koodali

Wednesday, October 31, 2012

కశ్మీరం ....



కొంతకాలం  క్రిందట  మేము  బాబా అమర్‌నాధ్ ,   మాతా వైష్ణవి దేవి  యాత్రలకు   వెళ్ళివచ్చాము..  అక్కడ   చెప్పలేనంత  అద్భుతంగా  ఉంది.  భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.


 మేము అమర్‌నాధ్ వెళ్ళినప్పుడు   ముస్లిం  సోదరులు  మాకు బాగా సహాయము చేశారు.   అదంతా  చూసి  మాకు   చాలా ఆశ్చర్యము  కలిగింది. 

  మేము అమర్‌నాధ్  వెళ్ళినప్పుడు   సైనికులు  కూడా  మాకు బాగా సహాయము చేశారు.  సైనికులను  చూస్తే ,  ఎన్నో  రాష్ట్రాల  నుంచి  వచ్చి  దేశం  కోసం  ఎంతో  క్లిష్టతరమైన   విధులను  నిర్వర్తిస్తున్నారు   కదా  !  అనిపించింది.

  మా యాత్రకు సహాయము అందించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు.
.....................................................
అమర్నాధ్  గుహ  గురించిన   ప్రస్తావన   ప్రాచీన  గ్రంధాలలో  ఉందట.  అయితే,  ఈ  కాలంలో   ఒక ముస్లిము సోదరుడు   అమరనాధ్   గుహను  మరల  కనిపెట్టి    అందరికీ  తెలియజేయటం  జరిగింది.  


  అమర్నాధ్ గుహను ఒక ముస్లిము సోదరుడు కనిపెట్టడము చూస్తే , అన్ని మతముల  వారు మంచిగా కలసి మెలిసి   ఉండాలని   దైవం  సందేశము   ఇచ్చారేమో ...  అనిపిస్తుంది.


 అక్కడ గుడి దగ్గర  షాప్స్ లో   పూజా సామాగ్రిని  ముస్లిం సోదరులు   కూడా అమ్ముతారు.  


అయ్యప్పస్వామికి    వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి శబరిమలలో ఉందంటారు.
 


షిరిడి  సాయిబాబా కూడా    మతసామరస్యాన్ని  గురించి  చెప్పారు. .

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధం లో  కూడా   పెద్దలు  మతసామరస్యత  గురించి  తెలియజేసారు.  మహావతార్  బాబాజీ  ,   ఏసుక్రీస్తు....  వీరి    గురించిన  విషయాలు  గ్రంధంలో  ఉన్నాయి.


   రామకృష్ణ  పరమహంస  కూడా  మతసామరస్యాన్ని  ప్రోత్సహించారు.  రామకృష్ణమఠంలో  అన్ని  మతముల  వారికి  ప్రవేశం  ఉంది.

మతసామరస్యం   గురించి   పెద్దవాళ్ళు   ఇంతలా   చెప్తుంటే   మనము ఎందుకు   గొడవలు  పడాలి  ? మతమేదయినా భగవంతుడనే  మహాపవర్ ను అందరు ఆరాధించొచ్చు.

..........................


కాశ్మీర్  ఎంతో  అందమైన  ప్రాంతం. అందుకే   కాశ్మీరుని   భూతల  స్వర్గం  అంటారు  కదా  ! 

ప్రాచీన  కాలంలో  కాశ్మీరుని   ఎందరో  గొప్ప  రాజవంశాల  వారు  పాలించారట.

 Kashmir was one of the major centre of Sanskrit scholars. According to the Mahabharata,[3] the Kambojas ruled Kashmir during the epic period with a Republican system of government[4]............ ఇలా  కాశ్మీర్  చరిత్ర  గురించి  అంతర్జాలంలో  వివరాలున్నాయి.  


ఆ  ప్రాంతం   చదువుల  తల్లి  సరస్వతీ  దేవికి  నిలయమట. 

అష్టాదశ  శక్తి  పీఠాలలో  చెప్పే  సరస్వతీ దేవి  ఆలయం  జమ్ముకాశ్మీరులో  ఉందట.  ఈ  ఆలయం  ఎక్కడ  ఉందనే  విషయం   గురించి  రకరకాల  అభిప్రాయాలు  ప్రచారంలో  ఉన్నాయి.


   ధృతరాష్ట్రుని  భార్య  అయిన   గాంధారి  పుట్టిన  ప్రాంతం  ఇప్పుడు  విదేశాల్లో  ఉందట. 

అయితే,  కశ్మీరంలో  స్థానికులైన కొందరు హిందువులను అక్కడనుంచి  వెళ్ళగొట్టటం జరిగిందట..ఇలాజరగటం మాత్రం అత్యంత బాధాకరం.

  భారతదేశం    మళ్ళీ   ఎప్పటికీ   విభజించబడకూడదనీ,   దేశంలోని  అందరు  ప్రజలు  సంతోషంగా ,  సామరస్యంగా   కలిసిమెలిసి     జీవించాలనీ  దైవాన్ని   కోరుకుంటున్నాను. 
..........................................

 మతము విషయానికి వస్తే,    ఒకే మతములో వాళ్ళు కూడా   గొడవలు    పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది 
ప్రస్తుతానికి  జరగని  పని.
 మతము  అనేది    అసలు   లేకుండా పోవటము   అనేది  ఎప్పటికీ  జరగనిపని.

అందుకని   అందరము   ఆనందముగా ఉండాలంటే,   అన్ని  మతముల  వారు   ఒకరినొకరు   గౌరవించుకోవటము ఒకటే మార్గము.

సృష్టిలో   రకరకాల మనుష్యులు ఉన్నట్లే ,   ఎన్నిమతములు ఉన్నా,   అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.

దైవం  అందరికి మంచి  బుద్ధిని  కలిగించాలి.


అంతా  దైవం  దయ.

.......................

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  కోరుకుంటున్నాను.
 
 

Monday, October 29, 2012

ఓం......శ్రీ శనిదేవుని మహిమలు.

ఓం.

శ్రీ  శనిదేవునికి  అనేక  నమస్కారములు.
శ్రీ శనిదేవుని పత్నికి అనేక  నమస్కారములు.

  శ్రీ శనైశ్చరుడు  న్యాయ పరిరక్షకుడని  పెద్దలు  తెలియజేసారు.  వారి  మహిమల  గురించి  imagine  T.V. లో ప్రసారమయ్యాయి. (  హింది  )
వాటిని   ఈ  లింకులలో  చూడవచ్చు..........

MAHIMA SHANI DEV KI PART 1 - YouTube

  కొద్దికాలం  క్రిందట " మా  టీవీ "  లో  కూడా  

"శ్రీ  శనిదేవుని  మహిమలు " ప్రసారమయ్యాయి. (తెలుగు).

తెలుగు ప్రసారాలు  కూడా అంత ర్జాలం లో  ఉన్నాయి.
  ................................

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి . 

Friday, October 26, 2012

అండగా నీవు మాకు ఉండాలనీ......

