koodali

Monday, September 3, 2012

ముహూర్తాలు....సత్కర్మాచరణ.

 ఓం.

లోకహితం  కోరి  దైవం    జ్యోతిషశాస్త్రాన్ని    లోకానికి  అందించారు.     అయితే,  చక్కటి    ముహూర్తాలలో  పనులు  ప్రారంభించాలన్నా    దానికి    ఎంతో  అదృష్టం,    పూర్వపుణ్యం  ఉండాలని,   సత్ ప్రవర్తన   అర్హతగా  ఉన్నవారికే   అన్నీ  కలిసివస్తాయి    అని   అనిపిస్తుంది.


  ఈ  రోజుల్లో  కొందరు   అదేపనిగా    పాపాలు  చేస్తూ   కూడా   ,  తమ  జీవితాలు  బాగుండాలనీ,  ఏదైనా  పని  ప్రారంభించే  ముందు     గొప్ప  ముహూర్తాల   కోసం     తాపత్రయపడటం    జరుగుతోంది.


  కానీ,   పాపాలను  చేసే   వ్యక్తులు   మంచి  ముహూర్తం  కోసం  ఎంత  తాపత్రయపడినా   ఆశించిన  ఫలితం  దక్కదు.   చేసుకున్నవారికి  చేసుకున్నంత  మహాదేవా  అన్నట్లు ,  ఎవరికెంత  ప్రాప్తమో  అంతే  దక్కుతుందట.  

  
 పాపాలు  చేసేవారు   గొప్ప  పండితుల  వద్ద  ముహూర్తం  పెట్టించుకున్నా  కూడా ,   దైవవశాన  ,  ఆ  పండితుల   నోట  కూడా  ( వారికి   తెలియకుండానే)    ఏదో  ఒక  దోషం  ఉన్న  ముహూర్తమే  వస్తుంది.   ఒకవేళ  మంచిముహూర్తమే  పండితులు  వ్రాసినా   కూడా,      ఏదో  విధంగా   ఆ  శుభముహూర్తం  తప్పిపోయే  అవకాశం  ఉంది.     (ఉదా  ... గడియారం  తప్పు  సమయాన్ని  చూపించటం.....   .వంటివి . )


మంచివ్యక్తులకు    ముహూర్తం    చూడటానికి     కుదరకపోయినా  కూడా   ,  వారికి    తెలియకుండానే  చక్కటి  ముహూర్తం  ఉన్న  సమయంలోనే   వారు  పనులు  ప్రారంభించే  విధంగా  దైవం  అవకాశాన్ని  కలిగిస్తారు. 


 ఏ జాతకాలూ    తెలుసుకోకపోయినా    చెడుపనులకు    దూరంగా ఉంటూ,    సత్ప్రవర్తనను    కలిగిఉండి    దైవంపైన    భారం వేసి    జీవించే    వ్యక్తికి    దైవమే    సరియైన   దారిని   చూపిస్తారు.

....................
ముహూర్తాల  గురించి    పురాణేతిహాసాల్లో  చక్కటి  ఉదాహరణ  ఉంది.    అది  ఏమిటంటే.....

  రావణాసురుడు  ఎంతో  పాండిత్యం  తెలిసిన  వ్యక్తి  అంటారు.   అతనికి   జ్యోతిషం  గురించి  కూడా  బాగా  తెలుసట.  తన    సంతానం    బాగుండాలని  భావించి,  వారిపట్ల  నవగ్రహాలు  శుభంగా  మాత్రమే  ఉండాలని  అనుకోగా....  


   సూర్యదేవుని  పుత్రుడైన    శనిదేవుని  కోపం    వల్ల ,   ఇంద్రజిత్తు  జాతకం    చెడ్డగా   మారిపోయిందని  అంటారు.

 రావణుడు  దేవతలను,  మునులను ,   మంచి  వారిని   .... బాధించటం  చేస్తుండేవాడు.   ఒకసారి  దేవతలతో  జరిగిన  యుద్దంలో  గ్రహాలను  కూడా  బంధించి  తెచ్చి  తన  రాజ్యంలో    ఉంచాడట.  


