koodali

Friday, September 30, 2011

భక్తి యోగము లోని కొంత భాగము.....2

ఓం.

ఓ అర్జునా ! ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి , నన్నే పరమగతిగ దలంచిన వారై అనన్యచిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను.


నా యందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.


ఓ అర్జునా ! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నా యందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తఱి అభ్యాస యోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము.
( అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము. )


ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీవసమర్ధుడవైతివేని నా సంబంధమైన కర్మల జేయుటయందాసక్తి గలవాడవు కమ్ము. అట్లు నా కొఱకు కర్మలను జేయుచున్నను గూడ నీవు మోక్షస్థితిని బడయగలవు..


(.
వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..)


Wednesday, September 28, 2011

భక్తి యోగం లోని కొంత భాగం .....1

ఓం.

దివ్యమైన దసరా నవరాత్రులు ఆరంభమయ్యాయి. ఇంతకు ముందు దసరా నవరాత్రుల సందర్భంగా పెద్దలు తెలిపిన అమ్మవారి దివ్యమైన కధలు బ్లాగులో వ్రాయటం జరిగిందండి.

ఈ సారి శ్రీకృష్ణపరమాత్మ బోధించిన
భగవద్గీత యందలి భక్తి యోగం లోని కొంత భాగం .....

పెద్దలు తెలిపిన తాత్పర్యము ........

భక్తి యోగము.

అర్జున ఉవాచ.........

ఈ ప్రకారముగ ఎల్లప్పుడు నీ యందే మనస్సును నెలకొల్పినవారై ఏ భక్తులు నిన్నుపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరము కాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆ యిరుతెగలవారిలో యోగమును బాగుగా నెరిగిన వారెవరు ?


శ్రీ భగవానువాచ.........

నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై ( తదేకనిష్ఠులై ) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా యభిప్రాయము.


ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి ( స్వాధీనపరచుకొని ) ఎల్లెడల సమభావము గలవారై, సమస్త ప్రాణులకును హితమొనర్చుట యందాసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింప నలవికానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియునగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.


అవ్యక్త ( నిర్గుణ ) పరబ్రహ్మమునందాసక్తి గల మనస్సు గలవారికి బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగుణోపాసకుల కంటె ) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన, నిర్గుణోపాసనామార్గము దేహాభిమానము గలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది.


వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నా
నండి..

 

Monday, September 26, 2011

ప్రక్కవారు అత్యంత ఆత్మీయుల్లా అనిపించినా, ఆగర్భ శత్రువుల్లా అనిపించినా కారణం ఏమిటో ?

*ధ్రువ ప్రాంతంలో ఒంటరిగా చిక్కుకుని ఉన్న మనిషికి మరో మనిషి కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. ఆ మనిషి ఏ దేశస్తుడు అని ఆలోచన రాదు.

విదేశాల్లో ఉన్నప్పుడు మన దేశం వ్యక్తి కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది. వారు ఏ రాష్ట్రం వారు అయినా సరే.

ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నప్పుడు మన రాష్ట్రం వారు కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది. వారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే.

ఇతర జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లా, మన ఊరు వారు , మన బంధువులు కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే .. దీనికి వ్యతిరేకంగా ... ఒకోసారి ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితీ ఉండవచ్చు.

ప్రక్కవారు అత్యంత ఆత్మీయుల్లా అనిపించినా, ఆగర్భ శత్రువుల్లా అనిపించినా కారణం ఏమిటో ?

* అలా అనిపించటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

అందులో ఒకటి ,ఆత్మీయతల కన్నా ఆర్ధిక సంబంధాలకే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా !

కొందరు అంటుంటారు. ప్రపంచం చిన్నదిగా కుగ్రామంలా అయిపోయిందండి. అందరం ఒకటే అని.

నిజమే , కానీ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య జనాలు గొడవలు పడుతూనే ఉన్నారు.

* ఆధునిక రవాణా సదుపాయాల వల్ల ప్రపంచం కుగ్రామంలా దగ్గరగా అయిన మాట నిజమే.

* కానీ, మనుష్యుల మనస్సుల్లో ఆ దగ్గరితనం ఉందా అని ?

రాష్ట్రంలో ఉద్యమాలు స్ఫూర్తిదాయకంగా సాగుతున్నాయి.

ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యమాలు వస్తే ?

* ఉదా... ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర, మన్యసీమ,

* ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, ఉత్తరాంధ్ర.....వగైరాలు.

ఇలా రావని గ్యారంటీ ఏమీ లేదు కదా !.

* ఎవరు ఎంతకాలం కలిసుంటారో ? ఎప్పుడు విడిపోతారో ?

* ఎవరు స్థానికులో ? ఎవరు వలసవాదులో ? ఇవన్నీ జవాబులు దొరకని ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి.,

* వీటన్నిటి మధ్యన దిక్కుతోచని సామాన్యుల జీవితాలు.

ఈ సమస్యలు లేకపోయినా కూడా పేదరికం గురించి , సామాన్య ప్రజల సమస్యల గురించిన పనులు నత్త నడకగా సాగుతుంటాయి. ఇక ఇప్పుడు చెప్పేదేముంది.

ఇదంతా కళ్ళప్పగించి చూడ్డం మినహా సామాన్యులు చేయగలిగిందేమీ కనిపించటం లేదు.

* ఇంట్లో పిల్లలు వాళ్ళలో వాళ్ళు తిట్టుకుని గొడవలు పడుతుంటే వారి పెద్దవాళ్ళకు చాలా బాధగా ఉంటుంది కదా !.

* ఎప్పటికైనా అన్నిటికి దైవమే దిక్కు.


Saturday, September 24, 2011

శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధములోని విషయములు.



హరి వినాయక సాఠే

సాఠే యనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. ఇంక మరికొన్ని విషయములతనిని చీకాకుపరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను: విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడచి చాలా దూరము పోవలెననుకొనెను.


మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్ధించును. వాని పాపకర్మములు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహా నిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు శిరిడీకి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో శిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై, నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను.



అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను :బాబా గురు చరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు ,అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుఋరుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి, గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమె గదా యనుకొనెను.



ఆ మరుసటి దినమా దృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము చేయవలెనో కనుగొనుమనెను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబు బాబాను ఇట్లడిగెను. " ఓ దేవా ! యీ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి ?అతడూరుకొనవలెనా లేక యింకొక సప్తాహము చేయవలెనా? అతడు అమాయిక భక్తుడు: అతని కోరిక నెరవేరవలెను.అతనికి దృష్టాంతార్ధమును బోధించవలెను.వానినాశీర్వదింపు"డన బాబా" అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంధమునే జాగ్రత్తగా పఠించినచో,నాతడు పావనుడగును: మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును." అనెను.


ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి , బాబా కాళ్ళనొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను. " సాఠే యొక్కవారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా ? నేను నలుబది సంవత్సరములనుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదా ! అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరముల నుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి ?చాతక పక్షి మేఘము నుంచి పడు నీటిబిందువులకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొనియున్నాను. "ఈ యాలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు. అంతియే గాక , చెడ్డ యాలోచనలను అణచుచు , మంచి యాలోచనలను ప్రోత్సహించువారు.


హేమాడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు ?


హేమాడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు వచ్చెను.అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటికి వచ్చి హేమాడ్ పంతు నిట్లడిగెను. " మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడయేలయున్నారు ? మీరు మసీదునుండి వచ్చుచున్నట్లున్నదే ! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు ?మీరొంటరిగా వచ్చినారేల ?కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడెదము. " ఇట్లనుచు నతడు లోపలికి పోయెను.