ఓం

అండగా  నీవు  మాకు  ఉండాలనీ
దండ  నీ మెడలో   వేశానమ్మా
కొండంత  నీ  ప్రేమ  కావాలని
కోటి  దండాలు  నీకే  పెడుతున్నానమ్మా       ......అండ...



రాగద్వేషాలు  మాలో  నశించాలని
రత్న  సింహాసనమమరించానమ్మా
రాజరాజేశ్వరి   రమ్యముగా  ఏతెంచి
మా  పూజలందుకొని  కాపాడవమ్మా           .....అండ...



పవిత్ర మౌనీ   పాదము  మాకు  ఆధారమని
పాలాభిషేకాలు   చేశానమ్మా
పవిత్రమౌనీ   నామము  మా  నోట  పలకాలని
పసుపు  కుంకమతో నిను  అర్చించానమ్మా.....అండ...



తామసమును  పోగొట్టే   తరుణీమని  నీవని
పరిమళ  తాంబూలాన్ని  అందించానమ్మా
నా  జీవన  సర్వస్వం  నీకే  అంకితమని
 కర్పూర  నీరాజన  మిస్తున్నానమ్మా           .....అండ....



మధురమౌ  నా  మనసును  మంత్రపుష్పము  చేసి
మహేశ్వరి  ముందుంచి  మైమరచానమ్మా
ఆత్మ  ప్రదక్షిణతో  ఐక్యమై  పోవాలని
అనుక్షణము  నీ  దీవెన  ఆశించానమ్మా......అండ...


ఈ  పాట  శ్రీ  లలితా  పూజా  విధానము  అనే  పుస్తకం  లోనిది. (  జగద్గురు  పీఠము...గుంటూరు. )

ఏమైనా  అచ్చు తప్పుల  వంటివి  ఉంటే,  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Wednesday, October 24, 2012

దసరా...

ఓం ..                                            

సాయి సాయి.


శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు, 

 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ   భైరవీ 
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ  


2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  


3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ 
  జాజీపంకజ  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనే  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  


4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వాలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ  


5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ  


6. అంబా  సృష్టివినాశ  పాలనకరీ  ఆర్యా  విసంశోభితా 
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ


7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ   


8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా  ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 



   ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................


ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Monday, October 22, 2012

ఆది పరాశక్తి కధలు...

ఓం....
 దుర్గమ్మకు  అనేక   వందనములు.

మహిషాసుర మర్దిని అమ్మవారు ...............


ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.

ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్తదివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.

చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.

మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని  క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.

మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.

అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 


తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.

మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !

దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది. 

........................

ఈ  కధలను  ఇంతకు  ముందు  కూడా బ్లాగులో   ప్రచురించానండి.

  దేవీనవరాత్ర  వ్రతకధ  ....వంటి  పుస్తకాలలో  ఈ  కధలను  పండితులు  క్లుప్తంగా  వ్రాసారు. 

  పండితులందరికి  కృతజ్ఞతలు.


Friday, October 19, 2012

ఆదిపరాశక్తి కధలు....




వ్యాసమహర్షి , జనమేజయ మహారాజుకి దేవీ అవతారగాధలను తెలియజెప్పటం జరిగింది. కొన్ని కధలను క్లుప్తముగా ..........................

ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు ................. ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని .......... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 



అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది. కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలు- ఓహ్! రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .



రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.

నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.

దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.



Wednesday, October 17, 2012

ఆదిపరాశక్తి కధలు.


ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 

 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.


 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు. 


విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది. 

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సం హరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.


 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.


యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది. 


ఆ చూపులకు మధుకైటభులు    తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.


పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.


 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సం హరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.


మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.
..............



Monday, October 15, 2012

అంతా దైవం దయ.

ఓం.

  సుఖసంతోషాలు  కలగటం   వంటి   మంచి  విషయాలు  దైవం  దయ వల్లనే  కలుగుతాయి.


 కష్టనష్టాలు  మాత్రం    మనం  ఎప్పుడైనా  చేసిన   పొరపాట్ల  వల్లనే  కలుగుతాయి.

జీవితంలో  ఒకోసారి  జరిగే  సంఘటనలు   అత్యంత  ఆశ్చర్యాన్ని  కలిగిస్తాయి.

 కొద్దో   గొప్పో   భక్తి  ఉన్నా  కూడా ,  భక్తులకు  దైవలీలలు  అనుభవంలోకి  వస్తాయి.

  దైవానికి  దైవమే  సాటి .


 అంతా  దైవం  దయ.

 దైవానికి  అనేక  నమస్కారములు.



Friday, October 12, 2012

స్త్రీలు మరియు సమాజ సంక్షేమం....స్త్రీ, పురుషుల బాధ్యత..


ఇప్పటి    సమాజంలో ఎంతసేపూ  సంపాదన,  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవటం .... ..ఇదే  గోల  కానీ,   పడిపోతున్న  నైతికవిలువల  గురించి   ఆలోచిస్తే    విచారించవలసిన    పరిస్థితి  ఉంది.
 
ఈ  రోజుల్లో ,  స్త్రీల  పట్ల  జరుగుతున్న    అత్యాచారాలు,  అన్యాయాలు  గురించి    వార్తల  ద్వారా  వింటున్నాము,  చూస్తున్నాము.

ఈ  మధ్య  ఒక  పత్రికలో ,....  చిన్నపిల్లలు,  వృద్ధులు  అనే  తేడా  లేకుండా    స్త్రీల  పట్ల   జరుగుతున్న  నేరాలు,  ఘోరాల  గురించి  రాసారు.  అవన్నీ  చదివితే,   సమాజం  ఎటు  పోతోందో  ? నాగరికత  పెరిగిందో ?  తగ్గిందో ? అర్ధంకాలేదు. కమల్ హాసన్ మరియు  ఇతర  నటీనటులు   నటించిన   మహానది ? అనే  సినిమాలో   చిన్న  వయస్సున్న  అమ్మాయిలను  కూడా  వ్యభిచార  గృహాలకు  తరలించటం,  వారి  కష్టాలను  గురించి  హృదయవిదారకంగా   చూపించారు. 



 సమాజంలో  ఇలాంటి  సంఘటనలు    జరగటానికి  ఎన్నో  కారణాలున్నాయి..అయితే,    మనుషుల్లో   నైతికవిలువలు    తగ్గిపోవటం  ఒక  ముఖ్యమైన  కారణం .


  స్త్రీ,  పురుషులకు  వివాహాలు  ఆలస్యంగా  జరగటం,  వివాహం  జరిగినా  వివిధ  కారణాలతో  భార్యాభర్తలు  విడిగా  ఉండటం,   భార్యాభర్తల  మధ్య  విభేదాలు,  విడాకులు ...ఇవన్నీ  కూడా    అక్రమసంబంధాలు,  వ్యభిచారం  వంటివి  పెరగటానికి  కారణాలు  కావచ్చు . అనిపిస్తోంది.  



