koodali

Wednesday, February 29, 2012

నేను M.A, చదివాను. కానీ,.....



నేను B.A. చదవలేకపోయాను కదా !

నేను ఎక్కువ చదువుకోలేదని కొందరు నన్ను ఎగతాళి చేయటం ఇవన్నీ చూసి మా నాన్నగారు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా డిగ్రీ వరకైనా చదువుకోవాలని భావించి మా చెల్లిని హిందీ లో
Ph.D. వరకూ చదివించారు. ( నన్ను కూడా డిగ్రీ వరకూ చదివించాలనుకుంటే నేను గ్రూప్ మార్చుకోవటం వగైరా సంగతులు ఇంతకుముందే వ్రాసాను కదా ! )



మా తమ్ముడు డాక్టర్ చదివాడు. మా నాన్నగారు మా తమ్ముడిని పశువులకు సంబంధించిన వైద్యం చదివించాలనుకున్నారు. ఎందుకంటే , మనుషుల కన్నా నోరు లేని పశువులకు వైద్యం చేయటం పుణ్యమని మా నాన్నగారి అభిప్రాయం. కానీ తరువాత మనుషులకు సంబంధించిన వైద్యం చదివించారు.


ఇలా మా తమ్ముడు, చెల్లెలు పెద్ద చదువులు చదివిన తరువాత ....

మా అమ్మనాన్నగార్లు,చెల్లి, తమ్ముడు , నేను పెద్ద చదువులు చదవలేకపోయానని బాధ పడటం మొదలుపెట్టారు. వాళ్ళు నన్ను ప్రైవేటుగా ఏదైనా డిగ్రీ చదవమని ప్రోత్సహించారు.


అప్పుడు నా భర్త యొక్క ఉద్యోగరీత్యా మేము చెన్నైలో ఉంటున్నాము. చెన్నైలో చాలా యూనివర్సిటీలు B.A. చదవకపోయినా డైరెక్ట్ గా M.A. చదవటానికి వీలు కల్పిస్తున్నాయి.


ఈ విషయం గురించి నా భర్తను అడిగితే ఆయన ముందు B.A. చదివి తరువాత M.A. చదివితే తేలికగా అర్ధమవుతుందని సలహా చెప్పారు. అదంతా చాలాకాలం పడుతుందని నేను డైరెక్ట్ గా M.A. చదవటానికి ఫీజు కట్టేసాను.


మళ్లీ ఇంగ్లీష్ మీడియమే. నేను చదవగలనా అని భయపడ్డాను. కానీ, రామకృష్ణమఠంలో నేర్చుకున్న ఇంగ్లీష్ వల్ల ధైర్యం వచ్చింది.


హిస్టరీ సబ్జక్ట్ తీసుకున్నాను. నేను వార్తాపత్రికలు బాగా చదువుతాను కాబట్టి,  ఫరవాలేదు నెమ్మదిగా పాసవ్వచ్చులే అనుకున్నాను.


కానీ నేను అనుకున్నంత తేలికగా ఏమీ లేదు పరిస్థితి. చాలా కాలం తరువాత చదవటం, ఇంగ్లీష్ మీడియం, హిస్టరీ అంటే బోలెడు సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలి.


హిస్టరీ అంటే....
ఇంటెల్లెక్చువల్ హిస్టరీ ఆఫ్ తమిళనాడు, ఇండియన్ హిస్టరీ , యూరోప్ హిస్టరీ, అమెరికా హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్,..ఇలా ఉన్నాయి సబ్జెక్ట్స్. ఇక అంతా గందరగోళం.


నా భర్త ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్ళాక నేను చదవటం, ఎంత చదివినా గుర్తు ఉండేవి కాదు.


మా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదివేవారు. ఆ స్కూల్ సాయంత్రం మూడు గంటలకే అయిపోతుంది.


ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఆ స్కూల్ ప్రిన్స్ పాల్ గారు తెలుగువారు. ఆయన స్కూల్ లో చదివే తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలని ఒక తెలుగు టీచర్ ను నియమించారు. ఆమె రోజూ స్కూల్ అయ్యాక మూడు గంటలకు వచ్చి ఒక గంట సేపు పిల్లలకు తెలుగు నేర్పించేవారు.


పిల్లలు తెలుగు క్లాసులో ఉంటే నేను బయట కూర్చుని M.A. పుస్తకాలు చదువుకునేదాన్ని. ఈ చదువు వల్ల నాకు ఇంట్లో పనికి సమయం సరిపోయేది కాదు.


ఏదో వంట చేసుకుని తినటం అంతే . అదివరకులా పావుబాజీ, పానీపూరీ ఇలా వంటకాలు చేయటానికి సమయం సరిపోయేది కాదు. . మా అమ్మగారు వాళ్ళు ఊరి నుంచీ పిండివంటలు బాగా వండి పంపించేవారు.


అయితే నాకు ఒక పక్క చదువు, ఒక పక్క ఇంటిపనులు, పిల్లలను చదివించటం ఇవన్నీ కష్టంగా ఉండేవి..... ఇప్పుడు చదవమన్నారని మా అమ్మవాళ్ళను కూడా విసుక్కున్నాను.


పిల్లలను చదివించటానికి కూడా నాకు నీరసంగా అనిపించేది. హిస్టరీ లోని సంవత్సరాలు గుర్తుపెట్టుకోలేక నా తల గిర్రున తిరుగుతునట్లు నీరసంగా అనిపించేది.


ప్రైవేటుగా చదివి తీసుకున్న డిగ్రీలంటే చాలామంది గొప్పగా భావించరు..... కానీ, అన్నామలై యూనివర్సిటీ వాళ్ళు చాలా
స్ట్రిక్ట్ .. . పరీక్ష హాల్లోకి హాండ్ బ్యాగు కూడా తీసుకు వెళ్ళనివ్వలేదు.


నేను సరిగ్గా వ్రాయని సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను కూడా..... అంత
స్ట్రిక్ట్ గా పేపర్స్ దిద్దుతారు అన్నమాట .....ఇలా రెండు సంవత్సరాల్లో చదవవలసిన చదువు ఎక్కువ కాలమే పట్టింది.


ఆఖరి పరీక్ష రోజయితే ఇక నాకు శక్తి అంతా పోయి బాగా ఏడ్చేసి దైవం మీద భారం వేసి బయలుదేరాను. మొత్తానికి దైవం దయ వల్ల పాసయ్యానండి. సంతోషంగానే అనిపించింది అందరికీ. యూనివర్సిటీ వారు డిగ్రీ సర్టిఫికెట్ కూడా పంపించారు.


ఇలా అంతా బాగానే ఉండగా ..... కొంతకాలం తరువాత.... ఒకరోజు తీరిగ్గా టీవీ చూస్తుంటే ..... జరజరా సాగిపోతున్న స్క్రోలింగ్ చూసిన నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.


ఎందుకంటే  B.A. చదవకుండా
డైరెక్ట్ గా M.A. వంటి చదువులు చదవటానికి అర్హత లేదని నిర్ణయించారని వార్తా సారాంశం. ఇక అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి.


నాకు డిగ్రీ పూర్తయింది కాబట్టి నాకు ఏమీకాదని కొందరు, నీకు కూడా ఆ నిర్ణయం వర్తిస్తుందని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.


నా సంగతి అలా ఉంచండి. నేను డిగ్రీ తీసుకున్నా...తీసుకోకున్నా దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.


కానీ ఎందరో వికలాంగులు, డైరెక్ట్ గా యూనివర్సిటీల్లో చదవలేని పేదవారు వచ్చి పరీక్షలు వ్రాసారు. వారి సంగతి ఏమిటని ? నాకు చాలా బాధ కలిగింది.


డైరెక్ట్గా పీజీ చదవకూడదు అన్నప్పుడు .... ముందే ఆ విషయం ప్రజలకు స్పష్టంగా అర్ధమయ్యేటట్లు తెలియచెప్పాలి కదా ! అలా చర్యలు కూడా తీసుకోవాలి.


ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్దయెత్తున వార్తాపత్రికల్లో యాడ్స్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. అప్పుడంతా ఊరుకుని విద్యాశాఖ వారు సడన్ గా మేల్కొని మేము ఊరుకోము . అంటే , చదువు సగంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి?

 

Friday, February 24, 2012

చదువు, డబ్బు బాగా ఉంటేనే గౌరవిస్తారా ?


నేను ఇంగ్లీష్ మీడియం అర్ధం కాక ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాను కదా ! ఇక నాకు వివాహం చెయ్యాలని ఇంట్లో వాళ్ళు అనుకోవటం జరిగింది.

ఒక మంచి సంబంధం ఉంది . వాళ్ళు ఎప్పట్నించో మన సంబందం అంటే ఇష్టపడుతున్నారు. మగపిల్లాడి తరపు వాళ్ళే అడుగుతున్నారు. ఒప్పుకోమని మా నాన్నగారి కోరిక.


నేనేమో ఇంటర్ అయినా పూర్తి అయ్యాక వివాహం చేసుకుంటానని ఏడ్చాను. ఇంతలో ఊరినుంచి మా తాతగారు ( మా నాన్నగారి తండ్రి ) వచ్చి పోనీ ,కొంతకాలం అయ్యాక వివాహం చెయ్యి అని, మా నాన్నగారికి సలహా చెప్పారు. అందువల్ల వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా పడ్డాయి.


కొంతకాలం ట్యూషన్ చెప్పించటం వల్ల నేను ఇంటర్ పాసయ్యాను.ఆ తరువాత కొంతకాలానికి మా నాన్నగారి దూరపు బంధువుల అబ్బాయితో నాకు వివాహమైంది.


మా మామగారు ఉద్యోగస్తులే.. మా అమ్మ, నాన్నగార్లకు బదిలీల ప్రాబ్లం లేదు గాని ... మా మామగారు, నా భర్తది ట్రాన్స్ఫర్స్ ఉండే ఉద్యోగాలే.

అలా.... వివాహం తరువాత హైదరాబాద్ జీవితం మొదలయ్యింది.


సిటీలో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు నలుగురు చేరినప్పుడు కొంతమంది ఇంగ్లీష్ లోనే కబుర్లు చెప్పుకొనేవారు.కొందరు తెలుగువాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు.


మళ్ళీ నా ఇంగ్లీష్ సమస్య మొదటికొచ్చింది. నాకేమో ఇంగ్లీష్ మాట్లాడాలంటే
తప్పులొస్తాయని భయం. ఒకసారి ఒకామె మీకు ఇంగ్లీష్ అస్సలు రాదా ? అని ఆశ్చర్యంగా అడిగింది.


మరి కొందరు తెలిసినవాళ్ళు, మాటల్లో నా చదువు వివరాలు అడిగి , నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను . అని చెప్పగానే అదో రకంగా చూసేవారు.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది.

నా భర్తను డిగ్రీ చదువుతానని అడిగాను. ఫీజు కట్టి ఇంట్లో చదివాను ( తెలుగుమీడియం ).అయితే పరీక్ష వ్రాసే సమయానికి వాళ్ళు ఏదో సర్టిఫికెట్ తెమ్మన్నారు. అది మా ఊరెళ్ళి తేవాలి.