హేమాడ్ పంతు ముందర వసారాలో గూర్చొనెను. కిటికీలో 'నాధభాగవత ' మనుప్రసిద్ధ మరాఠీ గ్రంధముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కందమునకు ఏకనాధుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము శిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము ' నానార్ధదీపిక ' లేదా జ్ఞానేశ్వరి ( శ్రీ కృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ )నాధభాగవతము, ( శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ ) భావార్ధ రామాయణమును, నిత్యము చదువుతుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి , అటుపైన వారిని ఆ గ్రంధముల పురాణ కాలక్షేపము వినుమనుచుండెను. ఈ గ్రంధములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంధములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడ నిత్యము నాధభాగవతమును పారాయణము చేయువాడు.

ఆ దినము చదువు భాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలో నున్న నాధభాగవతమును తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా యచ్చటికి పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.


హేమాడ్ పంతు....నేను బాబా వద్దనుండి యొక వార్త తీసికొని వచ్చినాను. నీ వద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి యున్నారు.కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడి పిమ్మట మసీదుకి రమ్మని యన్నారు.


శ్యామా..( ఆశ్చర్యముతో ) నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసికొని బాబా వద్దకు వెళ్ళుము.


హేమాడ్ పంతు...సరే నీ నమస్కారములామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును, కధలును చెప్పుము.

శ్యామా ...అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని ( బాబా ) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరువాడను :నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చినతరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను ? సరే యీ తమలపాకులు, వక్క, సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలికి బోయి దుస్తులు ధరించి వచ్చెదను.


కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియెను. " ఈ భగవంతుని ( బాబా ) లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతు లేదు. వాని నెవరు గమనించగలరు ? వారీ లీలలతో వినోదించునట్లగుపడినను వారు వానినంటినట్లు కనిపించరు. మావంటి జానపదులకేమి తెలియును ? బాబాయే యీ కధలనెందుకు చెప్పరాదు ?మీ వంటి పండితులను నా వంటి మూర్ఘుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. " ఈ ఉపోధ్ఘాతముతో శ్యామా యిట్లనెను ' నాకొక కధ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో
;బాబా యంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినపరీక్ష చేసినపిమ్మట వారికి ఉపదేశము నిచ్చును.( ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము.)

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమాడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తననచ్చటకు పంపియుండునని యనుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని , శ్యామా చెప్పుకధలను వినుటకు సిద్ధపడెను. ఆ కధలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కధను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్

రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాబా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి శిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయమును చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో నుపవాసమునుండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడురోజులవరకు మానివేసెను.

ఆమె పట్టుదలకు నేను ( శ్యామా )భయపడి యామె పక్షమును బాబాతో నిట్లంటిని. " దేవా ! మీరేమి ప్రారంభించితిరి ? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి యున్నది. ఆమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొని యున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము. " ఆమె మనోనిశ్చయమును జూచి , బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.

" ఓ తల్లీ ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు ? నీవు నిజముగా నా తల్లివి ; నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా వినినచో నీకది మేలు చేయును.


నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాల కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు. వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండుపైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని." మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల ? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు ?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది ?వారు కోరిన రెండు కాసులు. 1. దృఢమైన విశ్వాసము. 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని. వారు సంతోషించిరి.

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానినెట్లు వర్ణించగలను ? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు , వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దరమానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు యెల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి ( ఓపిక ) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని.


ఈ ప్రపంచమనే సాగరమును ఓపికయను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుష లక్షణము. అది పాపములన్నిటిని తొలగించును; కష్టములను పారద్రోలును. అనేక విధముల అవాంతరముల తొలగించి , భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ ( నమ్మకము ), సాబూరి ( ఓపిక ) అన్యోన్యము ప్రేమించు అక్కచెల్లెండ్రవంటివారు.


నా గురువు నానుండి యితరమేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలగలేదు.వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను కూడ మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున యుండును. బిడ్డ తాబేలు రెండవయొడ్డున యుండును. తల్లితాబేలు, పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నా యందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను ? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రముగానీ యుపదేశము గాని యెవ్వరి వద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్ధమును పొందెదవు. నావైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను.


ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలు గాని యారు శాస్త్రములలో ప్రావీణ్యము గాని యవసరము లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహరబ్రహ్మల ( త్రిమూర్తుల ) యవతారమని యెంచెదరో వారే ధన్యులు "

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను.

ఈ కధను జాగ్రత్తగాను , శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును , సందర్భమును గుర్తించి , హేమాడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామా ఆతని నీ స్థితిలో జూచి " ఏమి జరిగినది ; యేల యూరకున్నావు ?అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను ?'అని యడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను.మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు బాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా ; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను.


బాబా యిట్లనెను. " సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా ?అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. " గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాల ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కధ మిక్కిలి యాశ్చర్యమును కలుగ జేసినదనియును , దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు ఆ కధ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను.


అప్పుడు బాబా యిట్లనియె. " కధ చాల అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి ? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము . " అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కధను పూర్తిగ బాబాకు వినిపించి ,యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. " ఆ కధ నీకు నచ్చినదా ?దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?"యని బాబా హేమాడ్ పంతునడిగెను.


" అవును బాబా ! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని. "అని హేమాడ్ పంతు బదులిచ్చెను.


బాబా యిట్లు చెప్పెను. " నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కధను జ్ఞప్తి యందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానినలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము; చైతన్యము ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత,ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధార వలె పని చేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే ." బాబా యీ మాటలు పూర్తి చేయుసరికి , హారతి పూర్తియాయెను.


అందరు " శ్రీ సచ్చిదానంద సద్గురుసాయినాధ్ మహారాజ్ కీ జై " యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా ! యీ సమయమందు మనము కూడ మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులలో పాల్గొందము.


హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి యిట్లనెను. ఈ కధను నీవు మనసుకి పట్టించుకొని జ్ఞప్తి యందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును.నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు."


హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి " ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము. ఆశీర్వదించుము. కాపాడుము. " అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. ఈ కధను వినుము. దీనిని మననము చేయుము. నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును."


ఓ ప్రియమైన పాఠకులారా ! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కధయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి , ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తధాస్తు...


నాకు ఇలా అనిపించిందండి. . హేమాడ్ పంత్ తాను సాఠే కన్నా ఎక్కువసార్లు పారాయణం చేసానని అనుకొంటారు. అందుకేనేమో హేమాడ్ పంతుకు సాయి జీవితచరిత్రను వ్రాసే అదృష్టం కలిగింది అని నాకు అనిపించిందండి.

ఇంకా, భక్తులకు ( నిష్ఠ) నమ్మకము. (సాబూరి ) ఓపిక  ఉండాలని బాబా చెప్పటం జరిగింది. అధ్భుతంగా చెప్పారు..

నా అభిప్రాయములలో ఏమైనా పొరపాట్లు వచ్చినచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నానండి....

Wednesday, September 21, 2011

ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని............

" అమ్మ ఒడి " ఆదిలక్ష్మి గారి జీవితంలో జరిగిన విషాదకర సంఘటనలు అత్యంత బాధాకరమైనవి. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది.

ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని , ఆమె ధైర్యం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా చెప్పటం తేలికే గానీ .?

సినీనటి సౌందర్య అమ్మగారు తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న తరువాత అనాధపిల్లలను చేరదీసి వారికి అండగా ఉంటున్నారట.