మతం  పేరుతో  కూడా  కొందరు   దురాచారాలను  ప్రోత్సహిస్తున్నారు.   జోగిని  .....వంటి  ఆచారాలు సమాజంలో  ఎప్పుడు , ఎలా ,    ప్రవేశించాయో  నాకు  తెలియదు  కానీ,  ఇప్పుడు  ఆ  పేరుతో  జరుగుతున్న  కొన్ని  దురాచారాలను   గురించి  వింటుంటే,   ఈ  దురాచారాలను  నిర్మూలించవలసిన  అవసరం  ఎంతైనా  ఉందనిపిస్తోంది .



ఈ  రోజుల్లో,  తమ  హక్కులు,  తమ  సుఖమే  తమకు  ముఖ్యం  అంటూ   చిన్న  చిన్న  కారణాలకే   వివాహాలను  విచ్చిన్నం  చేసుకుంటూ  కుటుంబాలను,  సమాజాన్ని  అస్తవ్యస్థం  చేస్తున్న  కొందరు స్త్రీలు, పురుషుల  కంటే ,  ఓపికగా  కుటుంబాలను  తీర్చిదిద్దుకుంటూ  సమాజంలో  కుటుంబవ్యవస్థను  నిలబెడుతున్న  త్యాగమూర్తులైన  స్త్రీలు,  పురుషులు  ఎంతో  గొప్పవారు.  



  సమాజం  మంచిగా  ఉండే  విషయంలో   స్త్రీల  పాత్ర  ఎంతో  ఉంది. పిల్లలను  పెంచే  విషయంలో  తల్లుల  పాత్ర  ఎంతో  ఉంటుంది  కదా  !  తల్లులు  తమ  పిల్లలకు  చిన్నప్పటి  నుంచీ     చక్కటి  నైతికవిలువలను  బోధిస్తూ  పెంచితే ,  పిల్లలు  చక్కటి  వ్యక్తులుగా  తయారయ్యే  అవకాశం  ఉంది. చక్కటి    వ్యక్తిత్వం  కలిగిన  వ్యక్తుల  వల్ల  సమాజంలో  ఎన్నో    నేరాలు  , ఘోరాలు , సమస్యలు   తగ్గుతాయి.  



 అయితే  దురదృష్టవశాత్తూ  ఈ  రోజుల్లో చాలామంది   తల్లులకు  కొన్ని  కారణాల  వల్ల పిల్లలను  దగ్గరుండి  పెంచుకునేంత  సమయం    ఉండటం  లేదు. తల్లి  మాత్రమే  కాకుండా   తండ్రి  యొక్క  ప్రభావం  కూడా  పిల్లలపై  ఎంతో  ఉంటుంది. భర్త  యొక్క  ప్రభావం  భార్యపై  కూడా  ఎంతో  ఉంటుంది. 



 భర్త  తన  కుటుంబాన్ని  చక్కగా  ఆప్యాయంగా  చూసుకుంటే  భార్య  కూడా మనశ్శాంతిగా    కుటుంబాన్ని  చక్కగా  చూసుకుంటుంది.  భర్త   తన  ఇష్టం  వచ్చినట్లు  తాను  తిరుగుతుంటే  భార్య  ఆ  మనోవ్యధతో  పిల్లలను  సరిగ్గా  పట్టించుకోదు.  ఇక  సంసారం  తద్వారా  సమాజమూ  అస్తవ్యస్తమైపోతాయి.

భార్యాభర్తలు  అన్యోన్యంగా  ఉంటే  సంసారం  మరియు  సమాజం  కూడా  బాగుంటుంది.


పూర్వం  భార్యలు  తమ  భర్తలు  ఎన్ని  అవలక్షణాలను   కలిగి  ఉన్నా,  ఓర్పుతో  వారిని  మార్చుకోవటానికి  ప్రయత్నించేవారు.  అందువల్ల    ఆ  భార్య   కొన్ని   కష్టాలను   పడినా,   కుటుంబానికి,  సమాజానికి   మేలు  జరిగేది.   క్రమంగా  భర్త  మంచిగా  మారే  అవకాశం  కూడా  ఉండేది.    ఇలాంటి  భార్యలను గురించి  వింటే   వారికి   చేతులెత్తి  మొక్కాలనిపిస్తుంది.

భార్యల  వల్ల  బాధలు  పడుతూ ,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఓపిగ్గా ఎదురు చూస్తూ     భార్యను , కుటుంబాన్నీ  చక్కదిద్దుకునే   భర్తలూ   ఉంటారు. ఇలాంటి  భర్తలను  గురించి  వింటే   వారికి   చేతులెత్తి  మొక్కాలనిపిస్తుంది. 

భార్యాభర్తలు  గొడవలు  పడి  విడిపోవటం  వల్ల  ఆ  ప్రభావం  కుటుంబం  పైనా   సమాజం  పైనా  కూడా  ఉంటుంది.



ఇంకా,   తల్లిదండ్రుల  పెంపకమే  కాకుండా  స్నేహితుల  ప్రభావం,  సమాజంలోని  ధోరణులు  కూడా    పిల్లల  ప్రవర్తనపై  ఎంతో  ప్రభావాన్ని  చూపిస్తాయి.  ఈ  రోజుల్లో  మీడియా  రంగం  యొక్క  ప్రభావం  సమాజంపై  ఎంతో  ఉంది.  తల్లితండ్రులు  ఎన్ని  నైతిక  విలువలను  బోధించినా,  సమాజంలో   వ్యాపిస్తున్న  పెడధోరణుల  వల్ల  పిల్లలు  దారి  తప్పే  అవకాశం  ఉంది.



 కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్,  కొన్ని  కధలు  ,  సెల్ ఫోన్స్,  అంతర్జాలం  ద్వారా  అందుబాటులో  కొచ్చిన  అసభ్య  సమాచారం  యొక్క   ప్రభావం , సమాజంపై   ఉంది  కాబట్టి,   ఇలాంటి  అసభ్య  సమాచారానికి  అడ్డుకట్ట  వేయాల్సిన   అవసరం  ఎంతో    ఉంది.  



 అసభ్యకరమైన  విషయాలతో  సమాజాన్ని  కలుషితం  చేసి ,తద్వారా  సంపాదించిన ధనంతో  తాము  తమ  కుటుంబాలు 
బాగుపడిపోవాలనుకోవటం  అన్యాయం   కదూ! ఇలాంటి  అసభ్యకరమైన  సమాచారాన్ని  సమాజంపై  వదిలేవారికి , ఒకవేళ  సమాజం  శిక్షను  విధించలేకపోయినా  ,  వారికి  తగ్గ  శిక్షను   దైవం    విధిస్తారు.


 ఇంకా,  మత్తు  పదార్ధాల  వినియోగం  వల్ల  కూడా  సమాజానికి  ఎంతో  నష్టం  జరుగుతోంది. ఎన్నో  జీవితాలు  అతలాకుతలమై  పోతున్నాయి. ఇలాంటివాటిని  అమ్మేవారికి ,  ప్రోత్సహించేవారికి,   ఒకవేళ  సమాజం  శిక్షను  విధించలేకపోయినా  ,  వారికి  తగ్గ  శిక్షను   దైవం    విధిస్తారు.


కొందరు   సహృదయులైన    స్త్రీలు    సంస్థలను  ఏర్పాటు  చేసి ,  అన్యాయానికి  గురవుతున్న  స్త్రీలకు  సహాయపడటం  ఎంతో  గొప్ప  విషయం.  