ఈ గోలంతా భరించలేక ఇక చదువు ప్రక్కన పెట్టేసాను.

ఇక పిల్లల్ని స్కూల్లో వేసే సమయంలో...... మళ్ళీ నా ఇంగ్లీష్ సమస్య , నా చదువు నా ముందుకొచ్చి నిల్చున్నాయి.


పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా... పిల్లల తల్లిదండ్రులు కనీసం డిగ్రీ చదివిన వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ( కొన్ని స్కూల్స్ వాళ్ళు.) .
పేరెంట్స్ టీచర్లతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు,.


తెలుగులో చెబుతూ ఇంగ్లీష్ నేర్పిస్తే సులభంగా అర్ధమవుతుంది.

కానీ, నా చిన్నప్పుడు స్కూల్ లో కూడా ఇంగ్లీష్ క్లాసులో ఎక్కువగా ఇంగ్లీష్ లోనే నేర్పించేవారు. .



అందుకే తరువాత నేను  తెలుగులో ఇంగ్లీష్ నేర్పే పుస్తకాలు కూడా కొన్నాను. అవి చదివి కొంతకాలం ప్రాక్టీస్ చేసాను.

ఈ బాధలు భరించలేక నేను హైదరాబాద్లో రామకృష్ణామఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో జాయినయ్యాను.

అక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. ఉదయం క్లాసులకు వెళ్ళేదాన్ని.


నాకు ఆ వాతావరణం విపరీతంగా నచ్చేసింది. రిటైర్ అయ్యిన ఫ్రొఫెసర్లు కూడా వచ్చి పాఠాలు చెప్పేవారు.

అడ్వాన్స్ వరకు వచ్చాను. కానీ నాకు వీలవక కోర్స్ పూర్తి చేయలేదు.

రామకృష్ణమఠంలో విద్యాభ్యాసం చేయటం అన్నది ఒక గొప్ప వరం. అక్కడ విద్యాభ్యాసం వల్ల నేను ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాను.

అక్కడ గ్రామర్ బాగా నేర్పించారు. అయితే ఎంత గ్రామర్ నేర్చుకున్నా .....ఏ భాష అయినా మనం మాట్లాడితేనే కదా వస్తుంది.


నాకేమో మాట్లాడాలంటే తప్పులు వస్తాయని భయం. ఇక ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా వస్తుంది ?

అయితే , నాతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వారి గ్రామర్ తప్పులు బాగా తెలిసేవి.

ఇక నాకు కొత్త భయం పట్టుకుంది. బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకే అన్ని గ్రామర్ తప్పులు వస్తుంటే ఇక నేను మాట్లాడితే ఏమవుతుందో ? అని .


ఇదంతా జరిగి చాలా కాలం అవ్వటం వల్ల ఇప్పుడు గ్రామర్ కూడా అంతగా గుర్తు లేదు. . అయితే చదివితే గుర్తు వస్తాయి. కానీ ఇప్పుడు అంత సమయం కుదరటం లేదు.

నా భర్తా, మా అమ్మనాన్న వాళ్ళు తప్పులు వచ్చినా..... మాట్లాడుతుంటేనే భాష వస్తుంది అంటారు.


నేనేమో అదేదో సామెత చెప్పినట్లు ..... నేను మాట్లాడాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి.......ఇంగ్లీష్ బాగా రావాలంటే నేను మాట్లాడాలి. అని ఆ రెండూ ఒకేసారి అంటే కుదరనిపనికదా !


అయితే ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల తరువాత నేను  M.A.
ఇంగ్లీష్ మీడియం

 చదవగలిగాను..


ఇవన్నీ చూస్తుంటే నాకు అనేక సందేహాలు వస్తుంటాయి. మనిషికి చదువు, డబ్బు బాగా ఉంటేనే గౌరవిస్తారా ? చదువు, డబ్బు లేని వాళ్ళలో కూడా ఎందరో మహాత్ములున్నారు కదా ! అని.


ఇంకా, మన మాతృభాషలో మనం మాట్లాడాలంటే ఇబ్బంది పడే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి ? ఇలా అనేక సందేహాలు వస్తుంటాయి.

నాలాగే మరెందరో ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల .. చదువులో ఇబ్బందులు పడుతున్నారు.



Wednesday, February 22, 2012

ఇద్దరమూ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాము. .....


నన్ను మా ఊరిలోని మహిళా కళాశాలలో ఆర్ట్స్ గ్రూప్ లో చేర్పించారు.

నాకేమో డాక్టర్ లేక అలా ఏదన్నా చదవాలని కోరికలు ఉండేది.

మా ఇంట్లోవాళ్ళకేమో అలాంటి కోరికలు ఏమీ లేవు. సామాన్యమైన డిగ్రీ చదివించి వివాహం చెయ్యాలని వాళ్ళ కోరిక .

నేను సైన్స్ గ్రూప్ తీసుకుంటానని అడిగాను. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక చేసేదేమీ లేక ఆర్ట్స్ గ్రూప్ లో చేరి చదువుతున్నాను.

పది రోజులు గడిచేసరికి లెక్చరర్లు నా ప్రతిభను గుర్తించి మెచ్చుకున్నారు.

ఒకరిద్దరు లెక్చరర్లు నువ్వు సైన్స్ గ్రూప్ ఎందుకు తీసుకోలేదు ? అని ప్రశ్నించటం కూడా జరిగింది.

నేను సమాధానం చెప్పలేదు. ( నేను ఏం చెప్పగలను ? )

ఆ రోజుల్లో సైన్స్ గ్రూప్ చదవటం అంటే గొప్పగా ఫీలయ్యేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం లో అంటే మరింత గొప్ప.


పాత స్కూల్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను అడగటం మొదలుపెట్టారు ....
అదేంటి ! నువ్వు ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నావా ? అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

ఇదంతా చూసి ....నాకు అన్యాయం జరిగిపోతోందని గట్టిగా అనిపించింది.

ఇంతలో మా క్లాసులో ఒక అమ్మాయి తను గ్రూప్ మార్చుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇక నాకు దారి దొరికింది. ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి నేను కూడా గ్రూప్ మార్చుకుంటాను . ఏం చెయ్యాలో సలహా చెప్పమన్నాను.

ఇద్దరమూ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాము.

మా ప్రిన్సిపల్ కు చండశాసనురాలని పేరు.

మేము వణుకుతూనే వెళ్ళి మా సమస్య చెప్పాము.

ఆమె పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి.. అన్నారు.

అదే కాలేజీలో నాకు బాగా ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఉంది.

మావి ఎదురుబొదురు ఇళ్ళు అవటం వల్ల చిన్నప్పటినుంచి మేము బాగా ఫ్రెండ్స్.. తనకి ఈ కధంతా చెప్పి గ్రూప్ మారటంలో సాయం అడిగాను.

మా ఇంట్లో వాళ్ళ సంగతి తనకి తెలుసు .

కాబట్టి ఇదంతా ఎక్కడికి దారితీస్తుందోనని భయపడింది.

ఫరవాలేదు. మనమేమీ తప్పు చేయటం లేదు. ఇదంతా నేను పెద్ద చదువులు చదవటానికే కదా ! అని ధైర్యం చెప్పాను.

మరుసటి రోజు ఇద్దరం ప్రిన్సిపల్ వద్దకు వెళ్ళాము. మా పెద్దవాళ్ళకు రావటం కుదరలేదని చెప్పి దయచేసి గ్రూప్ మార్చమని ప్రాధేయపడ్డాము.

ఏమనుకున్నారో మరి ఆవిడ బైపిసి ఇంగ్లీష్ మీడియం లోకి మార్చేసారు.

అప్పుడు ఇంగ్లీష్ మీడియంకు, తెలుగు మీడియంకూ నాకు తేడా తెలియలేదు.

ఇక మరుసటి రోజు వెళ్ళి క్రొత్త క్లాసులో కూర్చున్నాను.

టెక్స్ట్ బుక్స్ లేవు. లెక్చరర్ చెబుతున్నది ఒక్క ముక్కా నాకు అర్ధం కావటం లేదు.

నేను తెలుగుమీడియం నుంచి వచ్చాను కదా !

నా ఖర్మ కొద్దీ ఆ లెక్చరర్ నన్నే ప్రశ్నలు అడిగేవారు.

ఆమె అడిగేది నాకు తెలియదు. నేను చెప్పేది ఆమెకు తెలియదు.

క్లాసులో ఘొల్లున పిల్లల నవ్వులు.

ఆప్పటివరకూ స్కూల్లో బాగా చదివే విద్యార్ధినిగా ఒక వెలుగు వెలిగిన నేను.... అందరిముందు అవహేళనలను ఎదుర్కోవటం మొదలయ్యింది.


మళ్ళీ ప్రిన్సిపల్ వద్దకెళ్ళి తెలుగు మీడియంలోకి మార్చమని అడిగాను. ఆవిడ నన్ను కోప్పడ్డారు. ( ఇన్నిసార్లు మార్చమంటే ఎవరైనా కోప్పడతారు మరి. )

ఇక చేసేదేమీ లేక వచ్చి క్లాసులో కూర్చున్నాను.

ఇలా వారం రోజులు గడిచేసరికి , కాలేజీలో కొందరు ఈ వార్తను ఆయాసపడుతూ మా ఇంటికి మోసేసారు.

మీ అమ్మాయి తనకుతానే గ్రూప్ మార్చుకుని వేరే క్లాసులో కూర్చుంటోంది అని.

ఇది ఒకరకంగా నాకు సంతోషాన్నీ, ఒక రకంగా భయాన్నీ కలిగించింది.

మా ఇంట్లో వాళ్ళకు నేను చెప్పే బాధ తప్పిందన్న సంతోషం...ఇక ముందు ఏం జరగబోతుందో ? అన్న భయం.

విషయం ఇంట్లో తెలిసింది.... ఇక చెప్పటానికి ఏముంటుంది లేండి.

మా నాన్నగారు నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు. మా అమ్మగారు నన్ను బాగా తిట్టిపోసారు.

అలా ఇంగ్లీష్ మీడియం అర్ధం కాకపోవటం వల్ల ఇంటర్లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ తప్పటం జరిగింది.

నాకు మొదట్నించీ బట్టీపట్టి చదవటం ఇష్టం ఉండేది కాదు. సబ్జెక్ట్ అర్ధమయిన తరువాతే చదువుతాను.

నాకు తెలిసిన కొందరు మాథ్స్ కూడా బట్టీపట్టి చదివే వాళ్ళున్నారు..

నాతోపాటు స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కొందరు మా క్లాసులో ఇద్దరుముగ్గురు ఉన్నారు.

వారిని నా సందేహాలు అడుగుదామంటే ఎంచేతో కాని ....వారు నాతో పూర్వంలా మాట్లాడటం తగ్గించారు.( ఇప్పుడు నేను యావరేజ్ స్టూడెంటును కదా ! )

పూర్వం కూడా మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కూడా వారికీ నాకూ కొంచెం గాప్ ఉండేది.

కారణమేమిటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి మెలిసి సినిమాలకు , ఒకరి ఇళ్ళకు ఒకరు వెళ్తూ అందరూ బాగా స్నేహంగా ఉండేవారు.

( వాళ్ళ ఇళ్ళలో పెద్దవాళ్ళు వాళ్ళని సినిమాలకు, ఫ్రెండ్స్ ఇళ్ళకు పంపించేవారు. )

కానీ మా ఇంట్లోనేమో ..... అలా ఫ్రెండ్స్ తో వెళ్ళటం అంటే ఒప్పుకునేవారు కాదు.

ఆడపిల్లలు అలా వెళ్ళకూడదు అనేవారు.


( ఇప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ఏమంటారంటే .......

* నిన్ను చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో సినిమాలకూ, వాళ్ళ ఇళ్ళకు పంపించటం లేదని మాతో వాదించేదానివి కదా !

* మరి ఇప్పుడు నువ్వు కూడా మీ పిల్లల్ని
ఫ్రెండ్స్ తో అంతగా పంపించటం లేదుకదా ! అని నవ్వుతూనే.... అంటారు.

* అది నిజమే కాబట్టి, నేను జవాబు చెప్పలేను.

* మాతృ భాషలో చదవటాన్ని ప్రోత్సహించాలి.

* జపాన్ వంటి దేశాలలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం ఉంటుందట.

* ఇంగ్లిష్
ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉండాలి.

* కొద్దోగొప్పో తెలివి ఉన్న నాకే ఇంగ్లీష్ చదువు ఇంత కష్టంగా ఉంటే
,
 ఇక
పల్లెల నుంచి వచ్చిన పిల్లలుఇంగ్లీష్ చదువులు చదవలేక,
 
చదువును మధ్యలోనే మానేస్తారు... అని నా అభిప్రాయం.

 

Monday, February 20, 2012

ఓం నమఃశ్శివాయ.....

ఓం 
శ్రీ విశ్వనాధాష్టకం...

గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం



తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..


ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.

శ్రీ గణేశ స్తుతి...

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్

ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..

హే స్వామినాధ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసమేత  మమదేహి కరావలంబం..

దేవాదిదేవనుత దేవగణాధినాధ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మా త్ప్రదాన  పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

దేవాదిదేవ రధమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృంద వంద్య

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః


పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః


పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ


వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..

ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


సంతాన ఫల మంత్రం..

సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా!

జరత్కారుప్రియాఽఽ
స్తీకమాతా విషహారేతి చ 


మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ !

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!

శ్రీ కాల భైరవాష్టకం..
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మ్యై మకారాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మ్యై శికారాయ నమశ్శివాయ.

వశిష్ట కుంభోధ్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

తస్మ్యై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Friday, February 17, 2012

కొన్ని సంగతులు.....


శ్రీ రామకృష్ణ పరమహంస వారి జన్మదినం ఫిబ్రవరి 18. శ్రీ రామకృష్ణ పరమహంస శారదాదేవిలకు అనేక నమస్కారములు ..........................................
టాపిక్ ను మార్చానండి. మా నాన్నగారు ఒక ఉద్యోగి, మా అమ్మగారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేసారు.


మా నాన్నగారి తల్లిదండ్రులు , మా అమ్మగారి తల్లితండ్రులు పల్లెటూరిలో ఉండేవారు. . సెలవులలో ఊర్లు వెళ్తే మా తాతగార్లు మాకు తాటిముంజెలు, ఈతకాయలు ఇలా రకరకాలు తెచ్చి ఇచ్చేవారు. ఇంకా ఆటవస్తువులు తెచ్చి ఇచ్చేవారు. మా నాయనమ్మ, అమ్మమ్మ మాకు ఎన్నో పిండివంటలు చేసిపెట్టేవారు. మా అమ్మమ్మకు నాన్నమ్మకు కూడా చదవటం వచ్చు.ఇప్పుడు అమ్మమ్మ ఉన్నారు. ( తాతగార్లు, నాన్నమ్మ ఇప్పుడు లేరు. )

మా అమ్మగారునాన్నగారు ఉద్యోగరీత్యా ఇంకో ఊరు వచ్చారు. మా ఇంట్లో వాళ్ళకు ఆ ఊరు కొత్త కావటం వల్ల మంచి హాస్పిటల్స్ గురించి అంతగా తెలియదట. .

నేను అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. ( అంటే ఇండియాలోనే .... మా ఊళ్ళో ఆ హాస్పిటల్ను అలా అంటారు. ) మా అమ్మగారు నేను పుట్టబోయే రోజున కూడా స్కూల్ కు వెళ్ళారట. ఆమెకు ఒంట్లో బాగా నలతగా అనిపించగా ... మా అమ్మగారు పనిచేసే స్కూల్
ప్రధానోపాధ్యాయురాలు అమెరికన్ హాస్పిటల్ గురించి చెప్పగా.... అప్పటికప్పుడు హాస్పిటల్కు వెళ్లారట..

ఇప్పుడు కూడా ఆ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ గేటు సమీపంలో ఏసుక్రీస్తు విగ్రహం పెద్దది ఉంటుంది. .

మేము కొంతకాలం క్రిందట అమరనాధ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి ముస్లిం మతస్థులు మాకు బాగా సాయం చేసారు. ఆ విధంగా నాకు ఆన్ని మతాలు అంటే గౌరవం. .

దైవం అందరికీ సమానమే కదా !

మా అమ్మగారికి ఉద్యోగం వల్ల నా చిన్నతనంలో నన్ను చూసుకోవటానికి ఎవరూ దొరకక ఇబ్బందులు పడ్డారట. పనిపిల్లలను పెడితే వాళ్ళు నన్ను సరిగ్గా చూసేవారు కాదట. ( వాళ్ళూ పిల్లలే కదా ! )


కొంతకాలం అలా జరిగాక మా అమ్మగారి మేనత్త వాళ్ళు ( ఒకపెద్దావిడ . ఆమెకు పిల్లలు లేరు. ) మాఊరు వచ్చి ఉండటం జరిగింది. . ఇక నన్ను రోజూ వాళ్ళింట్లో వదిలి సాయంత్రం మా ఇంటికి తీసుకు వచ్చేవారట. మా చెల్లెలు, తమ్ముడ్ని కూడా ఆమే చూశారు.


మా ఇంటికి బంధువులు బాగా వస్తుండేవారు. ఒక ప్రక్క స్కూల్ , ఒక ప్రక్క ఇంటినిండా బంధువులు .. ఇలా మా అమ్మగారికి చాలా
పని ఒత్తిడి ఉండేది.

నేను చిన్నప్పుడు చాలాకాలం ఒక్కదాన్నే పెరిగాను కదా ! అందుకని మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే నాకు చాలా ఇష్టం. ఇక నేను వాళ్ళని నా ప్రశ్నలతో వేధించేదాన్ని. వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పమనీ, వాళ్ళ తాతముత్తాత కబుర్లు చెప్పమనీ ఇలా ప్రశ్నలు అడిగేదాన్ని . వాళ్ళూ ఓపిగ్గా చెప్పేవారు.

పెద్దవాళ్ళకి తమ చిన్నతనం కబుర్లు చెప్పటమంటే ఇష్టమే కదా ! బ్లాగుల్లో వ్రాసిన పాతకాలం నాటి విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుని వ్రాసినవి కూడా ఉన్నాయి. అయితే నేను అంతటితో ఆగకుండా చిత్రమైన ప్రశ్నలు కూడా అడిగి వేధించేదాన్ని. వాళ్ళు వాళ్ళకి తెలిసినవి చెప్పేవారు.


నా అతితెలివి చూసి మా నాన్నగారు ఆడపిల్లలకు అతితెలివి ఉంటే కష్టమని భావించి ఏదో ఒక డిగ్రీ వరకూ చదివించి పెళ్ళిచేసేయాలని మా నాన్న గారి అభిప్రాయం. నాకేమో డాక్టర్ లేక అలా ఏదైనా చదివి దేశాన్ని
ఉద్ధరించాలని చాలా ఆశలు ఉండేవి.

నాకు చదవటం అంటే చాలాచాలా ఇష్టం. అది ఏదైనా కావచ్చు . బజ్జీలకు పొట్లంగా చుట్టిన కాగితం పైన వ్రాసి ఉన్న విషయాలను కూడా చదివే ఆ కాగితాన్ని పారేస్తానన్నమాట. ఇప్పుడు అంత సమయం ఉండటం లేదు లెండి. .

మా అమ్మగారు ఉద్యోగిని కాబట్టి నన్ను చాలా చిన్నతనంలోనే బళ్ళో వేసేసారు. ఆ స్కూల్ ఇప్పుడు కూడా పేరున్న స్కూలే. చిన్నప్పుడు స్కూల్లో నాకు చాలా ప్రైజులు వచ్చాయి.మా నాన్నగారికి తెలిసిన వారు క్రొత్తగా స్కూలు ప్రారంభిస్తే అక్కడ మరి కొంతకాలం చదివాను.

తరువాత ఆరవ తరగతిలో మా అమ్మగారు పనిచేసే స్కూల్ లో వేసారు. ( అది బాలికల స్కూల్ .ఆ స్కూల్ లో ఆరవ తరగతి నుంచే చెబుతారు. ) ఆ స్కూల్ లో టీచర్ గారి అమ్మాయిగా నాకు బాగానే గౌరవమర్యాదలు ఉండేవి.

స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మా అమ్మగారూ పక్కింటి పిన్ని గారూ, వదినగారూ కబుర్లు చెప్పుకుంటుంటే .... చుట్టు ప్రక్కల పిల్లలందరం కూర్చుని రకరకాల కధలు చెప్పుకునేవాళ్ళం. ( రోజూ కాదులెండి. )


మా అమ్మగారు చాలా నిదానం. స్కూలుకు వెళ్ళటం ఇల్లు చూసుకోవటం అంతే .
నేను ఇప్పటికీ అంటుంటాను అమ్మా నీ అంత ఓపిక, సహనం నాకు ఎంత ప్రయత్నించినా రావటం లేదు .అని. మా నాన్నగారు ఏమనేవారంటే మన చుట్టూ ఉన్నవారు పేదరికంలో ఉంటే మనకు డబ్బు ఉన్నా సంతోషంగా అనుభవించలేము అనేవారు. ఊరు నుంచీ తెలిసినవాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఇచ్చేవారు. వారిలో కొందరు తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేవారు . కొందరు తిరిగి ఇచ్చేవారు కాదు.ఇంకా చాలామందికి సహాయం చేసేవారు.