తమిళనాడులో ముగ్గురు పిల్లలు గల ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేవారట.

ఆ మధ్య సునామీ వచ్చినప్పుడు వారి ముగ్గురు పిల్లలూ అందులో మరణించారట.

అంత బాధ తరువాత కూడా వారి తల్లిదండ్రులు సునామీలో అనాధలైన కొందరు పిల్లలను చేరదీసి పెంచుకుంటున్నారట.

వారి ఫోటోలతో సహా వార్తాపత్రికలో వేశారు.

ఎవరి జీవితంలో అయినా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ధైర్యం తెచ్చుకుని కష్టాల్లో ఉన్న ఇతరులకు సేవ చేయటం వల్ల వారి జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది.

లేక ఇతరులు స్థాపించిన శరణాలయాలలోని అనాధలకు తమకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి సాయాన్ని అందించవచ్చు.

ఇదంతా చెప్పినంత తేలిక కాదుగానీ, అలా చేయటం వల్ల ఇతరుల జీవితాల్ని నిలబెట్టినవారవుతారు.

వారి మనసుకి కూడా ఉపశమనం కలుగుతుంది.

భారత యుద్ధంలో కౌరవులు మాత్రమే చనిపోలేదు. ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోథ్గచుడు వంటి వారు కూడా మరణించారు.

అప్పుడు మరి వారి తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవించి ఉంటారు.

అంత గొప్ప వారికే ఇలాంటి కష్టాలు వచ్చాయి. అని , వారి కధల ద్వారా ధైర్యాన్ని తెచ్చుకోవాలి.

కాలం అందరి గాయాలను తగ్గిస్తుందని ఆశిస్తూ..

Monday, September 19, 2011

అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా సృష్టించారు....


దైవం, ఈ భూలోకంలో మానవులను , వారి ఆహారానికి అవసరమైన మొక్కలనూ సృష్టించారు.

మొక్కలను సృష్టించటానికి ముందే ,
సూర్యుడిని, గాలినీ, నీటినీ , సృష్టించారు.

ఇలా ఒక పద్ధతి ప్రకారం అన్నీ సృష్టించబడ్డాయి.

ఇదంతా చూస్తేనే తెలుస్తోంది. అనంతమైన గొప్ప ఆలోచనా శక్తి గల మహాశక్తి వల్లనే , అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని.

ఇక దైవాన్ని ఎవరు సృష్టించారు ? అంటే ... మనకు తెలియని రహస్యాలు ఎన్నో సృష్టిలో ఉంటాయి.

వాటి గురించి మనకు తెలియనంత మాత్రాన అన్నీ అబద్ధాలు అనటం అవివేకం.

దైవం పచ్చటి ప్రకృతిని, పసిడిపంటలనూ, , పైరగాలినీ, రసభరిత ఫలాలనూ, సుగంధ పుష్పాలనూ .... ఇలా ఎన్నింటినో సృష్టించి మనకు ఇచ్చారు.

ఇంకా, మహా అగ్నిపర్వతాలనూ, మంచుపర్వతాలనూ, మహా సముద్రాలనూ కూడా సృష్టించారు.

సునామీలనూ, సుడిగాలులనూ, సుడిగుండాలనూ కూడా సృష్టించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ సౌకర్యాలు అమర్చి ఇచ్చినా ...

తామంటే కొద్దిగా భయభక్తులు ఉండటానికి అప్పుడప్పుడు పిల్లల పట్ల..... కోపాన్ని, గాంభీర్యాన్నీ , ప్రదర్శిస్తారు. అది పిల్లల మంచికోసమే.

వారు తప్పుదారి పట్టకుండా ఉండటానికి అలా చేస్తారు అంతే. .

అలాగే జీవులకు అన్నీ అమర్చి ఇచ్చిన దైవం భూకంపాలు, సునామీలను ఎందుకు సృష్టించారు అంటే ,

మానవులు మరీ అహంకరించకుండా భయభక్తులతో ఉండటానికి ,

లోకంలో ధర్మం క్షీణించినప్పుడు ,జీవులను హెచ్చరించటానికి ,
ఇంకా,

భూమిపై జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సమపాళ్ళలో ఉండటానికి,
..... ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.

జంతువులకు భూకంపాలు వంటి వాటిని గ్రహించే శక్తి ఉందట.

పూర్వం ప్రజలు జంతువుల ప్రవర్తన ఆధారంగా తామూ భూకంపాలు రావటాన్ని కొద్దిగా ముందే తెలుసుకుని జాగ్రత్త తీసుకునేవారట.

కొందరు , ఈ సునామీలూ, భూకంపాలను తప్పించుకోవటానికి మహిమలు తెలిస్తే బాగుండు అనుకుంటారు.

ఇక్కడ ఒక్క విషయం.

భూకంపాలు, సునామీలూ వచ్చినప్పుడు కూడా కొందరు ఏ హానీ లేకుండా బయటపడతారు.

క పెద్ద ప్రమాదంలో అందరూ చనిపోగా ఒక పసిబిడ్డ చిన్న దెబ్బ తగలకుండా బయటపడిన వార్త ఆ మధ్య చదివాను.

ఈ మధ్యనే కాకినాడలో అపార్ట్ మెంట్ క్రుంగిపోయిన  సంఘటనలో  అందరూ  సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతమే.

ఇదంతా వారివారి పూర్వసుకృతంపై ఆధారపడి ఉంటుంది. . కాలం కలిసివస్తే ఎంత గొప్ప ప్రమాదం నుంచి అయినా బయటపడతారని తెలుస్తోంది కదా !

లోకంలో ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటేనే కొందరు మానవులు విశ్వంలో తామే గొప్ప అంటున్నారు.

ఇక ఏ భయమూ లేకపోతే మనుష్యులు మరీ అహంకరించే అవకాశం ఉంది.,

మనం తెలుసుకోవలసింది ఏమంటే, ఇవన్నీ పరీక్షలు.

ఈ పరీక్షలకు తట్టుకుని ఈ లోకంలో సత్ప్రవర్తనతో జీవించిన వారికి బాధలు లేని ఉత్తమలోకాలకు వెళ్ళటానికి అర్హత లభిస్తుంది.

అందుకే, ఈ భూకంపాలు వంటి వాటికి భయపడకుండా , సత్ప్రవర్తనతో జీవితాన్ని సాగించటానికి ప్రయత్నించాలి .

అదే మనం చేయవలసింది......


 

Friday, September 16, 2011

కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....



కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది.

అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.

కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.

* పెద్దలు చెప్పిన స్వర్గం వంటి ," ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం, వంటి ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.

కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.

* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.

* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.

ఇంకా,

* ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువమార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.

లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు భయపడకుండా కష్టపడాలి.

మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కష్టపడకుండా ఎలా ?

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.

* జీవులకు అసలు పరీక్ష...మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే ప్రపంచాన్ని
జయించినట్లే అని.

* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.

గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం.

 నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .

సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు.

  అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !


ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు. రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !

* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.


* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో  జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.

ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.

* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.

* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.

* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.

* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.

* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి.

 

Wednesday, September 14, 2011

మానవులను ఎదుర్కునే మహిమలు కావాలని మొక్కలు, పశుపక్ష్యాదులు భగవంతుని అడిగితే ,

 
ఈ బ్లాగ్ ను ఇంతకుముందునుంచీ చదువుతున్నవారికి , మరియు క్రొత్తగా చదువుతున్నవారికి, మరియు సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లకు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.