  అందరూ  తలుచుకుంటే  సమాజంలో  నైతికవిలువలను  పెంపొందించటం,  చక్కటి  సమాజాన్ని  ఏర్పరుచుకోవటం  సాధ్యమయ్యే  పనే.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
...................................................

ఈ  బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలండి.
.............

Wednesday, October 10, 2012

కార్యేషు దాసి....... రెండవ భాగం.


భోజ్యేషు  మాతా..........అనే   విషయాన్ని  గమనిస్తే,

మనుషులు  ఎంత  డబ్బు  సంపాదించినా  ఆ  డబ్బు   కట్టలను  తినలేరు  కదా  !  శరీరము,  మనస్సు  ఆరోగ్యంగా  ఉండటానికి  చక్కటి  ఆహారం  అవసరం.

భార్య  భర్తకు  చక్కటి  ఆహారాన్ని   ఆప్యాయంగా  వండి వడ్డించాలంటారు. 
  తల్లి  తన  బిడ్డలకు  ఎలా  కొసరికొసరి  వడ్డిస్తుందో  అలా,  
చక్కటి  ఆహారాన్ని   ఆప్యాయంగా  వండి  వడ్డించాలంటారు.
...................................

శయనేషు  రంభ....ఈ  విషయాన్ని  గమనిస్తే, 

 భార్యాభర్తలు  అన్యోన్యంగా  ఉండటం  వల్ల  ఆ  కుటుంబానికి   ఎంతో  మంచి  జరుగుతుంది. బయటకు  వెళ్తే    ఎన్నో  ఆకర్షణలు.  ఇలాంటప్పుడు  భార్యాభర్తలు  అన్యోన్యంగా  లేకపోతే  కష్టాలు  వచ్చే  అవకాశం  ఉంది.  తద్వారా  కుటుంబాల్లో  కలతలు  వస్తే  కుటుంబానికీ   ముప్పే .   సమాజానికీ  ముప్పే.  ఇవన్నీ  ఆలోచించే  పెద్దలు  ఇలా  చెప్పి  ఉంటారు. 


  స్త్రీలు    పెద్దపెద్ద  పూజలు  చెయ్యకపోయినా,   ఇంటిని  చక్కదిద్దుకోవటం   వంటి   బాధ్యతలను  సవ్యంగా  నిర్వర్తిస్తే   చాలు  .....వారికి  పుణ్యం  వస్తుందని  పెద్దలు  తెలియజేసారు. 

........................

భోజ్యేషు మాతా ....  అని  తలుచుకుంటే  ,  ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలకు   తమ  పిల్లలకు  ఆప్యాయంగా  వండి  వడ్డించటానికే  సమయం  సరిపోవటం  లేదు కదా   !   అనిపించింది.

పాతకాలంలో  అయితే, పురుషులు  కుటుంబానికి  అవసరమైన  సంపాదన,  కుటుంబ  రక్షణ  వంటి  బాధ్యతలను  నిర్వర్తిస్తే ,  స్త్రీలు  కుటుంబసభ్యుల   ఆరోగ్యం  కోసం  ఇంటిని   శుభ్రంగా  ఉంచటం,   ఆరోగ్యకరమైన , పుష్టికరమైన,   రుచికరమైన   ఆహారాన్ని  తయారుచేయటం,    పిల్లలను  దగ్గరుండి    పెంచుకోవటం..... వంటి  బాధ్యతలను  నిర్వర్తించేవారు. 



ఇప్పుడు  స్త్రీలు , పురుషులు  పోటీపడి  సంపాదిస్తున్నారు.  సంపాదన  పెరిగింది  కానీ,  ఆ  సంపాదనతో   చక్కటి  ఆహారాన్ని  తయారుచేసుకోవటం,  పిల్లలను  దగ్గరుండి  ఆప్యాయంగా  పెంచుకోవటం....  అనే  వాటికి  సమయం  సరిపోవటం  లేదు. 


  ఏదో   హడావిడిగా   ఇంత   వండుకోవటం,  కొందరయితే,   వారానికి  ఒకసారి  వండుకుని  ఫ్రిజ్ లో  పెట్టుకుని  తినటం,  బ్రెడ్,  నూడిల్స్,  వంటివి   హడావిడిగా  నోట్లో  కుక్కుకుని ,   ఏడుస్తున్న   చంటిపిల్లలను  కూడా ,  క్రెచ్లో  ఉన్న   ఆయాల  దగ్గర  వదిలి  ఆఫీసులకు  పరిగెట్టడం  .  లాంటివి  ఎక్కువగా  కనిపిస్తున్నాయి.

తల్లితండ్రి  ఉండి  కూడా,  చంటి   పిల్లలకు   పరాయి  వ్యక్తుల  వద్ద  పెరగవలసిన  పరిస్థితి  బాధాకరం..   నోరుతెరిచి  తమ  బాధలను,  భావాలను   చెప్పుకోలేని    పసిబిడ్డలను    పరాయి  చోట  వదిలి  వెళ్తున్నారు  తల్లితండ్రులు. 


 పాతకాలంలో  అయితే,    తల్లులు  చందమామ  రావే ! అంటూ   జాబిల్లిని  చూపిస్తూ,  ఎన్నో  కధలు  చెబుతూ   పిల్లలకు   నిదానంగా ఆహారాన్ని    తినిపించేవారు.   ఇప్పుడు  అలాంటివి  అరుదై  పోయాయి.   


కొందరు  స్త్రీలు  కెరీర్  అంటూ  తాపత్రయపడుతుంటే ,  కొందరు  స్త్రీలు  ఇంట్లోనే  ఉన్నా  పిల్లల  పనులను  ఆయాలపై  వదిలి   టీవీ  చానల్స్ను  చూస్తూ,పార్టీలు  , ఫంక్షన్లు  అని   కాలక్షేపం  చేస్తుంటారు. 


  తల్లి  పాలు  త్రాగి  పెరిగిన  పిల్లలకు  భవిష్యత్తులో  ఎన్నో  వ్యాధులు  రాకుండా  ఉంటాయని  ఆధునిక  పరిశోధకులు  కూడా  చెబుతున్నారు.


 ఇంకా,   చిన్నతనంలో   బిడ్డలకు   తల్లి  ఆప్యాయతతో  ఆహారాన్ని  తినిపించటం,  ఆప్యాయంగా   కబుర్లు    చెబుతూ  పెంచటం  వంటి  జ్ఞాపకాలు  బిడ్డలు  ఎదిగిన  తరువాత  కూడా  వారి   వ్యక్తిత్వంపై   ఎంతో  ప్రభావాన్ని  చూపిస్తాయట.    బిడ్డలు  బుడిబుడి  అడుగులు   వేయటం,    వచ్చీరాని  ముద్దుముద్దు  మాటలు,  ఇలాంటివెన్నింటినో     కొందరు   తల్లితండ్రులు     కోల్పోతున్నారు. 