 (   భగవాన్  శ్రీరామ  భక్తుడైన  భగవాన్ హనుమంతులవారు   గ్రహాలను   విడిపించగా,  వారు    ఎంతో  సంతోషించారట.  అందువల్ల   శనివారం  నాడు  హనుమంతుని  పూజించిన   వారిని   శని   బాధించరని   అంటారు.   సూర్యుడు  హనుమంతునికి  గురువు.  ) 
 

   రావణాసురుని  కధ  ద్వారా    ఏమి  తెలుస్తుందంటే,     ఎన్ని  పూజలు  చేసినా   పాపాలు  చేసేవాళ్ళకు  దైవం  సహకరించరు  అని,  అలాంటి  వారికి    మంచి  ముహూర్తాలు   కూడా    దొరకవు .....   అని  తెలుస్తుంది.  

 ఇవన్నీ  గమనించితే..... దైవకృపను  పొందాలంటే ,   పూజలు  చేయటంతోపాటూ  సత్ప్రవర్తన   కూడా    ఎంతో   ముఖ్యమని    తెలుస్తోంది.


ఈ  రోజుల్లో  కూడా  కొందరు  .  ఒక  చేత్తో  పాపాలూ  ....... ఒక  చేత్తో  పూజలు    చేస్తూ     దైవాన్నే  మోసం  చేయాలని  చూస్తున్నారు  . రావణాసురుడంతటి  వాని    ఆటలే  సాగలేదు.   ఇక     ఈ  నాటి   పాపాత్ముల     అతితెలివి     ఎందుకూ  పనికిరాదు. 
 

  తల్లితండ్రులు    తమకు  పుట్టబోయే  సంతానం  మంచి  ముహూర్తంలో  జన్మించాలని,  వారి  భవిష్యత్తు  బాగుండాలని    ఎంతో  తాపత్రయపడతారు.  తమ   సంతానం  యొక్క  భవిష్యత్తు  బాగుండాలని  తల్లితండ్రులు  ఆశపడటం  సహజమే.

  అయితే,     చక్కటి  భవిష్యత్తు  కలిగిన  సంతానం  కలగాలన్నా,  చక్కటి  ముహూర్తాలు  కలిసి  రావాలన్నా  ..... పెద్దవాళ్ళు  చక్కటి  నైతికవిలువలతో  కూడిన  జీవితాన్ని    కలిగిఉండాలి.     కనీసం   సత్ప్రవర్తన  కొరకు   సాధ్యమయినంత  వరకు    ప్రయత్నించాలి.  
..............................

కొంతకాలం  క్రిందట  మేము  ఒక   ఉరిలో  ఉన్నప్పుడు  మాకు  తెలిసిన    ఒకరికి  సంతానం  లేరు.  కొంతకాలానికి  ఆమె    గర్భం  ధరించింది.   వారు  ముందే  డెలివరీ  కోసం  మంచి  ముహూర్తాన్ని  కూడా    చూసి  పెట్టుకున్నారు. 



 ఇక  వారం  రోజుల్లో  డెలివరీ  ఉందనగా  దురదృష్టవశాత్తూ   తల్లి    మృతశిశువును  ప్రసవించింది.   పెద్ద పేరున్న    డాక్టర్లు  ఎంత  ప్రయత్నించినా  బిడ్డను  రక్షించలేకపోయారు.  పాపం  ఆ  తల్లిదండ్రులు    ఏ  జన్మలో  చేసుకున్న  పాపఫలితం  వల్లో    అలా  జరిగి  ఉంటుంది. 
 

ఇలాంటివి  గమనిస్తే  ముందే  అనుకున్న   ముహూర్తంలో  చక్కగా  పని  జరగాలన్నా  దైవానుగ్రహం  ఉండాలని  తెలుస్తుంది.  దైవానుగ్రహం  ఉండాలంటే    వ్యక్తులకు  పూర్వపుణ్యం  ఉండాలి.  పూర్వపుణ్యం  ఉండాలంటే  సత్కర్మలు  చేసి   ఉండాలి. 


    ఎట్లా  చూసినా , దైవకృపను  పొందాలంటే  సత్కర్మాచరణే  మానవుల  కర్తవ్యమని  స్పష్టమవుతుంది. 

