పుడు వాడి పడేసిన  ప్లాస్టిక్ సామాను మరియు ఎలక్ట్రానిక్ సామానును  ఎలా వదిలించుకోవాలో ఎవరికీ సరిగ్గా తెలియటం లేదు .

పాతకాలంలో  ప్రతి సంక్రాంతికి  ఇంటికి సున్నం వేయించుకునేవారు. అందువల్ల  ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేది.

 ఇప్పుడు  ప్రతి సంవత్సరానికి రంగులు వేయించుకోవటం లేదు. 5 లేక 6 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేయించుకోవటం వలన ఇంట్లో  అశుభ్రత,  తద్వారా రోగకారక పరిస్థితి  ఎక్కువగా ఉంటుంది. 
......................

పాతకాలంలో.. తలకు ఆముదం రాసుకునేవాళ్ళు. అందువల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉండేది. ఉసిరి   కలిపిన తలనూనె, ఆముదం వంటి వాటి వాడకం వల్ల  కళ్ళకు, మరియు తలకు బాగుండేది. 

కళ్ళకు కాటుక పెట్టుకునేవాళ్ళు. ఈ కాటుక బయట తయారుచేసినది కాకుండా , ఇంటివద్ద మహిళలే తయారుచేసేవాళ్ళు.
............................... 

ఆ రోజుల్లో, ఇప్పటిలా టీవీలు చూడటం, కంప్యూటర్ చూడటం..వంటి కళ్ళకు ఎక్కువ శ్రమ కలిగించే పనులు ఉండేవి కాదు.

 పుష్టికరమైన ఆహారం తీసుకోవటం వలన శ్రమను తట్టుకునే విధంగా కూడా శరీరం ధృడంగా ఉండేది
...................... 

పాతకాలంలో.. రసాయనిక ఎరువులతో పండించిన ఆహారపదార్ధాలు కాకుండా,  సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారపదార్ధాలు తీసుకునేవారు.

 ఇప్పుడు మనం వాడే అనేక పదార్ధాలలో ఉన్న రసాయనాల వల్ల వాతావరణం కలుషితమయ్యింది. కలుషిత వాతావరణంలో పెరిగిన ఆహార పదార్ధాలు తినేవారికి అనారోగ్యాలూ ఎక్కువవటం సహజమే కదా !
......................... 

ఇప్పుడు  చాలామంది  పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు కూడా  సరైన పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించటం లేదు. 

ఇప్పుడు  చాలావరకు  బ్రెడ్, నూడిల్స్, బిస్కెట్స్..వంటి రెడీమేడ్ ఫుడ్ తో సరిపెట్టుకుంటున్నారు.
......................

ఈ రోజుల్లో ఎక్కువమంది  ఆరోగ్యం  కన్నా ఆదాయాన్ని  సంపాదించటానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు.  

ఆదాయం పెరిగినా ఆరోగ్యాన్ని పొందలేము ...అని తెలుసుకునే సరికి  సమయం మించిపోతుంది. అప్పుడిక ఏమీ చేయలేకపోతున్నారు.

Wednesday, February 18, 2015

ఓం నమఃశ్శివాయ.....

ఓం .

శ్రీ విశ్వనాధాష్టకం...

గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..


ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.


శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..


ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..


ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.


శ్రీ గణేశ స్తుతి...

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్

ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..


హే స్వామినాధ కరుణాకర దీనబంధో


శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసమేత  మమదేహి కరావలంబం..

దేవాదిదేవనుత దేవగణాధినాధ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మా త్ప్రదాన  పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

దేవాదిదేవ రధమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృంద వంద్య

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ

వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..

ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


సంతాన ఫల మంత్రం..



సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ 

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా !

జరత్కారుప్రియా
ఽఽస్తీకమాతా విషహారేతి చ 


మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ !

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!


శ్రీ కాల భైరవాష్టకం..


దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


శివపంచాక్షరీ స్తోత్రం....