  నాకు  తెలిసి  ఒక  ఆమె  తనకు  తన   కెరీర్  ముఖ్యం ........ అంటూ  చంటి  బిడ్డను  తల్లితండ్రుల  వద్ద  వదిలి  వేరే  ఊరు  వెళ్ళిపోయింది.


పరిస్థితులు ఇలా  మారటానికి  కొందరు  పురుషులు  కూడా   కారణమే.  కొందరు  పురుషులు , ఇంటిని  సరిగ్గా  పట్టించు కోకపోవటం  వల్ల   స్త్రీలు    బయటకు  వెళ్లి సంపాదించవలసి  వస్తోంది.

మరి  కొందరు  పురుషులు  అయితే,     స్త్రీలు   కూడా   ఉద్యోగం  చేయాలని  ,  అప్పుడే  సంపాదన  సరిపోతుందని  భావిస్తున్నారు. 


ఇంటి పనులు  చేయటం,  ఆఫీసు  పనులు  ఇలా  రెండింటినీ  నిర్వర్తించటం  అంటే  మాటలు  కాదు. ఒకేసారి   రెండు  పడవలపై  ప్రయాణం  లాగ  ఎంతో  కష్టం.  దీనివల్ల  అటు  కెరీర్  కు,  ఇటు  ఇంటికి  పూర్తి  న్యాయం  చేయలేక   కొందరు  స్త్రీలు  అనారోగ్యాన్ని  తెచ్చుకుంటున్నారు. 


 ఇంకా,  సమయం  లేక      పిల్లలను  చూసుకోలేకపోతున్నారు.  వృద్ధులైన  తల్లితండ్రి  లేక  అత్తామామ  ఉంటే  వారికి  ఏమైనా  అనారోగ్యాలు  వస్తే  వారిని  చూసుకోవటానికి   కుదరదు. 


 ఈ  రోజుల్లో  కుటుంబసభ్యుల  మధ్య  అనుబంధాలు  ఎలా  ఉన్నాయంటే,  ఎవరైనా  ఆరోగ్యంగా  ఉన్నంత  వరకే  పరిస్థితి    బాగుంటుంది.  .  ఏ  కొద్దిగా  అనారోగ్యం  వచ్చినా  ఎవరు   చూస్తారో  తెలియని    అయోమయ  పరిస్థితి  నెలకొంది. 


 పాత  కాలంలో  అయితే  ఇంట్లో  వాళ్ళకు  అనారోగ్యం  వస్తే  కుటుంబసభ్యులు  చక్కగా  చూసుకునేవారు. ఇప్పుడు  అందరూ  బిజీ  కదా  ! కుటుంబసభ్యుల  మధ్య  అనుబంధాలకు    తీరిక  లేని  ఈ  సంపాదనలు  ఎందుకు  అని  ప్రశ్నిస్తే  ........
 
 కొందరు   తల్లితండ్రులు.  ఏమంటారంటే,  ఇలా  డబ్బు  సంపాదించి  ఎన్నో  సౌకర్యాలను  పిల్లలకు  అందిస్తున్నాం    కదా  !   అంటారు .

ఇలా  పెరిగిన  కొందరు   పిల్లలు  కూడా   తాము   పెద్దయ్యాక  ,   ఎన్నో  సౌకర్యాలతో    కూడిన  వృద్ధాశ్రమాలలో  తల్లితండ్రులను  చేర్పిస్తున్నారు. 


  నేను  చదివిన  ఒక  పుస్తకంలో    పిల్లల  మనోభావములు....  అనే  విషయం  గురించి  రాసారు.  పిల్లలు    చిన్నతనంలో  పెరిగిన  పరిసరాలు,   అలవాట్లు,   పెంచిన   వ్యక్తుల  ప్రభావం...  పెరిగి  పెద్దయిన  తరువాత  వారిపై   ఎంతో  ఉంటుందట.  


అందుకే  , పిల్లల  హృదయాలను  పవిత్ర  భావనలతో,  పవిత్రాశయాలతో,  పవిత్ర  విద్యా  విజ్ఞానాలతో  నింపవలసిన  బాధ్యత  తల్లిదండ్రులపై  ఉన్నదనీ,  యింత  ధనం  సంపాదించి  వారికి  అందించినంత  మాత్రాన  బాధ్యత  తీరినట్లు  కాదని  వ్రాసారు.

.....................................

.Mitr, My Friend - Wikipedia, the free encyclopedia
.....................

mitr my friend full movie - YouTube

........ఈ  సినిమా  ఈ  మధ్య  ఒక  చానల్  లో  చూసాను  బాగుందండి .(  తెలుగు  డబ్బింగ్లో.  ).

 

Monday, October 8, 2012

కార్యేషు దాసి........

ఈ   బ్లాగును ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి.
.........................

ఈ  రోజుల్లో   కొందరు,   ప్రతి విషయాన్ని  స్త్రీ  హక్కులు ,  పురుష  హక్కులు  అనే  కోణంలో  చూస్తూ   భార్యా  భర్తల  మధ్య   విభేదాలకు  కారణమవుతున్నారు. 

ఇందువల్ల  చక్కగా  సాగవలసిన  కాపురాలలో  విభేదాలు  వచ్చి  కుటుంబ  వ్యవస్థే  బీటలు  వారే  పరిస్థితి  కనిపిస్తోంది. 
............................


  సరిగ్గా  గమనిస్తే , పూర్వీకులు  స్త్రీ  పురుషులను  సమానంగానే  చూసారు,  ఎవరినీ  తక్కువా  చూడలేదు. ఎవరినీ   ఎక్కువా  చూడలేదు.

 ధర్మేచ,  అర్ధేచ,  కామేచ,  మోక్షేచ .... నాతి  చరామి...నాతి  చరామి...నాతి  చరామి....అనే   విషయాన్ని గమనిస్తే,........   పూర్వీకులు  స్త్రీల    సంక్షేమం    గురించి  ఎంతగా  ఆలోచించారో  అర్ధమవుతుంది.


 
ఇక, 
కార్యేషు  దాసి .........అంటూ    వివాహిత  స్త్రీ   గురించి  చెప్పిన  విషయాలను   గమనించినా ........ అందులో  స్త్రీని  తక్కువ  చేసింది  ఏమీ  లేదు. 
..................


రూపేచ  లక్ష్మి.
......ఈ  విషయాన్ని  గమనిస్తే,  

  భార్య  గొప్పా  ?  భర్త  గొప్పా  ? అంటూ    పంతాలకు  పోకుండా  కుటుంబం  ముఖ్యం ..... అని  ఆలోచించే  స్త్రీ   లక్ష్మీ దేవిలా   చక్కగా  అందంగా  కనిపిస్తుంది.

స్త్రీ  పురుషులు  ఎవరైనా  సరే,  ఇతరులతో  పోట్లాడేటప్పుడు  తమ  ముఖాన్ని  అద్దంలో  చూసుకుంటే  అందంగా  అనిపించదు  కదా!

...............
క్షమయా  ధరిత్రి... భూదేవిలా  స్త్రీ  కూడా  సహనాన్ని కలిగి  ఉండాలని  అంటారు.  స్త్రీ   ప్రతి   చిన్న  విషయానికి  విసుగు  పడిపోకుండా  ఓపికగా  ఉండటం  వల్ల  ఎన్నో  లాభాలున్నాయి.   