మా అమ్మగారికి ఉద్యోగం వల్ల పిల్లల్ని పెంచటం, ఇంకా ఉద్యోగంలోని కష్టాలు ఇవన్నీ చూసి మా నాన్నగారు నేను బాగా చదివి ఉద్యోగం చెయ్యాలని భావించలేదు. నేను డిగ్రీ వరకూ చదివి గృహిణిగా ఇల్లు చూసుకుంటే చాలు అనుకునేవారు. ( మమ్మల్ని పెంచటానికి మా బామ్మగారు ఉన్నారు కానీ.... నేను ఉద్యోగం చేస్తే మా పిల్లలు కష్టపడతారని ).

ఇంకా, మా నాన్నగారు ఏమనేవారంటే,....
నువ్వు ఉద్యోగం చేస్తే నెలనెలా ఎంత ఆదాయం వస్తుందో నేను నీకు అంత ఆదాయం వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను .,నాకు ఉన్న ఆస్తి నా పిల్లలకు సమానంగా ఇస్తాను .... ఆడపిల్లలైనా మగపిల్లలైనా నాకు సమానమే అనేవారు. అలాగే చేశారు కూడా. ఇంకా , ఆడవాళ్ళకు ఉద్యోగంలో బోలెడు కష్టాలు ఉంటాయి అనేవారు.

అయితే స్త్రీలకు చాలా విషయపరిజ్ఞానం ఉండాలి అనేవారు. అందుకే రోజూ ఇంటికి వచ్చాక బయట జరిగిన విషయాలను చెప్పేవాళ్ళు. అలా నాకు బయట జరిగే విషయాలన్నీ తెలిసేవి.
నేను ఇప్పటికీ చాలాసార్లు మా అమ్మానాన్నగార్లను సలహాలను అడుగుతాను.

మమ్మల్ని సినిమాలకు ఎక్కువగా పంపేవారు కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నన్ను పెంచిన బామ్మగారిని తోడురాగా మా చుట్టాల పిల్లలం అందరం భక్తి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అంతే. అయితే మా ఇంట్లో వివిధభారతి తెలుగుపాటలు వినేవాళ్ళం.

అయితే నాకు సినిమా పరిజ్ఞానం చాలానే ఉంది. ఎలా అంటారా ? మా స్కూలులో నా ఫ్రెండ్స్ బాగా సినిమాలు చూసేవారు. ఇక అవన్నీ డైలాగులతో సహా ఒక వారం రోజుల్లో నాకు చెప్పేసే వారు.

ఆ రోజుల్లో చదువు ఇప్పటిలా చిత్రహింస కాదులెండి. ఎన్ని సినిమాలు చెప్పుకున్నా మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కువమార్కులు వచ్చేవి. .

మరికొన్ని విషయాలు తరువాత .....


Thursday, February 16, 2012

ఈ మధ్య ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యానించకపోవటానికి ...


నేను ఈ మధ్య ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యానించకపోవటానికి ఒక కారణం ఏమంటే ....

మనం వ్యాఖ్యానించినప్పుడు ఏ ఊరినుంచి వ్యాఖ్యానిస్తున్నామో తెలుస్తుంది కదా ! అందుకే వ్యాఖ్యలు వ్రాయటం మానేసాను .

ఇప్పటి నా ప్రవర్తనకు ఇలాంటి పైకి చెప్పలేని కారణాలు మరి కొన్ని ఉన్నాయి.. అంతేకానీ నాకు వేరే ఉద్దేశ్యాలు లేవండి.

ఇతరులు విమర్శించారని నేను వ్యాఖ్యానించటం మానలేదు.

నాకూ అందరితో ఫ్రెండ్లీగా ఉండటం ఇష్టమే కానీ ...

ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళే నేను ఎప్పుడైనా వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా టపా వ్రాశాననుకోండి బాధపడతారు.

యిలా నాకు మొహమాటాలు .,....

అప్పుడు నేను నా భావాలకు అనుగుణంగా కాకుండా ..... ఇతరుల భావాలకు అనుగుణంగా టపాలు వ్రాయవలసివస్తుంది.

ఇలా ఎన్నోకారణాలవల్ల నేను ఇలా ప్రవర్తించవలసివస్తోంది.

ఈ మధ్య కాలంలో కొందరు నన్ను ఎందుకు విమర్శించారో కూడా నాకు సరిగ్గా అర్ధం కాలేదు..


నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళను కూడా తిడుతున్నారు.

ఇదంతా ఆలోచించి నేనే
యిలా ప్రవర్తిస్తున్నాను.

నావల్ల ఇతరులు బాధపడకూడదు కదా !.

దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు.

ఇదంతా చెప్పటం ఇష్టం లేక ఇంతకు ముందు చెప్పలేదు.


Wednesday, February 15, 2012

అంతా దైవం దయ..


ఈ అద్భుతమైన సృష్టి దైవం వల్ల ఏర్పడింది .

ప్రాచీన గ్రంధాలలో సృష్టి గురించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.

అయితే , నాస్తికులు దైవం అంటూ ఎవ్వరూ లేరు అంటారు. .

ఇంకా,.... సృష్టి దానికదే మొదలయిందని , బిగ్బాంగ్ ద్వారా గ్రహాలు, నక్షత్రాలు వగైరా వాటికవే ఏర్పడ్డాయనీ, తరువాత సూర్యుడు, గాలి, నీరు ఏర్పడటం , డైనోసార్లు పుట్టటం, తరువాత పోవటం, తరువాత కోతులు పుట్టటం ,
వాటిలో కొన్ని కోతులు మనుషులుగా మారిపోవటం .... ఇలా చెబుతుంటారు. .

(డైనోసార్లు ముందుపుట్టాయా ? కోతులు ముందు పుట్టాయా ? అన్నది నాకు తెలియదు.)

ఇదంతా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఏ శక్తి సహాయం లేకుండా ఏదైనా నిర్జీవమైన వస్తువు దానికదే పనిచేయటం జరగదు కదా !

ఉదా...ఒక నిర్జీవమైన కంప్యూటర్ను ముక్కలు చేసి ఒక గదిలో పడేసి ఒక సంవత్సరం తరువాత చూస్తే కంప్యూటర్ భాగాలు అలాగే పడి ఉంటాయి కానీ, ఆ ముక్కలన్నీ వాటికవే అతుక్కుని కంప్యూటర్ తయారయిపోవటం జరగని పని.

కంప్యూటర్ తయారవ్వాలంటే .... దానివెనుక మనిషి లేదా మనిషి తయారుచేసిన యంత్రాలు ఉంటేనే కంప్యూటర్ తయారవుతుంది.

అలాగే ....ఏ శక్తి ( దైవం ) ప్రమేయం లేనిదే బిగ్బాంగ్ , తరువాత పరిణామాలూ ..... ఇలా దానికదే సృష్టి జరగటం అసంభవం .

సృష్టిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

జీవులలో ప్రాణం ఎలా వస్తుంది ? ఇన్ని కోట్ల మనుషుల్లో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒక్కలా ఎందుకు ఉండవు ? ఇలా.........ఎన్నో ప్రశ్నలు.

వాతావరణానికి , పరిసరాలకు అనుగుణంగా మాత్రమే .... అన్ని జీవుల పుట్టుక జరిగి ఉంటే ........ మరి ఒకే రకమైన వాతావరణం, పరిసరాలు ఉండే ఒకే చెరువులో పుట్టే జీవులన్నీ ఒకేలా ఉండవు కదా !

ఒకే చెరువులో ఆల్గే . దాన్ని తినే చేపలు, కప్పలు, వాటిని తినే పాములు, ఇలా ఎంతో భిన్నంగా జీవుల పుట్టుక ఉంటుంది.

ఇలా సృష్టించటం ఎంతో అద్భుతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఆ మహాశక్తినే దైవం అని ఆస్తికులు ఆరాధిస్తుంటారు.

అంతేకానీ ఏ శక్తీ ( దైవం ) లేనిదే ఇంత అద్భుతమైన ప్రణాళిక గల సృష్టి దానికదే ఎలా ఏర్పడగలదు ?

సృష్టిని దైవం సృష్టించారు .... అని ఆస్తికులు నమ్ముతారు.

మరి దైవాన్ని ఎవరు సృష్టించారు ? అన్న ప్రశ్నకు గ్రంధాలలో సమాధానాలు ఉంటాయి. అయితే అవి నా లాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....... .

ఈ సృష్టి ఎలా ఏర్పడింది ? అన్న ప్రశ్నకు...... దైవం వల్ల. అని ఆస్తికులు సమాధానం చెప్పగలరు.

కానీ ఈ సృష్టి ఎలా ఏర్పడింది ? అన్న ప్రశ్నకు .....నాస్తికులు సమాధానం చెప్పలేరు.

వారు సృష్టిలోని పదార్ధాల నిర్మాణం గురించి వివరించగలరు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టి చెప్పగలరు అంతే.

. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండేలా ఏర్పరచటం,

సూర్యుడు రోజూ క్రమం తప్పకుండా ఉదయించటం అస్తమించటం ,

చంద్రుడు బెడ్ లైట్ లాగా తక్కువ వెలుతురుతో వెన్నెలను కురిపించటం ...ఇవన్నీ దైవం అనే మహాశక్తి ప్రమేయం లేకుండా వాటికవే జరిగిపోవు కదా !

ఇవన్నీ ఏర్పరిచిన అద్భుతమైన ఆలోచనా శక్తిగల మహాశక్తి దైవం....దైవానికి అనేక కృతజ్ఞతలు.


అంతా దైవం దయ...


Monday, February 13, 2012

తోటి బ్లాగు సోదరసోదరీమణులకు ....



తోటి బ్లాగు సోదరసోదరీమణులకు కృతజ్ఞతలండి. ఎందుకంటే ..... ఏమో అలా వ్రాయాలనిపించింది అంతే.



భార్యా.....భర్త , తల్లిదండ్రులు...పిల్లలు, అత్తా......కోడళ్ళు, టీచర్లు.... పిల్లలు, అధికారులు...ఉద్యోగులు ........ ఇలా అందరు తమ జీవితాల్లోని కష్టసుఖాలను చెప్పుకోవటం వల్ల ఒకరి సమస్య ఇంకొకరికి అర్ధం అయి కొందరయినా మారే అవకాశం ఉంది.



అంతేకానీ మనకు నచ్చని అభిప్రాయాన్ని ఎవ్వరూ చెప్పకూడదంటే ఎలా ?


ఈ పోటీ ప్రపంచంలో శక్తికి మించి చదవలేక ........ తల్లిదండ్రులతో తమ నిస్సహాయతను సరిగ్గా చెప్పుకోలేక .....చెప్పినా వారు అర్ధం చేసుకోలేక మానసికంగా నలిగిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు.


కష్టంలో సుఖంలో తోడునీడగా కడదాకా కలిసి ఉంటామని వివాహ సమయంలో ప్రతిజ్ఞలు చేసి ..........


ఇంకొకరి మోజులో పడి భాగస్వామికి అన్యాయం చేసినప్పుడు ......... ఆ జంటలో ఒకరు ఆత్మహత్య చేసుకున్న వారి కధలు కూడా వింటున్నాము.


అలాంటి ఇళ్ళలో పిల్లల మానసిక పరిస్థితి ఏమిటి ? ఇలా సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి.