 మాకు  తెలిసిన  ఇంకొక  ఆమెకు    ఒక  గర్భాన్ని   కోల్పోవటం  జరిగితే ,     తరువాత   నాగేంద్రస్వామిని   ఆరాధించటం,   దైవానికి   పుట్టలో  పాలు  పోయటం  చేసారు.   కొద్దికాలంలోనే   వారికి     చక్కటి  అబ్బాయి  పుట్టటం  జరిగింది.  నాగులచవితికి  భక్తిగా  పుట్టలో  పాలు  పోసిన  ఆమె  ఒక  లేడిడాక్టర్.



అంతా  దైవం  దయ.  వ్రాసిన   విషయాలలో ఏమైనా పొరపాట్లు  ఉంటే   దయచేసి   క్షమించాలని   దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 


ఈ బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి    అనేక    కృతజ్నతలండి .



12 comments:

  1. బాగా చెప్పారండి.

    కాని ఒక్క విషయం ఎమిటంటే .. ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు. పాపులు ఎన్ని పాపాలు చేసినప్పటికి, వాళ్ళూ సుఖాలని అనుభవిస్తున్నారు. మంచి వాళ్ళు కూడా కొన్ని సార్లు కష్టాలు పడుతున్నారు. చరిత్ర చూసినట్టయితే .. ఏసుక్రీస్తు కి సిలవ వేశారు. సూర్దాస్ జీవితాంతం గుడ్డివాడిగానె ఉన్నాడు. రవిదాస్ చెప్పులు కుట్టుకుని బ్రతికాడు. గాంధి ని కాల్చి చంపారు.

    అలాగే హిట్లర్ చివరి దాకా ఎన్నో పాపాలు చేసాడు, అయినా రాజ భొగాలు అనుభవించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు..అది కూడా పాపమే. సత్కర్మాచరణ వలన పాపభారం అధికం కాకుండా చేసుకుని, తద్వారా తదుపరి జన్మలలో కష్టాలను తప్పించుకొనవచ్చును. జన్మలే లేకుండ చేసుకొనటానికి కూడా ఇది ఎంతో అవసరం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      సత్కర్మాచరణ వలన పాపభారం అధికం కాకుండా చేసుకుని, తద్వారా తదుపరి జన్మలలో కష్టాలను తప్పించుకొనవచ్చును. జన్మలే లేకుండ చేసుకొనటానికి కూడా ఇది ఎంతో అవసరం. ......చక్కగా చెప్పారు. మీరు చెప్పింది నిజం.

      అయితే, ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు ..అనుకోవటం పొరపాటు.

      జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా ... చెడ్డ పనులు చేయకుండా , దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా ......రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

      పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.

      షిరిడి సాయిబాబా ... భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ,..... ఆ జాతకాలను ప్రక్కన పెట్టి... తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.

      Delete
    2. మీ కామెంట్ చాలా వివరంగా బాగున్నది. మీ పాత పోస్ట్ లో కామెంట్ ప్రకారం(http://aanamdam.blogspot.in/2012/08/matter-and-energy-cannot-be-created-or.html)..మనస్తత్వాలు జన్మ జన్మ కి వారి పూర్వ కర్మల వలన మారిపోతుంటాయి. కొందరికి మంచి మన్స్తత్వం .. ఇంకొందరికి చెడ్డ మనస్తత్వం.చెడ్డ వారిని మంచిగా మార్చటం దుస్సాధ్యం, గొప్ప మహాత్ములకి తప్ప.

      కాబట్టి సత్కర్మాచరణ మంచి వారిలోనే ఉంటుంది.

      Delete

    3. కొందరు లోకహితం కోసం తాము కష్టాలను భరిస్తారు.

      ఏసుక్రీస్తు ఇతరుల సౌఖ్యం కోసం ( లోకహితంకోసం ) తాను బాధలను భరించారు.

      శివుడు లోకహితం కోసం తాను గరళాన్ని కంఠంలో భరించారు.