జీవితంలో మనకు చాలా సందేహాలు వస్తుంటాయి. మహిమలు అనేవి నిజంగా ఉన్నాయా ? ఉంటే ఈ ప్రపంచంలోని కష్టాలను మహిమలతో పోగొట్టవచ్చు కదా ! వంటి సందేహాలు.


ఈ మధ్యన , ఒకరు తమ బ్లాగులో ఇలాంటి అభిప్రాయాలను వ్రాయటం జరిగింది. నేను చదివాను. నాకు తెలిసినంతలో వాటి గురించి నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. వారి బ్లాగ్ పేరు ...ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

మహిమలవంటివి తప్పకుండా ఉన్నాయి. అలాంటి అనుభవాలు చాలామందికి జరుగుతున్నాయి. నమ్మనివాళ్ళని ఎలా నమ్మించగలం ?

ప్రతి పనీ మహిమతో పరిష్కరించుకుంటే ఇక సృష్టి అంతా నిస్సారంగా అయిపోతుంది.

ఇక్కడ ఇంకో విషయము. . మనం ఎంతకీ మన కష్టాల గురించి, మన సుఖాల గురించీ మాత్రమే ఆలోచిస్తున్నాము.

మనలాగే పశుపక్ష్యాదులకీ బాధలు ఉంటాయి. మరి మన స్వార్ధం కోసం పశుపక్ష్యాదులను ఎంతో బాధకు గురి చేస్తున్నాము. మానవుల కోసం లక్షలాది మూగజీవులు పడరానిపాట్లు పడుతున్నాయి.

* మానవులను ఎదుర్కునే మహిమలు కావాలని మొక్కలు, పశుపక్ష్యాదులు భగవంతుని అడిగితే , మానవులకు ఆహారమే ఉండదు. మానవులకు చాలా కష్టాలు వస్తాయి.

* ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ప్రతివిషయానికీ మహిమలు అవసరంలేదు. మనం మన కోరికలను, స్వార్ధాన్ని కొంచెం తగ్గించుకోవాలి.

అలా ఎందుకు తగ్గించుకోలేకపోతున్నామో ? ఆలోచించండి.

ఇక్కడ, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి అని సంభాషణ రూపంలో ఆ అభిప్రాయాలను చెబుతానండి.

* మొదటి వ్యక్తి....“గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా?


*రెండవ వ్యక్తి.... అన్నీ మహిమలతో చేసేస్తే ఇక మనిషి పనీపాటాలేకుండా ఏం చేస్తాడు. ?

తాము కూడబెట్టిన సంపాదనను కూర్చుని తినే పిల్లలను చూస్తే తల్లిదండ్రులకైనా చిరాకు వస్తుంది.

కష్టపడి సంపాదించే పిల్లలనే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు.

ప్రతి జీవి తనకు తానుగా కష్టపడి అత్యుత్తమమైన పరమపదాన్ని పొందాలన్నది దేవుని ఆలోచన కావచ్చు.

అన్నీ మహిమలతో అమర్చి ఇస్తే , ఈ మానవులు సోమరుల్లాగ తింటూ కూర్చోవాలని ఎందుకు అనుకుంటున్నారో ?

సృష్టిలో పశువులు, పక్షులు కూడా తమకు తాముగా ఎన్నో కష్టాలు పడి ఆహారాన్ని సంపాదించటం , జీవించటం చేస్తుంటాయి.


మనుషులు మాత్రమే పని లేకుండా ఆహారాన్ని మహిమల ద్వారా సంపాదించటం ఎలా ? వంటి ఆలోచనలు చేస్తుంటారు అనిపిస్తుంది.

***********
* మొదటి వ్యక్తి... భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు? “భూకంపాలూ, రైలుప్రమాదాలూ వంటి వాటిని ముందే కనిపెట్టటం వలన అనేక మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన వారమౌతాము.


* రెండవ వ్యక్తి....భూకంపాలను గుర్తించే శక్తి కొన్ని జంతువులకు ఉందట. జంతువుల ప్రవర్తనను గమనించి మానవులు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

రైలు ప్రమాదాలు వంటివి మానవ తప్పిదాల వల్లే జరుగుతాయి.
***********

* మొదటి వ్యక్తి...రైలు ప్రమాదం లో, సునామీ లో మరణించిన వారందరూ (కొన్ని లక్షల మంది) వారి కిందటి జన్మల కర్మ ప్రకారం మరణించారనటం ఎందుకో నాకు సరిగా కనిపించటం లేదు.


* రెండవ వ్యక్తి...సునామీ వంటి వాటిలో మరణించటం కర్మసిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అనుకోవచ్చు. కర్మసిద్ధాంతం సరైనదే అనుకోవచ్చు.


మనం పరీక్షల్లో ఎలా వ్రాస్తే అలాగే మార్కులు వేస్తారు కదా ఉపాధ్యాయులు. ! అలాగే వారు చేసిన కర్మ ప్రకారం వారు ఫలితాన్ని అనుభవించటం అన్నది సరైనదే కదా !

**************
* మొదటి వ్యక్తి....సోమాలియా, ఇతియోపియా వంటి దేశాలలో ఎంత కష్టించి పని చేసినా ఆహారం ఉండదు ,. అలాంటి చోట్ల ఈ బాబాల మహిమలు ఉపయోగ పడ్తాయి.

* రెండవ వ్యక్తి...ఆకలిచావులు సోమాలియాలో అంత తీవ్రంగా కాకపోయినా భారతదేశంలో కూడా జరుగుతున్నాయి.

ఇదంతా మానవుల స్వయంకృతాపరాధం. అవును, దైవం ఎన్నో మొక్కలను, విత్తనాలను సృష్టించి మనకు ఇచ్చారు. వాటినుంచీ పుష్కలంగా పంటలు పండించుకోవచ్చు.

కానీ మనం ఆహారం కంటే విలాసవస్తువులను తయారుచేసే పరిశ్రమలను స్థాపించటం, , ఆయుధాలను తయారుచేయటం వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము.

ఆ విధమైన పెట్టుబడి తగ్గించుకుంటే సోమాలియా వాళ్ళకు కూడా ఆహారపదార్ధాలు సరఫరా చేయొచ్చు.

మనదేశంలో అయితే గిడ్డంగులు సరిపడాలేక ఎన్నో ఆహారౌత్పత్తులు పాడైపోతున్నాయి. ఇలా ప్రపంచమంతా ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతోంది.

ఈ సమస్యలకు ఇలా ఎన్నో కోణాలున్నాయి .
**********

* మొదటి వ్యక్తి....ఒక పనిని సులువు గా చేయగల పరిస్థితి ఉన్నపుడు దానిని అనవసరమైన కష్టపడి చేయటం విజ్ణత అవుతుందా? 
 
* రెండవ వ్యక్తి....ఒక పనిని సులువుగా చేసే అవకాశం ఉన్నా కూడా ,
ప్రతిచిన్న విషయానికి యంత్రాలపై ఆధారపడకుండా , కష్టపడి మనపని మనమే చేయటం వల్ల మన ఆరోగ్యమే చక్కగా ఉంటుందని పెద్దలు అనుభవం ద్వారా చెప్పటం జరిగింది .

ఆ విధంగా మనకు విషయపరిజ్ఞానమూ పెరుగుతుంది.

ఉదా...కాలిక్యులేటర్లు ఉపయోగించని పాత తరాలవారికి మనకన్నా జ్ఞాపకశక్తి బాగా ఉండేది అనిపిస్తుంది.