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ


భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మ్యై మకారాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మ్యై శికారాయ నమశ్శివాయ.

వశిష్ట కుంభోధ్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

తస్మ్యై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
 
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. 


Sunday, February 15, 2015

నాగార్జునసాగర్ గురించిన విషయాలు..


నాగార్జునసాగర్ గురించిన విషయాలు  ఈ  లింకుల వద్ద చదవగలరు.



Nagarjuna Sagar Dam - Wikipedia, the free encyclopedia



నాగార్జునసాగర్ - వికీపీడియా


............................... 


నాగార్జునసాగర్ , పోలవరం వంటి భారీ ఆనకట్టల వల్ల కొన్ని నష్టాలు, కొన్ని ప్రమాదాలు కూడా  ఉన్నాయి. 

భారీ ఆనకట్టల కన్నా చిన్న, మధ్యతరహా ఆనకట్టలు ఎక్కువ  ప్రయోజనకరమైనవి. 

కొన్ని విషయాలను క్రింద చదవ వచ్చు. 

  What are disadvantages of dams? | Ask.com


Friday, February 13, 2015

అందరాని ఎండమావుల వెంట...

 
పాతకాలంలో ఇన్ని యంత్రాలు లేకున్నా, మనుషులు  తాపీగా జీవించేవారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకూ ఏదో ఒక టెన్షన్. 

కోట్లాది సంపదతో తులతూగే ధనవంతులు ఒకవైపు ,  కూటికి  కూడా  కరువైన  నిరుపేదలు మరొక వైపు  అన్నట్లుగా   పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు . 


 ఆరోగ్యం విషయానికి వస్తే,  పాతకాలంలో కేన్సర్, కిడ్నీ జబ్బులు వంటివి రావటం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు కేన్సర్, కిడ్నీ జబ్బులు..  
 కొందరు చిన్నపిల్లలకు కూడా వస్తుండటం అత్యంత బాధాకరం. 


చిన్నపిల్లలకు కూడా ఇలాంటి  జబ్బులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించే తీరుబడి కూడా ఎవరికీ లేదు.


 అందరూ దేనికో పరుగులు తీస్తున్నారు. అందరాని ఎండమావుల వెంట పిచ్చివాళ్ళలా పరుగులు పెడుతూ అదే అభివృద్ధి అంటూ తమను తాము మోసం చేసుకుంటున్నారు.


ఇక స్త్రీల పట్ల అఘాయిత్యాల విషయానికొస్తే చెప్పనే అక్కర్లేదు. స్వేచ్చ అంటూ బయటకు వచ్చిన స్త్రీలు.. స్వేచ్చ మాట అటుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ జీవించవలసి వస్తోంది.


 పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లుగా ఉంది చాలామంది మహిళల పరిస్థితి. 


 చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరిగిన  కేసుల గురించి విన్నాము.


 ఎక్కడికి పోతోంది ఈ సమాజం ? అభివృద్ధి అంటే ఇది కానే కాదు.


అభివృద్ధి పేరుతో.. భూమిమీద గాలి, నీరు, వాతావరణం పొల్యూట్ అయిపోతున్నా,  వాతావరణమార్పులు..  హెచ్చరికలు చేస్తున్నా  పట్టించుకోకుండా..


ఆకాశానికి నిచ్చెనలు వేసేస్తాం, చందమామ  పైన న్నవి  కిందికి దింపేస్తాం....అంటూ చెప్పేవారి మాటలను వింటూ మైమరిచిపోతే ఆనక చేతులు కాలిన తరువాత పట్టుకోవటానికి ఆకులు కూడా మిగలవు. 


Wednesday, February 11, 2015

శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు ..సమర్పించటం...

 
శ్రీ రామ నవమి సందర్భంగా  భధ్రాచలం దేవాలయం  వద్ద   రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలు ..  సమర్పించటం ఆనవాయితీగా జరుగుతోంది. 

అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నట్లు మీడియా చర్చల ద్వారా తెలుస్తోంది. 


ఉత్తరాంధ్రాలోని  రామతీర్ధం దేవాలయం  అని కొందరూ,   రాయలసీమలోని  వొంటిమిట్ట రామాలయం అని కొందరూ అంటున్నారు.


   ఒక సంవత్సరం రామతీర్ధం దేవాలయం .... ఇంకొక  సంవత్సరం వొంటిమిట్ట దేవాలయం.. అనుకుంటే సమస్య ఉండదు కదా... 


 మరొక నిర్ణయం ఏమైనా ఉందేమో తెలియదు. ఏమైనా,  అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.


Friday, February 6, 2015

చక్కెర తయారీ..


బాగా తెల్లటి పంచదార తయారీలో జంతు అవశేషాలు లేక బ్లడ్ ఆల్బుమిన్ వంటివి వాడతారని కొందరు అంటున్నారు...జంతు అవశేషాలతో సంబంధం లేకుండా కూడా శుద్ధ శాకాహార పంచదారను కొందరు తయారుచేస్తున్నారట. ఈ విషయాల గురించి ఇంతకుముందు టపాలో వ్రాసాను.

 చెరకుగడల రసాన్ని మరగించి, దానిని చల్లబరచి పంచదారను తయారుచేయటం అనేది సరైనపద్ధతి. ఈ పద్ధతిలో తయారయిన పంచదారను చక్కగా వాడుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఇలాగే తయారుచేసేవారనుకుంటాను.


ఈ రోజుల్లో కూడా   ఇలా తయారుచేసుకోవచ్చనిపిస్తోంది.


పంచదార తయారీ గురించిన కొన్ని లింక్స్ క్రింద ఇస్తున్నానండి.



Making Sugar at Home - in the Amazon - Rainforest Education




How to make cane syrup at home... without a sugar cane press



ఎండు ఖర్జూరంతో కూడా చక్కెర పొడి తయారుచేయవచ్చట. ఎండు ఖర్జూరాన్ని ముక్కలు చేసి , బాగా ఎండబెట్టి పొడి చేయాలి. అయితే  ఈ పొడి ,  ద్రవాలలో  పూర్తిగా  కరగక పోవచ్చు .కానీ స్వీట్స్ తయారీలో ఈ పొడిని వాడుకోవచ్చు.

 స్నాక్స్ లో వాడే  స్వీట్ చట్నీ తయారీలో ఖర్జూరాన్ని వాడతారు. ఖర్జూరాన్ని చింతపండుతో కలిపి ఈ చట్నీని  తయారుచేస్తారు. 


అయితే ఈ రోజుల్లో ఖర్జూరం ఎక్కువ రేటు కాబట్టి , పంచదార లేక బెల్లాన్ని చింతపండుతో కలిపి స్వీట్ చట్నీ చేసేస్తున్నారు.



Wednesday, February 4, 2015

పంచదార తయారీలో జంతువుల ఎముకలకు సంబంధించిన అవశేషాల వాడకం ఉంటుందా..

ఈ విషయంలో నిజానిజాలు సరిగ్గా తెలియటం లేదు ..ఈ విషయం శుద్ధశాకాహారులకు చాలా అయోమయాన్ని కలిగించే విషయమే. చాలా స్వీట్స్ తయారీలో పంచదారను వాడుతారు కదా మరి.

పంచదార ఉన్న పదార్ధాలు తినకుండా తప్పించుకోవటం కష్టమైన పని.


దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో కూడా పంచదార కలిసే అవకాశం ఉంది. ఉదా.. పంచామృతం వంటివి.


 ఇవన్నీ గమనిస్తే, దేవుని ప్రసాదం తయారీలో బెల్లం వాడితే మంచిదనిపిస్తోంది.పంచామృతంలో కూడా పంచదార బదులు బెల్లం వాడితే మంచిది .

......................