ఇలాంటి వాటి గురించి చర్చలు జరగటం వల్ల సమాజానికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు.


అయితే బ్లాగుల్లో కూడా చర్చలకు కొన్ని పరిమితులు ఎటూ ఉంటాయి.


పూర్తిగా మన అభిప్రాయాలను చెప్పటానికి కుదరదు.


అయితే కొద్దిగానన్నా స్వేచ్చగా చెప్పగలం.


అంతేకానీ అసలు చర్చించటమే తప్పు ....... అంటే ఇక బ్లాగుల అవసరం ఏమిటో అర్ధం కావటం లేదు.


నా బ్లాగులో నేను వ్రాసే టపాలు మీకు నచ్చినట్లయితే .... నచ్చాయని వ్యాఖ్యలు వ్రాయవద్దని ప్రార్ధిస్తున్నానండి .


నేను వ్రాసే విషయాలలో మీకు ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు , లేక ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు
.......


వ్యాఖ్యలు
ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తే.... నాకు వీలయినంతవరకు సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తానండి.

ఒకవేళ నేను వ్రాసిన దానిలో తప్పులుంటే సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను.

నేను ఎంత వివరించినా నా అభిప్రాయాలు మీకు నచ్చలేదనుకోండి .......

లాంటి సందర్భంలో ఎవరి అభిప్రాయం వారిది అనుకోవటం తప్ప.... నేను చేయగలిగింది ఏమీ లేదు.

  నా అభిప్రాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి.

ఉదా...ఒక గ్రూప్ వారి విధానాలు, అభిప్రాయాలలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు.

ఇంకొక గ్రూపు వారి
విధానాలు, అభిప్రాయాలలో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు.

ఒకే టీవీ చానల్లో వచ్చే కొన్ని ప్రోగ్రాంస్ నచ్చుతాయి. కొన్ని నచ్చవు.

( అందుకే నాకు ఎవరితోనూ  స్నేహమూ ఉండదు. ఎవరితోనూ శత్రుత్వమూ ఉండదు.. )

నాలో కూడా కొన్ని గుణాలు నాకు నచ్చుతాయి. కొన్ని నాకే అస్సలు నచ్చవు.

అయితే నాలో నాకు నచ్చని వాటిని మార్చుకోవటానికి ప్రయత్నిస్తుంటాను.......

 

Friday, February 10, 2012

కొన్ని విషయాలు.........



నేను రకరకాల వార్తా పత్రికలు చదువుతాను. రెండు ఆర్టికల్స్ గురించి వ్రాయాలనుకుంటున్నాను.

1. " luminescence ."...... సౌరశక్తి ద్వారా విద్యుత్ తయారీ కనిపెట్టారట....శాస్త్రవేత్తలు .

( మొక్కల్లో సహజంగా జరిగే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ మాదిరిగా ఈ ప్రక్రియ పనిచేస్తుందట. ఇదేదో వింటుంటే బాగానే ఉందనిపిస్తోంది.

2......వేదాలు ఎంతో గొప్పవి. ఈ క్రింది విషయాలు చదవండి. .

రాజమండ్రిలో కృష్ణనగర్ లో నివసించే మధుర కృష్ణమూర్తి శాస్త్రి అనే ఆయన గొప్ప పండితులట.


వీరి సలహాల కోసం దేశవిదేశాల నుంచి ఫోన్ల ద్వారా సంప్రదిస్తారట. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి శాస్త్రవిషయాలపై పత్రాలు సమర్పించమని లేఖలు వస్తుంటాయట.


వారు విమానాలను పాశ్చాత్యులు కనిపెట్టటానికి పూర్వమే భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని రచించారని.

భోజరాజు నౌకానిర్మాణ రహస్యాలను " నౌకా విహారం " అనే గ్రంధంలో రచించారని

"అంశుభోదినీ తంత్రం " అనే గ్రంధంలో విద్యుత్ ఉత్పాదన చేసే ప్రక్రియ వివరించబడిందని తెలియజేస్తున్నారట.

మన శాస్త్రాలను గురించి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎంతో లోతైన పరిశోధనలు చేస్తున్నారట.

ఉదా...ఫ్రెంచ్ రచయిత ఫ్రిట్జ్ స్టాల్ రచించిన Agni: The Vedic Ritual of the Fire Alter (2 Vols.) అన్న గ్రంధం మన హోమాలు, యజ్ఞయాగాలను గురించిన పరిశోధనా గ్రంధమట.



విదేశీయులు ఈ విధంగా మన గ్రంధాలను తెలుసుకోవాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటే ........ మన దేశీయులు కొందరు ప్రాచీనగ్రంధాలను ఎగతాళి చేయటానికి ఉత్సాహాన్ని చూపించటమే విషాదం..
..................................................

ఈ విషయం కూడా దయచేసి చదవండి.........

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇతర బ్లాగులలో వ్యాఖ్యానించటం కొంతకాలం మానెయ్యాలని గత కొంతకాలం నుంచి అనుకుంటున్నాను. అయితే ఇలా చేస్తే నన్ను అపార్ధం చేసుకుంటారేమోనని భయపడ్డాను.

( ఇలా అనుకోవటానికి కారణాలను ఇప్పుడు చెప్పలేను. ) ( అయితే నా బ్లాగులో ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు. ) ఇదంతా దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దండి.


ఇది ఇలా ఉండగా అనుకోని విధంగా నామీద విమర్శలు వచ్చాయి కదా !

పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు, నేను అందరూ మంచిగా ఉండాలని అనుకుంటే ఇలా జరిగిందేమిటి ? అని బాధనిపించింది.


ఆ విమర్శలను చదివిన తరువాత కొద్దిగా బాధనిపించినా నేను కూడా చాలాసార్లు ఇతరులను విమర్శించాను కదా !
అనుకున్నాను.

జీవితంలో విమర్శలు, ప్రశంసలు సహజం .......అని కష్టాలలోనూ, సుఖాలలోనూ స్థితప్రజ్ఞత అవసరం....... అని పెద్దలు చెప్పినది గుర్తు చేసుకుంటూ దైవ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా అవసాగింది.

ఇంతలో నా మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.

ఈ సంఘటన వంక పెట్టి నేను ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానటం వల్ల  ఎవరూ నన్ను అపార్ధం చేసుకోరు కదా ! అనిపించింది.

ఈ ఆలోచన వచ్చిన తరువాత అనిపించింది...... దైవం దయ వల్ల నా సమస్యకు యిలా పరిష్కారం దొరికింది అని.

విమర్శల వల్ల కూడా మనకు లాభముంది.

మనం చేసిన పొరపాట్లను సరిదిద్దుకొనే అవకాశం వస్తుంది.. ఇంకా మనకు కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి .


మనకు సమస్యలు వచ్చినప్పుడు ఒకోసారి బంధువులతో కూడా చెప్పుకోలేము .
కానీ ఎప్పుడైనా, ఎక్కడైనా సర్వకాలసర్వావస్థలలోనూ మనము మనసు విప్పి చెప్పుకోగలిగేది దైవం తోనే.


ఎప్పుడూ మన వెంట ఉండేది దైవమూ ,ఇంకా మనం చేసిన ధర్మము, అధర్మము.

ఈ విమర్శల విషయం ఇంతటితో ముగించుదాము అనుకుంటున్నానండి.
..................

.... luminescence

......... Agni: The Vedic Ritual of the Fire Alter (2 Vols.)

ఈ రెండు విషయాల గురించి అంతర్జాలంలో కూడా వివరాలు ఉన్నాయండి..


Wednesday, February 8, 2012

.యదార్ధవాది....లోకవిరోధి. అన్నారు మరి.



నేను నాకు తెలిసినంతలో నా అభిప్రాయాలను చెప్పుకోవాలని బ్లాగులో వ్రాస్తున్నానండి. . వాటిలో కొన్ని పొరపాట్లు కూడా ఉండవచ్చు.

నన్ను విమర్శిస్తున్న వారికి, విమర్శలు ప్రశంసలను రెండింటిని కలిపి అందిస్తున్నవారికి, ప్రశంసిస్తున్న వారికి, అందరికి నా ధన్యవాదములండి.

నా ఆలోచనలు ఈ కాలంలో చాలామందికి నచ్చవు. కొన్ని అలోచనలు నచ్చినా కొన్ని నచ్చకపోవచ్చు.

నన్ను ఎవరైనా అపార్ధం చేసుకున్నప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినవాళ్ళు ఇతరులతో స్నేహాన్ని పోగొట్టుకుంటారేమో ! అది నాకు ఇష్టం లేదు.


నేను టపాల్లో వ్రాసిన అభిప్రాయాలు నచ్చినవాళ్ళు మీ మనసులో నా అభిప్రాయాలను మెచ్చుకున్నా చాలు నాకు సపోర్ట్ అందించినట్లేనండి. ( నాకు సపోర్ట్ ఇచ్చిన వారికి ధన్యవాదములండి. )


ఈ ప్రపంచంలో అందరికి నచ్చేటట్లు మాట్లాడాలంటే చాలా కష్టం . ఒకే కుటుంబంలోని  తల్లిదండ్రులు పిల్లల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉంటాయి.

పూర్వకాలంలో అయితే భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా సర్దుకు పోయి జీవించి ఈ కుటుంబవ్యవస్థను నిలబెట్టారు.

వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉండే వ్యక్తులు కూడా చక్కగా స్నేహంగా ఉండేవారు.

కానీ ఈ రోజుల్లో ఎవరైనా తమకు నచ్చని అభిప్రాయాన్ని చెబితే చాలు ఇక వాళ్ళని నానామాటలూ అంటున్నారు.


ఈ రోజుల్లో ఏం మాట్లాడాలన్నా గొడవగానే ఉంది. ఆడవాళ్ళు పద్ధతిగా దుస్తులు ధరించాలి అని అన్నాము అనుకోండి. ఇక అంతే సంగతులు. వాళ్ళపని అయిపోయిందే.

నా అభిప్రాయాలు కూడా కొందరికి నచ్చలేదు కాబోలు . విమర్శిస్తున్నారు.

చాలామందితో పోల్చుకుంటే నేను ఒక సామాన్య భక్తురాలిని. నా ఆధ్యాత్మిక మార్గంలో నా శక్తికి మించిన పరీక్షలు ఎదురయ్యాయి. వాటితో పోల్చుకుంటే ఈ విమర్శలు పెద్ద కష్టం కాదులెండి.


బ్లాగులలో రాజకీయాల గురించి తెలిసి నేను చాలా కాలం వ్యాఖ్యలకు దూరంగానే ఉన్నాను. అలా ఉంటే అందరితో స్నేహం చెయ్యని వ్యక్తి అని నవ్వుతారేమోనని అప్పుడప్పుడూ వ్యాఖ్యలు వ్రాయటం చేసాను. అయితే నన్ను బ్లాగు రాజకీయాల్లో అనవసరంగా ఇరికిస్తున్నారు.