**************

* మొదటి వ్యక్తి...ఏయిడ్స్ వలన అనేక మంది అమాయకులు కూడా చనిపోతున్నారు. సైంటిస్టులు కనిపెట్టబోయే విషయాలను(మందు) ముందే బాబాలు తెలుసుకొంటే, అనేక మంది రక్షించబడతారు.

* రెండవ వ్యక్తి.... నైతికవిలువలతో కూడిన జీవనవిధానం, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , ఎయిడ్స్ వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు అంటున్నారుకదా ! అలా ప్రయత్నించవచ్చు.

అయినా జననం మరణం పశుపక్ష్యాదులకు వలెనే మానవులకూ అనివార్యమైన విషయాలు.

ఈ ప్రపంచంలో కష్టాలూ, సుఖాలూ రెండూ ఉన్నాయి.

*ఈ కష్టాలన్నీ లేకుండా శాశ్వత బ్రహ్మానందం పొందాలంటే , దైవకృపను పొంది మోక్షమనే పరమపదమును పొందటం ద్వారా మాత్రమే సాధ్యమని పెద్దలు చెప్పటం జరిగింది...
**************

ఇతర బ్లాగులోని విషయాలు వారి అనుమతి లేకుండా వ్రాయవచ్చో లేదో ? ఇలాంటి నియమాలు ఉంటే దయచేసి తెలియజేయండి. ఇక ముందు జాగ్రత్త తీసుకుంటాను.

వారి అనుమతి లేకుండా వ్రాసినందుకు క్షమాపణలతో.,వారికి అభ్యంతరాలు ఉన్నచో ఈ టపాలో కొంత భాగాన్ని నిలిపివేయటం గురించి ఆలోచిస్తాను.
 

Monday, September 12, 2011

అసలు స్థానికత అంటే ఏమిటో నాకు తెలియటం లేదు..

 

* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లొనూ బంధువులున్నారు. మాది బదిలీలతో కూడిన ఉద్యోగమండి. ఈ బదిలీల వల్ల మంచీ ఉంది. చెడూ ఉందనిపిస్తుంది.


ఒకసారి బదిలీ వల్ల ఒక ప్రాంతానికి వెళ్ళాము. యధాప్రకారం చుట్టుప్రక్కల వారితో పరిచయాలు అయ్యాయి.

కొంతకాలం తర్వాత , ఒకరోజు మా పొరుగామె ఒకామె మా ఇంటికి వచ్చారు.


ఆమెతో నాకు మంచి స్నేహమే ఉంది. నాకన్నా వయసులో పెద్ద. అలా మాటల్లో ఇళ్ళ అద్దెలు, స్థలాల రేట్ల ప్రసక్తి వచ్చింది.

నేను, ఇక్కడ వాటి రేట్లు ఎలా ఉంటాయండి ? అని అడిగాను.

అంతే, అప్పటివరకు చక్కగా కబుర్లు చెబుతున్న ఆమె ఒక్కసారిగా .


* ఏం ? కొంటారా ? బదిలీపై వచ్చారు. అద్దెకుండి మీ పని అయ్యాక వెళ్ళిపొండి. అంతే. ఇక్కడ రేట్లతో మీకేం పని ? అలా అనేసింది.

నేను ఒక్క క్షణం బిత్తర పోయి, అబ్బే నేను కొనాలని అడగలేదండి. అన్నాను.

* నిజంగానే , నేను కొనే ఉద్దేశంతో అడగలేదు. నాకు అలా విషయసేకరణ చేయటం అలవాటు.విషయ పరిజ్ఞానం పెంచుకుందామని పనీపాటా లేక అలా అడిగానంతే.


కానీ, ఆమె ముఖం మీదే అలా అనేస్తుందని అనుకోలేదు.

అప్పటినుంచీ ఎవరితో ఏం మాట్లాడితే ఏం తంటానో అని తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇంకోసారి ఇంకొకామె ఇతరప్రాంతం వాళ్ళు ఇక్కడికొచ్చి స్థిరపడుతున్నారని వారిని తిట్టటం జరిగింది.

ఇతర ప్రాంతాల నుంచీ వలసలు మితిమీరి పెరిగితే స్థానికులు ఆందోళన పడటం , వలసలవల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడటం జరుగుతుంది.


* ఈ భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే నేను ఎక్కడివాళ్ళు అక్కడే జీవించటం వల్ల ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది అంటాను.



ఇదంతా
సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయేమోనని ఇలా చెబుతున్నాను.అంతే.


సరే, అప్పుడు వాళ్ళు నాతో అలా అన్నందుకు నాకు బాధతో పాటు ఆశ్చర్యము, ఎన్నో ఆలోచనలు కూడా కలిగాయి.


* ఎందుకంటే , నన్ను అలా అడిగిన వాళ్ళ యొక్క పిల్లలు, బంధువులు, చాలామంది ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాల్లోనూ, ఇంకా కొందరు ఇతరదేశాల్లోనూ ఉద్యోగ, వ్యాపారరీత్యా ఉంటున్నారు.

వారు అక్కడ ఆస్తులూ కొనుకుంటున్నారు.

మరి అలాంటప్పుడు ఆమె నన్ను అలా అడగటం న్యాయమా ?

కొందరు తమకొక నీతి ఇతరులకు ఒక నీతిగా ప్రవర్తిస్తుంటారు.

* మా ఊరు ఎవరూ రాకూడదు అనేవారు ఇతరుల ఊళ్ళు కూడా వెళ్ళకూడదు కదా !

* అయినా ఆమె నన్ను పరాయి ప్రాంతం వాళ్ళగా భావించింది కానీ, మాకు ఆ ప్రాంతం వారితో వివాహబంధుత్వాలు కూడా ఉన్నాయి.


* మాకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారండి.

భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ స్థానికత అనే విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.



ఇక, బదిలీలవల్ల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అందుకు బాధగా కూడా ఉంటుంది.

ఎందుకంటే, ఇలా సమస్యలు వచ్చినప్పుడు మీది ఏ ప్రాంతం ? అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియదు.


మేము మా పూర్వీకులు నివసించిన ప్రాంతం పేరు చెబుతుంటాము.మాకు అక్కడ బంధువులు కూడా ఉన్నారు లెండి.

* ఇవన్నీ ఆలోచిస్తే అసలు నేటివిటీ అనేది ఎలా నిర్ధారిస్తారు ? దేని ఆధారంగా ? అన్నది మాకు తెలియటంలేదు.

మాలాంటి వారు ఆస్తిపాస్తులను ధైర్యంగా కొనుక్కోవాలన్నా మా ప్రాంతం ఏది అన్నది తెలిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది.


* ఇది మన రాష్ట్రం అనుకునేంతలో మీ రాష్ట్రం కాదంటున్నారు. మన ప్రాంతం
అనుకుంటే మీ ప్రాంతం కాదంటున్నారు.


* అందుకని మేధావులు ఇవన్నీ ఆలోచించి కొన్ని ఊళ్ళు ఒక ప్రాంతంగా నిర్ణయించి ,....... ఇక అక్కడి వాళ్ళు బయటికి పోకుండా అక్కడనే జీవించేటట్లూ ఉపాధి అవకాశాలు కల్పించాలి.

దిలీలు కూడా ఆ పరిధిలోని ఊళ్ళలోనే జరగాలి.

ఇదంతా సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయేమోనని ఇలా చెబుతున్నాను.అంతే.

. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే
,.............

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన వెంటనే హైదరాబాద్ ను రాష్ట్ర ముఖ్య రాజధానిగాచేసి.. కర్నూలు, వైజాగ్, విజయవాడలను
.. మిగతామూడు ప్రాంతాలకూ ఉప రాజధానులుగా చేసి , అభివృద్ధి చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

* అంటే
,ఒక ముఖ్య రాజధాని , మూడు ఉప రాజధానులు అన్నమాట..