      విష్ణువు లోకహితం కోసం రాక్షసులను సంహరించే క్రమంలో భృగు శాపాన్ని పొంది ఎన్నో అవతారాలను ( జంతుజన్మలను కూడా ) ధరించవలసి వచ్చింది. రామావతారంలో సతీవియోగాన్నీ అనుభవించవలసివచ్చింది.

      ఈ రోజుల్లో కూడా షిర్డి సాయి తన భక్తుల కష్టాలను తాను భరించారంటారు. ఒక చిన్న శిశువును రక్షించటం కోసం తన చేయిని మంటలో పెట్టారు. తాత్యా కు బదులు తాను ప్రాణత్యాగాన్ని చేసారంటారు.

      మహా భక్తులైన సూర్ దాస్, రవిదాస్ వంటివారు జీవితంలో కష్టాలను అనుభవించినా వారు దైవకృపకు పాత్రులయ్యారు. వారు దైవారాధనలో ఆనందాన్ని పొందిఉండవచ్చు.

      శ్రీకృష్ణ బలరాములు, తమ గురువైన సాందీపని గారి చనిపోయిన పుత్రులను కూడా తిరిగి బ్రతికించి ఇచ్చి వారికి సంతోషాన్ని కలిగించారు.

      భారత యుద్ధం తరువాత శ్రీ కృష్ణుడు పరీక్షిత్తును తిరిగి బ్రతికించారు. కానీ, అభిమన్యుని రక్షించలేదు. ఇలా చేయటం వెనుక గల కారణాలు భగవంతునికే తెలియాలి.

      ఇలా ఎందరో త్యాగధనుల జీవితాలను గురించి తెలుసుకుని , వారి స్పూర్తితో గాంధీజీ , సుభాష్ చంద్ర బోస్, . భగత్ సింగ్, .......వంటి ఎందరో వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసారు.



      Delete

    4. కొందరు గొప్పవారు కూడా కొన్ని కారణాల వల్ల కష్టాలను అనుభవించవలసి వస్తుంది.....ఉదా...ధర్మరాజు జూదంలో రాజ్యాన్ని కోల్పోయారు.

      కొందరు ఈ జన్మలో మంచిగా ఉన్నా , గత జన్మలో పాపాలను చెయ్యటం వల్ల కష్టాలను అనుభవించవలసి వస్తుంది ఉదా...... ....భీష్ముడు.

      ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం నడిపించిన పురాణేతిహాసాలలోని ఎన్నో పాత్రల ద్వారా ....ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని .....లోకానికి దిశానిర్దేశం జరిగింది అనిపిస్తుంది.
      ...............

      ఇతరుల జీవితాల్లోని పైపై మెరుగులు చూసి వారు సుఖంగా ఉన్నారని మనం భ్రమపడతాము.

      హిట్లర్ లేక దుర్యోధనుడు లేక రావణాసురుడు వంటివారు రాజ్యభోగాన్ని అనుభవించినట్లు పైకి కనిపించినా అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు జీవితంలో ఏమాత్రం మనశ్శాంతినీ పొందలేరని పెద్దలు తెలియజేసారు.

      రావణాసురుడు, దుర్యోధనుడు లాంటివారు తాము చేసిన పాపాల ఫలితంగా తమ సంతానాన్ని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలనూ కష్టాల పాలుచేసారు.

      సీతారాములు కష్టాలను అనుభవించినా కూడా వారి సంతానం చక్కగా ఉండి రాజ్యపాలన చేసారు.

      ఇందరి జీవితాలు చూసిన తరువాత ఏమనిపిస్తుందంటే, ..... ధర్మబద్ధంగా జీవించటం , సాధ్యమయినంతవరకు అలా జీవించటానికి ప్రయత్నించటము ..... మనిషి కర్తవ్యం అని అనిపిస్తుంది. .... ఎవరికి తగ్గ ఫలితాన్ని వారికి దైవమే ప్రసాదిస్తారు.

      మంచి కర్మకు మంచి ఫలితము.........చెడ్డ కర్మకు చెడ్డ ఫలితము.... లభిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు...... ఇది దైవం ఏర్పరిచిన ధర్మనిర్ణయం.