 స్త్రీల  కైనా  ,  పురుషులకైనా  ఓపిక  వల్ల  ఎన్నో   లాభాలు  కలుగుతాయి. 

..............
కార్యేషు  దాసి  .... ఈ  విషయాన్ని  గమనిస్తే,

 
సద్గుణవతియైన  ఏ  భార్య  అయినా,  తన  భర్త  ఆరోగ్యంగా  నూరేళ్ళు  చక్కగా  ఉండాలని  కోరుకుంటుంది.   భర్తకు   సేవలు  చేస్తుంది.  అంతేకాని,  భర్తకు  సేవలు  చేయటాన్ని  తప్పుగా  భావించదు.

  ఇంటిని  శుభ్రంగా  సర్దుకోవటం  వంటి   పనులను   ఎక్కువగా    ఇల్లాలే  చూసుకుంటుంది. కాబట్టి,  ఇంట్లో   ఎక్కడ  ఏ  సామాను  ఉందో  భార్యకే  తెలుస్తుంది . 


   పాఠశాలలకు   వెళ్ళే    పిల్లలు,   అమ్మా !   దుస్తులు  వెతికి  ఇవ్వు,   పుస్తకం  వెతికి  ఇవ్వు..... అంటే  తల్లి   ఆగమేఘాల  మీద  అందిస్తుంది.

   భర్తకు  దుస్తులు  అందించటం,   కావాల్సిన  వస్తువులు    అందించాలంటే   మాత్రం ,   భర్తకు  భార్య  ఎందుకు  అందివ్వాలి  ?  

 ఇలా  అందించమనటం   పురుషాహంకారం  . అంటారు    కొందరు  స్త్రీలు. 

 అమ్మా!  కాళ్ళు  నొప్పిగా  ఉన్నాయి   ....    అని  పిల్లలు  అంటే ,   అయ్యో  !  అంటూ నొప్పి   తగ్గటానికి   పిల్లల  కాళ్ళు   పడుతుంది  తల్లి.   


  కానీ,  భర్తకు  కాళ్ళు  పట్టే    విషయంలో  మాత్రం  భర్తకు  కాళ్ళు  ఎందుకు  పట్టాలి  ?
  ఇలా  కాళ్ళు  పట్టమనటం     పురుషాహంకారం .  అంటారు    కొందరు  స్త్రీలు. 

కానీ,  భర్త  కూడా  భార్యకు  ఎన్నో  విషయాలలో   సాయం   చేస్తారు  కదా  !
.........................

కరణేషు  మంత్రి  .....   ఈ  విషయాన్ని  గమనిస్తే,

 ప్రాచీనులు  స్త్రీలకు  ఎంత  ప్రాముఖ్యతను  ఇచ్చారో  అర్ధమవుతుంది.   భార్య  భర్తకు  మంత్రిలా  చక్కటి  సలహాలను   ఇవ్వవచ్చని    వారి  ఉద్దేశం. 


 అంతేకాని  స్త్రీలకు  ఏం  తెలుసు  ?  అని  వారు  అనుకోలేదు. ...



Friday, October 5, 2012

మితిమీరిన స్వేచ్చ.....


ఈ  రోజుల్లో  కుటుంబసభ్యులకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికే  సమయం  ఉండటం  లేదు.  కొందరు భార్యాభర్తలు  అయితే,  చెరొక  దగ్గర  ఉద్యోగాలు  చేస్తారు  ,  పిల్లలు  హాస్టల్సో  ఉంటారు .. అందరూ  అప్పుడప్పుడు   కలుసుకోవటం .. ఇలా  ఉన్నాయి  కుటుంబాలు...



అదేమిటంటే,    ఈ  రోజుల్లో  అందరూ  కష్టపడితేనే  కదా  !  అని  అంటుంటారు. అనుబంధాలు  లేకపోయాక  డబ్బుతో ఎన్ని వస్తువులు  కూడబెడితే  మాత్రం  ఏమిటి..?


కొంతకాలం  క్రిందట  మా  ఇంట్లో  ఒక  ఫంక్షన్  జరిగింది.    మా  మామగారి  ఆఫీసు  వాళ్ళు  కూడా  భోజనానికి  వచ్చారు.  ఈ  రోజుల్లో  ఆఫీసుల్లో  పనిచేసే  స్త్రీ  పురుషులు , తోటి  ఉద్యోగస్తుల  ఇళ్ళలో  జరిగే  ఫంక్షన్స్ కు  కలిసి వెళ్తుండటం  జరుగుతోంది    కదా  !  నాకు    వాళ్ళు  ఆఫీసు  వాళ్ళని  తెలియదు.



భోజనాలు  చేసి ,  వెళ్ళే  వారికి   గిఫ్ట్  ఇస్తున్నాము.  ఒక  స్త్రీ  పురుషుడు  వచ్చారు.  నేను  ఆమెకు  గిఫ్ట్  పాకెట్  ఇచ్చాను.  నా  భర్త   అతనికి  కూడా   ఇవ్వమన్నారు.  వాళ్ళు  వెళ్ళిన  తరువాత , అదేమిటి  ?  వాళ్ళిద్దరూ  భార్యాభర్తలు  కాదా? అన్నాను. అప్పుడు నా భర్త , వాళ్ళు  భార్యాభర్తలేంటి ?  వాళ్ళు  నాన్నగారి  ఆఫీసులో  వాళ్ళు.... అన్నారు.నేను  నోరు  తెరిచాను.  



 కొద్దిసేపటి  క్రితం  వాళ్ళిద్దరి   అతి  చనువు  ప్రవర్తన   చూసి ,  నేను  వాళ్ళిద్దరూ  భార్యాభర్తలనుకున్నాను. ఇంకా  నయం  ,  నేను    వాళ్ళతో  ఏమీ  అనలేదు. ఈ  రోజుల్లో ఎవరు  ఎవరో  చెప్పలేకపోతున్నాము.


  స్త్రీ  పురుషులు  మాట్లాడుకోవటంలో  తప్పూ  లేదు .. మాట్లాడుకోకుండా  కుదరదు  కూడా.  అయితే  ఏది,  ఎంతవరకు ?   అనేది  ఎవరికి  వారు   విచక్షణతో  ఆలోచించుకోవాలి.  ఇలాంటి  విషయాల్లో  గొడవలు  పడి,  అపార్ధాలతో  కొందరు    భార్యాభర్తలు  విడిపోవటం  కూడా   జరుగుతోంది.



కొన్ని    సిటీల్లో  అమ్మాయిలు,  అబ్బాయిలను  చూస్తే  ఇది  భారతదేశమేనా  ? ఎంత  మారిపోయిందో  ?  అని  నోరుతెరుచుకుని  చూడాల్సిందే. అయితే,  కొందరు   వివాహమైన  తల్లిదండ్రులైన  స్త్రీ  పురుషులే  తమకు   స్వేచ్చ  కావాలంటుంటే  ఇక   చెప్పేదేముంది   ?