అప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు రాకుండా అందరూ బాగుండేవారు అనిపిస్తుంది.

* రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతిచిన్నపనికీ హైదరాబాదుకు రాకుండా హైదరాబాదులోని ముఖ్య కార్యాలయాలకు ఉప కార్యాలయాలను ఉప రాజధానుల్లోనే ఏర్పాటు చేస్తే బాగుండేది అనిపిస్తుంది. .

* అన్ని ప్రాంతాల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను తమ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేసుకుంటే , ఇప్పుడు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అనిపిస్తుంది.


బదిలీ ఉద్యోగాలు మీద తిరిగే మాలాంటి వారు ఆస్తులను కొనాలంటే చాలా ఆలోచించాలి.

మన పూర్వులు నివసించిన ఊరిలో మనకు బాగా దగ్గరిబంధువులు ఉంటే , వాళ్ళు ఇవన్నీ చూస్తారు. అలా లేనివారి పరిస్థితి ఏమిటి ?


ఈ రోజుల్లో ఎవరిపనులు వాళ్ళే చేసుకోవటానికి సమయం సరిపోవటం లేదు. ఇక మన పనులు చక్కబెట్టడానికి బంధువులైనా , వారికి తీరిక ఉండొద్దూ ?

అందుకే చాలామంది తాము నివసించే ప్రాంతంలోనే స్తిరాస్తులు కొనుక్కుంటారు.

మాకూ స్వంత ప్రాంతంలోనే నివసించాలనీ ఉంటుంది. అసలు స్థానికత అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది.

* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తే ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాల్లో చదవటం వల్ల అలా ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది.

ఆ మధ్య ఒక చానల్లో ఒక ప్రసారం చూశాను.

* తెలుగువాళ్ళు చాలామంది శిరిడీలో స్థిరపడ్డారట. అక్కడ స్థిరాస్తులు కొనుక్కున్నారట.

మొదట్లో ఎంతో బాగా మాట్లాడి, సహాయం చేసిన అక్కడి స్థానికులు ఇప్పుడు ముభావంగా ఉంటున్నారట. ఇలా చాలా విషయాలు చెప్పారు.

ఈ మధ్య ఉత్తరాంధ్రలో ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వటం గురించిన వార్తలు వచ్చాయి. ముంబాయ్ లో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయి.

ఇవన్నీ చూసాక ఈ గొడవలన్నీ ఎందుకు ? ఎక్కడివాళ్ళు అక్కడే జీవించాలని నాకు అనిపించటంలో తప్పుందంటారా ?

ముందుముందు ఉద్యోగాలు చెయ్యబోయే ఇప్పటి విద్యార్ధులు ఈ సమస్యలన్నీ ఎదుర్కోవలసి ఉంది.


* ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఉద్యోగాలు ,వ్యాపారాలు కొరకు ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్ళకుండా ఉంటారా ?

* ఎవరికైనా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగావకాశం వచ్చిందనుకోండి.

" నా మాతృభూమి ఎంత అందమైనదీ "  అని పాటలు పాడుకుంటూ విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండే వారు ఈరోజుల్లో ఎందరు ఉంటారు ?


అందుకని స్థానికత అనే విషయం గురించి మేధావులు గట్టిగా ఆలోచించాలి. ప్రజల మధ్య అపార్ధాలు తొలగటానికి తోడ్పడాలి.


* రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా ఎప్పటికీ ప్రక్కప్రక్కనే జీవించవలసిన ప్రజల మధ్యన ఇంతలా అపార్ధాలు, ఆవేశాలూ పెరగటం మంచిదికాదు.

అది ముందుముందు అనర్ధాలకు దారి తీస్తుంది.

* ఎంతైనా మనమందరం ఒకటి.


* సమస్యలు సామరస్యంగా , త్వరగా పరిష్కారం అవ్వాలనీ ,అప్పుడు పేదప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువసమయం ఉంటుందని ఆశిద్దాము.


ఇంకా, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రాంతం ఏదైనా ప్రజల పేదరికం పోలేదు. పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ రైతులు, చేనేతలవారు, వేలాదిగా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఫ్లోరైడ్ సమస్య అలాగే ఉంది.

నాయకులలో కొందరు నిజాయితీగానే ఉన్నా, చాలామంది ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. పేదలు మరింత పేదలు అవుతున్నారు. అసలు సమస్యలు అవీ. వాటి గురించి బాధపడాలి..

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి ?


*
సమస్యలూ త్వరగా పరిష్కారం అవ్వాలని ఆశిద్దాము..


Friday, September 9, 2011

దైవ విగ్రహాలు పెరగటం గురించి..........



కొన్ని దైవ విగ్రహమూర్తులలో కాలంతో పాటూ పెరుగుదల కనిపిస్తోంది.

ఉదా..కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇంకా, యాగంటి లోని నందీశ్వరుడు .

కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా చెబుతారు . శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి కొంత దూరంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది..

,కాణిపాకంలో స్వామివారికి కొంతకాలం క్రిందట భక్తులు చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు.

కొంతకాలం క్రిందట యాగంటిలోని నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటానికి స్థలం సరిపడా ఉండేదట.

ఇప్పుడు అలా ప్రదక్షిణ చెయ్యటానికి , అంత స్థలం లేనంతగా నంది విగ్రహంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ దైవలీలలే.

హేతువాదులు ఏమంటారంటే, కొందరేమో రాళ్ళు పెరుగుతాయి అంటున్నారు.

కొందరేమో రాళ్ళలో జీవం ఉండదు కాబట్టి ఎలా పెరుగుతాయి ? అలాంటి పెరుగుదల అసంభవం.
అంటున్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళకే తేలటం లేదు.

ఇంకా కొంద
రు, ఒక్కోసారి భూమిలో వచ్చే మార్పుల వల్ల కొంతభాగం పర్వతాలు ఏర్పడుతాయి..అలాగే విగ్రహాలు పెరుగుతాయి అంటున్నారు.

పర్వతాలు ఏర్పడటానికీ, విగ్రహాలు పెరగటానికి పోలికే లేదు.

మరి , విగ్రహాలు పెరుగుతున్నా కూడా అవి ఒక పద్ధతిగా పెరుగుతున్నాయి.

అంటే వినాయకుని మూర్తి అలాగే చక్కగా ఒక పద్ధతిలో పెరుగుతోంది.

నందీశ్వరుని ఆకారం, ముఖకవళికలు , పాదాలు ,ఇతర
శరీరాకృతి చెక్కుచెదరకుండా చక్కగా అలాగే ఉండి పెరగటం జరుగుతోంది.

అంటే , ఇష్టంవచ్చినట్లు కాకుండా పూర్వపు ఆకారంలోనే పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి ఇదంతా దైవలీల.

సమాజంలో సవాలక్ష సమస్యలుండగా దేవుడు లేడని నిరూపించటానికి కొందరు ఎందుకు ఇంతగా తాపత్రయపడతారో అర్ధం కాదు.


సృష్టిలోని వ్యవస్థ పనిచేయటం గురించి కొద్దిగా తెలుసుకున్న శాస్త్రవేత్తలను ఎంతో గౌరవిస్తారు.

కానీ ఆ విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన మహాశక్తిని ఒప్పుకోము అని అగౌరవపరుస్తారు. ఇది చాలా అన్యాయం..

