koodali

Thursday, May 28, 2015

చిన్నారుల రక్షణ గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది...

 
ఈ రోజుల్లో దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము. 

 పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.



( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )


అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  


ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 


  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి. 


పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.   


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా. 


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.

.................................

చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.


    రోజుల్లో  సెల్ ఫోన్స్, ఇంటర్నెట్  వంటి  వాటి  ద్వారా  హింసా దృశ్యాలను ,  శృంగారదృశ్యాలను  ఎప్పుడుపడితే  అప్పుడు  చూసే  అవకాశం  కలిగింది. అసభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల  ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.


   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.

............................... 

 పెద్దవాళ్ళయిన  ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల  రక్షణ   గురించి  కూడా  ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది.  

......................

  ఒక వ్యక్తి  నేరం  చేస్తే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి.  చిన్నతనం  నుండి  తల్లితండ్రుల  పెంపకం,  పరిసరాల  ప్రభావం, ఆర్ధిక  అసమానతలు,  స్నేహసంబంధాలు , మీడియా  ప్రభావం,   మద్యపానం అలవాట్లు.....ఇలా  ఎన్నో  కారణాలుంటాయి. 


  నేరాలను  చేసిన  వారిపట్ల  కఠినమైన  శిక్షలు  ఉండటం  ఎంతో  అవసరం  . అయితే  నేరాలను  తగ్గించాలంటే,  చట్టంతో  పాటు  ప్రజల  బాధ్యత  కూడా  ఎంతో  ఉంటుంది. 

2 comments:

  1. చట్టాలున్నాయి, అమలు చేసేవారు, సత్వర న్యాయం కావాలి

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, నేరస్తులకు కఠిన శిక్షలు వేసి అమలుపరిస్తేనే నేరాలు ఆగేటట్లు అనిపిస్తోంది.

    ReplyDelete