తెల్ల పంచదార తయారీ కోసం ఎముకలు అవసరం అయితే.. పంచదార తెల్లగా ఉండవలసిన అవసరమేమీ లేదు.


అసలు, పంచదార తెల్లగా ఉండవలసిన అవసరమేముంది. బెల్లంలా ఉంటే నష్టమేమీ లేదు కదా. 


పూర్వకాలంలో పంచదారను ఎలా తయారుచేసేవారో ? ఆ పద్ధతిలో ఇప్పుడూ  తయారుచేస్తే బాగుంటుంది.

.................
పటికబెల్లం తయారీ ఎలా ఉంటుందో ? దీనిని కూడా పంచదారతో తయారు చేస్తారా ?
....................

 విదేశాల్లో 100 శాతం శుద్ధ శాకాహార పంచదార కూడా లభిస్తుందట. ఈ శుద్ధ శాకాహార పంచదార తయారీలో ఎముకలతో తయారయిన బొగ్గును ఉపయోగించరట.


మనదేశంలో ఎందరో శాకాహారులున్నారు. మనదేశంలో కూడా ఇలాంటి 100 శాతం శుద్ధ శాకాహార పంచదార  తయారు చేస్తే ఎంతో బాగుంటుంది.


ఆశ్చర్యమేమిటంటే, శాకాహారులు ఎక్కువగా ఉండే భారతదేశంలో శుద్ధశాకాహార చక్కెర లభించటం కష్టంగా ఉంటే , మాంసాహారులు ఎక్కువగా ఉండే విదేశాల్లో శుద్ధశాకాహార చక్కెర చక్కగా లభించటం.

...................

విదేశాల్లో కూడా శుద్ధ శాకాహారులుంటారట. వీళ్ళు జంతువుల నుంచి లభించే ఎటువంటి ఉత్పత్తిని కూడా ఆహారంలో తీసుకోరట. ఉదా.. పాలను, పాల ఉత్పత్తులను కూడా తీసుకోరట. ఇలాంటి వారికోసం 100 శాతం శుద్ధశాకాహార చక్కెర విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉందట.


 కొంతకాలం క్రిందట విదేశాల్లో మాడ్ కౌ డిసీజ్ బాగా వ్యాపించింది. ఇలాంటి వ్యాధుల భయంతో కూడా కొందరు శుద్ధ శాకాహారచక్కెరను వాడే అవకాశం ఉంది.

...............

విదేశాల్లో చెరకుగడలతో తయారు చేసిన పంచదారతో పాటు బీట్ పంచదార, ఖర్జూరంతో తయారు చేసిన పంచదార..వంటివి లభిస్తాయట. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మంచిది.


 ఖర్జూరం ఎడారుల్లో కూడా పండుతుంది. నీరు అంతగా లభించని రాయలసీమ వంటి ప్రాంతాలలో విస్తారంగా ఖర్జూరం తోటలను పెంచి ఖర్జూరంతో చక్కెరను తయారు చేయవచ్చు. 


ఆర్గానిక్ సుగర్ తయారీలో.. ములక్కాయల విత్తనాల ద్వారా కూడా చక్కెరను శుద్ధి చేయవచ్చట..మనదేశంలో కూడా ఇలాంటివి ఉపయోగిస్తే బాగుంటుంది. 

..............

మనదేశంలోనూ చక్కెర తయారీ మిల్లులు ఉన్నాయి. దయచేసి వీరు శుద్ధశాకాహార చక్కెరను తయారు చేస్తే ఎంతో పుణ్యం చేసినవారవుతారు. 

శుద్ధశాకాహారచక్కెరను తయారుచేసి అమ్మితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.

...............
ఈ విషయాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ వద్ద చూడవచ్చు.

Is Your Sugar Vegan? - The Vegetarian Resource Group



Search Results

Monday, February 2, 2015

దైవం తోటి బంధమే శాశ్వతమైన బంధం..