అంటే ;గాలిలో ఆక్సిజన్ ఉంటుందని కనిపెట్టిన శాస్త్రవేత్తను గౌరవించినంతగా,

గాలిలో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాటు చేసిన భగవంతుని గౌరవించరు కొందరు హేతువాదులు.,

అంతటితో ఊరుకోకుండా, దైవం అంటూ ఎవరూలేరని కూడా చెప్పటానికి కొందరు చాలా తాపత్రయపడతారు..

ఎవరు ఎలాంటి పేరుతో పిలిచినా దైవము ఒక మహా శక్తి ..


Wednesday, September 7, 2011

డెమాక్రసి అంటే ..........................


డెమాక్రసి ....

«Government of the people, by the people, for the people»

ఇది అబ్రహం లింకన్ డెమోక్రసీ గురించి ఇచ్చిన నిర్వచనం.

కొన్ని దేశాల్లో ప్రజలకు ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు కూడా ఉంది.

కానీ మన దేశంలో మాత్రం అవినీతిని తగ్గించే పటిష్టమైన బిల్లు గురించి గట్టిగా మాట్లాడితేనే తప్పుగా భావించటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రజాస్వామ్యవ్యవస్థలో సహజవనరుల వంటివాటిని ప్రజలందరూ సమానంగా అనుభవించాలి. అలా పేదరికం పోవటానికి ప్రభుత్వాలు కృషిచెయ్యాలి.

కానీ మితిమీరిన ప్రైవేటీకరణ వల్ల అవన్నీ ధనికుల అజమాయిషీలో ఉంటున్నాయి.

.డబ్బు ఉన్నవాళ్ళు లంచం ఇచ్చి పనులు త్వరగా చేయించుకుంటారు . మరి డబ్బు లేనివాళ్ళ సంగతి ఏమిటి ?

లంచాలకు అలవాటుపడ్డవారు ఊరికే పనులు చేయరు కదా !

ఈ అవినీతి, లంచగొండితనం వల్ల డబ్బులేని పేద వారు లంచాలు ఇవ్వలేక , పనులు సకాలంలో పూర్తి చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డబ్బు ఉండి లంచం ఇచ్చేవాళ్ళు కూడా అలా లంచాలు ఇచ్చీ ఇచ్చీ .. ఆ డబ్బు సంపాదించటానికి తిరిగి వాళ్ళూ లంచం తీసుకుంటారు. ఇదొక విషవలయం.

ఇక్కడ ప్రజల తప్పు కూడా ఉంది.

ఎన్నికల సమయంలో ఉచితహామీలు ప్రకటించని పార్టీలను ప్రజలు గెలిపించటం లేదు.

ప్రజలకు ఉపయోగపడేవి ఉచితహామీ
పధకాలు కాదు. ఉపాధి హామీ పధకాలు.

ప్రజలు ఎన్నికల సమయంలో ఉచితవస్తువులు తీసుకోవటానికి ఆశ పడకూడదు.

పార్టీలు ఎన్నికలఖర్చు కోసం చాలాడబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తోంది. దానికివారు విరాళాలు సేకరిస్తారు.

అలా విరాళాలు ఇచ్చినవారు ఆ భారాన్ని తాము ఉత్పత్తి చేసిన వస్తువులపైనే వేస్తారు.

అలా ధరలు పెరుగుతాయి. ప్రజలు ధరలు పెరిగాయని మళ్ళీ గోల పెడతారు.

ఉచితహామీలకు ఆశ పడితే అంతే మరి.

ప్రజలంటే రాజకీయపార్టీలవాళ్ళు, పారిశ్రామికవేత్తలు , మధ్యతరగతివారు, సామాన్యులు .. ఇలా అన్ని వర్గాల వారు కలిపితేనే ప్రజలు.

రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు వంటి వారిలో కూడా లంచం ఇచ్చి పనిచేయించుకోవటం , అవినీతి వంటి చర్యలు ఇష్టం లేనివారు చాలా మంది ఉంటారు.

కానీ, తప్పనిపరిస్థితుల్లో అలా ఇస్తుంటారు. ఇలాంటివారందరూ అవినీతి, లంచగొండితనం పోవాలనే అనుకుంటారు.

అందుకని మనం ప్రతిఒక్క రాజకీయనాయకుణ్ణీ, పారిశ్రామికవేత్తను అనుమానించనక్కరలేదు.

ప్రజలు కూడా ఎన్నికసమయంలో ఉచితహామీలకు ఆశపడకుండా పేదరికాన్ని పోగొట్టే వారికి, అభివృద్ధి పాలన అందించేవారికే ఓట్లు వేస్తే పార్టీలు కూడా ఓట్ల కోసమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు.

ఈ అవినీతి వంటి విషయాల్లో ఎవరోవచ్చి ఏదో చేస్తారని కాకుండా ప్రజలందరూ తమవంతు ప్రయత్నం తాము చెయ్యాలి.

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు రాబోయే తరాలకోసం తమ నిండు జీవితాలను అర్పించారు.

ఇంకా కొందరు, దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం కోసం ఆస్తులను కోల్పోయారు, యుక్తవయస్సులో జీవితాన్ని జైళ్ళలో గడిపారు.

ఈ నాటి వారు అంతలేసి త్యాగాలను చెయ్యనక్కరలేదు కానీ, తమవరకు తాము అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

సినిమాలు, క్రికెట్టు, లగ్జరీ జీవితం, వీటిపై పెట్టే శ్రద్ధలో కొద్ది భాగం ... దేశసమస్యలను పరిష్కరించటంలో తనకు చేతనైనంతలో శ్రద్ధ చూపిస్తే మన బ్రతుకులే బాగుపడతాయి.


ఇక జనలోక్ పాల్ బిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు.

ఇంకా భయపడేవాళ్ళు ఇలా ఆలోచించవచ్చు.

ఈ బిల్లువల్ల ......కి హాని కలిగే సందర్భం ఒకవేళ భవిష్యత్తులో వస్తే ? ( రాదు. ) ఆ సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండేలా బిల్లును తెస్తే ఇక అనుమాలుండవు.

 

Monday, September 5, 2011

నింగిని తాకిన నిశ్శబ్ద విప్లవం ...... అన్నా హజారే తో కలిసి ప్రజల ఉద్యమం..



ఈ బ్లాగ్ ను ఇంతకుముందునుంచీ చదువుతున్నవారికి , మరియు క్రొత్తగా చదువుతున్నవారికి, మరియు సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లకు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.


ఈ మధ్యన పనివత్తిడి వల్ల అన్నాహజారే గారి దీక్ష విరమణ గురించి వెంటనే టపా వ్రాయలేకపోయాను.

అవినీతిపై ఈ ఉద్యమం వెనుక అందరి పాత్ర ఉంది. మీడియా, యువత, బాలల నుంచీ వృద్ధుల వరకూ ఇలా ఎందరిదో పాత్ర ఉంది.

ఈ ఉద్యమానికి
మాత్రం విజయం లభించటం వెనుక ఎందరిదో పాత్ర ఉంది. అందుకే ఇది అందరి విజయం.


భారతదేశంలో అభివృద్ధి లేదు . అంటూ యువత విదేశాలకు విపరీతంగా తరలివెళ్ళటం చూశాక చాలా నిరాశగా అనిపించేది.

ఇంకా ఈ దేశాన్ని బాగుచేయటం సాధ్యమా ? అని కూడా చాలామంది బాధ పడ్డారు. కానీ , ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత ఉత్సాహంగా పాల్గొనటం చూశాక ఎందరిలోనో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.