 పూర్వం..చేనేత  పని,  కుండలు  చేయటం  వంటివి    ఇళ్ళల్లోనే  జరిగేవి.  వృత్తి  వ్యవహారాల్లో   భార్యాభర్తలు  ఒకరికొకరు  సాయంగా  పనులు  చేసుకునే  వారు.  భార్య   కమ్మగా  వండి  వడ్డిస్తే  కుటుంబసభ్యులు  భోజనం  చేసేవారు.  భర్త  ఇంటికి  కావలసిన  సరుకులు తేవటం వంటి ఇతర బాధ్యతలు  కూడా చూసుకునేవారు.  ఇంట్లో  పెద్దవాళ్ళు  ఉంటే    పిల్లలు  వారితో   కబుర్లు  చెప్పటం.. ఇలా  జరిగేది.   



 ఇప్పుడు  అయితే,  భర్త  సరుకులు  తేకపోయినా,  ఒక  ఫోన్  చేస్తే ,  షాప్  వాళ్ళు  సరుకులు  తెచ్చి  ఇంట్లో  పడేస్తారు.  భార్య  వంట  చేయకపోయినా,  ఒక  ఫోన్  చేస్తే   పిజ్జాహట్  వాళ్ళో  ,  కర్రీ  పాయింట్  వాళ్ళో   తినేవి  తెచ్చి  పడేస్తారు.    ఇలా  పనులు  జరిగిపోతున్నాయి.



 కుటుంబసభ్యుల  మధ్య  ఒకరి  అవసరం  ఒకరికి  లేకుండా  పనులు  జరిగిపోతున్నప్పుడు, ఒకరి  అవసరం  ఒకరికి  ఏముంటుంది  ?  ఒకరి  విలువ  ఒకరికి  ఎలా  తెలుస్తుంది  ? ఇక, అన్యోన్యత,అనుబంధాలు  ఎక్కడుంటాయి ?   కుటుంబసభ్యులు  అన్యోన్యంగా  ఉన్నప్పుడు  అనుబంధాలు  పెరుగుతాయి.



ఇప్పుడు  అందరూ  బిజీ  అయిపోయారు  కదా!  కొందరు  స్త్రీలైతే , చీ !  ఇంట్లో మొగుడికి, పిల్లలకు  వంట  చేస్తూ , సేవలు   చేస్తూ  పడి   ఉండటమేమిటి ? అసహ్యంగా .... అని  కూడా  భావిస్తున్నారు.



 చానల్స్ లో  వచ్చే కొన్ని  ప్రోగ్రామ్స్ లో, సినిమాల్లోని ద్వంద్వార్ధపు పాటలకు కూడా..బిడియపడకుండా  కొందరు ఆడవాళ్ళు చేసే  డాన్సులు  చూస్తుంటే , స్త్రీలు  ఇలా  మారిపోయారేమిటో ? అనిపిస్తుంది.
 

  ఇప్పుడు  స్త్రీపురుషుల  మధ్య  స్వేచ్చ బాగా   పెరిగింది.   ఈ  నేపధ్యంలో    సమాజంలో   వివాహేతర  సంబంధాల  సంఖ్య  పెరుగుతోంది.వాటి  వల్ల  కుటుంబాల్లో  గొడవలు  జరుగుతున్నాయి.  కొన్ని  సంఘటనల్లో  అయితే,   హత్యలు,  ఆత్మహత్యలు  జరగటం, తల్లిదండ్రులు  జైలు  కెళ్ళటం,   పిల్లలు  అనాధలవటం, వంటి  సంఘటనలను  వార్తాపత్రికల్లో  చూస్తున్నాము.



ఒకామె  తన  భర్తను   వదిలి  వస్తే ,   ఇంకొకాయన  భార్యను  వదిలి  వచ్చి,   వాళ్ళిద్దరూ  సహజీవనం  చేస్తుంటారు.   కొంతకాలం  క్రిందట  ఇలా  చేస్తే  ,  సమాజంలో  వారికి  గౌరవం  ఉండదని,  చెడ్ద  పేరు  వస్తుందని  భయపడేవారు.  అందువల్ల  ఇలాంటి  సంఘటనలు  తక్కువగా  జరిగేవి. 



 ఇప్పుడు   అయితే, ఇలాంటివి  తప్పు  కాదు... ఇవన్నీ  సామాన్యమే...అనే  విధంగా  సమాజం  తయారయ్యేటప్పటికి ,  ఇలాంటి  సంఘటనలు  ఎక్కువగా  జరుగుతున్నాయి.  

* కుటుంబంలో  ఇలాంటి  గొడవల  వల్ల  పిల్లలు  మానసికంగా కృంగి  పోతారు.   అప్పుడు   వారికి  వివాహవ్యవస్థ  అంటేనే  విరక్తి  పెరిగే  అవకాశం  ఉంది.  తద్వారా  సమాజానికి  జరిగే  నష్టానికి  తల్లిదండ్రులైన   ఇలాంటి    పెద్దవాళ్ళే  కారణమవుతారు.


.................
link
 
 

Wednesday, October 3, 2012

అసభ్యకరమైన వస్త్ర ధారణ , దృశ్యాలు ....



 దుస్తులు  శరీర  రక్షణ  కోసం  వేసుకుంటారు.  ఇవి    ఎండ,  వాన,  చలి  నుంచి,  ఇంకా   ఇతరుల  దృష్టి  నుంచి   శరీరాన్ని  కప్పి  కాపాడతాయి.


అయితే,  ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలు  అసభ్యంగా  ఇతరులకు  శరీరాన్ని  ప్రదర్శించే  రీతిలో  దుస్తులు  వేసుకుంటున్నారు.  ఏమన్నా  అంటే  మాకు  నచ్చినట్లు    దుస్తులు  వేసుకుంటాము.  ఎవరికీ  అడిగే     హక్కు  లేదంటూ  దబాయిస్తున్నారు.  



 సమాజంలో   ప్రతిదానికి  కొన్ని    కట్టుబాట్లు    ఉంటాయి.   సమాజం  సజావుగా  సాగాలంటే  కొన్ని  కట్టుబాట్లు  ఉండాలి  కూడా.   నా  ఇష్టం  వచ్చినట్లు  రోడ్డు  పై  కారు  నడుపుతాను...... నా  ఇష్టం   వచ్చినట్లు  జీవిస్తాను.  అంటే    ఎవరూ   ఒప్పుకోరు.....  అంతా  మా  ఇష్టమే..  అంటే  కుదరదు  కదా  !



  బాంకుకు  డబ్బు  పట్టుకెళ్ళాలంటే  ఎంతో  జాగ్రత్తగా   సంచిలో  వేసి  ఎవరికంటా  పడకుండా  తీసుకెళ్తాం . అంతేకానీ,  అందరికీ   ఆ  డబ్బును   ప్రదర్శించుకుంటూ  తీసుకెళ్ళం  కదా !  దొంగలు  ఉంటారు ... బాంకులకు  వెళ్ళేటప్పుడు  డబ్బును  జాగ్రత్త  చేసుకోమని  పోలీసులు ,  ఇంట్లో  పెద్దవాళ్ళు  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతారు. 