లౌకిక విషయాల ద్వారా మనకు సంతోషం లభించినా, ఆ సంతోషానికి  ఒక హద్దు ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంతోషానికి వెనుక దుఃఖమూ ఉండే అవకాశం ఉంది.


లౌకిక విషయాలంటే.. రుచికరమైన ఆహారం పట్ల మక్కువ, బంధుమిత్రుల పట్ల ఆప్యాయత, అధికారం, ధన సంపాదన పట్ల మక్కువ, పేరుప్రఖ్యాతులు పొందాలనే ఆరాటం..ఇలాంటివి లౌకికపరమైన కోరికల జాబితాలో ఉంటాయి.  ఇవన్నీ ఒక హద్దువరకే మానవులకు సంతోషాన్ని కలిగించగలవు. 



ఉదా..ఆహారం విషయంలో గమనిస్తే, మనకు ఎంత ఇష్టమైన  పదార్ధాలను అయినా కొంతవరకే తినగలం. ఎక్కువగా తింటే శరీరం అరాయించుకోలేదు.అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.



బంధుమిత్రులతో సంబంధభాంధవ్యాల విషయంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎన్నో కారణాల వల్ల అపార్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు.


అధికారం, సంపద..అనేవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు.


పేరుప్రఖ్యాతులు..అనేవి కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు.



జీవితంలో చిన్న పొరపాటు చేసినా అప్పటివరకూ ఉన్న మంచిపేరు ఊడ్చిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కొందరు అసూయాపరులు మాయచేసి, నిజాయితీపరులనూ ఉచ్చులో బిగించి, చేయని తప్పుకు బాధ్యులను చేసి ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టే సంఘటనలూ ఉంటాయి.

..................

అశాశ్వతమైన లౌకికవిషయాల పట్ల ఎంతగా పరుగులు తీసినా ఆయాసమే తప్ప, శాశ్వతమైన ఆనందం లభించటం జరగదు.


శాశ్వతమైన దైవాన్ని శరణువేడితే లభించేది శాశ్వతమైన ఆనందం.


లౌకిక విషయాల విషయంలో సంతోషానికి ఒక హద్దు ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంతోషానికి వెనుక దుఃఖమూ ఉండే అవకాశం ఉంది.అయితే, దైవస్మరణ వల్ల లభించే ఆనందానికి ఎటువంటి హద్దూ, ఎటువంటి దుఃఖమూ ఉండదు. 


 దైవాన్ని స్మరించిన కొద్దీ  లాభమే తప్ప నష్టం ఇసుమంతైనా ఉండదు. దైవాన్ని స్మరించిన కొద్దీ   ఆనందం పెరుగుతూ ఉంటుంది. తద్వారా హద్దులు లేని శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. 


 మనిషికి ఇహలోకంలో ఉండే బంధుమిత్రులు శాశ్వతం కాదు.దైవం తోటి బంధమే శాశ్వతమైన బంధం. జన్మజన్మల నుంచి జీవుని వెన్నంటి ఉండే ఆత్మ బంధువు దైవం. 


అశాశ్వతమైన విషయాల వల్ల లభించేది పరిమితులతో కూడిన  ఆనందం. శాశ్వతమైన దైవాన్ని శరణువేడితే లభించేది  పరిమితులు లేని శాశ్వతమైన పరమానందము( మోక్షము).

.... 

అయితే,  ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయి. ఆచరించటం మాత్రం చాలా కష్టం. అశాశ్వతమైన  విషయాల పట్ల మనస్సు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటుంది.


 స్వధర్మాన్ని నిష్కామంగా నిర్వర్తిస్తూ భగవంతుని శరణు వేడి జీవితాన్ని గడపగలిగితే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. 


అయితే, నిష్కామకర్మయోగాన్ని అవలంబిస్తూ జీవించటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు దైవాన్ని శరణువేడి దైవకృపను పొందటం తప్ప వేరే మార్గం లేదు.