కొందరు జనలోక్ పాల్ బిల్లు గురించి నిరాశగా మాట్లాడుతున్నా కూడా నిరాశను దరిచేయనీయకూడదు. కొంత అవినీతి తగ్గినా మంచిదే కదా !

అవినీతి చిన్న సమస్య కాదు. దాని వల్ల ప్రజలలో ఆర్ధికతారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి.

ధరలు తగ్గించటానికి గట్టి చర్యలు తీసుకోవటం వల్ల కూడా ప్రజల మధ్యన ఆర్ధిక తారతమ్యాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అయితే అన్నింటికన్నా కావలసింది , పాలకుల్లోనూ, ప్రజలలోనూ కూడా ఉండవలసింది చిత్తశుద్ధి.

అదేదో సామెత చెప్పినట్లు ..అదే ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి?


సరే, కొందరు మేధావులు ఈ జనలోక్ పాల్ బిల్లు వల్ల ముందుముందు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజల నిర్ణయాలు అధర్మంగా ఉంటే వాటిని తిరస్కరించాలి.

కానీ ఇక్కడ అవినీతిని పటిష్టంగా నిర్మూలించే బిల్లు కావాలని ప్రజలు కోరుకోవటంలో అధర్మం ఏమీ లేదు.

దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, తరలిపోతున్న ప్రజల సొమ్ము, వీటి గురించి గట్టిగా మాట్లాడని వారు పోతున్నారు.

మేధావులు ఈ విధంగా భావించటం , అవినీతి పెరగటానికి పరోక్షంగా తోడ్పడుతుందేమో దయచేసి వారు ఆలోచించాలి.

ఉదా..ఎవరైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చావుబ్రతుకుల మధ్య హాస్పిటల్ కు తీసుకు వెళ్తే  విజ్ఞులైన వైద్యులు రూల్స్ పాటించటం గురించి కంట, రోగికి వైద్యం చెయ్యటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు.


అంతేకానీ,ప్రాణం కన్నా రూల్స్ ముఖ్యం అని విజ్ఞులు ఆలోచించరు కదా !

అలాగే ఇప్పుడు పటిష్టమైన అవినీతి నిరోధకబిల్లు అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు.

చాలాకాలం తరువాత ప్రజలలో కదలిక వచ్చింది. దయచేసి దానిని బలహీనపరచవద్దు.

అన్నా హజారే గారి పట్టుదల మెచ్చుకోదగింది. వారి వెంట ఉండి సహాయసహకారాలు అందిస్తున్న కిరణ్ బేడి.. వంటివారు
రూల్స్ గురించి బాగా తెలిసినవారే .

అందుకని కంగారు పడవలసినపనిలేదు. 


ఇక, అవినీతిపనులు చేసే వారిని చూస్తే పాపం అనిపిస్తుంది.

ఎందుకంటే , వీళ్ళు తమకోసం, కుటుంబం కోసమూ అష్టకష్టాలు పడి పాపపు పనులు చేసి డబ్బు సంపాదిస్తారు.

కానీ ఆ పాప ఫలితాన్నీ ఈ జన్మలోకానీ, వచ్చే జన్మలో కానీ అనుభవించవలసి వస్తే ఎంతో కష్టం కదా ! .

ఆ పాపఫలితంగా వారి సొంతవాళ్ళే ఆ డబ్బు కోసం వారిని ఎన్నో కష్టాలపాలు చేస్తారు.

అందుకని ఎందుకొచ్చిన బాధలు..పాపపుపనులు చేయటం మానివేయండి.

కోట్లాది ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపండి. ఆ పుణ్యం వల్ల మీ జీవితాల్లోనూ ఆనందాన్ని అనుభవించండి. భగవంతుని దయను పొందండి.... 

 

Friday, September 2, 2011

దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది....



 
ఒకసారి నారాయణమహర్షి నారదమహర్షితో ఎన్నో విషయములను చెబుతూ ఇలా కూడా చెప్పటం జరిగింది. ..

జీవికి
కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ, భార్యాపుత్రులు గానీ, జ్ఞాతిమిత్రులు గానీఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి..అనీ,

ఇంకా
ఎన్నో విలువైన విషయములను చెప్పటం జరిగింది. ఇంకా, జగన్మాత గురించి చెబుతూ..

ఆవిడ జగన్మాత కనక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంతవిశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా ! అని కూడా చెప్పటం జరిగింది.

ఇలా
దేవతలు, పెద్దలైన మహర్షులు వంటివారు మనకు ఎన్నో విలువైన విషయములను అందించటం జరిగింది.

పరమాత్మ
పరాశక్తికి అందరూ బిడ్డలే.

పుణ్యాత్ముల
గురించి దైవం ఎంతగా ఆలోచిస్తారో పాపాత్ములను గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.

పాపాలు
చేస్తున్నవారిని దైవం శిక్షించటమంటే , ఆ విధంగా వారిని సక్రమమార్గంలోకి మళ్ళించి , వారికి కూడాపుణ్యాత్ముల వలెనే పరమపదమును అందించటం కొరకే.


( లోకంలో తల్లిదండ్రులు చెడుమార్గంలో వెళ్తున్న తమ పిల్లలను కొద్దిగా శిక్షించి అయినా సరే, మంచిమార్గంలోకితీసుకువస్తారు కదా ! అలాగన్నమాట. )

కొందరు
మంచివాళ్ళు కూడా అప్పుడప్పుడు మనస్సును నిగ్రహించుకోలేక కోపతాపాలకు గురవ్వటం, తప్పులు చేయటంప్రాచీన కధలలో కూడా కనిపిస్తుంది.

గొప్పవారైనా
, సామాన్యులైనా మంచిపనులు చేస్తే ... మంచి ఫలితాన్ని , చెడ్డపనులు చేస్తే ... చెడ్డ ఫలితాన్నిపొందుతారని అనిపిస్తుంది.

( ప్రతీచర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆధునికులు కూడా అంగీకరిస్తున్నారు కదా ! )

అయితే చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడితే , ప్రాయశ్శ్చిత్తమును అనుభవించటం , వంటి కొన్ని విధానముల వల్లచెడుఫలితాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు అని కూడా అనిపిస్తోంది.


కొందరు
ఎన్నో పాపాలు చేస్తూ కూడా , పూజలు అవీ చేస్తుంటారు.

వారి
గురించి నాకు ఏమనిపిస్తుందంటే , దైవాన్ని నమ్ముతూ కూడా , పాపపుణ్యాల గురించి తెలిసి కూడా, మనస్సునుఅదుపులో పెట్టుకోలేక ఎన్నోపాపాలు చేస్తున్నారు కదా !

ఇక
ఇలాంటివారికి దైవభీతి, పాపపుణ్యాల భయం లేకపోతే ఇంకా ఎన్ని పాపాలు చేస్తారో ! లోకాన్ని ఎంతగా పీడిస్తారోకదా ! అనిపిస్తుంది.

వీరు కూడా భయంతో కానీ, భక్తితో కానీ..పూజలు చేయగా చేయగా, ఎప్పటికైనా మంచిదారిలోకి వస్తారు అనిపిస్తుంది. ( కొన్ని జన్మలు కూడాపట్టవచ్చు. )

అప్పటికీ
మంచిదారిలోకి రాకపోతే , దైవమే తనదైన శైలిలో వారిని సక్రమమార్గంలోకి తీసుకురావటం జరుగుతుంది. అనిపిస్తుంది.

విధంగా , దైవం ఎప్పటికప్పుడు ధర్మమును కాపాడటం జరుగుతుంది.....

పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని..
ప్రార్ధిస్తున్నాను. 

 అంతా దైవం దయ.