రమణ గారి బ్లాగులో నా వ్యాఖ్యకు .. ఒకరు ఈ క్రింది వ్యాఖ్య వ్రాసారు.

( హ హ ..శ్రీ పాదుని బాల్యం కాపీ కొట్టి 'బుజ్జి పండు చదువు' అని కవరప్ చేసి, అటు శంకరా భరణం బ్లాగులో పెద్దలని బకారాలని చేసిన రియాల్టీ షో :)

ఈ వ్యాఖ్యను చూసి నాకు అయోమయం అనిపించింది.

బుజ్జిపండు చదువు గురించి నేను వ్రాయటమేమిటో ? శంకరాభరణం బ్లాగులో ఏం జరిగిందో ? ఇవన్నీ నాకు తెలియదు.


ఈ వ్యాఖ్య డైరక్ట్ గా నన్ను అన్నారు. కాబట్టి ఇక్కడ వ్రాసానండి. కొందరు ఇండైరెక్ట్ గా నన్ను విమర్శిస్తున్నారు.


మరి నన్ను ఎందుకు ఇలా విమర్శిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు.

నేను గృహిణినండి. నేను పుట్టిన సంవత్సరం......1966.


నేను మహిళను కాబట్టి తోటి మహిళల కష్టాల పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. అలాగని స్త్రీలు అసభ్యంగా దుస్తులు ధరించటాన్ని నేను సమర్ధించను. ఇలా నా ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.


కుటుంబ వ్యవస్థను గురించి, ఇంకా కొన్ని ఇతర విషయాలను గురించి నేను వ్రాసిన పాత టపాలు కొన్నింటిని చూస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. వాటిని ఇక్కడ ఇస్తున్నానండి.


విషయాలు ఎక్కువగా ఉన్నందువల్ల దయచేసి కొంచెం నిదానంగా చదవమని ప్రార్ధిస్తున్నానండి.

.......................................
పాపం పసివాళ్ళు....

ఒకప్పుడు నాకు ఉద్యోగం చెయ్యాలని ఇంకా సమాజాన్ని ఉద్దరించాలనీ అలా ఏవేవో కోరికలుండేవి.


* ముందు నన్ను నేను ఉద్దరించుకుంటే అదే గొప్ప అని ఇంకా, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించటం కూడా సమాజ ఉద్దరణలో భాగమే అని, నాకు ఆలస్యంగా తెలిసింది.

( మా టీచర్ ఒకామె ( నాస్తికవాది ) మాకు దేవుడు లేడు అంటూ చెప్తుండేవారు. అవన్నీ నమ్మి నేను దైవ ప్రసాదాన్ని నిరాకరించటం లాంటి తప్పులు కూడా చేశాను.
కానీ, భగవంతుడు దయామయుడు కాబట్టి నన్ను క్షమించారు. )

కొన్ని సంవత్సరాల క్రితం........

ఒక రోజు మా అబ్బాయి చిన్నప్పుడు ( నెలల వయసు ఉన్నప్పుడు ) హఠాత్తుగా విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు.

ఎంత ఊరుకోబెట్టినా ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. కడుపు నొప్పి అనుకుని మందు కూడా వేశాను.. బొమ్మలు ఇచ్చినా, బయట తిప్పినా, ఏడుపు ఆపలేదు.

నాకు చాలా భయం వేసింది.......... ఏం జరిగిందో తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని భయం, అయ్యో పిల్లాడు ఇంత బాధ పడుతున్నాడే అన్న బాధ .

నేను ఎంత ప్రయత్నించినా బాబు ఏడుపు ఆపలేదు.

*ఆ గందరగోళంలో వత్తిడితో కూడిన విసుగుతో నేను బాబును ఒక చిన్న దెబ్బ కూడా వేసినట్లు గుర్తు. అయినా ఏడుపు ఆపలేదు.

ఇక భయం వేసి నా భర్తకు ఫోన్ చేసి హాస్పిటల్ కు తీసుకు వెళ్దాము....... అని చెబుదామనుకుంటుంటే , ఏడ్చిఏడ్చి అలసిపోయి పిల్లాడు నిద్రపోవటం జరిగింది.

* బాబును మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంటే చూశాను. తన చేతి వెనుక ఎర్రటి చీమ కుడుతోంది.

దానిని తీసిపారేశాను. కానీ , ఆ సంఘటన తరువాత నేను ఉద్యోగం చెయ్యలేదని బాధపడటం తగ్గిపోయింది.

ఇదంతా ఆలోచిస్తే నాకు ఎంతో బాధ కలిగింది.

తల్లినయిన నాకే విసుగు కలిగిందే ! అయ్యో ! తన బాధ ఇదీ అని చెప్పటానికి ఇంకా మాటలు కూడా రాని చంటిపిల్లలను పనివాళ్ళకు, లేక క్రచ్ లకు అప్పగించి వెళితే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని ?

అంటే వాళ్ళు సరిగ్గా చూడరని కాదు. బాగా చూసె వాళ్ళు కూడా కొందరు ఉంటారు లెండి.
ఎంతైనా ఇంటి వాళ్ళంత ఆప్యాయంగా చూస్తారా ? ఏమో !

పూర్వం పేదస్త్రీలు పనులకు వెళ్ళేటప్పుడు తమ చంటి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్ళి చీరతో వీపుకు కట్టుకుని పనిచేసేవారట. లేకపోతే పొలం గట్టున చెట్టుకు చీరతో కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి కొంచెం పెద్దపిల్లలను కాపలాగ పెట్టి పనులు చేసుకొనేవారట.

( అంటే ఇప్పుడు అందరూ అలా చేయమని కాదు. వాళ్ళు పిల్లలను అంత జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్పటానికి అలా చెప్పాను అంతే. )

. మేము ఒక దగ్గర ఉన్నప్పుడు........ మా పొరుగున ఇంట్లో ఒకరి అమ్మాయి బిడ్డ పుట్టాక రెండో నెలలోనే పాలుత్రాగే బిడ్డను తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళిపోయింది.( కెరీర్ కోసమని .)

( ఆమెకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం కూడా లేదు. ( అయినా సంపాదనకు అంతు ఎక్కడుంది ? )

పెద్దవాళ్ళు పనిలో సాయం చేసే ఆమె సహాయంతో ఆ బిడ్డను చూసేవారు. పని ఆమె రానిరోజున వాళ్ళ పని ఇక అంతే.

పూర్వం తల్లిదండ్రులు చంటిపిల్లలను పెంచుతుంటే తాతా బామ్మలు, మనుమలు,మనుమరాండ్ర ముచ్చట్లతో కాలం గడిపేవారు.

కానీ, డాక్టర్ వంటి వృత్తులలో ఉన్న ఆడవాళ్ళ పిల్లలను పెంచటానికి మాత్రం వారి పెద్దవాళ్ళు తప్పక సహాయం చేయటం బాగుంటుంది.

అంటే , నాకు ఏమనిపిస్తుందంటే ..

వీలయినంతవరకు చంటి పిల్లలను పెంపకానికి బయటివాళ్ళ దగ్గర వదలటం కంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ( తాతగార్లు, అమ్మమ్మ,నాయనమ్మ..) వదలడమే మంచిది అనిపిస్తుంది.

ఇప్పుడు నాకు ఇంటిని చూసుకోవటం, కొంచెం సేపు పూజ చేసుకోవటం, పత్రికలు, పుస్తకాలు చదవటం ఇలా సమయం సరిపోవటం లేదు.

అసలు పుస్తక పఠనం అలవాటు ఉన్నవారికి బోర్ కొడుతోంది అనే సమస్యే ఉండదు.
............................

పాపం .... పెద్దవాళ్ళు.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎందుకంటే, ఒక వేళ అనారోగ్యం వచ్చిందనుకోండి వారిని చూసేవాళ్ళు ఎవరు ? ఇంట్లో అందరూ బిజీ కదా !

మా బంధువుల్లో ఒక బామ్మగారు ఉండేవారు. ఆమెకు 6 గురు సంతానం ఉన్నారు.
 
ఈమె భర్త మరణానంతరం 85 ఏళ్ళ వయసులో పల్లెటూరులో ఒక్కరే ఉండేవారు. అక్కడ అందరూ తెలిసిన వారు కాబట్టి ఇరుగుపొరుగు కొంచెం సహాయంగా ఉండేవారు.

ఒకరోజు ఆమె బాత్రూంలో కాలుజారి పడటం వల్ల ఇక మంచానికే పరిమితం అయ్యారు. ఆమెకు సేవ చెయ్యటానికి పనివాళ్ళు దొరకలేదు.

అలా మంచం మీద ఉన్నవారికి స్నానం చేయించటం, ,శుభ్రం చెయ్యటానికి ఎక్కువ డబ్బు ఇచ్చినా .....వాళ్ళు రెండు రోజులు పనికి వచ్చేవారు. తరువాత పని మానేసేవారు.

ఇక ఆమె పిల్లలు ఆమెను ఒక పేరున్న వృద్దాశ్రమంలో వేయాలని అనుకున్నారు. నెలకు 5 వేలు ఇంకా, కొన్ని వేలు డిపాజిట్ వేసి చేర్పించాలనుకున్నారు.

కానీ ఆ ఆశ్రమం వారు ఏమన్నారంటే , కొద్దిగా అయినా లేచి తమ పనులుతాము చేసుకునే వృద్దులనే వారు చేర్చుకుంటారట. ఇలా మంచంపై ఉండేవారిని వారు చేర్చుకోరట.

ఎందుకంటే అలాంటి వారిని చూసుకోవటానికి వారికి మనుష్యులు దొరకరని చెప్పి ఈమెను జాయిన్ చేసుకోవటానికి నిరాకరించారు.

ఆమెకు ఒక 6 రోజులు కొద్దిగా సేవ చేయటానికి మాత్రమే నాకు వీలు కుదిరింది.అలాంటి వారికి చెయ్యటం కష్టమే.

ఆమె పరిస్థితి చూసి నాకు జీవితమంటే ఇంతేనా అని అనిపించింది.

పెద్ద వయసు వచ్చాక ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ? అని భయం కూడా కలిగింది.
యవ్వనంలో ఆరోగ్యంతో ఉండగా మనకు ఏదో సాధించెయ్యాలని తపన తప్పితే ఇలాంటి కష్టాలు తెలియవు.

వృద్దాప్యం అంటే రెండో బాల్యం అంటారు.

ఆ వయసు వచ్చి అనారోగ్యం ఉండేవాళ్ళకు అందరూ తమ దగ్గర కూర్చుని కొద్దిసేపయినా ఆప్యాయంగా మాట్లాడాలని ఉంటుంది.
కానీ,
మనకేమో వీర బిజీ కదా ! మనకు భోజనం చెయ్యటానికే సమయముండదు.

వారికి ఏమీ తోచదు. కానీ ప్రతి చిన్న విషయం వారు పట్టించుకుంటారు. అన్నీ వివరాలు అడుగుతుంటారు.
కానీ ,
మనకేమో అంత ఓపిక ఉండదు.