  మీరేమిటి  జాగ్రత్తలు  చెప్పేది  ?   అంతా  మా  ఇష్టం.....అని  వారిని  తూలనాడి ,  ఎవరిష్టం  వచ్చినట్లు  వాళ్ళు  ప్రవర్తిస్తే ,  ఏదైనా  జరగరానిది  జరిగితే ?..... మళ్ళీ  ఆ  పోలీసులను,  పెద్దవాళ్ళనే  సహాయం  కోసం  దేబిరించుకోవాలి.  మన మంచి  కోరి  చెప్పే  పెద్దవాళ్ళ  మాట  వింటే  మనకే  మంచిది.  డబ్బు ముఖ్యమైనదే  కానీ , స్త్రీ  జీవితం  మరింత  ముఖ్యమైనది.



కొందరు  ఏమంటారంటే,  నిండుగా  దుస్తులు  వేసుకునే  ఆడవారి  పట్ల   కూడా  అత్యాచారాలు  జరుగుతున్నాయి.  అసభ్యంగా  దుస్తులు  వేసుకోవటం  తప్పుకాదు ..... అంటూ  వాదిస్తున్నారు. ఆ  వాదన  తప్పు.



 డబ్బును  ఎంతో  జాగ్రత్తగా ఇనప్పెట్టెలో  పెట్టినా  ఒకోసారి  కొందరు  దొంగలు  ఇనప్పెట్టెను    పగలకొట్టి   దోచుకుపోతారు.  అలాగని  
ఇనప్పెట్టెలో  పెట్టటం  మానేయము  కదా  ! మరిన్ని తాళాలు వేసి  పెట్టెలో  దాస్తాము.



 చక్కగా  దుస్తులు  వేసుకున్న  స్త్రీలకు  కూడా,......
అనేక కారణాల  వల్ల , ఆపదలు  కలిగే  అవకాశం  ఉంది.  అంతమాత్రం  చేత    అర్ధనగ్నంగా  దుస్తులు  వేసుకు తిరిగితే  తప్పేమిటి  ?  అని  వాదించటం   హాస్యాస్పదం.  



ఈ  రోజుల్లో,    కొన్నికధలు,  కొన్నిసినిమాల్లో  అసభ్య  వస్త్ర  ధారణ,  అసభ్య  దృశ్యాలు  ఎన్నో  ఉంటున్నాయి.    ఆధునిక  విజ్ఞానం  వల్ల  సెల్ ఫోన్లు,   అంతర్జాలం,    టీవీ  చానల్స్  వల్ల  అర్ధరాత్రి,  అపరాత్రి  అని  లేకుండా  ఎప్పుడూ  ఈ  అసభ్య  దృశ్యాలు   అందరికీ  అందుబాటులోకి  వచ్చేసాయి.  ఇవి  చూసేవారి  మీద   ఆ  ఎఫెక్ట్  ఎంతో  ఉంటుంది.  



ఇక  ఆ  ప్రభావంతో   పసి పిల్లలు,  పండు వృద్ధులు,  చక్కగా  దుస్తులు  ధరించే  స్త్రీలు  అని  తేడా  లేకుండా  అత్యాచారాలకు  గురయ్యే  అవకాశం  ఉంది.   అసభ్యంగా  దుస్తులు  వేసుకునే  ఆడవాళ్ళు  కూడా  ఇందుకు  మినహాయింపు  కాదు.

 శారీరికంగా  స్త్రీలు  పురుషుల  కన్నా  బలహీనులు  కాబట్టి ,  ఎంత  డేరింగ్  నేచర్  ఉన్న  ఆడవాళ్ళకయినా  ఇబ్బందులు  వచ్చే  అవకాశం  ఉంది.



  కొందరు  ఆడవాళ్ళయితే  తాము  ఎలాగూ  దారి  తప్పాము  కాబట్టి,  మిగతా  వారెందుకు  మంచిగా  ఉండాలనే  ఉక్రోషంతో ....... ఆడవాళ్ళు  మగవాళ్ళతో    ఎప్పుడయినా , ఎలా  తిరిగినా .. ఫరవాలేదు.  అని   స్టేట్మెంట్స్  ఇస్తుంటారు.   ఇలా   స్టేట్మెంట్స్  ఇచ్చేవారికి  వారి  పిల్లలు  పెద్దయ్యాక  అప్పుడు  తెలుస్తుంది.       


     
        మరికొందరేమో ,  మగవాళ్ళు  ప్రాచీనకాలంలా   పంచలు  వేసుకుంటున్నారా  ?  మేమెందుకు  ప్రాచీన  కాలంలాగా  నిండుగా  దుస్తులు  వేసుకోవాలీ  ?  అని  ప్రశ్నిస్తుంటారు.

 మగవాళ్ళు  పంచలు  వేసుకోపోయినా  నిండుగా  పాంట్ షర్ట్  వేసుకుంటున్నారు.   కొందరు   ఆడవాళ్ళు  వేసుకునే  చిన్న  షార్ట్స్,  చిన్న  బనీను  అలా  నిండుగా  ఉండటం   లేదు  కదా  !

 ( ఉష్ణదేశాల్లోని  మగవారికి  పాంట్,  షర్ట్  కన్నా ,  పంచలే  ఆరోగ్యం  అట.  ఇది  వేరే  విషయం.  )


  అయినా  మగవారు  షార్ట్స్  మాత్రమే  వేసుకుని  వీధుల్లో  తిరిగినా  అసభ్యంగా  అనిపించదు.  ఆడవాళ్ళేమీ  వారిని  గమనించరు,  పట్టించుకోరు. 



  మగవాళ్ళు  పొట్టిదుస్తులు  వేసుకుని  తిరగటానికీ  ,   ఆడవాళ్ళు  మగవాళ్ళలా   పొట్టి  దుస్తులు  వేసుకుని   తిరగటానికీ   చాలా  తేడా  ఉంది  మరి.
 



  అసభ్యంగా  దుస్తులు  వేసుకుని  కనిపించే  సినిమాల్లోని  ఆడవాళ్ళని ,  మగవాళ్ళు  మెచ్చుకుంటూ   ప్రోత్సహించటం వల్ల  ఆనక  కష్టాలు  వస్తాయి.  అలా  ఉంటే  మగవాళ్ళకు  నచ్చుతుంది  కాబోలు .... అనుకునే  ఆడవాళ్ళూ  ఉంటారు.   అసభ్యంగా  దుస్తులు  ధరించే  అమ్మాయి  భార్యగా  వస్తే , అప్పుడు  అబ్బాయి   లబలబలాడటం  వల్ల  ఉపయోగమేమీ  ఉండదు.

  పరాయి ఆడవాళ్ళు అసభ్యకరమైన దుస్తులు వేస్తే చూడాలని ఉబలాటపడే మగవాళ్ళు కూడా తమ కుటుంబసభ్యులు వేసుకుంటే లబలబలాడతారు.
 అందరూ  ఇలాంటి  అసభ్య  వాతావరణాన్ని  గట్టిగా   వ్యతిరేకించినప్పుడే   ఇవన్నీ  తగ్గుతాయి.