      మంచి వాళ్ళు తమ పూర్వ కర్మ ఫలితంగా వర్తమానంలో కష్టాలను అనుభవిస్తున్నా , వారు ఇప్పుడు ఆచరించే మంచిపనుల యొక్క ఫలితాలు ఎక్కడికీ పోవు . మంచి ఫలితాలనూ తప్పక పొందుతారు.

      దైవం దృష్టిలో అన్ని జీవులు సమానమే. కానీ వారివారి కర్మలను బట్టి నడిపిస్తూ , మోక్ష మార్గాన్ని గుర్తు చేస్తూ ..... చివరికి అందరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు.

      వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


      Delete
    5. అవునండి, నేను ఆ వ్యాఖ్యలో .....

      * ఆత్మ తిరిగి జన్మను ధరిస్తుందని పెద్దలు తెలియజేసారు. అని,......ఇంకా,

      * బిడ్డ జన్మించక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు , ఆ బిడ్డకు తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తు వస్తాయట. తాను క్రితం జన్మలో చేసిన పనులను తలుచుకుని , మళ్ళీ గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తున్నందుకు బాధపడుతుందట. మళ్ళీ జన్మ ఎత్తిన తరువాత ఇక పాపాలు చేయకూడదని అనుకుంటుందట. కానీ, మాతృగర్భం నుంచి బయటపడ్డాక గత జ్ఞాపకాలను మర్చిపోతుందట.

      * మరణించిన వ్యక్తుల జీవాత్మలకు కూడా గత జ్ఞాపకాలు గుర్తుంటాయని పెద్దలు చెబుతారు.. ..... అని వ్రాసాను
      .......................

      * చెడ్డవాళ్ళూ కొన్ని మంచి పనులను చేస్తారు.

      * మంచి వాళ్ళూ కొన్నిసార్లు పాపాలను చేస్తారు.

      * అందరూ దైవం యొక్క బిడ్డలే కాబట్టి, అందరూ మంచిదారిలో నడవాలని దైవం ఆశిస్తారు.

      * చెడ్డ దారిలో నడిచే వారికి కష్టాలను కల్పించి అయినా , దైవం మంచి దారిలోకి తీసుకువచ్చి వారితో సత్కర్మలను చేయిస్తారు.

      Delete
  2. నిజమేనండి. సత్ప్రవర్తన ఎంతో ముఖ్యం. మంచి పోస్ట్.
    అబినందనలండి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. manchi post..
    abhinandanalu meeku...
    @sri

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  4. మీ పోస్టులో మీరు చెప్పకనే చెప్పారు.మనం ఎంత పండితులచేత ముహూర్తాలు పెట్టించుకున్నా మన పూర్వ జన్మ సుకృతం లేక పోతే కలిసి రాదని.ఈ ముహూర్తాలకి అర్థం లేదు.చేయబోటేది మంచి పనా కాదా అని మాత్రమే ఆలోచించాలి.అంతే. మంచి పనులు చేయడానికి ఏ ముహూర్తాలు అక్కర లేదు.సృష్టిలో చెడు పనులున్నాయి కాని చెడు ముహూర్తాలంటూ ఏమీ లేవు.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృఅతజ్ఞతలండి.

    * మనం ఎంత పండితులచేత ముహూర్తాలు పెట్టించుకున్నా , మన పూర్వ జన్మ సుకృతం లేక పోతే కలిసి రాదన్నది నిజమేనండి.

    * అయితే , పూర్వ జన్మ సుకృతం లేకపోయినా , ఇప్పుడు పాపకర్మలు చేయకుండా పట్టుదలగా సత్కర్మలు చేయటం వల్ల , గతజన్మ పాపకర్మ ఫలితాలు బలహీనపడి , మంచి జరిగే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుందండి.

    * మంచి పనులు చేసేవారు ముహూర్తాలు చూసినా చూడకపోయినా, వారికి మంచే జరిగే మాట నిజమే అయినా, మంచి ముహూర్తం చూసుకుని, దేవతలను, గ్రహదేవతలను పూజించి పనులను ప్రారంభించటం వల్ల మరింత మంచి జరిగే అవకాశం ఉందనిపిస్తుందండి.

    ReplyDelete