ఆ వయసులో వారితో మాట్లాడాలంటే ఇంట్లో వారికి విసుగ్గా అనిపిస్తుంది కానీ, 
మనం చిన్నతనంలో ఎంత విసిగించినా ఓపికగా సమాధానాలు చెప్పి మనలను పెంచిన తల్లిదండ్రులే అయినా మనకు వారితో మాట్లాడటానికి విసుగొస్తుంది.

పెద్దవయసు వాళ్ళకు ఏమీ తోచక ఇరుగుపొరుగుతో మాట్లాడాలని ఉంటుంది .......కానీ ,శరీరం సహకరించదు.

ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడాలని ఉంటుంది కానీ , అందరూ ఎవరి బిజీలో వారు ఉంటారు.

అప్పటివరకూ జీవితంలో బిజీగా ఉండి ఒక్కసారే ఖాళీగా ఉండాలంటే తట్టుకోవటం వాళ్లకు కష్టంగా ఉంటుంది.

ఇక వాళ్ళు తమ జీవితంలో జరిగిపోయిన ముచ్చట్లు తలచుకుంటూ గడపటం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

ఇలా మంచానికే పరిమితమయిన వారి పరిస్థితి ఎంతో బాధాకరం. నాకు ఏమనిపించిందంటే , నరకం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది.

ఇంకా, ఆ బామ్మగారు నాతో ఏమన్నదంటే , నేను ఇంకా ఎందుకు బ్రతకాలి ? అని ఏడ్చింది ......కానీ దానికి ఏమని సమాధానం చెబుతాము. తరువాత కొన్ని నెలలు మాత్రమే జీవించింది ఆమె.

ఇవన్నీ చూశాక నాకు ఏమిటో ! మనిషి జీవితం అనిపించింది.

నడివయసు వాళ్ళకయినా చిన్న జబ్బు చేసి మంచం మీద ఉంటే ఈ రోజుల్లో వాళ్ళను చూసుకోవటానికే ఎవరికీ తీరికలేని పరిస్థితి ఉంది.

* మొత్తానికి అటు చిన్నపిల్లలుగాఉన్నప్పుడు కేర్ సెంటర్ల సం రక్షణలో , ఇటు వృద్ధాప్యం వస్తే వృద్ధాశ్రమం వాళ్ళ సం రక్షణలో ఉండవలసిన వింత పరిస్థితి వచ్చేసింది.

యవ్వనంలో మాత్రమే అదీ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనల్ని అందరూ గౌరవిస్తారు.
ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఎవరి గొప్పతనమయినా అనిపించింది.

యవ్వనంలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు గదా ! అది గుర్తుంచుకుంటే పెద్దవాళ్ళను చూడటానికి విసుగు తగ్గి కొంచెం ఓపిక వస్తుంది.
..............................

*స్త్రీకి స్త్రీయే శత్రువా ? కాదా ?

స్త్రీలు చాలా మంది పురుషాధిక్య ధోరణి వల్లే తమకు కష్టాలు వస్తాయి అనుకుంటారు.
సరే, స్త్రీలు అంటే గౌరవం లేకుండా స్త్రీలను పీడించే పురుషులు చాలా మంది ఉన్నమాట నిజమే.

కానీ, కేవలం మగవారి వల్లే స్త్రీలకు కష్టాలు వస్తున్నాయంటారా?

స్త్రీల వల్లే తోటి స్రీలకు వచ్చే కష్టాల మాటేమిటి ?

అత్తా, కోడళ్ళ గొడవల్లో పోటీపడేది స్త్రీలే గదా !

ఒక స్త్రీ గర్భం ధరించటం కొంతకాలం ఆలస్యమయితే చాలు, ఇక గొడ్రాలు అంటూ విసిగించి వేధించేది అత్తగారు, ఆడపడుచులు, తోటిస్త్రీలు.వారూ స్త్రీలే గదా!

పిల్లలు పుట్టి వారు అందరూ ఆడపిల్లలయితే , అందుకు కోడలినే తప్పుపట్టి కొడుకుకు ఇంకో పెళ్ళి చేయటానికి సిద్ధపడే అత్తగార్లు కూడా ఉంటారు.

స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలిస్తే కడుపులో పిండాన్ని, వీలుకాకపోతే పుట్టిన తరువాత ఆ పిల్లను చంపేసే వాళ్ళలో ఆ ఇంటి ఆడవాళ్ళు కూడా పాత్రధారులే.

ఇక కట్నం వేధింపులు, చావులు విషయంలో చెప్పనే అక్కర్లేదు.

ఆ విషయంలో ఇంటి కోడలిని వేధించే వారిలో అత్తగారూ, ఆడపడుచుల పాత్ర ఎంతో ప్రధానమైనది. 

ఇక కొందరు కోడళ్ళు కూడా తక్కువ వారేమీ కాదు.

పెళ్ళి అయిన మరుక్షణం నుంచీ ....... ఇక అత్తగారి మీద భర్తకు చాడీలు చెబుతూ భర్తను వారి తల్లిదండ్రులకు దూరం చేయటానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎందరో ఉన్నారు.

ఇక కోడళ్ళు కూడా తమ తల్లి కోప్పడితే అంతగా బాధపడరు ..... అదే అత్తగారు కోప్పడితే సీరియస్ గా తీసుకుంటారు.

ఇక అత్తగారేమో తన కూతురుకు ఒక న్యాయం ....... కోడలికి ఒక న్యాయంగా ప్రవర్తిస్తారు.

అత్తగార్లు తాము ఒకప్పుడు కోడళ్ళమే అనీ......కోడళ్ళు తామూ కాబోయే అత్తలమే అని గుర్తు పెట్టుకున్న రోజున ఇంట్లో అందరికీ సుఖంగా ఉంటుంది.

అత్తాకోడళ్ళ మధ్యన ఈ గొడవలకు అభద్రతా భావం, తన చెయ్యే పైన ఉండాలనే పోటీ మనస్తత్వం ఇలా ఎన్నో కారణాలు.

కోడలికి అత్తగారు, అత్తగారికి కోడలు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది !

ఇవన్నీ కాకుండా కొందరు మగవాళ్ళ వివాహేతర సంబంధ కారణంగా బాధలు పడేది .. మళ్ళీ స్త్రీయే.

ఇలా స్త్రీ కష్టాలకు .. తోటి స్త్రీయే కారణమవుతోంది.

స్త్రీలలో త్యాగమూర్తులూ ఉన్నారు.........తనకు లభించని అదృష్టం ఇంకొక స్త్రీకి లభిస్తే అసూయతో కాపురాలు కూల్చే పడతులూ ఉన్నారు.

సెలెబ్రిటీలు అనే వారి విషయంలో చూస్తున్నాము కదా ! మగవారు భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.

కొన్ని సార్లు భార్య కూడా తాను ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.

ఇలా పిల్లలు పుట్టాక బాధ్యత లేకుండా...... ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.

అలాంటి పిల్లలు వివాహవ్యవస్థ అంటేనే నమ్మకాన్ని కోల్పోతున్నారు.

పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు .. ఇలాంటి పిల్లల సమస్య గురించి కూడా .. గొప్ప సినిమా తీస్తే ఎంతో బాగుంటుంది మరి.

ఇక, పిల్లలను పెంచేది చాలా వరకూ తల్లులే గదా!

వారు పిల్లలను పెంచేటప్పుడు అమ్మాయి అయినా........ అబ్బాయి అయినా సమానమే అని పెంచాలి.

అంతే కానీ ఆడవారిని చెప్పుచేతలలో అణచి ఉంచాలని అబ్బాయికి చెప్పకూడదు.....మగవారిని ద్వేషించేటట్లు అమ్మాయిని పెంచకూడదు.

ఇలా.. స్త్రీలు తోటి స్త్రీలను కష్టపెట్టకపోతే అదే చాలు. స్త్రీల బాధలు చాలా వరకూ తగ్గుతాయి..
................................

*ఇంతకు ముందు కొన్ని టపాలలో కుటుంబాలలో కలతలు రావటం గురించి చెప్పుకున్నాం కదండి.

ఒక 50 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు బయటకు వచ్చి సంపాదించటమనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు సమాజం చాలా మారిపోయింది. ఇంకో 50 ఏళ్ళు అయితే ఇంకెన్ని మార్పులు వస్తాయో !

ఈ రోజుల్లో పెద్దవయసు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కర్మకాలి వాళ్ళు బాత్రూం లో కాలుజారి పడో, లేక పక్షవాతం వచ్చో మంచానికి పరిమితం అయిపోయారనుకోండి. ఈ రోజుల్లో వాళ్ళను చూసే వారే తక్కువ.


భార్యాభర్తలు ఇద్దరూ బిజీ కదా ! ఈ రోజుల్లో చంటి పిల్లలను చూసుకోవటానికి కూడా పెద్దవాళ్ళకు తీరిక లేక పిల్లలను క్రచ్ లలో వేస్తున్నారు.

అది అలా ఉంచితే మీడియాలో వార్తలు చూస్తుంటే వివాహేతర సంబంధాలు, విడాకులు, వివాహవ్యవస్థ విచ్చిన్నమవటం , యువతరంలో సహజీవనం వంటివి పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల పట్ల , ఆఫీసుల్లో పనిచేసే మహిళల పట్ల కొందరు మగవారి వేధింపులు, వీటిగురించి వింటున్నాము.

ఇవన్నీ వింటున్న భార్యలకేమో తమ భర్తల గురించిన బెంగ, భర్తలకేమో తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో తమ పిల్లల గురించిన బెంగ ఉంటుంది.

ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరగటం , అవి విడాకులకు దారితీయటం వింటున్నాము.

ఆడువాళ్ళ మీద జరిగే దాడులు మొదలైన వాటి గురించి ...........

నాకు ఏమనిపిస్తుందంటే, కొంతకాలం క్రిందట అమ్మాయిలకోసం విడిగా పాఠశాలలు, కళాశాలలు ఉండేవి. మళ్ళీ ఆ పద్దతి వస్తే ఈ బాధలు సగమయినా తగ్గే అవకాశముంది.

ఇంకా , చదువుకున్న ఆడవాళ్ళు కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ( ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. )

అందులో పేద, మధ్యతరగతి మహిళలను ఉద్యోగానికి తీసుకోవటం వల్ల వారికి సహాయం చేసినట్లు అవుతుంది.

పరిశ్రమలంటే కుటీరపరిశ్రమలు, జ్యూట్ సంచుల తయారీ, పచ్చళ్ళు, పిండివంటల తయారీ, ( డ్వాక్రా సంఘాలలా ), బట్టలపై అద్దకం, ఫాషన్ టెక్నాలజీ, ..........ఇంకా రైతుల వద్ద పంట కొని ఉదా...వడ్లు కొని బియ్యం అమ్మటం, కందులు కొని కంది పప్పు చేసి అమ్మటం, టమేటో కొని ఎండబెట్టి అమ్మటం( వరుగులు ) ఇలా ఎన్నో చేయవచ్చు.

ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఉండే ఆడవాళ్ళు సాయంత్రం పూట చుట్టుపక్కల పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్పించవచ్చు.

ఆఫీసుల్లో ఆడవారికి నచ్చినట్లు టైమింగ్స్ ఉండవు కదా ! ఎప్పుడో ప్రొద్దున వెళ్ళి రాత్రికి రావలసి వస్తుంది.

అలా కాకుండా మహిళలే స్థాపించిన పరిశ్రమల్లో అయితే వారు తమకు తగ్గట్లు 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.

ఆ విధంగా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో చిన్న క్రచ్ ఏర్పాటు చేసుకుంటే చంటి పిల్లల తల్లులు మధ్యలో ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు.

ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.

ఈ రోజుల్లో వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వంటి కొన్ని రంగాలలో మహిళలు పనిచేయటం అవసరం.

ఈ రోజుల్లో మనుష్యుల్లో పడిపోతున్న నైతికవిలువల గురించి ఎన్నో సంఘటనలు వింటున్నా ................ సమాజం పూర్తిగా పాడయిపోయిందని అనుకోకూడదు.

సంప్రదాయాన్ని పాటిస్తూ, పద్దతిగా ఉండేవారు ఎందరో ఉన్నారు.

సినిమా రంగంలోనే చూడండి. భానుమతి గారు తన హుందా ప్రవర్తన వల్ల ఎంత గౌరవాన్ని పొందారో.

రాజకీయాల్లో ,ఇంకా ఇతర రంగాల్లో కూడా కూడా మంచి పద్దతిగల మహిళలు, పురుషులు ఎందరో ఉన్నారు.



Monday, February 6, 2012

స్వధర్మం మరియు అసమానతలు వంటి కొన్ని విషయాలు............



ఒక వ్యక్తి రాజుగా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు .. ప్రజల రక్షణ , రాజ్య రక్షణ కోసం యుద్ధాలు కూడా చేయవలసి వస్తుంది.
రాజ్యం పైకి శత్రువులు దండెత్తి వచ్చి ప్రజలను హింసిస్తున్నప్పుడైనా రాజుకి యుద్ధం చేయకతప్పదు.

అంతేకానీ, ఇతరులను చంపటం పాపం కాబట్టి, నేను యుద్ధం చేయను అంటే కుదరదు కదా ! అలా తప్పించుకుంటే అది అతని స్వధర్మాన్ని తప్పినట్లవుతుంది.

రాజుగా బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి యొక్క ధర్మం ఏమంటే ..... యుద్ధం చేసి అయినా ప్రజలను రక్షించటం.

యుద్ధం చెయ్యకూడదు అనుకున్నప్పుడు.... రాజు తన బాధ్యతల నుండి తప్పుకొని తనకు ఇష్టమయిన ధర్మాన్ని
స్వీకరించవచ్చు. ఉదా... తపస్సు వంటివి .

కొందరు రాజులు కోరికలు తీరటానికి కొంతకాలం తపస్సు చేసి ( తాత్కాలికంగా రాజ్య బాధ్యతలను ఇతరులకు అప్పగించి ) మరల రాజుగా బాధ్యతలను స్వీకరిస్తారు. ఇది వేరే విషయం.

అయితే , విశ్వామిత్రుడు మహర్షి అయినా కూడా అవసరమైనప్పుడు ..... అంటే మునులను రాక్షసులు హింసిస్తున్నప్పుడు రామలక్ష్మణులకు యుద్ధవిద్యలను నేర్పించారు.


ఇవన్నీ నిశితంగా గమనించితే స్వధర్మం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.

ఇంకా,
ఎవరైనా వ్యక్తి ..శక్తి లేక అసహాయుడై  స్వధర్మాన్ని సరిగ్గా ఆచరించ లేని పరిస్థితిలో..తనకు చేతనైనంత వరకు ఆచరించినా మంచిదే అని నాకు అనిపించింది.

ఇంకా,
నేను ఇంతకుముందు ఒకటపాలో వ్రాసినట్లు పెద్దలు సమాజంలోని అన్ని బాధ్యతలనూ విభజించి అందరికి అప్పగించారు.

అందరూ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే సమాజం సాగేదెలా ? అందుకే బ్రాహ్మణులకు దైవపూజ,ఇంకా కొన్ని బాధ్యతలు, క్షత్రియులకు రాజ్యరక్షణ
ఇంకా, కొన్ని బాధ్యతలు,... అప్పగించారు.


శూద్రులు బ్రాహ్మణులకు వలె ఎక్కువగా పూజలు చెయ్యకపోయినా, శూద్రులు తమ స్వధర్మాన్ని చక్కగా పాటించినా చాలు.... తేలికగా దైవకృపను పొందుతారు అని చెప్పారు. ఉదా...ధర్మవ్యాధుని కధ....
అయితే అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు.

కర్మసన్యాస యోగము లో ...18 వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారో చదవండి.


**********************

ఒక వ్యక్తికి అతని అర్హతలు, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు నిర్ణయించబడటం సరైనదే అయినప్పుడు ........,

..ఒక వ్యక్తి చేసిన పాపపుణ్య కర్మల ఆధారంగా మరు జన్మ  నిర్ణయించబడటం..కూడా
సరైనదే కదా !

ఆస్తికులు తాము చేసిన కర్మల ఆధారంగానే వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. అందుకని ఆస్తికులతో ప్రాబ్లం లేదు. వారి పుట్టుక ఎలంటిది అన్నది.. వారు క్రితం జన్మలో చేసిన కర్మ ద్వారానే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో ఆస్తికులు బాధపడకూడదు.


పుట్టుక ఎలాంటిదయినా తమ సత్కర్మలతో దైవాన్ని మెప్పించి కష్టాలను పోగొట్టుకున్న భక్తులెందరో ఉన్నారు.

నాస్తికులు పాపపుణ్యాల ఆధారంగా వచ్చే జన్మపరంపరను నమ్మము అంటారు. అందరూ సమానమే కదా ! అంటారు. వారి మాటలకు చేతలకు పొంతన ఉండదు. 
 
అందరూ సమానమే అనే వారు .. రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?


ఒక డాక్టరుకు, ఒక నర్సుకు ఒకే రకం హోదా , జీతభత్యాలు, ఇస్తే ఒప్పుకుంటారా ?
ఎందుకంటే ఒక డాక్టరు వైద్యం చేస్తూ కష్టపడినట్లే , ఒక నర్సు రోగుల సేవలో కష్టపడతారు.

టార్గెట్ రీచ్ అవటం అనే టెన్షన్ ఒక ఉన్నత స్థాయి ఉద్యోగికి ఉంటుంది. క్రింది స్థాయి ఉద్యోగికి ఉంటుంది. కానీ, వారి హోదా జీతభత్యాలలో ఎంతో తేడా ఉంటుంది.

సమాజంలో ఎందరో పేదలుండగా .. కొందరు ధనికులు కోట్లాది రూపాయల సంపదను తరతరాలకు సరిపడా ప్రోగుచేసుకుంటున్నారు. ఈ పాపాలకు వాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టినా ఆశ్చర్యం లేదు.

లక్షలాది రూపాయలు విలాసాలకు .. అంటే ఆభరణాలు, కార్లు, బంగ్లాలు కొనటానికి ఖర్చుచేస్తుంటారు.


ఇలా.. డబ్బున్న వాళ్ళు, లేనివాళ్ళ మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి.

డబ్బున్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

మనుషులందరి కష్టం ఒకటే.

అలాంటప్పుడు సంపద, హోదా, జీతభత్యాల విషయంలో ఇన్ని అసమానతలు ఉండకూడదు కదా !

ఎర్రని ఎండలో, వానలో, చలిలో పనిచేసే కూలీకి రోజుకి 100 రూపాయల ఆదాయం వస్తే ఏసీ గదిలో పనిచేసే ఉద్యోగికి రోజుకి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. కూలీకి మరుసటి రోజు పని దొరుకుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు..

ఈ ఆర్ధిక అసమానతలను సరిదిద్దినప్పుడే మనుషుల మధ్య అసమానతలు తగ్గుతాయి..


************************

పెద్దలు అంటరానితనాన్ని పాటించమని చెప్పలేదు. ఇది ప్రజల తప్పే.


కొందరు స్వార్ధపరులైన వాళ్ళు , ఇంకా కొందరు తెలిసీతెలియని వాళ్ళ వల్ల ఇలా అసమానతలు పెరిగాయి.


పెద్దలు కులాల మధ్య అసమానతలను కల్పించలేదు.ఏ వృత్తిలో ఉండే కష్టాలు వారికున్నాయి.


బ్రాహ్మణులకు ఎక్కువ భాగం పూజలు చేయటం , ఎన్నో నియమనిష్ఠలు , చెప్పారు. ( ఇవన్నీ పాటించటం చాలా కష్టం. ) వీరికి కుటుంబానికి సరిపడా సంపాదించుకోవటానికి కూడా సమయం చాలదు.



అందుకే పూజలు, వ్రతాలు చేయించుకునేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటాన్ని ఆచారంగా ఏర్పాటు చేసారు. కొందరు సంపన్నులు బోలెడు ఖర్చుపెట్టి పూజలు చేయించుకుని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చే విషయంలో బేరాలాడతారు. అలా వచ్చిన కొద్ది చాలీచాలని డబ్బుతోనే జీవించే బ్రాహ్మణులెందరో ఉన్నారు.



రాజుల విషయంలో అయితే ఎప్పుడు ఏ యుద్ధంలో మరణిస్తారో అనే ప్రమాదం పొంచి ఉంటుంది. . వారి కుటుంబానికి ఎప్పుడూ శత్రు భయమూ, విషప్రయోగ భయాలే.


శూద్రులకు సంఘంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఉన్నంత హోదా లేకపోయినా జీవితంలో స్వేచ్చ ఉంది.


శూద్రులకు బ్రాహ్మణులకు లాగా నియమనిష్ఠలు పాటించనవసరం లేదు. క్షత్రియులకు లాగా యుద్ధాలు, శత్రుభయం ఉండదు. ( కొద్దిమంది సైనికులకు తప్ప ) ఇలా అన్ని వృత్తులలోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి.


.వస్తూత్పత్తి , వాటిని విక్రయించటం అనే పనులను వైశ్యులు, శూద్రులు నిర్వహించేవారు.

శూద్రులు కూడా సమాజంలో అందరికీ కావలసిన వస్తువులను తయారుచేసి అందిస్తూ వారూ ఆర్ధికంగా మంచిగానే జీవించి ఉంటారు .
 
.ఇలా ఎవరి బాధ్యతను వారు నిర్వహిస్తూ అందరూ చక్కగా జీవించేవారు అనిపిస్తుంది.

వర్ణవ్యవస్థ వంటివి సున్నితమైన అంశాల గురించి . మరీ ఎక్కువగా చర్చించటం బాగుండదేమో అని నాకు అనిపిస్తోంది. నా అభిప్రాయములు నచ్చిన వారికి, నచ్చనివారికి అందరికి కృతజ్ఞతలండి.

వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను..